విమోచించు దేవుడు
నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము. - కీర్తనలు 44:22-26
పక్షిరాజు తన గూడు రేపినప్పుడు, ఆ గూడులో నుండి పడిపోతున్న పిల్లలకు గనుక మాటలు వస్తే, అవి మాట్లాడుకుంటే ఆ మాటలు ఇలా ఉంటాయేమో " మా అమ్మకు నా మీద ప్రేమ లేదు, నేను ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు, అందుకే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తుంది, అసలు ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా, అలా చేసేది ఒక తల్లేనా " అని మాట్లాడుకుంటాయేమో. అవి అలా మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే, గూడురేపిన పక్షిరాజు తన పిల్లలు పూర్తిగా కింద పడక ముందే మరలా వచ్చి రెక్కలు చాపి తన రెక్కల మీద ఆ పిల్లలను ఎక్కించుకుని వాటిని గూటిలోనికి తీసుకొని వెళుతుంది. సరిగ్గా మన కష్టాల్లో దేవుడు ఇదే చేస్తాడు.
క్రైస్తవ జీవితం శ్రమల కుంపటి వంటిది. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనివార్యము. లోకంలో విశ్వాసికి శ్రమ తప్పకుండా కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు.
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. -యోహాను 16:33
శ్రమ కలిగినప్పుడు ఆశ్చర్యపడవద్దని అపోస్తలుడైన పేతురుగారు ముందుగానే మనలను హెచ్చరించారు.
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. -1 పేతురు 4:12
అయినప్పటికీ శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు మనము ఆశ్చర్యపడుతుంటాం ఆవేదన చెందుతూ ఉంటాం. శ్రమకు కారణం ఏదైనా తగిన సహాయం వెంటనే మనము పొందకపోతే వివిధ ఆలోచనలతో మనము మన మనసులను నింపేసుకుంటాం. జరగని కార్యములను బట్టి, పొందని మేలును బట్టి, జరుగుతున్న అన్యాయాలను బట్టి, మూసి వేయబడిన ద్వారాలను బట్టి, మనం ఇలా ఆలోచించుటకు మొదలుపెడతాం.
ఆ సమయాల్లో మన విషయంలో దేవుడు నిద్రిస్తున్నట్టుగా, ఆయన మనలను విడిచిపెట్టినట్లుగా, తన ముఖాన్ని మనకు మరుగుపరుచుకున్నట్టుగా, మనకు కలుగుతున్న హింస బాధ ఆయన మరిచిపోయినట్టుగా భావిస్తూ ఉంటాం. ఈ భావం సరైనదేనా?? మన బాధల ద్వారా కలిగిన కృంగుదలను బట్టి దేవుని విషయంలో మనం ఈ విధంగా అపార్థం చేసుకుంటాము, కానీ నిజానికి దేవుడు కునికేవాడు కాదు నిద్రించేవాడు కాదు ఆయనను మేల్కొల్పవలసిన అవసరం అంతకన్నా లేదు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు - కీర్తనలు 121:4
మన దేవుడు విడువనివాడు, నీ బాధలను బట్టి ఆయన నిన్ను విడిచిపోయాడని నీకు అనిపిస్తుందేమో కానీ పవిత్రత కలిగి ప్రభువును వెంబడిస్తున్న వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే నిన్ను విడివను ఎన్నడూ ఎడబాయని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నువ్వు గట్టిగా ఆనుకుని నిలబడవచ్చు
నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. .... -యెహోషువ 1:6
పాపము నీ జీవితంలో లేకపోతే, దేవుడు ఎన్నటికీ తన ముఖమును నీకు మరుగు చేసుకొనుడు.
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. - యెషయా 59:2
మన జీవితంలో మనం లెక్కలేనన్ని సార్లు దేవుని మర్చిపోతామేమో గాని ఆయన మనలను మరిచిపోయేవాడు కాదు, నీ జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడో లేడో కానీ ఆయన ఆలోచనలలో మాత్రమ నీవు ఉన్నావు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధలను బట్టి నీ జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలను బట్టి దేవుని అపార్థం చేసుకోవద్దు, ఒకవేళ నీవు అలా అపార్థం చేసుకుని ఉంటే దానిని బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపపడు. ఎందుకంటే ఈ అపార్ధాలు నిన్ను సంపూర్ణంగా దేవునికి దూరం చేసే ప్రమాదం ఉన్నది.
ఈ అపార్థాల ద్వారానే దేవునికి దూరమైపోయిన వారు చాలామంది ఉన్నారు, అలా దూరమైపోయిన వారిలో గాని, దేవునికి దూరం అవ్వాలని ఆలోచిస్తున్న వారిలో గాని ఒకవేళ నీవు ఉంటే ఈ ఒక్క ప్రశ్నకు నీవు సమాధానం చెప్పాలి? నీవు దేవునికి దూరం అవ్వాలి అనుకోవడానికి కారణం నీ శ్రమలేయైతే, శ్రమల మార్గములో ఉపశమనం పొందడమేయైతే, నిజానికి నీవు దేవునికి దూరం అవడం ద్వారా ఆరోగ్యకరమైన ఉపశమనం నీకు కలుగుతుందా? శాశ్వతమైన పరిష్కారం నీవు చూడగలవా? ఈ రెండిటికి మించి బహు భయంకరమైన నిత్య నరకమును తప్పించుకొనగలవా? సాధ్యం కాదు కదా.
శ్రమలలోనే దేవుడు నిన్ను నిత్యము ఉంచుతాడని నీవు ఎందుకు అనుకుంటున్నావు? శ్రమలలో నీవు ఆనందాన్ని చూడాలన్నా, శ్రమల తర్వాత నీవు మంచి ఫలితాలను చూడాలన్న దేవుని ద్వారా తప్ప నీకు మరొక మార్గం లేదు.
ఇప్పటికైనా గ్రహించు మన దేవుడు విమోచించేవాడు, మన పాపముల నుండి మనలను విమోచించుటకు ఒక గొర్రెపిల్లవలే తాను కల్వరి సిలువలో వధించబడ్డాడు. నీ శ్రమలన్నిటి నుండి నిన్ను విమోచించువాడు ఆయనే, దీన్ని స్పష్టంగా ఎరిగిన కోరహు కుమారులు, వారి బాధలను బట్టి దేవునితో వాదించినప్పటికీ, మాకు సహాయం చేసి మమ్ములను విమోచించమని దేవుని వేడుకున్నారు .
మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము. -కీర్తనలు 44:26
కాబట్టి దేవునిని నిందించడం, అపార్థం చేసుకోవడం మాని, మన పాపముల నుండి మనలను విమోచించినందుకు, మన శ్రమల నుండి మనలను విమోచింపబోవుచున్నందుకు హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం.
మన శ్రమలను బట్టి దినమెల్ల మనం వధింపబడుతున్నవారముగా ఉన్నప్పటికీ, దేవుడు వాటన్నిటిలో మనకు అత్యధిక విజయాన్ని ఇస్తాడని గ్రహించి విశ్వసించి స్తుతించేవారంగా ఉందాం.
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. -రోమీయులకు 8:36,37
కలుగుతున్న ఏ శ్రమ, దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవని, గ్రహించి, ఈ లోపు గానే ఆయన నుండి వేరుపడే బుద్ధిహీనమైన నిర్ణయాలు మాని ఆయన అనుగ్రహించు అత్యధిక విజయం పొందుటకు ఆయనను హత్తుకుని దీవించబడదాం, అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి