హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు



హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు


 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు

 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? -కీర్తనలు 44:20,21

    మనం కొన్ని పుస్తకాలు చదివి లేదా కొన్ని ప్రసంగాలు విని కొన్నిసార్లు నిరాశపడుతూ ఉంటాము. మనం చదివిన పుస్తకాల్లో మనం విన్న ఆ ప్రసంగాల్లో మనం ఆశించిన విషయాలు లేదా మనం ఉన్న పరిస్థితులకు సంబంధించిన విషయాలు లేకపోవడమే కారణం. 

    మనం ఆ విషయాన్ని సదరు ప్రసంగీకునితో లేదా రచయితతో పంచుకుంటే, అయ్యో మీరు కూడా చదువుతారని వింటారని నాకు ముందే తెలిసి ఉంటే నేను మీకు తగ్గట్టుగా దాన్ని మలిచేవాడిని అని చెప్పవచ్చు. కాని అది నిజమా?? చాలాసార్లు మనం వ్యక్తులతో మాట్లాడగలవేమో గాని వారి వ్యక్తిత్వంతో అంతరంగ స్థితిలో మనం మాట్లాడలేం. దానికి కారణం మనిషిని హృదయము చాలా లోతైనది, వారి అంతరంగము పైకి కనిపించే అంత తేటగా ఏమాత్రం ఉండదు.

నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును. -సామెతలు 20:5

    కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు కానీ వారి అంతరంగము దుఃఖముతో నిండి ఉంటుంది.

ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. -సామెతలు 14:13

    ఈ వైరుద్యాలను మనం అనేక విషయాలకు ఆపాదించవచ్చు, పైకి భక్తి కలిగి లోపల భక్తి హీనంగా, పైకి గంభీరంగా లోపల బిడియంగా, పైకి అందంగా లోపల అందవిహీనంగా, పైకి జ్ఞానంగా లోపల బుద్ధిహీనంగా, పైకి ప్రేమగా లోపల ద్వేషంతో, పైకి మర్యాదగా లోపల గర్వంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే హృదయము మోసకరమైనది అని బైబిల్ చెప్తున్నది.

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? -యిర్మియా 17:9

    నిజంగా దాన్ని గ్రహింపగలిగిన వారెవరు?? కొన్ని సంవత్సరాల స్నేహం తర్వాత కొంతకాలం పాటు కలిసి ఉన్న తర్వాత ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని మరో వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకున్నాను అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఎంత గొప్ప మేధావైనా, ఎంత గొప్ప ప్రవక్తయినా, ఎదుటి వ్యక్తి యొక్క అంతరంగమును సంపూర్ణంగా వివేచించడం సాధ్యం కాదు.

వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. -1 సమూయేలు 16:6,7

    మన జీవితంలో మనం కొన్నిసార్లు మన విషయాలు ఎవరికీ తెలియకూడదు అని జాగ్రత్తపడుతూ వాటిని మరుగునపెడతాం. ఇందులో మన పాపములు రోగములు బలహీనతలు సమస్యలు ఇలా ఎన్నో ఉండవచ్చు. మనము చనిపోయే వరకు కూడా మనకా రోగం ఉన్నట్టు, సమస్య ఉన్నట్టు ఎవరూ గుర్తించలేకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే ఈ దినాన్న మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన ఈ జాగ్రత్తలన్నీ మనుషుల విషయంలో మాత్రమే పరిమితం.

    మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన ఎదుటి నుండి దేనిని మనము దాచలేము. నీవు గ్రహించినా గ్రహించకపోయినా, నీవు దేవునితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయన నీ బాధలు, భారములు, భవిష్యత్తును గూర్చి నీకున్న తలంపులు, నీ అంతరంగములో నీవు మరుగు చేసుకొని ఉన్న పాపములు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు.

 మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. -నిర్గమకాండము 3:7
 మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; -మత్తయి 6:8

    ఈ విషయాన్ని ఇక్కడ కోరహు కుమారులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితిలన్నిటిలో వారు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు నిబంధనను మరువక మార్గమును విడువక కొనసాగినట్టు గతంలోనే చెప్పారు. మరి ఈ వచనాల్లో వాళ్లు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మాకున్న కఠిన పరిస్థితులను బట్టి అపజయాన్నిబట్టి బానిసలుగా అమ్మబడిన విధానాన్ని బట్టి మిగిలిన కొద్దిపాటి శేషమును బట్టి మేము మా దేవుని నామాన్ని మర్చిపోలేదు, అన్య దేవతలతట్టు మా చేతులు చాప లేదు. 

    చేతులు చాపడం అనేది ఆరాధించుటను ప్రార్థించుటను సూచించుచున్నది. అనగా ఇక్కడ వీరు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మా పరిస్థితి ఎలా ఉన్నా మేము మా దేవునిని విడిచి అన్య దేవతలు వైపు మరలిపోలేదు అని తెలియజేస్తున్నారు. వీరిస్తున్న ఈ సాక్ష్యాన్ని మనలో ఎంతమందిమి ఇవ్వగలము! పైగా వారు ఎంత దృఢంగా ఈ విషయాన్ని చెప్తున్నారంటే ఒకవేళ మేము అలా చేసి ఉంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించకుండా మానుకుంటాడా అని అడుగుతున్నారు.

    కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన వాడు, మన హృదయాలను పరిశోధించగలిగినవాడు. ఈ దినాన ఆయన నీ స్థితిని నీ అంతరంగంలో ఉన్నటువంటి బాధలన్నిటిని ఎరిగిన వాడుగా ఉన్నాడని గ్రహించి దాన్నిబట్టి దేవునిని మనస్సు పూర్వకముగా స్తుతించు. 

    రెండవదిగా నీవు మరుగు చేసుకున్న పాపమంతటిని రహస్యముగా ఉంచుకున్న అనేకమైన విషయాలను పరిశోధించువాడుగా ఆయన ఉన్నాడని గ్రహించి దేవుని ఎదుట పశ్చాత్తాపడవలసి ఉన్నది. ఎరిగిన దేవుడు మౌనంగా ఉండడు , ఈ కష్ట నష్ట బాధలన్నిటికీ పరిష్కారాన్ని చూపుతాడు. మీ పాపమంతటికి ఆయన తీర్పు తీరుస్తాడు. నీ సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తి కనీసం ఒక్కడైనా ఉన్నాడని గ్రహించి ఆయనను స్తుతించు, ఆయనకు భయపడుతూ పశ్చాతాపంతో నిను ఆయనకు అప్పగించుకో. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నిన్నునూ నీ పరిస్థితిని చక్కదిద్ది ఆనందముతో నింపును గాక ఆమెన్.

- ఆర్ . సమూయేలు 

Post a Comment