నలుగురు తల్లులు - ఏ తల్లిగా నీవు ఉన్నావు ?
"హ్యాపీ మదర్స్ డే " ఈ మాట కొంత మంది మహిళలకు సంతోషం, మరి కొంత మందికి బాధాకరం. తల్లులైన వారు, నేడు పిల్లలు కలిగినవారు ఈ మాట విని సంతోషిస్తారు. తల్లులు కాలేకపోయినవారు నేడు ప్రస్తుతం పిల్లలను కోల్పోయినవారు ఎంతగానో దుఃఖిస్తారు.
అసలు ఎవరిని మనం తల్లి అని పిలవాలి? పిల్లలను కంటే మాత్రమే తల్లా? లేకపోతే కాదా?? అని ఆలోచిస్తే ఈ నాలుగు ఆలోచనలు నా మనసుకు వచ్చాయి. కాబట్టి ఈ నాలుగు రకాల తల్లులను గూర్చి ఆలోచన చేద్దాం.
1. కన్న తల్లి లేదా జన్మనిచ్చిన తల్లి :
దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. వారు పిల్లలు కలిగి ఉండాలి అనేది దేవుని సంకల్పం. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే కొంత మంది ఈ బహుమానమునకు నోచుకోనలేదు. వారు ఎందుకు బహుమానం పొందుకోలేకపోయారు అది దేవునికే తెలియాలి.
మనుష్యులముగా అది శాపం అనుకుంటాము, పాపం చుట్టుకుంది అనుకుంటాము. కానీ దేవుని ఆలోచనలు కొంత మంది విషయంలో విభిన్నంగా ఉంటాయి అని అంగీకరించలేము.
ఈ మధ్య ఓ సోదరి సాక్ష్యం నన్ను ఎంతగానో బాధపెట్టింది. వివాహమైన తరువాత ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని గర్భములో ఉండగానే కోల్పోయింది రెండు కాన్పులలో (ఒకటి సిజేరియన్ ఒకటి సాధారణ కాన్పు) ఇద్దరు చనిపోయిన బిడ్డలకే జన్మనిచ్చింది. అది జరిగిన కొన్ని నెలలకే తన భర్త చనిపోయాడు. తాను మరలా వివాహం చేసుకోలేదు, చాలా మంచి యవ్వన కాలంలో ఉన్నది దేవుని కొరకు మంచి సేవ నేడు జరిగిస్తున్నది. దీనిని ఏమని పిలుద్దాం? కర్మ అందమా? వాళ్ళు పాపాత్ములు అందమా?
చాలా సార్లు మన పిల్లల యెదుట గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతాం కానీ మన పిల్లలు ఆ గొప్ప వ్యక్తుల వలె మారతాము అని అంటే మాత్రం తట్టుకోలేము. భక్తిపరులైన అనేకమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంధములో కూడా చాలా కాలం పిల్లలు లేనివారుగా ఉన్నారు. శారా పిల్లలు లేకుండా 90 సంవత్సరాలు గడిపింది. రిబ్కాకు వివాహమైన తరువాత 20 సంవత్సరాల పాటు పిల్లలు లేరు. రాహేలు దాదాపు 10 సంవత్సరాల పాటు పిల్లలు లేకుండా ఉన్నది. తామారు పిల్లలను కనకుండానే ఇద్దరు భర్తలను పోగుట్టుకున్నది. రూతు 10 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత కూడా పిల్లలను కనలేదు మరియు భర్తను పోగొట్టుకున్నది. మనోహ భార్య , హన్నా , ఎలీసబెత్ ఇలా వీళ్ళందరూ చాలా కాలం పాటు పిల్లలు లేకుండా ఉన్నవారే. వివాహం చేసుకుంటే పిల్లలు పుడతారు కాబట్టి వివాహమే చేసుకొనవద్దు అని దేవుడు యిర్మీయాకు చెప్పాడు.
తల్లులు కాలేకపోయిన అక్కలారా, చెల్లెలరా మీరు దిగులు చెందవద్దు, దేవునికి ఏదైనా సాధ్యము అని నమ్మండి. మన అందరి విషయములో దేవుని ప్రణాళిక విభిన్నమని గ్రహించండి. సూటిపోటి మాటలను బట్టి కలతచెందవద్దు దేవునికి అప్పగించండి ఆయనే న్యాయం తీర్చుతాడు.
2. పెంచిన తల్లి లేదా జీవితమును ఇచ్చిన తల్లి:
కొంతమంది తల్లులు పిల్లలకు జన్మనిచ్చి వారు మరణించినవారుగా ఉన్నారు. రాహేలు అందుకు ఓ ఉదాహరణ . కొంతమంది తల్లులు పిల్లలను కని వారు మాకు వద్దు అని చెత్త కుండీలలో పడవేసినవారుగా ఉన్నారు, రోడ్లు మీద వదిలేసిన వారుగా ఉన్నారు. అలాంటి వారిని పెంచే భాద్యత కొన్ని అనాధ శరణాలయాలు తీసుకున్నాయి. చాలా మంది పిల్లల జీవితములలో ఈ ఇద్దరు తల్లులు ఉంటారు. నీవు కనలేకపోయినా ఎవరిని అయినా పెంచుకోవచ్చు కదా.
ఈ మధ్య ఓ చెల్లి తన గర్భఫలము కోల్పోయింది వెంటనే ఒక బాబును దత్తత తీసుకుంది. పిల్లలను కంటేనే తల్లి అని అంటే మదర్ తెరిసా ఎప్పటికి తల్లి అని పిలువబడలేదు. కొంత మంది జీవితములలో వారు అనాధగా ఉన్న బిడ్డలను దత్తత చేసుకున్న తర్వాత దేవుడు వారికి పిల్లలను ఇచ్చాడు. నీవు జన్మనిచ్చిన తల్లిగా ఉండలేకపోయినా జీవితమును ఇచ్చే తల్లిగా ఉండవచ్చు. ప్రేమకు నోచుకోని పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఆలోచించు.
యోవాషు మరణాపాయములో ఉండగా తన తల్లి ఏమి చేసిందో రాయబడలేదు గాని తన మేనత్త యెహోషబతు మాత్రం తల్లి పాత్ర తీసుకొని అతనిని కాపాడింది. అతనిని రాజుగా చేయువరకు జాగ్రత్త వహించింది. యోవాషు జీవితంలో కన్నతల్లి కంటే పెంచిన తల్లి పాత్రే ఎక్కువగా ఉన్నది.
3. ఆత్మీయ తల్లి లేదా జీవింపజేసే తల్లి :
పిల్లల భౌతిక జీవితం కంటే ఆత్మీయ జీవితము చాల ముఖ్యం. నీవు పిల్లలను కనకపోయిన పెంచకపోయిన అనేక మందికి ఆత్మీయ తల్లిగా నీవు ఉండవచ్చు. నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించి, వారిని ఆత్మీయ జీవితంలో పోషించి వారి ఆత్మలను కాస్తూ ముందుకు సాగడం ఎంత గొప్ప భాగ్యం. ఇది దేవుని సేవకుల పని అని అనుకోవద్దు. కనీసం దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయములో అయినా బాధ్యత వహించు.
మీ పిల్లలు ఈ భూలోకమంత సంపాదించుకొని వారి ఆత్మను నరకం పాలు చేసుకుంటే ఏమి లాభం. తల్లులారా పిల్లలు ఎక్కువగా మీ దగ్గరే ఉంటారు మీ ప్రవర్తన వారి ఆత్మీయ స్థితి మీద ప్రభావం చూపుతుంది జాగ్రత్త.
మొదట నీవు ఆత్మీయముగా ఉంటేనే తప్ప వారిని ఆత్మీయముగా పెంచలేవు. యోకెబెదు, హన్నా, దావీదు తల్లి ,బత్షెబ వంటివారు ఆత్మీయమైన సూచనలు వారి పిల్లలకు చేసారు. నా జీవితంలో నా తల్లి తాను బ్రతికి ఉన్నంత కాలం ఆమె ఆత్మీయ తల్లిగా కూడా ఉన్నది.
4. ఆదరించే తల్లి :
తల్లిని చంద్రుడుతోను తండ్రిని సూర్యుడుతోను పోల్చాడు ఓ సేవకుడు. ఆలోచిస్తే నిజం అన్పిస్తుంది. అమ్మ ఒడిలో దొరికే ప్రశాంతత ఇంక ఎక్కడా దొరకదేమో. తల్లి తన పిల్లలను ఆదరించేదిగా ఉండాలి. దేవుడు తల్లివలే ఆదరిస్తాను అని తెలియజేయుచున్నాడు. దేవుడు ఇచ్చే ఆదరణ ప్రతి తల్లి పొందుకొని తన పిల్లలను ఆదరించవలసియున్నది.
అతల్యా వంటి దుర్మార్గపు తల్లులుగా ఉండక, హాగరు వలె పిల్లల సమస్యలను అర్థంచేసుకుంటూ వారిని ఆదరించే వారుగా ఉండండి.
అన్వయం & ముగింపు :
అమ్మలారా, అక్కలారా, చెల్లెలరా దేవుడు మీకు పిల్లలను ఇచ్చాడా సంతోషించండి వారిని ఆదరిస్తూ, ఆత్మీయ విలువలు నేర్పిస్తూ వారికి కన్నతల్లులులాగానే మిగిలిపోకుండా ఆదరించే తల్లులుగా, ఆత్మీయ తల్లులుగా ఉండండి.
దేవుడు మీకు ఇంకా పిల్లలను ఇవ్వలేదా దేవుని చిత్తమును ప్రణాళికను గ్రహించండి దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మండి. అంతే కాదు పిల్లలు లేరని దిగులుపడక మీ కుటుంబ అంగీకారంతో అనాధలుగా ఉన్న పిల్లలను దత్తత చేసుకుని పెంచండి.
నీవు నీ పిల్లలను కోల్పోయి దిగులు చెందుతున్నావా? పర్వాలేదు నీవు చూపే తల్లి ప్రేమ అవసరమైనవారు నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, వారిలో నీ పిల్లలను చూసుకుంటూ ఆ పిల్లలు నీకు ఏమి చేయకపోయినా ఒక తల్లిగా నీవు వారి కొరకు ఏమి చేయగలవో దానిని చెయ్యి.
రెండో వివాహం ద్వారా నీవు ఒక కుటుంబంలోకి వచ్చావా, మొదటి భార్య ద్వారా నీ భర్తకు పిల్లలు ఉన్నారా, నీ పిల్లలకు వారి పిల్లలకు మధ్య తేడా చూపించవద్దు. నీవు వారికి పెంపుడు తల్లివి మాత్రమే కాకూడదు, ప్రేమ చూపే తల్లి మరియు ఆదరించే తల్లి అని నిన్ను గూర్చి వారు సాక్ష్యమివ్వాలి.
ఈ నలుగురు తల్లులలో ఏ తల్లిగా నీవు ఉన్నావు? నీకు ఏ స్థానం కలిగిన ఆ స్థాయిలో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు.
పిల్లలూ, కన్న తల్లిని, ఒక వేళ మీరు తల్లిని కోల్పోయి ఉంటె ఇప్పుడు మిమ్ములను పెంచుతున్న తల్లిని, లేదా నీకు ఎవరు లేకపోతే నీ తల్లి వయసులో ఉండే తల్లులను గౌరవించు, ప్రేమించు. గౌరవమును ప్రేమను ఈ ఒక్క మదర్స్ డే కి మాత్రమే పరిమితం చేయకుండా అనుదినము దానిని వారి పట్ల చూపే వారముగా ఉందాము.
ఆఖరుగా, మాకే ఆదరణ లేదయ్యా మమ్ములను ఎలా ఆదరించమంటావ్ అని మీరు అడుగుతుంటే, అమ్మ వంటి ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మూలముగా ఆదరింపబడి ఇతరులను ఆదరిద్దాం.
నాకు తల్లి లేకపోయినా నన్ను మీ కుమారునిగా భావించి నా కొరకు ప్రార్థిస్తూ ప్రేమ చూపుతూ ప్రోత్సహిస్తున్న తల్లులందిరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ఆర్. సమూయేలు

మాతృ దినోత్సవం సందర్భంగా, చక్కటి వాక్యం అందించారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిThanks uncle for your feedback
తొలగించండిమాతృ దినోత్సవం సందర్భంగా, చక్కటి వాక్యం అందించారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిNice message
రిప్లయితొలగించండిGood Message Brother
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి