మోషేగారు చేసిన ప్రార్ధనలు
(రెండొవ భాగము)
అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యముగలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. -నిర్గమకాండము 6:12
డి. ఎల్. మూడీ అనే సేవకుడు ఒక సండే స్కూల్ క్లాసులో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఇలా అడిగాడు? ప్రార్థన అంటే ఏమిటి? దానికి ఒక చిన్న పిల్లోడు " దేవునితో మాట్లాడడం " అని అద్భుతంగా బదులిచ్చాడు.
నిజమే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే, ఈ క్రమంలో మన మనసులో ఉన్నది దేవునికి తెలియజేసి దేవుని మనసును మనం అర్థం చేసుకొని దేవునికి లోబడే వారంగా ఉండాలి. ప్రార్థన అనే అంశాన్ని గూర్చి గతంలో ధారావాహికంగా చాలా విషయాలు నేర్చుకున్నాం, మరలా ఈరోజు మరొక ప్రార్థనను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పై వచనంలో మీరు చదివిన విషయం, మోషేగారు చేసిన ప్రార్థనగా ఉన్నది, ఆయన పై మాటలు మాట్లాడడానికి ఒక నేపథ్యం ఉన్నది, అదేంటో తెలుసుకుని దాని భావాన్ని అర్థం చేసుకుంటూ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రండి.
మోషేగారు చేసిన ఈ ప్రార్ధన లో ఈ నాలుగు అంశాలు చూడవచ్చు. వీటిని గూర్చి ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం
మోషేగారి విన్నపం :
మోషేగారు ఇక్కడ తన ప్రార్థనలో మొదటిగా "చిత్తగించుము" అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. దీనికి అయ్యా చూడండి లేదా వినండి అని అర్థం చెప్పవచ్చు. ఇక్కడ మోషేగారు తాను ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు, మన పరిస్థితులు అంతగా బాగా లేకపోయినా, దిగులు పడి కూర్చోక, దేవునికి వాటిని విన్నవించుకునేవారంగా ఉండాలి. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘస్తులకు ఇదే విషయాన్ని తెలియపరిచాడు.
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. -ఫిలిప్పీయులకు 4:6
నిజానికి మోషేగారు ఇక్కడ చాలా బాధలో ఉన్నాడు అయినప్పటికీ దేవునికి తాను ఏమి విన్నవించుకోవాలని ఆశిస్తున్నాడో దానిని తెలియపరిచే ప్రయత్నం చేశాడు. మన కష్ట నష్ట బాధల్లో దిగులుపడేవారముగా కాక మన బాధలన్నిటిని దేవునికి విన్నవించుకునేవారంగా ఉందాం. మోషేగారికున్న బాధ ఏమిటి? తెలుసుకుందాం రండి!
మోషే గారి బాధ :
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము యొక్క బానిసత్వం నుండి విడిపించి కనానులోనికి వారిని నడిపించుటకు దేవుని చేత ఎన్నిక చేయబడి పంపించబడిన సేవకుడే ఈ మోషే. దేవుడు చెప్పిన ప్రకారముగా ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు వద్దకు ఆయన వెళ్లి తన ప్రజలను పోనిమ్మని దేవుడు అడుగుతున్నట్టుగా దేవుని పక్షంగా తెలియపరిచాడు.
మోషే గారు తెలియజేసిన ఈ సమాచారానికి ఏమాత్రము దైవ భయము లేని ఐగుప్తు రాజు అనుకూలంగా కంటే వ్యతిరేకంగా స్పందించడం ప్రారంభించాడు. మోషేగారు రావడం ద్వారా సమస్యలు ఇంకా అధికమయ్యాయి, మొదట్లో మోషేగారిని బట్టి దేవుని స్తుతించిన ఇశ్రాయేలీయుల పెద్దలు, ఇప్పుడు ఐగుప్తు రాజు వారిని ఇంకా కష్టపెడుతున్న విధానాన్ని బట్టి మా ఈ కష్టానికి మీరే కారణం అంటూ మోషేగారితో మాట్లాడిన విధానాన్ని బట్టి మోషేగారు చాలా బాధపడి దేవునికి ప్రార్ధన చేశాడు దానిని గూర్చి గత భాగంలో మనం నేర్చుకున్నాం, ఆ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నిర్గమకాండం ఐదవ అధ్యాయం చదవండి.
