అతి సుందరుడు
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. నరుల కంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. -కీర్తనలు 45:1,2
ఈ కీర్తన రాజును గురించి రాయబడినటువంటి కీర్తన, ఇక్కడ ప్రస్తావించబడిన రాజు ఎవరు అనేదాన్ని గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజు యొక్క వివాహ సమయాన్ని ఉద్దేశించి ఈ కీర్తన రాయబడినట్టుగా మనము గమనించవచ్చు. కీర్తనకారుడు రాజును తన యొక్క పెళ్లి కుమార్తెను గురించి కూడా వివరిస్తూ ఉన్నాడు. ఇది సొలోమాను మరియు ఫరో కుమార్తె యొక్క వివాహ సమయంలో రాయబడినట్లుగా, ఇక్కడ రాజు అనగా సొలోమోను అది సూచించినట్లుగా కొంతమంది అభిప్రాయపడ్డారు.
అయితే రాజును గూర్చి చెప్పిన విషయాలన్నీ సొలోమోను కు సరిపోయేవి గా లేవు గనుక ఇది కచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంఘమును ఉద్దేశించి ప్రవచనాత్మకంగా రాయబడిన కీర్తన అని మనము నమ్మవచ్చు. ఇశ్రాయేలీయులు వారి యొక్క ఆరాధన క్రమంలో ఈ కీర్తనను ఏ సమయంలో పాడుకున్నప్పటికీ మనము దీనిని ధ్యానించుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అతి దగ్గరగా చేరగలిగే వారం గా ఉంటాం.
సౌందర్యాన్ని ఇష్టపడని వారు కోరుకొనని వారు భూలోకంలో ఎవరూ లేరు, నేను ఈ మాట చెప్పగానే మీ మనసులో నా గురించి వేరేగా ఆలోచించుట ప్రారంభించారు కదా! కొన్నిసార్లు మనం ఒప్పుకోవటానికి అది కష్టంగా ఉన్నా ప్రతి ఒక్కరము అందంగా కనబడడానికి ప్రయత్నించేవారమే. అయితే నేనిక్కడ మాట్లాడుతున్న ఈ సౌందర్యం ఏంటి అనేది అర్థమైనప్పుడే నా భావాన్ని మీరు గ్రహించగలుగుతారు. సౌందర్యము అనగా అది బాహ్యానికి మాత్రమే సంబంధించింది కాదు, నిజంగానే మనలో చాలామంది బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వకపోవచ్చు, కానీ అంతరంగ సౌందర్యమును ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. కొంతమందిలో బాహ్య సౌందర్యం ఉండొచ్చేమో గాని అంతరంగ సౌందర్యం ఉండకపోవచ్చు, కొంతమంది బయటకి అంత అందంగా ఉండకపోవచ్చు కానీ లోపల వారు చాలా సౌందర్యవంతులు. సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అని నేను చెప్పినప్పుడు నేను మాట్లాడుతున్నది బాహ్య సౌందర్యాన్ని గూర్చి కాదు గాని అంతరంగ సౌందర్యాన్ని గూర్చి నేను మాట్లాడుతున్నాను.
కోరహు కుమారులు ఈ కీర్తనలో నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు అని దేవునిని స్తుతిస్తున్నారు. నరుల కంటే అతి సుందరుడు ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారే. భూలోకంలో ఉన్న చాలామంది సౌందర్యవంతులు గురించి బైబిల్ మాట్లాడుతున్నది, మోషే, సౌలు, దావీదు వీరు సౌందర్యవంతులు అని రాయబడింది.
ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి .... -నిర్గమకాండము 2:2అతనికి సౌలు అను నొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యముగల యౌవనుడు, ... -1 సమూయేలు 9:2అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. .. - 1 సమూయేలు 16:12
ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించినప్పుడు, ఆయన భౌతికంగా అంత ప్రత్యేకమైన సౌందర్యం కలిగిన వాడు కాదు.
లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. -యెషయా 53:2
ఆయన ముఖమును ప్రత్యేకంగా చూడాలని అనిపించే లక్షణాలు భౌతికంగా ఆయనలో ఏమీ లేవు. అయితే పైన ప్రస్తావించబడిన సౌందర్యవంతులు అందరికంటే ఆయన సుందరుడు అని రాయబడింది. ఆయన సౌందర్యం అంతరంగమైనది అని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఆయన ఏ విధంగా సుందరుడు గా ఉన్నాడు గమనిద్దాం రండి,
పవిత్రమైన జన్మ -
మనుషులు జన్మించినప్పుడు సౌందర్యవంతులుగా ఉండొచ్చేమో కానీ పరిశుద్ధులుగా మాత్రం లేరు. కానీ యేసయ్యా పరిశుద్ధుడిగా జన్మించాడు, కన్య మరియ గర్భాన ఆయన జన్మించడం ద్వారా పాపము లేని వాడుగా ఈ లోకంలో ప్రవేశించాడు, దీనిని బట్టి ఆలోచిస్తే జన్మలో ఆయన కంటే సుందరులు మరెవరు లేరు.
ప్రజ్ఞ గల బాల్యం -
యేసయ్య రూపం మనల్ని ఆకర్షించకపోవచ్చుగాని, ఆయన జ్ఞానము, విధేయత, ఆయనపై ఉన్న దేవుని దయ, మనుషుల దయ, వయసులో జ్ఞానంలో కలిగిన ఆరోగ్యకరమైన ఎదుగుదల, ఇవన్నీ ఆయనను సుందరుడుగా చూపిస్తున్నాయి. ఏసు వారు కలిగి ఉన్న మచ్చలేని బాల్యమును కలిగి ఉండగల బాలబాలికలు నేడు ఉన్నారా? అందుకే ఆయన వారందరికంటే సుందరుడు.
పరిశ్రమ గల యవ్వనం -
ఈయన ఒక వడ్లవాని కుమారుడిగా పిలవబడ్డాడు, తన తండ్రియైన యోసేపు వడ్రంగి పని చేసేవాడు, ఈయన బంధువులందరూ చేపలు పట్టేవారు కనుక బహుశా ఓడలకు లేదా పడవలకు ఈయన వడ్రంగి పని చేసేవాడు అనే అభిప్రాయం ఉన్నది. యేసుక్రీస్తు వారు తనకు 30 సంవత్సరాలు వయసు వచ్చేవరకు, తన కుటుంబం కొరకు కష్టపడి పనిచేశాడు. అందుకే నేటి సమాజంలో కుటుంబాన్ని బాధ్యతలను పట్టించుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగే అనేకమంది యవ్వనస్తులందరికంటే యేసయ్య సుందరుడు.
పాటించే బోధకుడు -
యేసుక్రీస్తు వారి బోధలు అద్భుతమైనవి అసమానమైనవి, ఆయన కేవలం బోధించే బోధకుడు మాత్రమే కాదు గాని, దానిని పాటించి చూపించిన బోధకుడిగా ఉన్నాడు, ఈ లోకంలోని సుందరుడైన ఏ బోధకుడు కన్నా కూడా యేసుక్రీస్తు వారు సుందరుడు గా ఉన్నాడు.
శ్రమలనుభవించుటలో -
మనుషులు ఎంత సుందరులైనా, శ్రమలలో వారు అంత వికారంగా కనబడతారు, శ్రమలలో యేసయ్య కంటే సౌందర్యవంతులుగా కనబడగలిగిన వారు ఎవరూ లేరు, అన్యాయంగా శ్రమపరచబడి క్షమించాడు, మన పై ప్రేమ కలిగి శ్రమనంతటిని ఓర్చుకున్నాడు, ఆయన శ్రమను చూచిన వారిలో కొందరు దైవత్వాన్ని ఆయనలో చూడగలిగారు.
పునరుద్ధానం -
ఎంత సుందరులైన మట్టికి మట్టి అయిపోవాల్సిందే, వారి దేహము చీకిపోయి మట్టిలో కలిసిపోతుంది, భూగర్భమును చీల్చుకుని మరణము నుండి తిరిగి లేచి సమాధిని ఖాళీ చేసిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయంలో ఆయనకు సాటి అయిన సౌందర్యం కలిగిన వారు మరెవరూ లేరు.
ఆరోహణము -
పునరుద్దానుడై తిరిగి లేచి 40 దినాలు పాటు అనేక మందికి తనను తాను కనబరుచుకుని సజీవుడుగా పరమునకు ఆరోహణమయ్యాడు ఆ దృశ్యం చూచుటకు ఎంత అందంగా ఉన్నదో!
పరమునకు ఆరోహణమైన ఈ సుందరుడు, గొప్ప మహిమతో పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడు (ప్రకటన 4&5 అధ్యాయాలు) అతి త్వరలో మరల భూలోకమునకు రానై ఉన్నాడు.
భూలోకంలో ఉన్న మనమందరము నరుల కంటే అతి సుందరుడు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన సౌందర్యమును ధ్యానిస్తూ అపేక్షిస్తూ పరలోక సైన్య సమూహాలతో కలిసి స్తుతించి ఆరాధిద్దాం. దేవా నీ వంటి సౌందర్యము నేను కలిగి ఉండునట్లు సహాయం చేయమని వేడుకుందాం, అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి