దేవుని దయను గుర్తించిన హవ్వ


దేవుని  దయను గుర్తించిన హవ్వ
Eve -6

తల్లిగా  దేవుని దయను గుర్తించింది

ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. -ఆదికాండము 4:1

    మనకు ఇవ్వవలసిన వాటిని ఇవ్వకపోవడం, పొందవలసిన వాటిని పొందకపోవడాన్ని దయ అంటారు. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు దయగలిగినవాడు. ఆయన మనతో వ్యవహరించే విధానాల్లో ఆ దయను కనబరుస్తూ ఆయన నడుచుకునేవాడుగా ఉన్నారు. నిజంగా మనం ఆలోచిస్తే చాలా సందర్భాల్లో మనకు ఇవ్వవలసిన వాటిని దేవుడు ఇవ్వకుండా బిగబట్టుకున్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం.

ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము. -యోబు 11:6

    దేవుడు చాలా మంచివాడు, మనం ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించిన గుర్తించకపోయినా దానిని మన జీవితంలో ఆయన వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆదాము హవ్వల జీవితాన్ని గమనిస్తే వారి విషయంలో దేవుడు దయ కలిగించిన విధానాన్ని ముఖ్యంగా హవ్వ ఒక తల్లిగా గుర్తించింది. హవ్వ గుర్తించిన వాటిని మనం కూడా మననం చేసుకుందాం రండి

చర్మపు చొక్కాలు కుట్టించడం :

    ఆదాము హవ్వలు దేవుని ఎదుట పాపం చేసి, తాము దిగంబరులమన్న సంగతి తెలుసుకొని వారి శరీరాలను కప్పుకోవడానికి అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకున్నారు. ఆకులతో శరీరాన్ని కప్పుకోవడం అంత శ్రేష్టమైన ఆలోచన కాకపోయినా అంతకుమించి అప్పుడు వారు చేయగలిగింది మరొకటి ఏమీ లేకుండా పోయింది. జీవితం ఇలాగే కొనసాగితే వారు ఎంతగా ఇబ్బంది పడవలసి వస్తుందో ఎరిగిన సర్వజ్ఞాని అయిన దేవుడు ఏదేను తోట నుండి వారిని పంపించి వేయడానికి ముందుగా వారికి చర్మపు చొక్కాయిలను కుట్టించిన వాడుగా ఉన్నాడు.

    ఇది మానవునికి రాని ఆలోచన, దేవుడే చొరవ తీసుకుని చేసిన కార్యమై ఉన్నది. నిజంగా ఇది దేవుడు చేసిన దయాపూర్వకమైన కార్యమే. మన జీవితాల్లో మనం అనేక విధమైన రీతుల్లో తప్పిపోయి కష్టాలు కొని తెచ్చుకొన గా మన చావుకు మనలను విడిచిపెట్టకుండా అవసరమైన ఆ సహాయమును మన అర్హత వైపు చూడకుండా చేస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైయున్నాము.

గర్భఫలం ఇవ్వడం :

    సాధారణంగా ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, ఆ వ్యక్తి చేసిన ఆ తప్పును మన మనసులో ఉంచుకొని వారికి ఇవ్వవలసిన మంచి వాటిని అన్నిటిని బిగబట్టుకునేవారముగా ఉంటాము. కానీ దేవుడు మన పాపములను బట్టి మనపై చూపవలసిన కోపమును బిగబట్టుకున్నాడు, (ఇదే దయ అని పిలవబడుతున్నది) ఆశీర్వాదములను బహుమానములను ధారాళముగా అనుగ్రహించాడు.

ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి. -అపో.కార్యములు 14:16,17

    దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారిని ఆయన ఆశీర్వదిస్తూ, మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అన్నాడు.

దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. -ఆదికాండము 1:28

    దీనిని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చంటే పాపం చేయడానికి పిల్లలను కనడానికి సంబంధమే లేదు. ఆదాము హవ్వలు పాపం చేయడానికి అంటే ముందే పిల్లలు దేవుని ఆలోచనలో ఉన్నారు. వారికి పిల్లలను ఇవ్వాలని, పిల్లల చేత భూమిని నింపాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ విస్మయానికి గురి చేసే విషయం ఏంటంటే మనుషులు దేవుని మాట వినకపోయినా ఆయన తన ఆలోచన మార్చుకోలేదు. దేవుడు ఇక్కడ వీరిని భార్యాభర్తలుగానే విడిచిపెట్టక తల్లిదండ్రులుగా మార్చిన వాడుగా ఉన్నాడు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని బైబిల్ చెప్తుంది

కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే -కీర్తనలు 127:3

    ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి వారిని పిల్లలు లేని వారిని మిగిల్చాలని దేవుడు అనుకోలేదు. వారు పాపం చేసినప్పటికీ పాపమును బట్టి వారి మీదికి రావలసిన వాటిని దేవుడు బిగబట్టి వారి మనుగడకు అవసరమైన బహుమానాలన్నిటిని వెనుతీయక ఆయన అనుగ్రహించినవాడుగా ఉన్నాడు.

         పిల్లలు లేని చాలామంది వారి పాపాన్ని బట్టి వారి జీవితం ఇలా ఉంది అని భావిస్తారు. లోకం కూడా వారిని అలాగే చూస్తుంది. పిల్లలను పొందిన అనేకమంది అదేదో వారి గొప్పతనం గా భావిస్తారు.

    వీరి ఆలోచనలు మనం అనుసరిస్తే పిల్లలను పొందిన ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టులు, పొందలేకుండా ఉన్న వారందరూ దేవునికి అయిష్టులు అని భావించాల్సి వస్తుంది. పరిశుద్ధులైన చాలామంది భార్యాభర్తలు పిల్లలు లేని వారిగానే ఉన్నారనే సంగతిని గమనించండి.

    పిల్లలను కలిగి ఉండటం, లేకపోవడం అనేవి దేవుని దయ పూర్వకమైన ఆయన సంకల్పమునకు చెందిన కార్యములుగా అంగీకరించండి. దేవుడు మీకు బిడ్డలని ఇస్తే దేవుని దయను బట్టి ఆయనను స్తుతించండి, దేవుడు మీకింకా బిడ్డల్ని ఇవ్వకపోతే ఆయన దయ కొరకు కనిపెట్టుకొనండి ఆయన చిత్తమును అంగీకరించండి.

    దేవుడు ఇక్కడ వీరికి పిల్లలను ఇవ్వకుండా బిగబట్టడంలో ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి , వీరి జీవితం కూడా అందుకు సరిపోయింది గా ఉంది, కానీ దయ కలిగిన దేవుడు ఆ విధంగా చేయలేదు.

పిండం ఎదుగుదలలో :

    గర్భఫలం పొందడం ఒక ఎత్తుయితే, ఆ పిండము బిడ్డగా మార్చబడి భూలోకములోనికి తీసుకురావడం మరొక అంశంగా ఉన్నది. గర్భంలో పిండం ఎదుగుతున్న దినాలన్నిటిలో దేవుని కాపుదల కావాలి. నేటి దినాల్లో గర్భ స్రావాలను అధికంగా చూస్తున్నాము. అవయవాలు సర్లేవని ఊపిరి ఆడటం లేదని, కొన్నిసార్లు తల్లి అజాగ్రత్తను బట్టి ఇలా ఎన్నో విధాలుగా చాలామంది తమ గర్భంలోని పిండములను బిడ్డలుగా చూడలేకపోతున్నారు.

    ఒక గర్భిణీ స్త్రీగా మీరు ఉన్నప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువు ఎదిగే విధంగా చేసినవాడు దేవుడే, ఆయన దయచేతనే ఒక మాంసపు ముద్ద శిశువుగా మార్చబడటం జరిగిందని గుర్తించండి.

చూలాలి గర్బమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. -ప్రసంగి 11:5
గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లి గర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. -కీర్తనలు 71:6
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. -కీర్తనలు 139:13,16

ప్రసవంలో కాపుదల :

    పిండం శిశువుగా మార్చబడటం , శిశువు తల్లి గర్భంలో నుండి క్షేమంగా బయటకు రావడం ఇవి దేవుని దయ చేత జరగవలసిన కార్యములై ఉన్నాయి.

అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలు కడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును. -1 తిమోతికి 2:15

    శిశు ప్రసూతి సమయంలో తల్లికి దేవుని కాపుదల కావాలి, పిల్లలకు జన్మనిస్తూ చనిపోయిన ఎంతోమంది తల్లులను పరిశుద్ధ గ్రంధములోను, బయట కూడా మనం చూడవచ్చు. అంతేకాదు బిడ్డను ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటం చాలా అవసరం. 

    కొన్నిసార్లు బిడ్డ బ్రతికి తల్లి చనిపోవడం తల్లి బ్రతికి బిడ్డ చనిపోవడం జరుగుతూ ఉంటాయి. కానీ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంటే అది దేవుని దయవలన సాధ్యమైందని గ్రహించాలి.

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. -ఆదికాండము 3:16

    దేవుడు హవ్వ యొక్క గర్భ వేదనను హెచ్చిస్తానని చెప్పినప్పటికీ ఆమె గర్భిణీ స్త్రీ గా ఉన్నప్పుడు ప్రసవ సమయంలోను, దేవుడే తగిన కాపుదలను మెలకువను అనుగ్రహించి ఆమె ప్రాణమును నిలిపిన వాడుగా ఉన్నాడు. 

    హవ్వ చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఈ ప్రసవ సమయంలోనైనా విచారించదగిన సంఘటనలు చోటు చేసుకునే విధంగా ఆయన చేయవచ్చు. కానీ ఆయన దయగలిగినవాడు మన వంటి స్వభావం కలిగిన వాడు ఏమాత్రం కాదు గనుక హవ్వ పొరపాట్లు ఎన్ని ఉన్నా దేవుడు ఆమెకు క్షేమకరమైన ప్రసవాన్ని ఇచ్చి చక్కని బిడ్డను అనుగ్రహించాడు.

ముగింపు :

    కాబట్టి తల్లులారా, మీ జీవితంలో మీరు తల్లిగా మార్చబడటం దేవుని దయ అని గుర్తించండి, అది మీ గొప్పతనం అని భావించి దానిని బట్టి గతంలో ఎప్పుడైనా అతిశయించి ఉంటే దేవుని యొద్ద క్షమాపణ కోరుకొనండి. మీరు పిల్లలను పొందిన దానిని బట్టి లేనివారిని చిన్న చూపు చూడడం నిందించటం చేసి ఉంటే వారిని క్షమించమని అడగండి దేవుని ఎదుట మీ తప్పును ఒప్పుకొనండి, అంతేకాదు మీ వంతుగా అలాంటి వారిని నిమిత్తం ప్రార్థన చేయండి. 

    పిల్లలు లేని వారిని చూసి మీకు ఎంతమంది పిల్లలు అని గాని, ఇంకా ఎప్పుడు కంటారు అని గాని, పదేపదే అడగొద్దు, వారు అడగకుండానే ఉచితమైన సలహాలు ఇచ్చి వారిని విసిగించడం వేధించడం చేయక, వారి భారాన్ని మీ భారంగా ఎంచుకొని దానిని బట్టి దేవునికి ప్రార్థించండి. 

    ఈమధ్య తల్లులుగా చేయబడిన వారు, ఒక తల్లిగా మీ ప్రయాణం ఎలా సాగిందో నెమరు వేసుకొని, ప్రతి అనుభవంలో దేవుడు తన దయను నీ పట్ల ఎలా చూపించాడో, జ్ఞాపకం చేసుకొని అది ఒక డైరీలో రాసుకొని అందునుబట్టి దేవుని స్తుతించండి. మేము పిల్లల్ని కానీ చాలా కాలం అయిపోయింది అని చెప్పేవారు కూడా వీలైతే ఈ పని చేయండి. దేవుని దయ చేత తల్లులుగా మార్చబడిన ప్రతి ఒక్కరిని దేవుని కృప నడిపించును గాక ఆమెన్.

- ఆర్ . సమూయేలు 

Post a Comment