మోషే గారు చేసిన ఈ ప్రార్థనకు దేవుడు స్పందించి, నిరాశలో ఉన్న తన సేవకుని వాగ్దానాల ద్వారా, తన నిబంధనను జ్ఞాపకం చేయడం ద్వారా తన ప్రజల పక్షముగా తాను పోరాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా బలపరచాడు.
అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశ మగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణము చేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా- నిర్గమకాండము 6:1-8
దేవుడిచ్చిన ఈ సమాధానాన్ని మోషేగారు తీసుకెళ్లి తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పమన్నట్టుగా చెప్పాడు. అయితే మోషేగారు ఇచ్చిన ఈ సందేశానికి ఆశించిన ఫలితాలు రాలేదు? ఇదే అనుభవం మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా?? ఎంతో ఉత్సాహంగా మీరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అవతల వ్యక్తి దాన్ని కనీసం పట్టించుకోకపోవడం ఎప్పుడైనా ఎదుర్కొన్నారా??
అలా ప్రజలు మనము ఆశించిన రీతిలో స్పందించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, కారణాలు ఏవైనా మనం ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి మనం కృంగిపోతాం. ఇక్కడ మోషే బాధ అంతటికి మూలం ఇదే.
మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. -నిర్గమకాండము 6:9
ఇశ్రాయేలీయుల ప్రజలు, వారు అనుభవిస్తున్న కష్టాన్ని బట్టి దేవుని వాక్యానికి చెవినివ్వలేకపోయారు, మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా?? మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారా?? అయితే మీరు అలా ప్రవర్తించడం ద్వారా పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి.
సాధారణంగా మనుషులకు ఉన్న నైజం ఏంటంటే వారు మాట్లాడితే ఇతరులు వినాలి, వాళ్లు రాస్తే ఇతరులు చదవాలి, వారు చెప్పిన దానికి ఇతరులు విధేయులు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎవరూ వినకపోతే నేనెందుకు మాట్లాడాలి? ఎవరూ చదవకపోతే నేనెందుకు రాయాలి?? ఎవరూ లోబడకపోతే నేను ఎందుకు సలహాలు ఇవ్వాలి?? ఇలా కొన్నిసార్లు మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలు లోకంలోని ఒక వ్యక్తికి సరిపోతాయేమో కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనకు ఏమాత్రం సరిపడవు. ఈ అంశాన్ని గురించి యెహేజ్కేలు అనే ప్రవక్తతో దేవుడు ఇలా చెప్పాడు
ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నా మీద తిరుగుబాటు చేసినవారు. వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. -యెహేజ్కేలు 2:3-5
యెహేజ్కేలు అనే ప్రవక్తకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎలా ఉందో గమనించారా?? విన్నా వినకపోయినా చెప్పమన్నాడు, యెషయా అనే మరో ప్రవక్త విషయంలోనైతే, వాళ్లు వినరు అయినా నువ్వు వెళ్లి చెప్పమన్నాడు
ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. -యెషయా 6:9,10
ఫలితాలు ఎలా ఉన్నా దేవుడు మనలను ఏ పని కొరకు పిలిచాడో ఆ పని నమ్మకంగా చేయడమే మన బాధ్యత. ఫలితాలను బట్టి మనము కృంగిపోకూడదు.
ఈ అంశాన్ని దాటి ముందుకు వెళ్ళటానికంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, ప్రకటించేవారు ప్రకటిస్తుండగా మనం ఎలా స్పందిస్తున్నాం? మన స్పందన మన కొరకు ఏర్పాటు చేయబడిన సేవకుని బలపరుస్తూ ఉందా? కృంగదీస్తోందా?? ఒక సేవకునికి నీ స్పందన ఎంత ముఖ్యమో అర్థమైందా?
సరియైన రీతిలో నీవు స్పందించకపోతే ఆ సేవకుని మనస్సు ఎంతగా బాధపడుతుందో నీకు అర్థమైందా, ఇప్పటికైనా మేలుకో, నిన్నే తమ ఆస్తిగా చేసుకుని నీ కొరకు ప్రయాసపడుతున్న మీ సేవకున్ని కృంగిపోనివ్వక దుఃఖముతో వారా పనిలో కొనసాగనివ్వక సరైన రీతిలో స్పందిస్తూ వారికి ప్రోత్సాహకారంగా నిలబడతాను అని తీర్మానించుకో!
మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి. -హెబ్రీయులకు 13:17
మోషేగారు ఇక్కడ దేవునితో తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల ప్రజలు తన మాట వినలేదని బాధపడుతూ దానిని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు.
నీకున్న బాధ ఏదైనా, నీ లోపల ఉన్న భావోద్వేగం ఏదైనా నిర్భయంగా నీవు దాన్ని దేవుని సన్నిధిలో తెలియపరచవచ్చు, ముఖ్యంగా పురుషులారా, మీ హృదయంలో ఎన్నో బాధలు ఇబ్బందులు ఉన్నప్పటికీ పైకి బింకంగా కనిపిస్తూ మనుషులు మధ్య మీరు కొనసాగుతున్నప్పటికీ దేవుని ఎదుటకు మీరు వచ్చి నీ బాధను వేదనంతటిని కుమ్మరించి మనుషుల మధ్య మీరు ఏడవ లేకపోతే దేవుని ఎదుట కన్నీరు కార్చి ఆ బరువును భారమును తీర్చుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, నీ బాధను బట్టి నువ్వు ఎప్పుడూ దేవునికి ప్రార్థించకపోతే, నీ కృంగుదలను ఎప్పుడూ దేవుని సన్నిధిలో తెలియపరచకపోతే, ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ పని చేయకూడదు, నీ లోపల పెళ్లుబుకుతున్న దుఃఖాన్ని అణచివేసుకొనక, కాసేపు చదవడం పక్కనుంచి ప్రార్థించడం ప్రారంభించు.
మోషేగారి బలహీనత :
మూడోవదిగా మోషే గారు తన బలహీనత గురించి దేవునితో విన్నవించుకున్నాడు. మనుషులంగా మనందరం ఏదో ఒక బలహీనతలు కలిగి ఉంటాము, కొంతమందికవి శారీరకమైనవి, ఇంకొంతమందికి మానసికమైనవి, మరి కొంతమందికి అవి ఆత్మీయమైనవిగా ఉండవచ్చు.
మన బలహీనత ఏదైనా దేవుని పనిలో మన పరిధిలో మనము చేయగలిగిన వాటిని చేయనివ్వకుండా అది వెనక్కి లాగకూడదు, మోషే గారు ఇక్కడ తాను నోటి మాంద్యం కలవాడని దేవునికి తెలియజేస్తున్నాడు. ఆయన ఇలా దేవునికి చెప్పడం ఇది మొదటిసారి కాదు.
అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండియైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహొవాతో చెప్పగా -నిర్గమకాండము 4:10
తాను అరణ్యంలో ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగానే చెప్పాడు, దేవుడు దానికి తగిన పరిష్కారం చూపించాడు కూడా, కానీ మరలా దాన్ని ఎత్తి ఆయన మాట్లాడుతున్నాడు.
మోషేకున్న బలహీనత ఏంటి అనేదానిపై బైబిల్ పండితులు వివిధమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు, కొంతమంది ఆయన నాలుక సరిగా లేదని, ఇంకొంతమంది ఆయనకు భాష మీద పట్టు లేదని, మరి కొంతమంది ఆయన ఇతరులను మెప్పించి ఒప్పించగల సమర్థత కలిగిన ప్రసంగీకుడు కాదని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
వీటిల్లో మీకు ఏది సరైనదిగా తోస్తే దానిని అంగీకరించండి, అయితే ఒకటి మాత్రం స్పష్టం మాట్లాడే విషయంలో ఆయనకు ఏదో ఒక రకమైన సమస్య ఉన్నది, అది శారీరకమైనదో భాషాపరమైనదో ప్రసంగించే కళకు చెందినదో ఇలా ఏదైనా కావచ్చు.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఆయన దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు?? తన నోటి మాంద్యమే తన పరిచర్యలో భిన్నమైన ఫలితాలకు కారణమైందని భావిస్తున్నాడా?? నేనింకా కొంచెం మంచిగా చెప్పగలిగి ఉంటే, వారిని ఒప్పించగలిగే సమర్ధత కలిగి ఉంటే బావుండేది అని బాధపడుతున్నాడా?? దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు??
నిజంగా మోషే గారి వలె మనం కూడా చాలా సందర్భాల్లో మన పరిచర్య ఇలా మారిపోవడానికి, మిగిలిపోవడానికి, ఎదగక పోవడానికి, మార్పులేనిదిగా ఉండిపోవడానికి మన బలహీనతలే కారణం అని భావిస్తూ ఉంటాం. వారిని వీరిని చూసి నాకు ఆ తలాంతు ఉండుంటే, నేను ఇలా ఉండేవాణ్ణి అలా ఉండేవాణ్ణి అని ఆలోచిస్తూ ఉంటాము.
నిజమా మన బలహీనతలే కారణమా? మనలను పుట్టించిన దేవునికి, ఈ పరిచర్యకు పిలిచిన దేవునికి మన బలహీనతలు ఏంటో తెలియదా? మన సమర్థత ఏంటో తెలియదా? మనము మోయలేనిది, చేయలేనిది దేవుడు మనకు ఇస్తాడా? పౌలు గారు చెప్పినట్లుమనం చేయగలిగిందే, మన వల్ల అయ్యిందే దేవుడు మనకు ఇస్తాడు.
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. -1 కోరింథీయులకు 10:13
నీ బలహీనతల సంగతి దేవునికి తెలుసు, నిన్ను బలపరుచుటకు వాడుకొనుటకు ఆయన యొద్ద ప్రణాళికలు ఉన్నాయి. మన బలహీనత వైపు చూసుకొని మనలను మనం తగ్గించుకోవడం మంచిదే గాని దాన్ని సాకుగా చూపి ఇక్కడ మోషేగారి వలే పరిచర్యలో వెనకడుగు వేసే ప్రయత్నం చేయకూడదు.
మోషే గారికి మాట్లాడే విషయంలో సమస్యలు ఉన్నా తోడుగా దేవుడు అహరోనుగారిని ఇచ్చాడు, మరి మరలా మోషేగారు తన బలహీనతను గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు?? మీరే ఆలోచించండి.
ఈ అంశాన్ని వదిలి వెళ్ళటానికి ముందుగా ఇక్కడ మనం చేసుకోవలసిన అన్వయం ఏమిటంటే నీ బలహీనతను బట్టి నిన్ను నీవు తగ్గించుకొని నన్ను బలపరచి వాడుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించు, అంతేకానీ నేను బలహీనుడిని ప్రభువా నేను నీకు పనికిరాని లే నన్ను వదిలేసేయ్ అని ఎన్నడు మాట్లాడవద్దు.
మోషేగారి భయం:
నాలుగోదిగా మోషేగారి మాటల్లో భయం ధ్వనిస్తున్నది, ఈ భయం అపజయమునుండి పుట్టింది, కృంగుదల నుండి పుట్టింది, అసలు భయమేమిటంటే తన సొంతం అనుకున్న ఇశ్రాయేలీయుల ప్రజలే తన మాట వినకపోతే మాట్లాడుటకు సరిగా చేతగాని నేను మాట్లాడితే ఇక ఐగుప్తు రాజు వింటాడా? సొంతవాళ్లే నన్ను లెక్క చేయకపోతే బయట వ్యక్తి లెక్క చేస్తాడా? అనేదే. భవిష్యత్తును ముందుగానే ఎరిగినట్లుగా మోషే గారి ధోరణి ఉంది కదూ!
సంఘంలోని విశ్వాసులే నన్ను పట్టించుకోకపోతే లోకంలోని అన్యజనులు నన్ను పట్టించుకుంటారా అనే భయం ఆ అనుభవం గుండా వెళ్ళినా ప్రతి సేవకుడు అనుభవించి ఉంటాడు. నీ భయం ఏదైనా నిర్భయంగా దేవునితో చెప్పు, ధైర్యపరిచే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నీకు తగిన సమాధానం ఇచ్చి బలపరుస్తాడు, అంతేగాని భయాన్ని బట్టి వెనుతిరగవద్దు. అన్ని ఎరిగిన దేవుడు నిన్ను ముందుకు పంపిస్తూ ఉంటే నీవు ఎందుకు ఇంకా అనవసర భయాలతో గతకాలపు అపజయాలతో పోల్చుకుంటూ వెనకడుగు వేస్తున్నావ్??
మోషే గారి అవిధేయత:
ఇక ఆఖరి విషయం, మోషే గారు పలికిన ఈ మాటల్లో భయమే కాదు అవిధేయత కూడా ధ్వనిస్తుంది. ఇశ్రాయేలీయులే వినలేదు ఇక ఐగుప్తు రాజు ఏం వింటాడులే అనే భావన మోషే గారి హృదయంలో ఉన్నది, దీనిని బట్టి తాను వెళ్లడానికి ఇష్టపడట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు, దీన్ని చదువుతుంటే వ్యవహారం మొత్తం మొదటికి వచ్చినట్టు ఉన్నది. అయినప్పటికీ దేవుడు మోషే గారిని విడిచిపెట్టలేదు, ప్రజలకు విసుగు వచ్చింది, మోషే గారికి కూడా విసుగు వచ్చింది కానీ దేవునికి విసుగు రాలేదు.
ఇక్కడ ఇంకా ఆసక్తి రేపుతున్న సంతోషాన్నిస్తున్న విషయం ఏంటంటే మోషే గారు ఈ మాటలు మాట్లాడినా, దేవుడాయనను గద్దించలేదు, తన మాట ద్వారా అనేక సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు వెళ్ళమని ప్రోత్సహించాడు, అయితే ఆ తర్వాత మోషేగారు మొండికేయలేదు.
ఈ మాటలు చదువుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎదురవుతున్న అపజయాలు నీకున్న బలహీనతలు నీలో భయాన్ని కలిగించి దేవునికి అవిధేయుడయ్యే విధంగా చేస్తున్నదా, నీ మనసులో ఉన్న భారం అంతా దేవుని ఎదుట కుమ్మరించు, నీకున్న బలహీనతలు ఎదురైన అపజయాలు, కలుగుతున్న భయాలు, అవిధేయుడవ్వాలి అనిపించే శోధన అన్నిటిని దేవునితో పంచుకో, దేవుని మనస్సు ఏంటో తెలుసుకుని ఆయనకు అవిధేయుడవు కాక విధేయుడువై నడుచుకునే వ్యక్తిగా ఉండు.
గడచిన కాలంలో మోషేగారు మాట్లాడినట్లుగా నీవు కూడా మాట్లాడి ఉన్నట్లయితే దాన్నిబట్టి పశ్చాతాపడి అలాంటి బుద్ధిహీనమైన మాటలను సర్వశక్తుడైన దేవుని ఎదుట పలకకుండా ఉండుటకు జాగ్రత్త పడదాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి