రెండంచుల ఖడ్గదారుడు
శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. -కీర్తనలు 45:3
పూర్వ కాలంలోని యుద్ధవీరులు కత్తులను మొలకు కట్టుకొనేవారు, కొంతమంది వీపు భాగమున కూడా కట్టుకునేవారు. గడచిన భాగంలో తెలుసుకున్నట్టుగానే ఈ వాక్యము సొలొమోనును సూచించినది కాదు, ఇది యేసుక్రీస్తువారికి వర్తించే విషయమైయున్నది.
సొలొమోను ఎప్పుడు యుద్ధం చేయవలసిన అవసరం రాలేదు గనుక కత్తి ఆయన ఉపయోగించిన ఆనవాలు కనబడవు. కాబట్టి ఖచ్చితంగా కోరహు కుమారులు చేస్తున్న ఈ విన్నపం యేసుక్రీస్తువారిని గూర్చినదై ఉన్నది.
భౌతిక యుద్ద వీరుడు గా కాకపోయినా యేసుక్రీస్తువారిని యుద్ధవీరునిగా బైబిల్ చూపిస్తున్నది. ఆయన నోట రెండంచుల ఖడ్గం ఉన్నదని, ఆ ఖడ్గముతో యుద్ధము మరియు వధ జరుగుతుందని బైబిల్ చెప్తుంది.
..... ఆయన నోటి నుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను...... -ప్రకటన గ్రంథం 1:16
..... మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. -ప్రకటన గ్రంథం 2:16
ఆ గుఱ్ఱము మీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దాని యెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను. -ప్రకటన గ్రంథం 19:19-21
ఈ ఖడ్గము యేసయ్య నోటి నుండి వచ్చే మాటలే.
....... దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. -హెబ్రీయులకు 4:12
యేసయ్య నోటి నుండి వెలువడే ఖడ్గము, అనగా ఆయన మాటలే, అనగా దేవుని వాక్యమే. దేవుని వాక్యమును గూర్చి అపోస్తులైన పౌలు ఈ పత్రికలో, లేదా ఈ వచనములో ఐదు విషయాలు తెలియపరిచాడు.
- దేవుని వాక్యము సజీవమైనది
- దేవుని వాక్యము బలముగలది
- దేవుని వాక్యము వాడిగలది
- దేవుని వాక్యము లోతుగా పనిచేస్తుంది
- దేవుని వాక్యము అంతరంగమును శోధిస్తుంది
దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గమునకు ఇక్కడ పోల్చబడిన విధానాన్ని బట్టి మనము ఈ రెండు విషయాలు గమనించాలి. దేవుని వాక్యము వెల్లడి చేయబడినప్పుడు అది మనుషుల లేదా పాపుల హృదయాలను ఖండిస్తుంది, దాని ద్వారా వారు నోచ్చుకోవడం జరుగుతుంది.
వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా -అపో.కార్యములు 5:33
వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. -అపో.కార్యములు 7:54
దేవుని వాక్యాన్ని బట్టి నొప్పి కలగడానికి ప్రధానమైన కారణం, అది మన యొక్క అంతరంగాన్ని బహు స్పష్టముగా బయలు పరచడమే. దేవుడు మన అంతరాంగాన్ని స్పష్టంగా చూడగలరు. కొన్ని సందర్భాల్లో మన హృదయమునుకున్న ఘోరమైన వ్యాధి మనము గ్రహింప లేనంత గొప్పది అని తెలుసుకోవాలి.
చాలాసార్లు మనం మన శరీరం వైపు చూసుకొని, నా శరీరం అంతా చక్కగా ఉందని భావిస్తాం. కానీ ఒకసారి వైద్య పరీక్షలు జరిపిన తర్వాత మన శరీరంలో ఉన్న ఎన్నో వ్యాధులు వెల్లడి చేయబడతాయి.
రకరకాల వైద్య పరీక్షలు మన శరీరంలోని వ్యాధిని వెల్లడి పరిచిన రీతిలోనే, దేవుని వాక్యము మన అంతరంగములో మనము గ్రహింపలేని పాపమును, అవిశ్వాస్యతను బట్టబయలు చేస్తుంది. దేవుని వాక్యము ఈ విధమైన కార్యమును జరిగించిన తర్వాత సాధారణంగా రెండు స్పందనలు కలుగుతాయి, మొదటిగా ప్రతి ఒక్కరిలోనూ నొప్పి కలుగుతుంది. ఈ నొప్పిని బట్టి మనసు మార్చుకోవడం ఒక స్పందన, మనలను మనము విమర్శించుకోకుండా దేవుని వాక్యమును విమర్శించడం అనేది మరొక స్పందన.
దేవుని వాక్య ఖడ్గమును మన జీవితమును సరిచేయడానికి మనము అవకాశమిచ్చి మేలు పొందువారముగా ఉండాలి. మన బోధల విషయంలో, ప్రవర్తన విషయంలో దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉంటే అదే ఖడ్గము మనతో యుద్ధం చేస్తుంది.
..... మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. -ప్రకటన గ్రంథం 2:16
ఒక అంచు వలన నీకు మేలు, క్షేమము, దేవుని వాక్యమునకు లోబడకపోతే మరొక అంచు వలన తీర్పుపొందవలసి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యమునకు లోబడి క్షేమమును మేలును పొందుకొని, తీర్పును తప్పించుకొందాము.


కామెంట్‌ను పోస్ట్ చేయండి