ఆదికాండము - సమస్త జనులను ఆశీర్వదించు దేవుడు


Bible Survey -01

ఆదికాండము 

సమస్త జనులను ఆశీర్వదించు దేవుడు


నేను ఎవరిని అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? బహుశా ఎప్పుడు వచ్చి ఉండకపోవచ్చు, దానికి కారణం మీ తల్లిదండ్రులు ఎవరు మీకు తెలుసు. అయితే ఈ ప్రశ్న కొంతమందిని వేధిస్తూ ఉంటుంది, వాళ్లే అనాధలు. చిన్నతనములో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు, తమ తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పెంచబడినవారు ఈ ప్రశ్న ద్వారా వేధించబడుతుంటారు.

పోనీ నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? దానికి కూడా తల్లిదండ్రుల వైపు చూసి సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాము. మా అమ్మ నాన్న ఇక్కడున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, మా నాన్న ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడున్నాను, అని మనం సర్ది చెప్పుకోవచ్చు.

కొన్నిసార్లు మనం ఉన్న కొన్ని పరిస్థితులు మనలో ఈ ప్రశ్నలు లేవనెత్తుతాయి, అసలు నేనెవరిని? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఒకవేళ ఒక కఠినమైన పరిస్థితుల్లో గనక వారు ఉంటే ఇంక నేను ఇక్కడే ఉంటానా? నా స్థితి మారదా? అనే ప్రశ్నలు మన యొక్క జీవితాన్ని తొలిచేస్తూ ఉంటాయి.

సుమారు 3400 సంవత్సరాల క్రితం ఒక జాతి ఇదే విధమైన ప్రశ్నలతో వేధించబడింది, వారికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం అత్యవసరమైంది. వారు బానిసలుగా చేయబడి వందల సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో వారు ఈ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వారు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేస్తూ తన సేవకుడైన మోషే ద్వారా క్రీస్తుపూర్వం 1440-1400 మధ్యకాలంలో దేవుడు రాయించిన గ్రంథమే ఆదికాండము.

ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు ఒక్క ఇశ్రాయేలు జాతికి మాత్రమే కాకుండా సమస్త మానవాళి ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.

ఈ గ్రంథం ఇశ్రాయేలు యొక్క గతాన్ని, వారు ప్రస్తుతము అనుభవిస్తున్నటువంటి బానిసత్వానికి గల కారణాన్ని, వారి స్థితి మార్చబడుతుంది అనే భరోసాను తెలియజేస్తుంది.

ఈ గ్రంథం చదవడం ద్వారా ప్రతి వ్యక్తి తన గతాన్ని గుర్తించగలుగుతాడు, తాను ప్రస్తుతం అనుభవిస్తున్న సమస్యలకు కారణాన్ని కనుగొనగలుగుతాడు, తన భవిష్యత్తును గూర్చిన నిరీక్షణను ఈ యొక్క గ్రంథము ద్వారా పొందుకొనగలుగుతాడు.

ఈ గ్రంథంలో సమస్తానికి ఆరంభాన్ని మనం చూడవచ్చు, ఆరంభం లేనిది దేవునికి ఒక్కడికే, ఆయన మినహా ప్రతి ఒక్కటి ఎలా ఆరంభమైంది అనేదానికి ఈ గ్రంథం సమాధానం ఇస్తుంది.

ఈ సృష్టి ఎలా ఏర్పడింది? మనిషి ఎలా ఉనికిలోనికి వచ్చాడు? ఈరోజు మనం చూస్తున్న చెడుతనం ఎలా ఉద్భవించింది? ఇన్ని రకాల జాతులు భాషలు వృత్తులు ఎలా వచ్చాయి? వివాహ బంధం ఎలా ప్రారంభమైంది? ఇలాంటి ప్రశ్నలకు ఈ గ్రంథంలో సమాధానాన్ని మనం చూడవచ్చు.

ఈ గ్రంథంలో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి, ఈ 50 అధ్యాయాలు ప్రాథమికంగా నాలుగు సంఘటనలు నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నది. మొదటి 11 అధ్యాయాలు నాలుగు సంఘటనల గురించి మాట్లాడితే 12 నుండి 50 వరకు గల అధ్యాయాలు నలుగురు వ్యక్తుల గురించి తెలియపరుస్తుంది. మొదటి భాగం ప్రపంచమంతటికి వర్తిస్తుంది, రెండవ భాగం ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి రాయబడింది.

మొదటి భాగంలో మొదటి రెండు అధ్యాయాలు సృష్టిని గూర్చి మొత్తంగాను, మానవుని యొక్క సృష్టిని గూర్చి ప్రత్యేకంగాను వివరిస్తున్నాయి. 3-5 అధ్యాయాలు దేవుని చేత ఎంతో అందంగా చేయబడిన ఈ సృష్టి, కల్లా కపటం ఎరుగని మానవులు ఎలా చెడ్డవాళ్ళుగా మారిపోయారో తెలియపరుస్తుంది. 6-8 అధ్యాయాల్లో చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న మనుషులకు దేవుడు ఎలాంటి తీర్పును ఇస్తాడో, తనకు లోబడి జీవిస్తున్న వారిని ఎలా రక్షిస్తాడో వివరిస్తున్నాయి. 9-11 అధ్యాయాల్లో జాతులు భాషలు ఎలా ఉనికిలోనికి వచ్చాయో తెలియపరుస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే మొదటి రెండు అధ్యాయాలు మానవుని సృష్టిని గూర్చి, 3-5 అధ్యాయాలు మానవుని పతనమును గూర్చి, 6 నుండి 8 అధ్యాయాలు జల ప్రళయము ద్వారా జరిగిన తీర్పును గూర్చి, 9 నుండి 11 అధ్యాయాలు బాబెలు గోపురం యొద్ద భాషలు తారుమారు చేయబడిన విధానాన్ని గూర్చి వివరిస్తున్నాయి.

రెండవ భాగంలో 12-24 అధ్యాయాల్లో అబ్రహామును గూర్చి, 25,26 అధ్యాయాల్లో అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చి, 27-36 అధ్యాయాల్లో ఇస్సాకు కుమారులైన ఏశావు యాకోబులను గూర్చి, 37-50 అధ్యాయాల్లో యాకోబు కుమారుడైన యోసేపు మరియు అతని అన్నదమ్ములను గూర్చి చదువుతాము.

ఈ గ్రంథం మనకు ఏమి నేర్పిస్తున్నది?

దేవుడు మన సృష్టికర్త :

మనిషి కోతి నుండి రాలేదు, దేవుని యొక్క పోలికలో ఆయన స్వరూపములో నేలమంటితో దేవుని చేత మనిషి నిర్మించబడ్డాడు. మానవులందరికీ సృష్టికర్త ఒక్కడే, ప్రతి ఒక్కరూ ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడి ముందుకు సాగాలి.

నీ జీవితంలో దేవుడు నిన్ను సృష్టించాడని గుర్తిస్తున్నావా? నిన్ను సృష్టించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచావా? సృష్టికర్త నిన్ను సృష్టించిన కారణము నెరవేర్చుటకు ప్రయాస పడుతున్నావా? లేనట్లయితే ఇప్పుడే ఆ విధంగా చేయడానికి ప్రారంభించు.

అవిధేయత సమస్యలను తీసుకొస్తుంది :

ఈనాడు మనం చూస్తున్న ద్వేషం, అసూయ, హత్యలు, విచ్చలవిడితనం, ఇవి ఏర్పడ్డానికి ప్రధానమైన కారణం, ఒకప్పుడు ఆదిమానవులైన ఆదాము హవ్వలు దేవుని మాటను మీరి ప్రవర్తించడమే. వారు దేవునికి అవిధేయులై మనలను కూడా విధేయులుగా మార్చారు. వారి అవిధేయత మనుష్యుని స్వభావము ఇంతగా పతనము చెందడానికి కారణమైంది. మనలను సృష్టించిన సృష్టికర్తకు మనము నడవవలసిన మార్గమును గూర్చి ఆజ్ఞలు ఇవ్వడానికి సర్వహక్కులు ఆయనకు ఉన్నాయి. నేను ఎలా నడవాలో ఆయనెవరు చెప్పడానికి అని నువ్వు అడిగితే ఆయన నీ సృష్టికర్త అనే విషయాన్ని తెలుసుకోవాలి. నీవు నడవాల్సిన తీరు ఆయన కాకుండా ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఆయన మాత్రమే చెప్పగలడు ఆయన మాత్రమే చెప్పాలి. మనలను సృష్టించిన సృష్టికర్తకు మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో స్పష్టంగా తెలుసు, మన క్షేమాన్ని ఉద్దేశించి మనం నడవవలసిన మార్గాన్ని ఆజ్ఞల రూపంలో మన ఎదుట దేవుడు పెట్టాడు, దానికి లోబడి జీవిస్తే మేలు కలుగుతుంది, దానికి అవిధేయులైతే మన కాల పరిమితిని మనమే తగ్గించుకునే వారముగా, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునేవారంగా మారతాము.

ఇప్పటివరకు దేవుని ఆజ్ఞలు ఏమిటో తెలిసి కూడా ఆయనకు అవిధేయుడుగా నడుచుకుంటున్నావా? నేడైనా మేలుకొని ఆయనకు విధేయుడవై క్షీణతను శాపమును కాక అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందే వ్యక్తిగా ఉండుటకు ప్రయత్నం చెయ్.

విశ్వాసము విధేయత దీవెనను కలిగిస్తుంది

అవిధేయత సమస్యలను తీసుకొస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులమై నడుచుకుంటే ఖచ్చితంగా దీవెన పొందుకుంటాం. లోకం తీరును చూచి వాతలు పెట్టుకోకుండా, దేవునికి విధేయులైన నడుచుకున్న వారికి ఎలాంటి దీవెన కలుగుతుందో నోవాహు జీవితం మనకు స్పష్టంగా వివరిస్తుంది.

భవిష్యత్తు ఏమిటో తెలియకపోయినా పిలిచిన వ్యక్తి మీద, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మీద విశ్వాసముంచి అడుగులు వేస్తే ఎలాంటి దీవెన కలుగుతుందో అనేదానికి అబ్రహాము జీవితమే ఒక ఉదాహరణ. నీకు ఎన్నో ప్రశ్నలు ఉన్నా, నీకు అది సంపూర్ణంగా అర్థం కాకపోయినా దేవుని యందు విశ్వాసము ఉంచి, విధేయతతో నడుచుకోవటానికి ఇష్టపడితే దీవెన నీ సొంతమవుతుంది.

దేవుడు ప్రణాళిక గలవాడు

కొన్నిసార్లు ఎందుకు ఇలా చేశావు అని మనం ఎవరినైనా అడిగితే, ఏదో ఊరికే చేశాను సరదాకు చేశాను అనే సమాధానాలు కొన్నిసార్లు వినబడతాయి. దేవుని నోట నుండి ఎప్పటికీ ఈ మాటను మనం వినలేము. ఆయన ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక, ఇంకా చెప్పాలంటే ముందస్తు ప్రణాళిక కలిగినవాడై సమస్తాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. 

బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఆదికాండము ద్వారా మోషే తెలియజేయాలనుకున్న సత్యం ఏమిటంటే, వారు అబ్రహాము సంతానమై ఉన్నారు, ఆ విషయము వారి యొక్క గుర్తింపును వారికి వెల్లడి పరుస్తుంది. మేమెందుకు ఇక్కడ ఉన్నాము అని వారు అడిగే ప్రశ్నకు ఆదికాండము అది దేవుని యొక్క ప్రణాళికయై యున్నది అని సమాధానం ఇచ్చుచున్నది. 

దేవుడు అబ్రహం ని పిలిచినప్పుడు ఆయనకు మూడు మాటలు చెప్పాడు, నీకు భూమిని, సంతానమును ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. భూమి విషయంలో మరింత స్పష్టంగా కనాను దేశమంతటిని అబ్రహాముకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అది ఎప్పుడూ అబ్రహంకి ఇవ్వబడుతుంది? దానికి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు కనాను దేశములో నివసిస్తున్న అమోరియుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు, కాబట్టి నీ సంతానపు వారు తా మెరుగని దేశంలో 400 సంవత్సరాల పాటు బానిసలుగా ఉంటారు, నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరల తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు. 

కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాలు పాటు బానిసలుగా ఉండడం దేవుని ప్రణాళికలో భాగమే. అసలు ఐగుప్తులోనికి ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించిన విధానాన్ని చూస్తే, ఆయన మేదస్సు మనలను ఆశ్చర్యానికి లోను చేస్తుంది. 

యాకోబు యొక్క కుటుంబానికి రానున్న 20 సంవత్సరాల్లో కలగబోయే కరువును ఎరిగిన దేవుడు ఆ కరువు లో ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ కుటుంబానికి చెందిన యోసేపు అనే వ్యక్తిని ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మి వేయబడే విధంగా చేసి, తదుపరి అక్కడ అధికారిగా ఆయనను నిలబెట్టి, కరువు తప్పించుకొను లాగున 70 మందితో కూడిన యాకోబు కుటుంబాన్ని కనాను నుండి ఐగుప్తుకు నడిపించడం జరిగింది. ఎంత గొప్ప ప్రణాళిక కదా! 

నీ జీవితంలో ఏమి జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? సంపూర్ణంగా దేవునికి నిన్ను అప్పగించుకుని ఆయన నిన్ను నడిపిస్తున్న రీతిలో ఆయనను వెంబడించు, ఆయన చేసే ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంది, నీ విషయంలో కూడా ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తాడు.

మనము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉంచబడినప్పటికీ వారు ఎల్లకాలం అక్కడే ఉండరు, దేవుడు వారి పితరుడైన  అబ్రహాముకు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి వారిని ఖచ్చితంగా బయటికి తీసుకు వస్తాడు, దేవుని వాగ్దానాలు యందు నిరీక్షణ కలిగిన అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు అనువారు వారి తర్వాతి తరాలకు వాటిని చేరవేశారు. వారి నిరీక్షణ వమ్ము కాలేదు. 

నేడు మనము కూడా మనం మన చుట్టూ ఉన్న మనలో ఉన్న పాపము నుండి విడుదల పొందుటకు దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. మన పాపముల కొరకైన శిక్షను భరించటానికి దేవుడు తన కుమారుడిని పంపుతానని ఆయన స్త్రీ సంతానంగా వస్తాడని హవ్వకు వాగ్దానం చేయడం జరిగింది. 

అబ్రహముకు ఇవ్వబడిన సంతానమును గూర్చిన వాగ్దానం ఇస్సాకులో కాదు గాని యేసుక్రీస్తు వారిలోనే అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నది, ఆయన సంతానమైన క్రీస్తు ద్వారా సమస్త జనులను ఆశీర్వదించాలన్న ఉద్దేశంతోనే. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటూ 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని స్త్రీ సంతానంగా, కన్య మరియ గర్భాన ఉద్భవింపజేసి, ఆయన సిలువ మరణము ద్వారా మన పాపములకు శిక్ష విధించిన వాడుగా ఉన్నాడు. 

ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ పాపపు శిక్షను తప్పించుకుంటూ, వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని ద్వారా దేవునికి లోబడిన ప్రతి ఒక్కరూ పాపము యొక్క శక్తిని అధిగమిస్తూ ముందుకు కొనసాగగలరు. అంతేకాదు ప్రస్తుతము పరమందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తువారు పాపము లేని చోటుకి మనలను తీసుకొని వెళ్ళుటకై రానై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన సమస్త జనులకు ఏ భేదము లేక తన కుమారుని ద్వారా ఆశీర్వాదమును అనుగ్రహించేవాడుగా దేవుడున్నాడు, కనుక ఆయన యందు నిరీక్షణ ఉంచి దీవెన పొందుదాం.

Post a Comment