దీనిని చదవడానికి మీరు చూపిన ఆసక్తిని బట్టి మీకు వందనములు, అయితే దీనిని చదవడానికి ముందుగా " దేవా నాతో మాట్లాడు, నేను నీ వాక్యమునకు లోబడతాను" అని ప్రార్ధన చేస్తూ చదవాలి అని మీకు విన్నవిస్తున్నాను.
" ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు" . - కీర్తనలు 119:5
పైన మనం చదివిన ఈ 5వ వచనము దేవుని వాక్యము మేలు చేస్తున్నదని, ప్రవర్తనను స్థిరపరచుకున్నవారికి ఆ మేలు కలుగతుందని, మన ప్రవర్తనను స్థిరపరచుకుని మేలుపొందునట్లు దేవుని సహాయం కోరుకోవాలి అని మనకు బోదిస్తున్నది, దీని భావం ఏమిటో అది మనకు ఏ పాఠాలు నేర్పిస్తుందో మరింత లోతుగా తెలుసుకుందాం రండి!
మన ఆత్మీయ జీవితం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా కలిగియుంటారు. మనము పాటలు పాడుతున్న విధానమును బట్టి, ప్రసంగిస్తున్న, బోధిస్తున్న విధానమును బట్టి, వస్త్రాధారణ, మాటతీరును బట్టి, కొంతమంది మన గురించి గొప్పగాను, ఇంకా కొంతమంది తక్కువగాను అంచనాలు వేస్తూ ఉండి ఉండవచ్చు. వారు నీ గురించి వేసిన అంచనాను బట్టి గతంలో నీవు విచారపడడం లేదా గర్వపడడం జరిగి ఉండవచ్చు.
కాని ఒక్క క్షణం నీ ఆత్మీయ జీవితం గురించి నీవు ఆలోచన చేస్తే అది నీతో ఏమి మాట్లాడుతున్నది. పై వచనం నేరుగా నీ గుండెల్లో దూసుకొని పోయినట్లుగా లేదా? నిజంగా కొంతమంది తమ ఆత్మీయ జీవితంలో ఇక సాధించాల్సింది ఏమి లేదు, పరిపూర్ణత లోనికి వచ్చాము అని భావిస్తూ ఉంటారు.
కొంతమంది వేషధారులై తమ ఆత్మీయత గురించి లేనిపోని రంగులు పులుముకొని, దానిని లోకమునకు చూపించాలి అని తాపత్రయపడుతూ, అబద్దములోనూ, మోసములోనూ జీవిస్తూ, వారు పైకి చూపిన రంగును జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటారు.
యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. - కీర్తనలు 119:1-4
దేవుని వాక్యము ఎంత విలువైనదో పై నాలుగు వచనాల్లో కీర్తనాకారుడు వివరిస్తూ ఈ 5 వచనముకు వచ్చేసరికి తన వైపు తాను చూసుకుంటూ ఉన్నాడు. తన వైపు తాను చూసుకుంటూ తనలో కొట్టచ్చినట్టుగా కనబడుతున్న తన బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
తన మార్గములు, తన ప్రవర్తన ప్రభువులో, వాక్యములో స్థిరముగా లేవు అని తనకు అర్థమైంది! దేవుని వాక్యమును పూర్ణముగా పాటించునట్లు అది స్థిరపడి ఉండలేదు అని అర్థమైంది. దేవుని వాక్యమును, చదువుతున్నాను, వింటున్నాను, బోదిస్తున్నాను, గాని దానిని గైకొనే విధంగా నా ప్రవర్తన స్థిరపరచుకోలేదు అని తనకు అర్థమైనది.
ప్రియ సహోదరుడా, సహోదరి, అది నీకు అర్ధమైనదా? అయ్యో, నేను చదివిన, విన్న, ప్రకటించిన వాక్యములన్నిటిని నేను పాటించియుంటే ఎంత బాగుండేది, ఎంత మేలు కలిగియుండేది అని బాధ కలుగుతున్నది కదా! కీర్తనాకారుడు కూడా ఒక వైపు ఆయనలో బాధ కలుగుతుంటే ఇంకో వైపు ఆయన ప్రార్ధన చేస్తున్నాడు! తన ప్రవర్తనను స్థిరపరచుకుంటే అది తనకు మేలు కలుగజేస్తుంది అని భావిస్తూ దేవుని సహాయం కోరుతున్నాడు.
భూమి మీద ఉన్న ఏ భక్తుడూ (నాతో సహా) పరిపూర్ణుడు కాదు, ఒక్కొక్కరు వారి వారి పరిధిలో బలహీనతలు కలిగి ఉంటారు, కొంతమందికి తిండి, ఇంకొంతమందికి నిద్ర, మరికొంతమందికి డబ్బు, ఇంకొంతమందికి పదవి, ఇలా ఎన్నో… నీవు బలముగా ఉన్న అంశంలో నీ పొరుగువాడు బలహీనుడుగా ఉండొచ్చు, ఆయన బలముగా ఉన్న అంశంలో నీవు బలహీనడవు కావొచ్చు.
కాబట్టి నీవు బలముగా ఉన్న అంశమును పట్టుకొని, అది నీ పొరుగువానిలో ఉన్న బలహీనత అని నీవు తెలుసుకొని, నీవు పరిపూర్ణుడైనట్టు అతని/ఆమె మీద కాలు నిలిపి అతనిని/ఆమెను అణగద్రోక్కుతూ నీవు నిలబడే ప్రయత్నం చేయకుండా.. మనకున్న బలహీనత, మనము అస్థిరముగా ఉన్న ప్రవర్తన విధానాలు ఆలోచించుకొని మనలను మనము సరిచేసుకొని స్థిరపరచుకొనే ప్రయత్నం చేద్దాం! నిజముగా మనము మన ప్రవర్తనను స్థిరపరచుకొంటే ఎంతగానో మేలు పొందుతాము.

Good message brother
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి