అభిషేకించబడినా…తండ్రికి ఎప్పటివలె లోబడ్డాడు



అభిషేకించబడినా…తండ్రికి ఎప్పటివలె లోబడ్డాడు

అభిషేకించబడినా…తండ్రికి ఎప్పటివలె లోబడ్డాడు

యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది; మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి సౌలు బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెష్షయి ఒక గార్దభము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. -1 సమూయేలు 16:14 -20 

కంఠత వాక్యము :

మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.- 1పేతురు 2:13

ఆ రోజుల్లో సౌలు అనే రాజు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు, ఇతను మొదట్లో దేవునికి ఇష్టంగా ఉన్నాడు గానీ, తర్వాత కాలంలో దేవునికి అవిధేయుడయ్యాడు. ఇతని అవిధేయతను బట్టి సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించగా, పరిష్కారంగా దేవుడు దావీదును అనుగ్రహించాడు. దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత, సౌలుకు దయ్యం పట్టినట్టుగా బైబిల్ లో రాయబడింది. సౌలుకు దయ్యం పట్టిన పరిస్థితిలో ఆయనకు సహాయం చేయడానికి మేము ఒక వ్యక్తిని కనుగొన్నాము అని ఆయన సేవకులు దావీదు గురించి తెలియజేశారు. 

దావీదు గురించి వారు చెబుతూ వారు ప్రస్తావించిన లక్షణాలను గూర్చి గడచిన భాగాలన్నిటిలో మనం నేర్చుకున్నాం. దావీదు గురించి సౌలు విన్న తర్వాత, దావీదు యొక్క నాన్నగారు యొద్దకు సౌలు వర్తమానం పంపి దావీదును తన వద్దకు పంపాలని కోరుకున్నాడు. 

దావీదును పంపమని వాళ్ళ నాన్నగారికి వర్తమానం పంపినప్పుడు దావీదు వాళ్ళ నాన్నగారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? చాలా గొప్యముగా దావీదును అభిషేకించే కార్యక్రమాలు జరిగాయి కదా, ఇది ఇంతలోనే రాజు గారికి తెలిసిందా, దావీదును ఇబ్బంది పెట్టడానికి పిలుస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఆయనకు వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరైతే ఈ వర్తమానం తీసుకువచ్చారో, వారు రాజు ఉన్న పరిస్థితిని ఆయనకు అవసరమైన సహాయాన్ని కూడా తెలియపరచి ఉండుంటారు. మొత్తానికి దావీదు వల్ల నాన్నగారు దావీదును పంపడానికి ఇష్టపడి ఆయనకు కానుకగా కొన్ని వస్తువులను కూడా పంపాడు.

మనలో చాలామంది నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోగానే మన తల్లిదండ్రులను తృణీకరించడం ప్రారంభిస్తాం, మనమెంటో గొప్పవాళ్ళమైనట్టు, వారికి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడతాము, మనం చదువుకున్న చదువును బట్టి, కొన్నిసార్లు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, ఇంకొన్నిసార్లు సంపాదిస్తున్న డబ్బులను బట్టి తల్లిదండ్రులకు లోబడి జీవించటం పక్కన పెట్టి వేస్తాం. 

అయితే దావీదు ఇక్కడ ఎంత చక్కని మాదిరి కనబరుస్తున్నారో చూడండి, తాను రాజుగా అభిషేకించబడినప్పటికీ తన తండ్రికి తాను చూపించే విధేయతలో ఏ మాత్రం మార్పు రాలేదు. తనకు ఎన్నో తలాంతులు ఉన్నప్పటికీ దావీదు తండ్రికి లోబడ్డాడు. ఈ విధేయతను మనం కూడా నేర్చుకోవాలి, వయసు పెరుగుతున్నప్పటికి, ముఖ్యంగా టీనేజ్ లో విధేయత కలిగి మనం నడుచుకోవలసి ఉన్నది. 

టీనేజ్లో తల్లిదండ్రులు మీకు చెప్పే కొన్ని పనులు మీకు విసుగు తెప్పించొచ్చు, వారు అప్డేట్ కాలేదు అని అనిపించవచ్చు, వారి అతి ప్రేమను బట్టి చెప్పే జాగ్రత్తలు మీకు ఎగతాళిగా అనిపించొచ్చు కానీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, దీనిని ఒక సవాలుగా భావించండి.

యేసయ్య ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైన, తన ప్రశ్నలకు పండితులే సమాధానం చెప్పలేకపోయినా, తన తల్లిదండ్రులకు భూలోకంలో ఆయన లోబడి ఉన్నాడు. ఇలా లోబడడం అనేది దైవిక క్రమాన్ని తెలియపరుస్తుంది. 

నీవు లోబడటానికి నీ తండ్రికున్న ఆదిక్యత, అర్హత, హోదా, ఘనత అను వాటిని లెక్కించవలసిన అవసరం లేదు. లేదా ఆయా అంశాల్లో నీవు కలిగి ఉన్న వాటిని పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. సన్మార్గంలో ప్రభువు నందు వారు నడిపించినంతవరకు వారికి లోబడి ఉండండి. 

తనకున్న ఆధిక్యతలను బట్టి ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు అవిదేయడవ్వడం ప్రారంభిస్తే, తాను పరోక్షంగా దేవునికి అవిదేయుడవుతున్నట్టే, అతి త్వరలోనే తాను ప్రత్యక్షంగా దేవునికి అవిదేయుడవుతాడు.

తల్లిదండ్రులకు విధేయులు కావడం అనేది దేవుని ఆజ్ఞ, అందులో దీర్ఘాయుష్షు అనే ఆశీర్వాదం ఉన్నది, అలా కాలేకపోతే అలాంటి వారి కన్నులను లోయ కాకులు పీకుతాయి అనే హెచ్చరింపు కూడా ఉన్నది, కాబట్టి జాగ్రత్త పడదాం.

పునర్విమర్శ ప్రశ్నలు :

  1. దావీదు ఏ పరిస్థితుల్లో తన తండ్రికి లోబడ్డాడు?
  2. దావీదు వలె లోబడిన మరొక వ్యక్తి ఎవరు?
  3. తల్లిదండ్రులకు లోబడ్డానికి చాలామందికి అడ్డం వచ్చే అంశాలు ఏంటి?
  4. ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం చదివి ఈ అంశంలో దావీదుకు ఎస్తేరుకు ఉన్న పోలికలను రాయండి.
  5. తల్లిదండ్రులకు అవిధేయత చూపడం వలన వచ్చే నష్టాలు, విధేయత చూపడం వలన కలిగే ప్రయోజనాలను రిఫరెన్స్ లతో పట్టిక రూపంలో రాయండి.

Post a Comment