తగ్గింపు కలిగి దేవునికి, సౌలుకు సేవ చేశాడు
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని యెదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెష్షయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. -1 సమూయేలు 16:21-23
దావీదు వచ్చి రావడంతోనే, ఆయన చేస్తున్న పరిచర్యతోనే సౌలు మనసును గెలిచాడు. ఇక ఆయన వెంటనే మరలా దావీదు వాళ్ళ నాన్నగారికి వర్తమానం పంపి దావీదు నాకు బాగా నచ్చాడు, నా దగ్గర పని చేయటానికి ఒప్పుకొనమని అభ్యర్థించాడు. అక్కడి నుండి దావీదుకు రాజప్రసాదంలో అప్పుడప్పుడు పని ఉంటూ ఉండేది. సౌలు యొక్క ఆయుధములు మోసేవాడుగా కూడా దావీదు నియమింపబడ్డాడు.
దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత, నేను రాజును అనే అహంభావం, లేదా అలా అభిషేకించబడ్డాను అనే గర్వం ఏమాత్రం కాన రాలేదని మనం అర్థం చేసుకోవచ్చు. అభిషేకించబడిన విధేయతలు మార్పు రాలేదు, తండ్రికి ఎప్పటి వలనే విధేయత కనబరిచాడు.
అంతేకాదు రాజుగా అభిషేకించబడిన దావీదు, సౌలు యుద్ధ ఆయుధాలు మోసేవాడుగా ఉండటం మనకేమి నేర్పిస్తున్నది! రాజు కావాల్సినవాడు, గొర్రెల దొడ్డిలో కంటే రాజభవనంలోనే ఎక్కువ కాలం ఉండాలి, అందుకొరకు కలిగిన గొప్ప అవకాశం ఇది! తాను ఇక్కడ ఉండటం ద్వారా, దొరికిన ఉద్యోగమును చేయడం ద్వారా మంచిగా ఒక అవగాహన పొందేవాడుగా ఉంటాడు.
ఈ భాగంలో దావీదు దేవుని కొరకు తన తలాంతులు ఉపయోగించేవాడిగా కనబడుతున్నాడు, తనలో ఉన్న పాటలు రాసే, పాడే తలాంతులను, వాయిద్యాలు వాయించే తలాంతులను, ప్రయోజనకరమైన రీతిలో వినియోగించడానికి దావీదు అంగీకరించాడు.
ఇంకా చెప్పాలంటే దావీదును దేవుడు ఇక్కడ చక్కగా వాడుకున్నాడు. మన టీనేజ్ లో మనము కలిగి ఉన్న ప్రతి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి, సేవ చేయడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి.
దేవుడు మన జీవితంలో తాను చేయదలచిన కార్యమును నెరవేర్చు వరకు, మనలను మనం తగ్గించుకొని దావీదు వలె పనిచేసేవారంగా ఉండాలి. ఇందులో సిగ్గు పడకూడదు, హెచ్చుతగ్గులను ఆలోచించకూడదు, స్థితిని చదువును హోదాను పక్కకు పెట్టి దేవుడు మన ఎదుటకు తీసుకువచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి.
తండ్రికి విధేయుడై, దేవుని కొరకు తన తలాంతులను ఉపయోగిస్తూ, తగ్గింపుతో తాను చేసిన సేవను బట్టి త్వరలోనే దావీదు సౌలు కుటుంబంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. దావీదులోని విధేయతను, సేవ చేసే గుణాన్ని, తగ్గింపును అలవర్చుకుందాం.
కంఠత వాక్యము :
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తి లోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు. -ప్రసంగి 9:10
పునర్విమర్శ ప్రశ్నలు :
- సౌలుకు ఉపశమనం దేని నుండి ఎలా కలిగింది?
- రాజుగా అభిషేకించబడిన దావీదుకు రాజప్రసాదంలో ఇవ్వబడిన ఉద్యోగం ఏంటి?
- దావీదుకున్న తలాంతులను, మీకున్న తలాంతులను పోల్చి చూసుకొని, దావీదు వాటిని ఉపయోగించుకున్న తీరు మీరు వాటిని ఉపయోగించుకుంటున్న తీరును పోల్చి చూడండి.
- నీకున్న ఏ తలాంతులు దేవుని సేవ కొరకు ఉపయోగిస్తున్నావు?

కామెంట్‌ను పోస్ట్ చేయండి