దేవుడున్నాడు
నాకు అప్పుడు 17 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్తున్నాను, ఈలోగా మా గ్రామానికి చెందిన ఒక అన్న బస్టాండ్ లో నన్ను కలసి తర్వాత ఏం చేయబోతున్నావు అని మాట్లాడాడు? నేను అప్పటికి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని సేవ కొరకు అవసరమైన తర్ఫీదును పొందడానికి, బైబిల్ కాలేజ్ కి వెళ్లి చదువుకోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశాను. దానికి ఆయన స్పందిస్తూ "ఎందుకు తమ్ముడు నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? నిజానికి దేవుడు దెయ్యం అనేటువంటిది ఏమీ లేవు, మనుషులు ఒక భయం కలిగి క్రమశిక్షణ కలిగి జీవించడానికి మన పూర్వీకులు పెద్దలు ఎవరో ఏర్పాటు చేసిన మూఢనమ్మకాలే ఈ దేవుడు దెయ్యం పరలోకం నరకం అనే అంశాలు" అని చెప్పాడు.
నాతో మాట్లాడిన ఆ అన్న వలె చాలామంది చాలా కారణాలు చేత దేవుడు లేడని భావిస్తూ ఉంటారు, అన్యాయం ఎదురైనప్పుడు, కారణము తెలియని కొన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, వారి మేధస్సుకు అందని కొన్ని విషయాలను ఆలోచించినప్పుడు దేవుడు లేడని కొంతమంది భావిస్తూ ఉంటారు, వీరిది అవగాహన లోపం అని మనం చెప్పవచ్చు.
ఇంకొంతమంది ఉంటారు, వీరు మేధావి వర్గానికి సంబంధించిన వారు, ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు, అయితే వీరు కూడా దేవుడు లేడని భావిస్తూ ఉంటారు. బైబిల్ ఇలాంటివారిని బుద్ధిహీనులు అని పిలిచింది, ఇక్కడ బుద్ధిహీనులు అంటే తెలివి లేని వాళ్ళు కాదు మూర్ఖులు అని అర్థం.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయు వాడొకడును లేడు. -కీర్తనలు 14:1
వీరు సత్యం తెలిసి దాన్ని అడ్డగించే మనుషులుగా ఉన్నారు. వారు అలా అడ్డగించడానికి కారణమేంటంటే వారికి దుర్నీతి పట్ల ఉన్న ప్రేమే.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది.-రోమీయులకు 1:18
అయితే పరిశుద్ధ గ్రంథంలోని మొదటి వచనము మనకు స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు.
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. -ఆదికాండము 1:1
నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు కూడా దేవుడు లేడనే వారి గుంపులో ఉన్నావా? అది అజ్ఞానం మూర్ఖత్వం అని తెలుసుకో! దేవుడు లేకపోతే నీకు ఉనికి లేదని తెలుసుకో, ఎందుకంటే మనము ఆయన యందు బ్రతుకుతున్నాము ఆయన యందు చలిస్తూ ఉన్నాం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము అని బైబిల్ చెప్తుంది.
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. -అపో.కార్యములు 17:28
ఒకవేళ నీవు నీ దుర్నీతిని నెరవేర్చుకోవడానికి, నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి కోరుకోని దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్నో రుజువులు నీకు కనబడుతున్నా వాటిని త్రోసిపుచ్చుతూ అదిమి పెడుతూ, నీ మనసుకు నీ తోటి వారికి సర్ది చెప్పుకుంటూ దేవుడు లేడు అని నమ్ముతూ నీవు బ్రతికినప్పటికీ , నీ నమ్మకాన్ని బట్టి దేవుని ఉనికిలో మార్పు రాదు కనుక ఒక రోజు నువ్వు మరణించిన తర్వాత నీవు లేడని అనుకున్న దేవుని ఎదుట నిలబడతావు, ఆయన నీ క్రియలన్నిటిని బట్టి నీకు తీర్పు తీర్చుతాడు, అప్పుడు నీకు కలిగేది నిత్య నరకమే.
ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నీ దుర్నీతిని విడిచిపెట్టి దేవుని ఉనికిని గుర్తించి, ఆయనకు లోబడుటకు తీర్మానించుకుంటే నిత్య నరకమును తప్పించుకొనగలవు.
నేను ఇప్పటికే దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగిన వ్యక్తివైతే, నీ జీవితంలో దేవుడు ఉన్నాడన్నట్టుగా బ్రతుకుతున్నావో లేడన్నట్టుగా బ్రతుకుతున్నావో మొదట ఆలోచించుకో, ఒకవేళ దేవుడు ఉన్నాడని నీవు నమ్ముతూ దేవుడు లేడు అన్నట్టుగా గనక జీవిస్తున్నట్లయితే, దేవుడు లేడనే వ్యక్తుల కంటే నీవింకను ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని గ్రహించి, దేవునికి లోబడి జీవించుటకు తీర్మానించుకో!
రెండవదిగా దేవుడు లేడని భావిస్తున్న వారు సత్యమును గ్రహించాలని వారి కొరకు విజ్ఞాపన చెయ్, మూడవదిగా దేవుడు ఉన్నాడన్న సత్యము తెలిసి దుర్నీతి చేత దాన్ని అడ్డగిస్తున్న వారందరూ వారి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలని వారి కొరకు ప్రార్ధించు.
ఈ విషయాన్ని ఊరక చదివి విడిచిపెట్టక ఒక డైరీ లేదా నోట్ బుక్ తీసుకుని పైన తెలిపిన మూడు అంశాల నిమిత్తమై కనీసం ముగ్గురు వ్యక్తుల పేర్లు రాసుకొని వారి కొరకు ఈ దినము మనస్పూర్వకంగా ప్రార్ధించు.
సత్యము ఎరుగని వారు సత్యమును ఎరుగునట్లును, సత్యమును తొక్కిపెడుతున్నవారు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టునట్లును, సత్యము తెలిసి దాని ప్రకారము నడవని వారు సత్యమును అనుసరించి నడుచునట్లును సత్యవంతుడైన దేవుడు సహాయం చేయను గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి