వందనములు తండ్రి (Thank you Father )
హాయ్ పిల్లలు బాగున్నారా?? మంచిగా, క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్తున్నారా?? అయితే మీలో ఎంత మంది ప్రార్ధన చేసుకొని స్కూల్ కు వెళ్తున్నారు??
అరే! నేను ప్రార్ధన చేసుకోకుండా స్కూల్ కు వెళ్తున్నానే!! అని సిగ్గుపడుతున్నారా? కాదా!! ఓహ్ మీ మమ్మీ, డాడీ ప్రార్ధన చేసి మిమ్మల్ని స్కూల్ కి పంపిస్తున్నారా!
మంచి పిల్లలయితే దేవునికి ప్రార్ధన చేసుకొని స్కూల్ కి వెళ్తారు (మమ్మీ, డాడీ ప్రార్ధనే కాదు, మీరు కూడా ప్రార్ధన చేసుకోవాలి)
మంచి పిల్లలందరు ప్రార్ధన చేసుకుంటారు అని ఒప్పుకుంటున్నారా?? మరి మీలో చాలా మంది ఎందుకు ప్రార్ధన చేసుకోవడం లేదు ?? ఓహ్ మీలో చాలా మందికి ప్రార్ధన చేయడం రాదు కదా! అందుకే మీరు ప్రార్ధన చేసుకోలేదు కదా!!
ఓకే ఓకే నాకు అర్థమైంది. సరే ప్రార్ధన చేయడం రాకపోతే ఏమి చేయాలో, అసలు ఎందుకు ప్రార్ధన చేసుకోవాలో ఈ రోజు పాఠములో నేర్చుకుందాం! మీరు రెడీనా??
యేసయ్య భూలోకములో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రార్ధన చేసేవాడు. కొన్ని సార్లు రాత్రంతా ప్రార్ధన చేసేవాడు. కొన్ని సార్లు వేకువనే లేచి ప్రార్ధన చేసేవాడు, కొంతమంది చాలా ఆలస్యముగా నిద్రలేస్తారు (మీరు కూడా అంతేనా, సర్లే సిగ్గుపడకండి)
అలా ఒకసారి శిష్యులు నిద్రలేచేసరికి యేసయ్య వారి పక్కన లేడు. ఎక్కడికి వెళ్లాడా అని వెదుకుతూ వెళ్తే యేసయ్య ప్రార్ధన చేస్తూ వారికి కనిపించాడు.
యేసయ్యకు ప్రార్ధన చేసే అలవాటు ఉంది. మీకు కూడా ఆ అలవాటు ఉందా?? స్కూల్ కు వెళ్ళేటప్పుడు మాత్రమే కాదు ఉదయాన్నే లేచి ప్రార్ధన చేసుకునే అలవాటు ఉందా?? ఉంటే మంచిది! లేకపోతే ఈ రోజు నుండి ప్రారంభం చేయండి. ఎందుకంటే ప్రార్ధన మన జీవితంలో చాలా ముఖ్యమైనది.
మనము ప్రతి రోజు దేవునికి ప్రార్ధన చేసే వారముగా ఉండాలి అలా యేసయ్య తన అలవాటు ప్రకారం ఒకరోజు ప్రార్ధన చేస్తూ ఉన్నాడు. యేసయ్య శిష్యులు ఆయన ప్రార్ధన ముగించే వరకు ఆగి, ఆ తర్వాత ఆయన శిష్యులలో ఒకడు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్ధన నేర్పమని యేసయ్యను అడిగాడు.
అప్పుడు యేసయ్య ఇలా ప్రార్ధన చేయమని చెప్పాడు.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
పిల్లలు మీరందరు ఈ ప్రార్ధన నేర్చుకొండి, సరేనా! అసలు దేవునికి మనం ఎందుకు ప్రార్ధన చేయాలి అంటే…ఆయన మన తండ్రి కాబట్టి!
మీరు ఉదయాన్నే నిద్రలేవగానే మీ మమ్మీ డాడీ కి good morning చెప్తారా?? చెప్పరా! అయితే మీరు అది అలవాటు చేసుకోవాలి. నిద్రలేచిన వెంటనే మమ్మీని డాడీని పలకరించాలి, వారికి వందనాలు చెప్పాలి.
దానికంటే ముందు దేవునికి ప్రార్ధన చేయాలి, ఎందుకంటే ఆయన మన తండ్రి. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా దేవునికి ప్రార్ధన చేయాలి.
మనకు ఈ జీవితమును, మమ్మీ, డాడీని, మంచి డ్రెస్, ఆహారం, ఫ్రెండ్స్, టీచర్స్, బుక్స్ అన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి దేవా, నన్ను అందముగా పుట్టించినందుకు, మంచి మమ్మీ డాడీలను ఇచ్చినందుకు, డ్రెస్, ఆహారం, ఫ్రెండ్స్, బుక్స్ ఇచ్చినందుకు వందనాలు అని దేవునికి ప్రార్ధన చేయాలి.
ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేకపోతే, డ్రెస్, ఫ్రెండ్స్చే, బుక్స్ ఇలాంటివి మీకు లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన వాటిని బట్టి ఆయనకు వందనాలు చెప్పండి.
ప్రార్ధన చేయడం అంటే దేవునితో మాట్లాడడమే, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలా దేవునితో మాట్లాడండి. ఏమి మాట్లాడాలో అర్దమైందా??
కాబట్టి దేవుడు ఒక తండ్రి లాగా మీకు ఏమేమి చేస్తున్నాడో, ఇస్తున్నాడో ఆలోచించుకొని దేవునికి వందనాలు చెప్పండి. మీ డాడీతో ఎలా మాట్లాడతారో అలా దేవునితో మాట్లాడండి.
వచ్చే భాగములో ఇంకా దేవునితో ఎలా మాట్లాడాలో, ప్రార్ధన చేయాలో తెలుసుకుందాం. సరేనా! మీకోసం క్రింద ఒక కంఠత వాక్యము ఇస్తున్నాను. అందరూ నేర్చుకోండి. సరేనా, బై! దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
కంఠత వాక్యము :
…మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. -1దినవృత్తాంతములు 29:10
- ఆర్. సమూయేలు.

వందనాలు బ్రదర్, యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన, మనం కూడా అదే ప్రార్ధనఈ దినాలలో పలుకవచ్చా. నీ రాజ్యము వచ్చును గాక అని అక్కడ ప్రార్థన నేర్పించారు.అపో కార్యములు 2వ అధ్యాయం లో పెంతేకొస్తు పండుగ నాడు దేవుని రాజ్యం స్థాపించబడింది. గనుక మరలా మనము నీ రాజ్యము వచ్చును గాక అని మనం ప్రార్ధన చేయ వచ్చునా. దయచేసి తెలుపగలరు.Thanking you brother.
రిప్లయితొలగించండిఅన్న, "దేవుని రాజ్యము వచ్చింది వస్తూ ఉంది" కాబట్టి ఈ ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. ఈ విషయం మీద మీకు మరింత వివరణ కావాలని కోరుకున్నట్లైతే దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యాసాన్ని రాస్తాను.
రిప్లయితొలగించండిOkay brother
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి