శూరుడు
శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. -కీర్తనలు 45:3
దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, జీవిస్తున్న వారు జీవించేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. వీరు దేవుని ఉనికిని గుర్తించరు, అంగీకరించరు, ఆయనకు లోబడరు, ఆయన మార్గంలో నడవరు. విర్రవీగి దుష్ట సంబంధమైన కార్యములు ఎన్నో చేస్తూ, సన్మార్గంలో నడుస్తున్న వారిని దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తూ తమకు తిరుగులేదు అన్నట్టుగా భావిస్తూ ఈ లోకంలో కొనసాగుతూ ఉంటారు.
ఇలాంటివారు నాయకుల స్థానాల్లో, అధికారుల స్థానాల్లో, అత్యున్నతమైన స్థానాల్లో కొన్నిసార్లు ఉంచబడవచ్చు, వారాలా ఉంచబడటం ద్వారా అన్యాయము అక్రమము రాజ్యమేలుతుంది. బీదలు దౌర్భాగ్యుల ముఖాల్లో సంతోషం కానరాదు. వీరు మంచిగా బ్రతకరు, అలా బ్రతికే వారిని బ్రతకనివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు మొదలుకొని సన్మార్గాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చేసే ప్రార్థనకు ప్రతిరూపమే పైనున్న ఆ వచనం.
ఈ వచనం ఖచ్చితంగా సొలోమోను రాజును ఉద్దేశించినది కాదని చెప్పవచ్చు, దానికి కారణం ఏంటంటే ఆయనకు శత్రువులు ఎవరూ లేరు ఆయన యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడలేదు. అయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నది, మరి ముఖ్యంగా రెండవ రాకడలో ఆయన చేయబోయే కార్యాన్ని తెలియపరుస్తున్నది.
యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న సౌందర్యానికి, ఆయన మాటలు అదనపు ఆభరణంగా మిగిలితే, ఆయన చేతలు ఆయన సౌందర్యాన్ని అధికము చేస్తున్నాయి. అతి సుందరుడైన యేసుక్రీస్తు వారు బల శౌర్యములు గల యుద్ధ వీరుడు అయి ఉన్నాడు.
తన మార్గాన్ని కోరుకుని, తన వైపు చూస్తూ కొనసాగే ప్రతి ఒక్కరి కోసం, లోకములోని అక్రమాన్ని అన్యాయాన్ని అణచి వేయుట కోసం ఆయన ఈ యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధము దేవునికి శత్రువులుగా నడుచుకునేటువంటి వారికి కునుకు లేకుండా చేస్తుంది.
ఆయన తన విరోధులందరినీ ఓడించి గెలుపు పొందుతాడు. తన బిడ్డలకు న్యాయం చేకూరే వరకు మేలు కలిగే వరకు ఒక యుద్ధ వీరుడు వలె ఆయన పోరాటం చేస్తాడు. ఇది భవిష్యత్తులో ఆయన యొక్క రెండవ రాకడలో జరగబోతున్నది.
ఈ మాటలు తెలుసుకుంటున్న మనము రెండు విషయాలను ఆలోచన చేద్దాం. మొదటిగా నీవు దేవునికి శత్రువుగా నడుస్తున్నావా? ఆయన శత్రువులపై ఆయన యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు, ఆయన సౌందర్యమును కృపను గుర్తించి ఆయన కుమారుడు గా కుమార్తెలుగా నీవు మార్చబడితే ఆయన నీ పక్షమై నిలిచి నీ కొరకు యుద్ధం చేస్తాడు, కానీ నీవు ఆయనకు వ్యతిరేకివై కొనసాగుతూ ఉన్నట్లయితే నీతోనే యుద్ధం చేయవలసి వస్తుంది.
కాబట్టి సత్యమును తెలుసుకొని, ఇకను శత్రుత్వమును కొనసాగించక ఆయనకు విధేయుడు వై జీవించుటకు ప్రయత్నం చెయ్.
రెండవదిగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి మూలంగా సమస్యలు అనుభవిస్తున్నావా, యుద్ధ వీరుడుగా మన ప్రభువు రాబోతున్నాడు అనే సత్యం తెలుసుకుని ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించు, ఆయనను మనస్ఫూర్తిగా స్తుతించు.
అంతే కాదు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కోరహు కుమారులతో గొంతు కలిపి యుద్ధమునకు త్వరపడమని దేవునిని ప్రార్థించవచ్చు. చుట్టూ అన్యాయం అక్రమం ఎంత ఉన్నా, ఎట్టకేలకు విజయం సాధించేది న్యాయమేనని ప్రభువైన యేసుక్రీస్తు వారేనని ఎరిగి నీ నీతిని విడిచిపెట్టకుండా సన్మార్గంలో కొనసాగే వ్యక్తిగా నీవుండుట మంచిది. దేవుడు అలాంటి భాగ్యము మనకు కలుగజేయును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి