![]() |
| Rephidim Daily Devotions - 002 |
దేవుడు అద్వితీయుడు
చాలాసార్లు మనం మీ దేవుడు మా దేవుడు అని మాట్లాడుకుంటూ ఉంటాం అతి తక్కువ సార్లు మాత్రమే కొద్ది మంది మాత్రమే మన దేవుడు అని మాట్లాడుతారు. అలా మీ మా అని మాట్లాడ్డానికి దేవుని గూర్చి మనకున్న విశ్వాసాలు వేరు కావడం ఒక కారణమేమో.
కానీ బైబిల్ తెలియజేస్తున్న సత్యాన్ని మనం గమనిస్తే " ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను " (ఆది. 1:1) అని రాయబడింది. ఇక్కడ దేవుళ్ళు అని చెప్పబడలేదు దేవుడు అని మాత్రమే చెప్పబడింది. బైబిల్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నది.
........ ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. -మార్కు 12:32
దేవుడు ఒక్కడే, చాలామంది లేరు. ఈ ఒక్కడైయున్న దేవుడు సమస్త సృష్టిని కలుగజేశాడు.
నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. .......... -నెహెమ్యా 9:6
ఈ అద్వితీయుడగు దేవుడు శ్రీమంతుడు మరియు సర్వాధిపతి అయ్యున్నాడు, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని బైబిల్ సెలవిస్తుంది.
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. -1 తిమోతికి 6:15
ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఒక్కడే అనే ఈ సత్యాన్ని నమ్ముతున్నావా? అలా నీవు నమ్ముతున్నట్లయితే నీ విశ్వాసమును ఈ అద్వితీయుడైన దేవుని మీద స్థిరంగా ఉంచవలసి ఉన్నది. నీ జీవితంలో ఈ అనుభవం లేక ఊగిసలాడుతున్న వ్యక్తివి గా నీవు ఉన్నట్లయితే దాని నుండి తక్షణమే బయటకు రా!
.......... యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, ........ -1 రాజులు 18:21
నీవు ఈ సత్యాన్ని నమ్ముతున్నట్లయితే, నీ మీద ఉన్న ఈ బాధ్యతను గుర్తించాల్సి ఉంది.
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. -ద్వితియోపదేశకాండము 6:4-7
నీవు తెలుసుకున్న ఈ సత్యాన్ని అనేకమందికి నీవు బోధించవలసి ఉన్నది, మొదటిగా నీ పిల్లలకు నీ కుటుంబీకులకు దీనిని నీవు తెలియపరచవలసి ఉన్నది. మరి నీవు అలా చేయుచున్నావా? లేకపోతే ఈ రోజే నీవు అలా చేయడానికి తీర్మానం తీసుకో. ఈరోజు కనీసం ఒక్కరితోనైనా ఈ సత్యాన్ని పంచుకునే అవకాశం కలిగించమని దేవుని ప్రార్థించు, చిత్తశుద్ధితో అవకాశాన్ని వినియోగించుకుని ఈ సత్యాన్ని ప్రచురము చెయ్.
ఎవరైతే ఈ జ్ఞానము లేని వారుగా నీకు తెలిసిన నీ కుటుంబీకులు సన్నిహితులు స్నేహితులు ఉన్నారో, వారి పేర్లు రాసుకుని వారు ఈ సత్యమును గ్రహించునట్లుగా వారి కొరకు అనుదినము ప్రార్థిస్తూ , వారికి ఒక నిర్ణీత సమయం లోపల ఈ విషయాన్ని బోధించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకో.
సత్యమెరుగునివారు సత్యమును ఎరుగునట్లుగా, సత్యమెరిగినవారు దాన్ని బోధించినట్లుగా అద్వితీయుడైన దేవుడు సహాయము అనుగ్రహించును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి