మీకు సమాధానము కలుగును గాక


మీకు సమాధానము కలుగును గాక

మీకు సమాధానము కలుగును గాక

    ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. -యోహాను 20:19 

    భయం ప్రతి మనిషిని రాజ్యమేలుతున్నది, కొంతమందికి మరణ భయం, ఇంకొంత మందికి శత్రువుల భయం, కొంతమంది ఈ భవిష్యత్తును గూర్చిన భయం, తమ చుట్టూ జరుగుతున్న సంఘటన బట్టి, మా భవిష్యత్తు ఏమవుతుందా అని భయపడుతూ ఉంటారు, ఇలా ప్రతి మనిషికి లోలోపల ఉన్న రకరకాల భయములతో మనసుకు శాంతి లేక సాగుతున్నారు.

    కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను. -హెబ్రీయులకు 2:14,15 

    అయితే భయం ఎందుకు కలుగుతుంది? భయాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తారు? ఈ భయానికి విరుగుడు ఏంటి? ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? అనే విషయాలను ఈ వాక్య భాగంలో నేర్చుకుందాం. మొదటిగా శిష్యులు ఎందుకు భయపడ్డారో ఆలోచన చేద్దాం.

శిష్యులు ఎందుకు భయపడ్డారు?

తమ కాపరికి వచ్చిన కష్టం బట్టి :

    అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా. -మత్తయి 26:31 

    యేసుక్రీస్తు వారిని పట్టుకుని, యూదా మత పెద్దలు అన్యాయంగా, తీర్పు తీర్చి సిలువకు అప్పగించారు. బహుశా ఇక్కడ ఏసుక్రీస్తు వారిని వారు నిస్సహాయునిగా చూస్తున్నారేమో! తనని తాను రక్షించుకోలేని వాడిలా చూస్తున్నారేమో! 

    యేసయ్య చెప్పిన ప్రవచనాలు ఆయన పలికిన కొన్ని కొన్ని మాటలు కేవలం ఆయన పునరుద్దానం తర్వాతనే వారు అర్థం చేసుకోగలిగారు, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారికే ఇంత కష్టం కలిగింది కనుక, ఇక ప్రధాన యాజకులు పెద్దలు యేసయ్య తర్వాత ఆయన అనుచరులైన వారి కోసమే వెతుకుతారని, తమకు కూడా అలాంటి శిక్ష కలుగుతుందని వారు భయపడ్డారు.

    పెద్దవారికి నాయకులకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వారి అనుచరులుగా ఉన్నవారు భయపడడం సహజమే, నీ ముందున్న వారికి కలుగుతున్న కష్టాలను చూసి నువ్వు కూడా భయపడుతున్నావా?

పేతురు తప్పిదమును బట్టి :

    నా విషయం మీరు అభ్యంతర పడతారని యేసయ్య మాట్లాడినప్పుడు, పేతురు ఎవరు అభ్యంతర పడిన నేను మాత్రం అభ్యంతర పడనని మాట్లాడుతాడు, ఇది ఒక రకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటమే, ఆ తర్వాత శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేస్తే పేతురుతో సహా అందరూ ఆ మాటకు అవిధేయులై నిద్రించారు.

    మన జీవితంలో ఇలా కొనసాగుతున్నప్పుడు ఆత్మీయ ఉద్దేశాలను ఆత్మీయ బలమును కలిగి ఉండక, ఆ స్థానంలో శారీరిక యుక్తులను ఉపయోగించేవారంగా ఉంటాము. ఆ క్రమంలోనే పేతురు మూడో తప్పిదంగా యేసుక్రీస్తు వారి యొక్క మాట కొరకు ఎదురు చూడకుండా, మల్కు అనే వ్యక్తి యొక్క చెవిని తెగ నరికాడు. 

    యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి యొక్క చెవిని బాగు చేయకపోతే బహుశా నాలుగవ సిలువను చూడాల్సి వచ్చేదేమో, ఈ నేపథ్యం ఎరిగిన ప్రతి ఒక్కరూ ప్రధాన యాజకుని ఇంటి ముంగిట పేతురు ఎందుకు యేసుక్రీస్తు వారిని గూర్చి అబద్ధమాడాడో సులభంగా అర్థం చేసుకోగలరు.

    పేతురు యొక్క పతనం యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే ప్రారంభమైంది, ప్రధాని యాజకునికి సంబంధించిన వ్యక్తి యొక్క చెవి తెగ నరికిన కారణం చేత పేతురు ఇక బయట తిరిగే పరిస్థితి లేదు . నిజంగానే కొన్నిసార్లు మనం చేసిన కొన్ని తప్పిదాలు మనలను అత్యంత భయానికి గురిచేస్తాయి నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా?

యోహానుకున్న పరిచయాలను బట్టి:

    యోహాను ఒక పెద్ద చేపలు వ్యాపారి, ఆయన ఈ ప్రధాన యాజకులైన అన్నా, కయప ఇంటివారికి కూడా వాటిని అమ్మేవాడని చరిత్ర చెబుతుంది. అంతేకాదు యేసుక్రీస్తు వారిని, ప్రధాన యాజకుని వద్దకు తీసుకెళ్లినప్పుడు, తనకున్న పరిచయాలను బట్టి పేతురు యోహాను ఇద్దరు కూడా యేసయ్యకు ఏమవుతుందో చూద్దామని అక్కడ వరకు వెళ్లగలిగారు. కాబట్టి ప్రధాని యాజకుల బృందానికి యోహాను కూడా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడని స్పష్టంగా తెలుసు. 

    ఇప్పుడు ఆయనకున్న పరిచయమే ఆయన భయపడడానికి కారణమైంది. నిజంగా మన జీవితాల్లో మనం కలిగి ఉన్న కొన్ని పరిచయాలు మన భయానికి కారణం అవుతూ ఉంటాయి, నీకు ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా??

వారి మీద జరిగిన దుష్ప్రచారమును బట్టి

    యేసయ్య మీద తప్పుడు నేరం మోపి, అన్యాయంగా సిలువకు అప్పగించినా, యూదా మత పెద్దలకు నిద్ర పట్టలేదు, శిష్యులు మర్చిపోయిన విషయాలను కూడా వారు జ్ఞాపకం ఉంచుకొని, సమాధిని భద్రంగా కావాలి కాసారు. 

    అయితే వారి ప్రయత్నాలు ఏవి యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని నిరోధించలేకపోయాయి, ఇప్పుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో రోమా సైనికులకు డబ్బులు ఇచ్చి, మేము కావలి కాస్తుండగా, యేసయ్య శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయారు అనే ప్రచారానికి తెర తీశారు. 

    దీనివల్ల ఇప్పుడు శిష్యులు ఎక్కడున్నారా అని వెతికే ప్రయత్నం అందరూ చేస్తారు కనుక వీరు భయపడ్డారు. నిజంగా కొన్నిసార్లు మన మీద జరిగిన కొన్ని దుష్ప్రచారాలు మనలను బందీలుగా మార్చేస్తాయి, నీవు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా??

    ఇప్పుడు వరకు మీరు ఎందుకు భయపడ్డారో చూసాము!, మీరు భయాన్ని బట్టి ఎలా ప్రవర్తించారో చూద్దాం రండి!!

భయమును బట్టి ఎలా ప్రవర్తించారు??

    భయం మన లోపల ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, ఈ శిష్యుల ప్రవర్తన చూసి మనం పోల్చుకోవచ్చు.

సిలువ దగ్గర కనిపెట్టలేకపోయారు :

    సిలువ మీద ఒక వ్యక్తి బాధ అనుభవిస్తూ ఉంటే, ఆయనకు దగ్గర వారందరూ ఆ సిలువ దగ్గర కనిపెట్టేవారు, అలాగంటే యేసయ్య కోసం ఒక పెద్ద గుంపే కనిపెట్టాలి, యోహాను మరియు స్త్రీలు ఒక నలుగురు తప్ప ఇంకెవరు ఆ దరిదాపుల్లో లేరు, దానికి కారణం వారిలో ఉన్న భయమే అని మనం అర్థం చేసుకోవచ్చు, నీ భయాన్ని బట్టి నీవు యేసుక్రీస్తు వారికి దూరమయ్యావా? ఆయన బిడ్డనని సాక్ష్యం ఇవ్వడానికి దూరమయ్యావా?? ఆలోచించు.

సమాధి కార్యక్రమంలో పాలుపంచుకోలేదు:

    యూదులకు మంచిగా సమాధి చేయబడ్డం, చాలా అవసరం. వారు ఏ రీతిగా సమాధి చేయబడ్డారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, అనేది కొన్నిసార్లు వారు జీవించిన జీవిత విధానాన్ని తెలియజేస్తుంది. అందుకే ఓ సందర్భంలో సొలోమోను అంటాడు " ఒకనికి వందమంది కుమారులు ఉండి సరైన రీతిలో సమాధి చేయబడుకపోతే అతను పిండంగా ఉన్నప్పుడు పడిపోవడమే మంచిది" అంటాడు.

    యూదుల భయం చేత రహస్య శిష్యుడుగా ఉన్న అరిమతయియ యోసేపు కూడా కొంత తెగింపు కలిగి యేసయ్య సమాధి విషయంలో ముందుకు వచ్చాడు. 

   గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. -మార్కు 15:43

    యేసయ్య సమాధి నిమిత్తమై రహస్య శిష్యుడైన అరిమతయియ యోసేపు, తెగించినట్లుగా వీరు తెగించలేకపోయారు. నీ భయాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పోగొట్టుకున్నావా??

సుగంధ ద్రవ్యాలు పూసే ప్రయత్నం చేయలేదు

    చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూయడం, కొన్ని దినాలు ఆయన కోసం విలపించడం యూదులు పాటించే ఆచారాలుగా ఉన్నాయి, ఈ విధానాన్ని వీరు ఐగుప్తు నుంచి నేర్చుకున్నారు అని అంటూ ఉంటారు. ఆ క్రమంలో స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ శిష్యులు అందులో భాగం కాలేకపోయారు. 

    యేసయ్య శరీరముకు సుగంధ ద్రవ్యములు పూయాలని, సిద్ధం చేసుకొని స్త్రీలు సమాధి యొద్దకు వెళ్లే ప్రయత్నం చేసారు, కాని ఆ ప్రయత్నం కూడా శిష్యులు చేయలేదు.
 విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.- మార్కు 16:1-3

తలుపులు గట్టిగా మూసుకొని ఇంట్లోనే ఉన్నారు

    ఇక్కడ శిష్యులు యూదుల భయం చేత తలుపులు మూసుకొని ఉన్నారు. 3 సంవత్సరాలుగా తమతో పాటు ఉన్న యేసయ్య లేకపోవడం, చనిపోవడం వారు తట్టుకోలేని విషయముగా ఉన్నది, కనీసం ఆయన శత్రువులు ఆయన మాటలు గుర్తుంచుకున్నంతగా వీరు గుర్తుంచుకున్నా వీరు ఇలా ఉండేవారు కాదేమో!

 అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. -మత్తయి 27:63

ఇప్పటివరకు వీరు ఎందుకు భయపడ్డారో భయాన్ని బట్టి ఏం చేశారో చూశాము, ఈ భయాన్ని ఎలా జయించాలి??

భయాన్ని ఎలా జయించాలి??

    ఈ విషయాలు మన మనసులో ఉంచుకోవడం ద్వారా మనం భయాన్ని జయించగలం.

పునరుద్దాన సత్యం :

    యేసుక్రీస్తు వారు తాను బ్రతికున్న కాలంలో, తన మరణ పునరుద్దానములను గూర్చి ఎన్నోసార్లు చెప్పాడు, శిష్యులు స్త్రీలు మరణం గురించి మాత్రమే గుర్తుంచుకున్నారు కానీ పునరుద్ధానం గురించి జ్ఞాపకం ఉంచుకోలేదు, బహుశా నమ్మలేదేమో, ఆయన శత్రువులు దాన్ని గుర్తుంచుకున్నారు, ఆశ్చర్యం ఏమిటంటే వారు నమ్మకపోయినా గుర్తుంచుకున్నారు, యేసయ్య తిరిగి లేస్తాడు అన్న సత్యం వీరికి గుర్తుంటే ఇలా భయపడుతూ ఉండేవారు కాదేమో! నిరీక్షణ ఉన్నచోట భయం ఉండదు, విశ్వాసము నిరీక్షణ లేనప్పుడు ఉండేదంతా భయమే

    జీవితంలో నిన్ను ఏ భయం కలిచి వేస్తున్నా, నా యేసు సజీవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు వారి మరణాన్ని చూస్తున్న అనేకమంది, ఆయన చాలా మంచివాడు అని రోమీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడని, ఇంకొంత కాలం ఉంటే బాగుండేదని ఇలా వాపోతూ ఉండి ఉంటారు, కాని ఆయన మూడవ దినాన తిరిగి లేస్తాడన్న సత్యం వారు జ్ఞాపకం ఉంచుకుంటే దిగులు విచారాలతో కూడిన ఈ పలుకులు వచ్చేవి కాదు.

    పునరుద్దాన సత్యం నీలో భయాన్ని తొలగిస్తుంది, నీకు ఎవరూ లేరు అనుకోకు, నీ కొరకు సజీవుడైన యేసయ్య నీ పక్షమై నిలిచి నిన్ను ఓదార్చి బలపరుచుటకు ఎదురుచూస్తున్నాడు, వ్యర్ధమైన భయాలతో నువ్వు కుమిలిపోక ఆయన వైపు చేరితే ఖచ్చితంగా దీవెన పొందుకుంటావు. 

    ఇదే సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు గనుక మనం కూడా ఒక రోజు తిరిగి లేపబడతాం ఈ నిరీక్షణ మనం కలిగి ముందుకు సాగాలి

దేవుని వాగ్దానం :

    దేవుని వాగ్దానం యందు నమ్మకం లేకపోవడమే చాలాసార్లు మన దిగులు విచారాలకు కారణము అవుతుంది. నేను మూడోవ దినాన్న తిరిగి లేస్తాను అన్నది యేసయ్య చేసిన వాగ్దానం, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చలేడు అని ఈ శిష్యులు భావించినట్లుగా ఉన్నది.

    యేసయ్య నిస్సహాయంగా చనిపోలేదు గాని తన ప్రాణాన్ని మరలా తీసుకునేటట్లుగా దానిని పెట్టాడు, ఇది శిష్యులు గమనిస్తే భయపడేవారు కాదు. దేవుడు తన వాగ్దానాలు విషయంలో ఎన్నడు గనుక తగ్గడు, ఆయన వాగ్దానాలు పట్ల విశ్వాసమును కోల్పోక నువ్వు స్థిరంగా నిలబడు, నీ భవిష్యత్ విషయం దేవుడే చూసుకుంటాడు.

దేవుని మాటలు :

    శిష్యులు భయపడి ఆ విధంగా వారి గదిలో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తువారు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు, ప్రత్యక్షమై, తనను గూర్చి అభ్యంతర పడినందుకు గాని, సిలువ యొద్ద కనిపెట్టనందుకు గాని, సమాధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కానీ, తలుపులు గట్టిగ మూసుకొని భయపడుతూ ఉన్నందుకు గాని వారిని ఏమీ అనలేదు, దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు బలహీనతలు ఓటములు ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి గడిచిన కాలంలో నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను త్రోసివేస్తాడని భావించక పశ్చాతాపంతో దేవుని వద్దకు రా, ఆయన నిన్ను క్షమించి చేరదీస్తాడు. 

    అయితే యేసయ్య వారిని కలుసుకున్న వెంటనే మీకు సమాధానం కలుగును గాక అన్నాడు, ఈ మాట సాధారణమైన మాటే అయినా వారున్న పరిస్థితుల్లో ఎంతో అవసరమైన మాట, ఆయన కూడా సాధారణమైన ఉద్దేశంతో కాక వారి యొక్క భయాన్ని తొలగించడానికి ఈ మాట చెప్పాడని భావించవచ్చు.

    ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్న దేవుడు నీతో చెప్తున్నా మాటిదే నీకు సమాధానం కలుగును గాక, మరణ భయమా, దాన్ని యేసయ్య జయించాడు, శత్రుభయమా దాన్ని యేసయ్య జయించాడు, భవిష్యత్తును గూర్చిన భయమా, నీ భవిష్యత్తు యేసయ్య చేతిలో భద్రంగా ఉంది, కలత చెందక సమాధానంగా ఉండు. 

    ఆయన తన సిలువ మరణం ద్వారా తండ్రితో సమాధానాన్ని మన కొరకు సంపాదించాడు, పునరుద్ధానం ద్వారా శత్రువును మృత్యువును జయించాడు, ఇక భవిష్యత్తును గూర్చిన దిగులు లేదు. భయపడక దిగులు చెందక దేవుడు నీ హృదయంలో అనుగ్రహించు సమాధానం పొందుకొని ఆయన కొరకే ఈ లోకంలో జీవించు.

    వ్యర్థమైన మాటలన్నీ చెవిని పెట్టవద్దు, దేవుని మాటలను హృదయంలోకి తీసుకో, దేవా నన్ను నీ సమాధానంతో నింపని వేడుకో, ఆయన ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు.

తక్షణ కర్తవ్యం :

 అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. -యోహాను 20:21

    యేసయ్య వారికి సమాధానాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా వారిపై ఒక బాధ్యతను ఉంచాడు,, అదేంటంటే ఈ లోకంలోకి వెళ్లి ఏసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించడం. తనను విడిచిపోయిన, తానెవరో తెలియదని అబద్ధం ఆడిన, భయపడుతున్న ఈ శిష్యులకే ఆయన తనను గూర్చి ప్రకటించే బాధ్యతను అప్పగించాడు, కాబట్టి నీ బలహీనతలు వైపు చూసుకోవద్దు, సమర్ధతనిచ్చే దేవుడు వైపు చూడు, ఆయనకు లొంగిపో ఆయనే నిన్ను వాడుకుంటాడు

దీన్నిబట్టి ఈ దినాన మూడు తీర్మానాలు తీసుకుందాం

భయపడవద్దు :

    జీవితంలో ఎంత గొప్ప సమస్యను ఎదుర్కొంటున్నా.. నా యేసు సజీవుడు ఆయన ఈ లోకమునకు రాజుగా ఉన్నాడు, ఆయన నా పక్షమై యుద్ధం చేస్తాడు అని అని విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి భయపడక ధైర్యంతో ముందుకు కొనసాగే వారుగా ఉందాం.

నీతిగా, భక్తి కలిగి జీవించండి :

    జీవితం మరణంతో ముగిసిపోవడం లేదు, యేసుక్రీస్తు వారి వలె మనం మరలా తిరిగి లేస్తాం, భూమి మీద మనం చేసిన ప్రతి దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం, అలాగైతే చావైనా బ్రతుకైనా మనుషులకు భయపడి వేషదారులుగా జీవించకుండా, దేవునికి భయపడి నీతి కలిగి ఈ లోకంలో జీవించాలి, ఎందుకంటే మరణం తర్వాత మనం కలుసుకోబోయేది ఆయననే, మనకు తీర్పు తీర్చి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. కనుక నీ నీతి వ్యర్థం కాదు, భక్తి వ్యర్థం కాదు, ఖచ్చితంగా పరలోకంలో నీకు ఫలముంది.

సమాధాన వార్తను ప్రకటించుటకు ప్రయాసపడండి :

    దేవునితో సమాధాన పడని వారు, ఈ లోకంలో సమాధానం లేక, మరణం తర్వాత కూడా వేదనలు అనుభవించే స్థలానికి వెళ్తారు, ఒకప్పుడు మనమందరం కూడా దేవునితో సమాధాన పడక ఈ లోకంలో అనేక సమస్యలతో సతమతమవుతూ, ఉండగా, క్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని, ఆయన ఇచ్చే విడుదలను మనకు ఎవరో ప్రకటించారు కనుక ఈ రోజు ఆయనతో సహవాసంలో ఉంటూ నిత్య రాజ్యానికి వారసులమౌవుతామన్న నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాము.

 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమైదేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. -2 కోరింథీయులకు 5:19,20

    ఈ నిరీక్షణ, సమాధానం అనేకులు అనుభవించు లాగున పొందుకొనలాగా ఈ పునరుద్దాన వార్తను అనేకులకు ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది, గుర్తుంచుకో ప్రభువునందు నువ్వు పడే ప్రయాస వ్యక్తం కాదు! దేవుడు మనలను దీవించును గాక ఆమెన్.

 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. -1 కోరింథీయులకు 15:58
దేవా, మాలో ఉన్న రకరకాల భయాలన్ని తొలగించబడి, నీ సమాధాన వార్తను ఇతరులకు ప్రకటించు భాగ్యం నాకు దయచేయండి. - ఆర్. సమూయేలు

Post a Comment