కృపను ఉచ్చరించువాడు

కృపను ఉచ్చరించువాడు

 కృపను ఉచ్చరించువాడు. 

నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.  - కీర్తనలు 45:2

బైబిల్ చాలా రకాల పెదవులు గురించి మాట్లాడుతున్నది, అందులో నిజమాడు పెదవులు, అబద్ధమాడు పెదవులు , జ్ఞానము గల పెదవులు, నీతి గల పెదవులు, బుద్ధిహీన పెదవులు, తెలివిని ఉచ్చరించు పెదవులు మరియు అపవిత్రమైన పెదవులు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు కృపగల పెదవులు గలవాడైయున్నాడు, ఆయన కృపను ఉచ్చరించేవాడైయున్నాడు.

  • నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. - సామెతలు 12:19   
  • అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు. -సామెతలు 12:22   
  • జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును  -సామెతలు 15:7 
  • నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు. -సామెతలు 16:13 
  • బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును. -సామెతలు 18:6 
  • బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. -సామెతలు 20:15
  • నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను;  -యెషయా 6:5

గడిచిన భాగంలో యేసుక్రీస్తు వారు అతి సుందరుడు అని తెలుసుకున్నాము. ఆయన సౌందర్యం ఎన్ని విధాలుగా కనబడుతుందో కూడా చూసాము. అయితే ఆ తర్వాత లైన్ లో నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది అని రాయబడింది. 

    ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన పెదవులను బట్టి ఆయన మరింత సుందరుడుగా కనబడుతున్నాడు. ఇక్కడ దయ అని తర్జుమా చేయబడిన పదానికి, హెబ్రీ భాషలో హెన్ (hen) అనే పదము ఉపయోగించబడింది. దీనికి వాస్తవంగా ఇంగ్లీషులో ఫేవర్ (favour) అని అర్థం. కానీ ఇక్కడ దయ అని అనువాదం చేయబడింది, కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలు ఈ పదానికి గ్రేస్ (grace) అని ఉపయోగించడం జరిగింది. Grace అంటే unmerited favour అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కృప అని తర్జుమా చేయడం సరైన తర్జుమా అవుతుంది. ఆయన పెదవుల మీద కృప పోయబడింది, లేదా ఆయన పెదవుల నుండి కృప వెలువడుతుంది అని మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు.

ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో పరిచర్య చేసిన కాలంలో ఆయన మాటలు ఈ వచనంలో చెప్పబడిన దానికి సరిగ్గా సరిపోయినవిగా ఉన్నాయి. ఆయన ఉచ్చరించిన కృపగల మాటలు కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేశాయి,

 అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా -లూకా 4:22

మరో సందర్భంలో యేసు క్రీస్తు వారిని బంధించడానికి పంపించబడిన సైనికులు, ఆయన మాటలు విని వట్టి చేతులతో తిరిగి వెళ్లారు. మీరు ఎందుకు ఆయనను బంధించకుండా వచ్చారు అని అడిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లుగా ఎవరు ఎన్నడూ మాట్లాడలేదని తెలియపరిచారు.

 జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీ రాయనను తీసికొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి. -యోహాను 7:32,45,46

కొంచెం కఠినంగా వ్యవహరించే సైనికులను సహితము యేసుక్రీస్తు వారి మాటలు కదిలించాయి. యేసుక్రీస్తు వారి కృపగల మాటల ద్వారా కొంతమందికి స్వస్థత సమాధానము కలిగాయి.

  •  యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను. పక్ష వాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరి యెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. -మార్కు 2:5,11,12
  • అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను. -లూకా 7:50

యేసుక్రీస్తు వారి నోట నుండి జ్ఞానము ప్రేమ, జాలి, సాత్వికము, క్షమాపణతో కూడిన మాటలే వచ్చాయి. కృపగల ఆయన మాటలు అధికారంతో కూడినవై యున్నవి. ఆయన గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలించినవి. ఆయన దయ్యములకు ఆజ్ఞాపించగా అవి వదిలిపోయినవి, ఆయన మృతులను పిలవగా వారు మరల తిరిగి బ్రతికారు.

  •  గనుక ఆయనయొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను. అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. -లూకా 8:24,25
  •  జనులు గుంపు కూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. -మార్కు 9:25-27
  • ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా  చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. -యోహాను 11:43,44 

మనందరి జీవితాల్లోనూ యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన కృపగల మాటలు మనకు ఎన్నో సందర్భాల్లో విడుదలను, రక్షణను, నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమమును, అభివృద్ధిని, విజయమును ఉన్నత స్థితిని అనుగ్రహించినవిగా ఉన్నవి. యేసుక్రీస్తు వారి కృపగల మాటల ద్వారా నీకు మేలు కలిగిందా? అలాగైతే కృపనుచ్చరించువాడా నీకు స్తోత్రమని దేవుని స్తుతించు. అదేవిధంగా మనమందరము ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించు మాటలు మాట్లాడవలసినవారమై యున్నాము.

 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. -ఎఫెసీయులకు 4:29

మేలు కలిగే మాటలు క్షేమాభివృద్ధికరమైన మాటలు ఉచ్చరించువాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, మన నోట కూడా అలాంటివే రావాలి, కానీ దానికి భిన్నంగా దుర్భాషలు మన నోట మనం రానిచ్చినవారంగా ఉన్నట్లయితే, మేలు కలిగించే క్షేమాభివృద్ధి కరమైన మాటలు పలకనటువంటి వారంగా ఉన్నట్లయితే దానిని బట్టి దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటూ, ఇది మొదలుకొని మన మాటలు ప్రేమ, మేలు, క్షేమాభివృద్ధి అను వాటిని ఇతరులకు కలిగించే విధంగా ఉండునట్లు తీర్మానించుకుందాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక ఆమెన్.

Post a Comment