దేవుడే మన రాజు
దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. - కీర్తనలు 44:4
బానిసత్వంలోని స్వతంత్ర ఏమిటో, స్వతంత్రలోని బానిసత్వం ఏమిటో గ్రహించిన ప్రతి ఒక్కరు, ఒక మంచి అధికారి యొక్క అధికారమునకు లోబడియుండుటకు ఇష్టపడతారు. మనుష్యుల జీవితాలలో రాజుగారి ఆజ్ఞ చాలా కీలకం. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏ ఒక్కటి జరగడానికి వీలు లేదు.
రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేస్తే దానిని మార్చడం ఇక ఎవరి తరము కాదు. రాజు గొప్పతనమును, అధికారమును గుర్తించిన అనేకులు వారి జీవితాలలో వారి సమస్యను ఆయన యొదుట చెప్పుకొంటూ, రాజా ఒక్కసారి ఈ విషయంలో నీ ఆజ్ఞ జారీ చేయి, ఆజ్ఞాపించు రాజా అని ఆయనను వేడుకొంటు వుంటారు.
భూలోకసంబంధమైన, పరిధులు కలిగిన ఓ రాజుయొక్క ఆజ్ఞలకు ఇంత గొప్పతనం వుంటే రాజుల రాజుకు ఇంకెంత గొప్పతనం వున్నది. ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే భూమి తల్లక్రిందులయ్యే గొప్ప కార్యములు జరుగుతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే భూమి పండుతుంది, కొన్నిసార్లు ఎండుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే రోగము కలుగుతుంది, తొలగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే భధ్రత కలుగుతుంది, తొలగుతుంది.
ఆయన ఆజ్ఞకు సృష్టితో పాటుగా లోకమును ఏలుతున్న రాజులు కూడా లోబడవలసిందే. రాజులు రాజుకు ఇంత గొప్ప సామర్థ్యము ఉంటే, మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు భూలోకములోని రాజుకు విన్నవించుట కంటే రాజాధిరాజుకు విన్నవించి నా జీవితంలో నీ ఆజ్ఞ జారీ చేయమని అడగితే సరిపోదా అనిపిస్తుంది కదూ.
అయితే అది అలా జరగాలంటే, ఆ రాజుల రాజు యేసుక్రీస్తు అని నీవు గ్రహించి, ఆయనను నీ జీవితంలో ప్రభువుగా అంగీకరించి, ఆయన ఆజ్ఞను పాటించుటకు ఇష్టపడుతూ, నీవు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన యొదుట వుంచి, ఆజ్ఞాపించు రాజా అని కోరుకొనవలసియున్నది. ఆయనను రాజుగా అంగీకరించడం వలన, ఒక రాజు తన రాజ్యములోని వ్యక్తికి అందించవలసిన సుభిక్షమైన పరిపాలన నీకు అందించి నీ ప్రతి అవసరత తీర్చుతాడు.
ఆయన ఏ విషయమును గూర్చి నీ జీవితంలో ఆజ్ఞాపించాలి? ఆయనను రాజుగా అంగీకరిస్తే, ఆయనను అడుగుటకు సందేహింపక నీ ఆజ్ఞను జారీ చేయమని ప్రార్థించు, తప్పక దీవెన పొందుతావు.అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ఆమెన్.

Good message brother
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి