![]() |
| Eve -5 |
చెడుగా ప్రోత్సహించిన హవ్వ
భార్యగా హవ్వ ఎలా ఉన్నది? - భర్తను చెడుగా ప్రోత్సహించింది
ప్రోత్సాహం అనేది ప్రతి మనిషి జీవితంలో అవసరమైయున్నది. ఎంత గొప్పవాడికైనా ఎంత చిన్నవాడికైనా ప్రోత్సాహం అవసరమే. స్థాయిని బట్టి పరిపక్వతను బట్టి ప్రోత్సాహం యొక్క రంగులు మారొచ్చేమో గాని ప్రోత్సాహం అవసరమే.
ప్రోత్సాహం కొరవడినప్పుడు చాలా అనర్ధాలు చోటుచేసుకుంటాయి, మనం కొన్ని విషయాల్లో కొంతమందిని ప్రోత్సహించలేకపోయినందుకు వారి జీవితాలు మరొక కోణంలో మారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారిని ప్రోత్సహించలేకపోయిన వారు కారణమవుతారు.
మనం ఈ భూలోకంలో జీవిస్తున్నంత కాలము మనలను మనం ప్రోత్సహించుకోవాలి, మనము ఒకరిని ఒకరం కూడా ప్రోత్సహించాలి. దేవుడు ఆదామును సృజించిన తర్వాత, ఆయనకు మంచిగా లేదని అనిపించిన ఏకైక విషయం ఆదాము ఒంటరిగా ఉండటం.
ఒంటరిగా ఉన్నవారికి జంటగా ఉండుటవలన కలిగే ప్రయోజనాలు దొరకవు గనుక ఒంటరిగా ఉండుట కంటే జంటగా ఉండటం మేలని బైబిల్ బోధిస్తున్నది.
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరియొకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? -ప్రసంగి 4:9-12
కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని భావించిన దేవుడు ఆయన కొరకు సాటి అయిన సహాయమును చేయాలనుకున్నాడు. అంటే భార్య భర్తకు సహకారంగా ఉండాలని దేవుడు భావించాడు. భార్య భర్తకు ఏ విధంగా సహకారంగా ఉండగలదు! చాలా విషయాల్లో సహకారంగా ఉండగలదు, అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. అదే ప్రోత్సహించడం. ప్రోత్సహించడం ద్వారా ఏ విధంగా సహకారం అందించగలమో ఈ భాగములో చూద్దాం.
దేవుడు కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరికీ కొన్ని బాధ్యతలు అప్పగించాడు, ఇందులో ముఖ్యంగా భార్య తన భర్తకు లోబడవలసి ఉన్నది, లేదా అప్పగించుకొనవలసి ఉన్నది. వివాహ ప్రమాణాలకు కట్టుబడి అన్ని స్థితిగతుల్లో తన భర్తను ప్రేమిస్తూ ఆదరిస్తూ ఆయనకు లోబడుతూ, సామెతలు 31 లో వివరించబడిన గుణమతి అయిన స్త్రీ యొక్క లక్షణములను జీవితంలో ప్రతిభంబింపజేస్తూ కొనసాగడమే భర్తకు తాను ఇచ్చే గొప్ప ప్రోత్సాహమైయున్నది.
ప్రోత్సాహం అనే ఈ అంశాన్ని మనం రెండు కోణాల్లో ఇక్కడ చూడవలసి ఉంది. మన బాధ్యతను మనం నిర్వర్తించడం ద్వారా ఒక వ్యక్తిని మనం ప్రోత్సహించినవారమౌతాము. ఇంకో రకంగా చెప్పాలంటే మనము చేయవలసినవి చేయకపోవడం ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించని వారి జాబితాలో మనం చేరిపోతాం.
ఒక వ్యక్తిని చెడుగా ప్రోత్సహించడం గాని, ఒక వ్యక్తిని ప్రోత్సహించుటకు గాను మనం చేయవలసిన పనులు చేయకపోవుట ద్వారా గాని ఆ వ్యక్తులు పాడవడానికి మనమే పరోక్షంగా కారణమయ్యేవారముగా ఉంటాము.
ఇక్కడ హవ్వ జీవితాన్ని చూస్తే, పండు తిని తాను పాపం చేయడం మాత్రమే కాకుండా, తన భర్తకు కూడా ఇవ్వడం ద్వారా తన భర్త కూడా పాపములో పాలిపంపులు కలిగి ఉండటానికి తాను కారణమైంది. దీనిని బట్టి హవ్వ తన భర్తను చెడుగా ప్రోత్సహించింది అని చెప్పవచ్చు.
మీలో ఎవరైనా హవ్వవంటి జీవితాన్ని కలిగి ఉన్నారేమో ఆలోచన చేసుకోండి. మీరు తప్పిపోవడమే కాకుండా, మీ భర్త కూడా దారి తప్పుటకు మీరు కారణమవుతున్నారేమో ఆలోచన చేసుకోండి.
జీవితం పట్ల మీరు గాడి తప్పిపోయి ఆలోచిస్తూ, సరైన ఉద్దేశాలు కలిగి కొనసాగుతున్న మీ భర్తను కూడా మీ మాటల ద్వారా మార్చివేసి మరొక పయనంలో పయనించునట్లు చేస్తున్నారేమో ఆలోచించండి.
నిజంగా ఈ పొరపాట్లు ఉంటే దేవుని సన్నిధిలో మీరు చేసిన దానిని బట్టి పశ్చాతాపడుతూ క్షమాపణ కోరుకుంటూ, నీ భర్త జీవితము కుటుంబ జీవితం చక్కబడునట్లుగా ప్రార్థించ వలసి ఉన్నది.
ఇక్కడే నేను మరొక కోణాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దేవుడు మీలో చాలామందిని మంచి భర్తలను ఇవ్వడం ద్వారా దీవించాడు, ఒకప్పుడు మంచిగా ఉన్న భర్తలు ప్రస్తుతం గాడి తప్పిన వారుగా, కుటుంబానికి ఇబ్బందిగా మారిపోవడం ద్వారా మీ మనసు ఎంతో గాయపడుతున్నది కదా! వారి యొక్క ప్రవర్తన మీ మనసును ఎంతో గాయపరుస్తున్నది, బాధ పెడుతున్నది. వారు అలా మారిపోవడానికి కారణం మీరేనేమో ఆలోచన చేయండి. ఆ…. నేను ఎలా కారణమవుతాను అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరే కారణం నేను చెప్పను కానీ మీరు ఒక కారణం కాకుండా పోరు అనేది వాస్తవం.
మీరు మీ భర్తను సరైన రీతిలో ప్రోత్సహించకపోవడమే మీ భర్త నేడు కలిగి ఉన్న స్థితికి కారణం. మీ బాధ్యతను మీరు సరిగా నిర్వర్తించడంలో విఫలం అవడమే మీ భర్త నేడు ఉన్న స్థితికి కారణం. మీరు ఇవ్వవలసిన ప్రేమ, కనబరచవలసిన ఆదరణ, చూపవలసిన విధేయత చూపకపోవడమే దీని అంతటికి కారణం కావచ్చు.
నీ భర్త నీకు దూరమైన తర్వాత, అక్రమ జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితుల్లో దుఃఖపడుతూ ఉంటావు తన అక్రమానికి నీవు సక్రమంగా లేకపోవడమే కారణమని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మీ భర్తల మీద మీరు చేసే అనేకమైన ఫిర్యాదులకు భార్యగా మీరు ఇవ్వలేకపోయిన ప్రోత్సాహమే కారణం.
అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. -మత్తయి 24:12
పై వాక్యాన్ని మరో రకంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు? అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారడం కాదు, ప్రేమ చల్లారి పోవడం ద్వారానే అక్రమము విస్తరిస్తుంది అని ఎందుకు అనుకోకూడదు. భార్యాభర్తలుగా మీ మధ్య ప్రేమ చల్లారిపోవడం, సంభాషణలు కోరవ కావడం, ప్రేమ భాషలను విస్మరించడం… ఇవి లేకపోవడం ద్వారా అనేకమంది భర్తలు అక్రమంగా ప్రోత్సహించబడుతున్నారు అని చెప్పవచ్చు . నీవు నిజంగా ప్రార్థన పరురాలవైతే, వాక్యానికి లోబడే వ్యక్తి వైతే,అది నీ భర్తను ప్రోత్సహించడంలో కనబడాలి.
దేవుని వాక్యం లో చెప్పబడినట్లుగా మూడు రాలే తన చేతులతో తన ఇల్లు ఊడబెరకు కుంటుంది.
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును. -సామెతలు 14:1
ఇప్పటికైనా మేలుకో ప్రియ సహోదరి, నీ నీ చేతులతో నీ భర్తను కుటుంబాన్ని వివాహ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ బాధ్యతను గుర్తు ఎరిగి నడుచుకో, నీవు ప్రత్యక్షంగా నీ భర్తను చెడుగా ప్రోత్సహించవద్దు, ఆయన చెడుగా ప్రోత్సహించబడడానికి నీవు పరోక్షంగా కూడా కారణం కావొద్దు. ఈ రెండు కోణాల్లో మీకు ఇంకా అర్థం కాని విషయాలు ఉంటే పరిశుద్ధాత్ముడే మీకు చక్కగా దీన్ని బోధించును గాక ఆమెన్.
కార్యాచరణ :
ఒక భార్యగా నీకున్న బాధ్యతలు ఏమిటి, ఏమి నువ్వు సరిగ్గా నిర్వర్తించగలిగావు, ఏది నువ్వు సరిగా నిర్వర్తించలేకపోయావు! అనే విషయాలను ఒక పట్టికగా రాసుకొని, ఆలోచించుకుని, నీ బాధ్యతను నీవు సరిగా నిర్వర్తించకపోవడం ద్వారా నీ భర్త ఒకవేళ చెడుగా ప్రోత్సహించబడుతున్నాడేమో అనే విషయాన్ని పరిశీలించడం ద్వారా తనని అడిగి తెలుసుకోవడం ద్వారా దిద్దుకునే ప్రయత్నం చేయండి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి