బిలాముకు దేవుడే వెళ్ళమని అనుమతిచ్చాడు కదా మరి ఎందుకు గాడిద ద్వారా మాట్లాడించి తన కోపాన్ని వ్యక్తపరచాడు?





 బిలాముకు దేవుడే వెళ్ళమని అనుమతిచ్చాడు కదా మరి ఎందుకు గాడిద ద్వారా మాట్లాడించి తన కోపాన్ని వ్యక్తపరచాడు? 


    ఇశ్రాయేలు ప్రజలను శపించుటకు గాను డబ్బుకు అమ్ముడుపోయిన వ్యక్తిగా బిలాము చరిత్రలో జ్ఞాపకం ఉంచుకోబడ్డాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు ఈయన గుర్తింపు ఏంటో మొదటిగా తెలుసుకుందాం!

కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. -సంఖ్యాకాండము 22:5

    ఈ వచనాన్ని బట్టి ఈయనను గూర్చి మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి, మొదటిది ఈయన బెయోరు కుమారుడు, రెండవది పెతోరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు.

    ఈయన నివసిస్తున్న ప్రాంతం, ఏ ప్రాంతం అయితే అబ్రహం వదిలి వచ్చాడో, ఏ ప్రాంతంలో అయితే లాభాను నివసించాడో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నది. ఏ విధంగా చూసినా బాలాకు పరిపాలిస్తున్న మోయాబుదేశానికి బిలాము నివసిస్తున్న పెతోరు అనే ప్రాంతం చాలా దూరంలో ఉంది.

    ఈ బిలాముకున్న ఉన్న గొప్పతనాన్ని బట్టి బాలాకు కోరుకున్నది చేయగలిగిన వారు తన చుట్టూ ఎంతోమంది ఉన్నప్పటికీ వారందరినీ కాదని నేరుగా ఆయన్ని పిలిపించారు

తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును. -సామెతలు 22:29

    మన పనిలో మనం నిపుణుత కలిగి ఉంటే అవకాశాలు మనలను వెతుక్కుంటూ వస్తాయనే దానికి ఇదొక నిదర్శనం.

    మూడవదిగా ఈయన ఇశ్రాయేలీయుడు కాదు అన్యుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. నాలుగవదిగా భవిష్యత్తును గురించి సమాచారాన్ని పొందగల ప్రత్యేక జ్ఞానం ఈయనకు ఉన్నది, అంతేకాదు తనకు తెలిసిన మంత్ర విద్య ద్వారా క్షుద్ర శక్తులను ఉపయోగించి దీవించడం లేదా శపించడం చేయగల సమర్థుడు.

    ఐదవదిగా ఈయన ధనాపేక్షగలవాడు అని చెప్పవచ్చు. ఎవరు తనకు ధనమిస్తే వారి కొరకు తనకు తెలిసిన సేవలన్నిటిని చేయడానికి సిద్ధంగా ఉండేవాడు.

    ఇక విషయానికొస్తే , బాలాకు తన ఎదుట ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి లేనిపోని భయాలు కలిగి తాను భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం జరిగితే తన దేశం పాడైపోతుందని ఆలోచించి వారిని బలహీనపరచడానికి లేదా అసలు లేకుండా చేయడానికి వారిని శపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

    ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే మోయాబీయులతో యుద్ధం చేయడం అనేది దేవుని ప్రణాళికలో లేదు, ఈ మోయాబీయులు లోతు సంతానంగా ఉన్నారు కనుక వీరి ఇశ్రాయేలు ప్రజలకు సహోదరులు అవుతారు. కాబట్టి వారితో యుద్ధం చేయడం అనేది దేవుని ఆలోచనలో లేదు. ఇది తెలియని బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి రావాలని బిలాము వద్దకు తన మనుషులను పంపాడు.

కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితోయీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి. -సంఖ్యాకాండము 22:6-8

    తన వద్దకు వచ్చిన మోయాబు అధికారులతో మీరు ఈ రాత్రి ఉండండి, నేను కనుక్కొని చెప్తానని చెప్పారు. ప్రతి జనముకు ఒక దేవుడు ఆ దినాల్లో ఉన్న విషయం ఎరిగిన బిలాము ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించువాడైన యెహోవాను విచారించాలని కోరుకున్నాడు.

 దేవుడు బిలామునొద్దకు వచ్చినీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా -సంఖ్యాకాండము 22:9

ఇక్కడ దేవుడే బిలాము వద్దకు వచ్చిన విషయాన్ని మనం విస్మరించకూడదు. మంత్రజ్ఞులు ఎవరు కూడా తమ శక్తుల చేత మన దేవునిని వారి వద్దకు రప్పించుకొనలేరని వారే స్వయంగా చాలా సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చారు.

    యెహోవా దేవుడు ఇక్కడ బిలాముతో చెప్పిన విషయం ఏంటంటే నీవు వారితో వెళ్లొద్దు , ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన ప్రజలు కనుక వారిని శపించడానికి వీలు లేదని చెప్పడం జరిగింది.

    అయితే దీనిని బిలాము మోయాబు అధికారులకు ఎలా చెప్పాడో ఒకసారి చూడండి!

కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా -సంఖ్యాకాండము 22:13

    దేవుడు చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా బిలాము వారితో చెప్పలేదు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన ప్రజలు కనుక వారిని శపించడానికి వీలు లేదని చెప్పి ఉంటే రెండోసారి బాలాకు రాజు తన పరివారాన్ని బిలాము యొద్దకు పంపించు ఉండేవాడు కాదు. ఇందులోనే బిలాము ఎంత విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

    బిలాము రానని చెప్పినట్లుగా మోయాబు అధికారులు వెళ్లి బాలాకు రాజుతో చెప్పారు, ఇప్పుడు ఆయన ఇంకా ఎక్కువ మందిని శ్రేష్టమైన వస్తువులను ఇచ్చి బిలాము యొద్దకు పంపడం జరిగింది. మరి ఈ సమయంలో బిలాము ఎలా ప్రవర్తించాడు?

అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. -సంఖ్యాకాండము 22:18,19

    ఈ మాటల్లో బిలాము దేవునికి విధేయుడుగా కనపడటం లేదా? పైగా యెహోవాను తన దేవునిగా పిలవడం, ఇవన్నీ ఈయన వేషధారణకు పరాకాష్ట అని చెప్పొచ్చు.

    దేవుడు ఒకసారి వద్దని చెప్పిన తర్వాత, మరల రెండోసారి దాని గురించి ప్రార్థన చేస్తున్నాము అంటే మనం ఏం కోరుకుంటున్నట్లు? దేవుడు తన మనసు మార్చుకోవాలనా? మన దురాశలను నెరవేర్చుకోవడానికి మనం చేసే ప్రార్థన కూడా బిలాము చేసిన ఈ ప్రార్థనకు ఏమాత్రం భిన్నంగా లేదని మనం గ్రహించవలసి ఉన్నది.

    బిలాముకు నిజంగా వారి బంగారం మీద డబ్బులు మీద ఆశ లేకపోతే రెండోసారి ప్రార్థన ఎందుకు చేసినట్టు? కాబట్టి సమస్తము ఎరిగిన దేవుడు బిలాము యొక్క దురాశలకు బిలామును అప్పగిస్తూ కోపంతో వెళ్ళమని అనుమతిస్తూ నేను చెప్పింది మాత్రమే చెప్పాలని ఆజ్ఞాపించాడు.

ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. -రోమీయులకు 1:24
 ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. -సంఖ్యాకాండము 22:20

    ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. రేపు ఉదయం ఆ మనుషులు నిన్ను పిలిస్తే వెళ్ళమని దేవుడు చెప్పాడు, వెళ్లడానికి ఇది దేవుడు ఏర్పరచిన షరతు. మరి బిలాము ఏం చేసాడో చూడండి!

ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను. -సంఖ్యాకాండము 22:21

    వాళ్లు వచ్చి ఈయనను పిలిచే అంతవరకు ఈయన ఆగలేదు. కాబట్టి బిలాము చేసిన ప్రార్థన దేవునిని ఒత్తిడి చేసేదిగా ఉన్నది గాని ఆయన ఇష్టాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలన్న ఉద్దేశం కలిగినదిగా లేదు. 

    ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులు కోరుకున్న కోరికను దేవుడు తీర్చిన విధానాన్ని, గెత్సమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్ధనను పోల్చి చూడండి (సంఖ్యా కాండం 11వ అధ్యాయం, మత్తయి సువార్త 26 వ అధ్యాయం).

    కాబట్టి బిలాము వెళ్లడం దేవునికి ఇష్టము లేదు, అందుకే ఆయనను మరొకసారి హెచ్చరించడానికి దేవుడు తన దూతను పంపాడు.

గమనిక : 

    మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆశతో నాకు ప్రశ్నలు పంపించే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. మీ ప్రశ్నలన్నీ నా యొద్ద భద్రంగా ఉన్నాయి, మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి రెండు మాటల్లో నేను సమాధానం చెప్పవచ్చు, కానీ దాని ద్వారా మీకు ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవడం స్పష్టత అవగాహన సంపూర్ణంగా పొందలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఒక అంశాన్ని వివరించాలి అంటే దానికి కొంత సమయం పరిశోధన కావాలి. నాకున్న పరిచర్య భారాన్ని బట్టి వరుస క్రమంలో మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు కాబట్టి నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.

- ఆర్ . సమూయేలు 



Post a Comment