నేను దప్పిగొనుచున్నాను



నేను దప్పిగొనుచున్నాను



నేను దప్పిగొనుచున్నాను

    అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను.- యోహాను 19:28

    అది మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయం, అప్పటికే ఆరు గంటలుగా యేసుక్రీస్తువారు సిలువపై వేలాడుతున్నాడు. సిలువ మరణం అనేది కొన్ని గంటల్లో గడిచిపోయే ఘట్టం కాదు. కత్తితో పొడవడం, తుపాకీతో కాల్చడం, ఉరిశిక్ష వేయడం వంటి శిక్షలు అమలు చేసినప్పుడు మనిషి ప్రాణం వెంటనే పోతుంది కానీ ఈ సిలువ మరణం ఒక పండితుని అభిప్రాయం ప్రకారం కనీసం ఒక వారమైనా ఉంటుంది. ఈ వారం రోజుల్లో సిలువకు వేలాడదీయబడిన వ్యక్తి ఎండకు, వానకు, మంచుకు ఇబ్బందిపడుతూ ఆకాశ పక్షులకు ఆహారమవుతూ ఉంటాడు.

    యేసుక్రీస్తు వారి కాలంలో రోమన్లు సిలువ శిక్షను అమలుపరుస్తున్నప్పటికీ వాస్తవానికి అది వారు పర్షియన్ల నుండి అలవర్చుకున్నారు అని చెప్పొచ్చు. పర్షియన్లు ఈ భూమిని పవిత్రమైనదిగా ఎంచుతూ నేరస్తుడైనవాడు శిక్ష పొందుతూ చనిపోయేటప్పుడు భూమిని తాగితే భూమి కలుషితం అయిపోతుంది అని ఆకాశానికి భూమికి మధ్య సిలువకు వేలాడు తీసేవారు. రోమన్లు ఈ శిక్షను  వారి యొక్క మాతృభూమిలో అమలుపరచరు.  వారు ఆక్రమించుకున్న  ప్రాంతములలో మాత్రమే వారు ఈ శిక్షలు అమలుపరిచేవారు.

    ఒక రోమా పౌరున్ని తాళ్లతో కట్టడం నేరం, అలాగంటే కొట్టడం, చంపడం సిలువనెక్కించడం ఇంక అసలు ఊహల్లోకి రాదేమో. అంటే రోమా సామ్రాజ్యంలో రోమీయులు కాని వారికి అందులోను నేరస్తులకు, బానిసలైనవారికి మాత్రమే విధించబడే మరణ శిక్ష ఈ సిలువ. ఈ సిలువ శిక్ష కొరడాలతో కొట్టడంతో ప్రారంభమవుతుంది. 

    నేరస్తులను కొట్టడానికి ఉపయోగించేటువంటి కొరడా పొడవునా అక్కడక్కడ సీసపు గుళ్ళు ఎముక ముక్కలు పొదిగి ఉంటాయి, ఈ కొరడాలతో కొడుతూ ఉంటే ప్రతి దెబ్బకి చర్మం రిబ్బన్ లాగా చీలి వేలాడుతుంది. కొరడాలతో కొడుతున్నప్పుడు స్పృహ కోల్పోకుండా ఉండేవాళ్లు కొద్దిమంది మాత్రమే, కొరడాలతో కొట్టిన తర్వాత సిలువ వేయాల్సిన చోటికి నేరస్తుడు తన సిలువను తానే మోసుకొని వెళ్ళాలి. సిలువను మోసే క్రమంలో ఒకవేళ ఆ వ్యక్తి తూలి కింద పడిపోతే మరల కొరడాలకి పని చెప్పేవారు.

    దీనిని  బట్టి ఒక విషయం మనకు  స్పష్టంగా అర్థం అవుతుంది, అదేంటంటే సిలువ మరణం బహు వేదనకరమైన మరణం. అయితే ఏ పాపము చేయని యేసయ్య ఎంతో వేదనకరమైన ఈ శిక్షను అనుభవించాడు. ఈ క్రమంలో ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు.  ఒకసారి ఆయన అనుభవించిన శ్రమలను గూర్చి ఆలోచన చేద్దాం.

    మేడ గదిలో తన శిష్యులతో పాటు ఆఖరి సారి భోజనం చేసిన యేసయ్య సుదీర్ఘంగా వారితో అనేకమైన విషయాలు పంచుకున్నారు, దానిని గురించి యోహాను భక్తుడు తన సువార్తలో 14 -16 అధ్యాయంలలో రాసి ఉంచాడు. 

    అక్కడ నుండి గెత్సేమనే తోటకు ప్రయాణం చేశాడు, అక్కడ తన చెమట రక్త బిందువుల మారునంతగా వేదనపడి ప్రార్థించాడు, వెంటనే యూదా రావడం, సైనికుల ఆయనను పట్టుకొని సన్ హెడ్రిన్ సభ యొద్దకు తీసుకువెళ్లడం, అక్కడ తీర్పు జరిగినంతసేపు నిల్చోబెట్టడం (సాధారణముగా సభ్యులందరు అర్ధ చంద్రాకారములో కూర్చొని ఉంటే నేరస్తుడు వారి మధ్యలో నిలబడతాడు), ఉమ్మి వేయడం, పిడిగుద్దులు గుద్దడం, పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు, మరల పిలాతు దగ్గరకు తిప్పడం, కొరడాలతో కొట్టడం, ముళ్ల కిరీటం పెట్టబడి తలలో 17 ముళ్ళు గుచ్చుకోవడం, హేళన చేయబడుతూ రాళ్ల దెబ్బలను ఓర్చుకుంటూ పుర్రె ఆకారములో ఉన్న కొండను ఎక్కే వరకు సిలువను మోయడం, ఇవన్ని జరిగాయి. వీటి మూలముగా కలిగిన అలసటను, రక్తం కారుతున్న గాయాలను, ఎండ వేడిమిని ఓర్చుకుంటూ యేసయ్య ఇప్పటివరకు గడిపాడు.

    ఈ దెబ్బలను తట్టుకోవడానికి మొదట్లో పుల్లటి ద్రాక్ష రసాన్నిచ్చేవారు అయితే యేసయ్య దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు, ఎందుకంటే అది తీసుకున్న తర్వాత శరీరం ఒక రకమైన మత్తులోనికి వెళ్తుంది, అంటే యేసయ్య సంపూర్ణ స్పృహలో ఉండి ఈ బాధ అంతటిని అనుభవించాడు. తన శిష్యులతో ఆఖరి సారి తాగిన ద్రాక్షరసం తప్ప, ఇప్పుడు వరకు దెబ్బలు, నిలబడడం, నడవడం తప్ప ఒక చుక్కైనా నీళ్లు పుచ్చుకున్నది లేదు. దానిని  బట్టి తన ప్రాణం ఎంత అలిసిపోయి ఉంటదో, ఎంతగా ఆయన దప్పికగొని ఉంటాడో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

మానవునిగా దప్పిగొన్నాడు

    యేసయ్యకు ఎందుకు దప్పికేసింది అనేదానికి మొదటి సమాధానం ఆయన మానవుడు కాబట్టి, దేవునికి, దేవదూతలకు దాహం ఉండదు, యేసయ్య మానవుడు కాదు ఒక మాయాస్వరూపం అని భావించే వారికి ఆయన సిలువలో పలికిన ఈ మాట సమాధానం ఇస్తూ ఉన్నది.

శ్రమను బట్టి దప్పిగొన్నాడు

    యేసయ్య మానవుడిగా శ్రమల అనుభవిస్తూ తన శ్రమను వ్యక్తపరచిన మాట ఈ మాట. దప్పిగొనుచున్నాను అనే ఈ మాటను అర్థం చేసుకోవడం చాలా సులభం కానీ దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. 

    ఇస్మాయేలు, ఇశ్రాయేలీయులు, సంసోను వంటి వారి దప్పిక తీర్చిన ఆయనకే ఇప్పుడు దప్పికయ్యింది. కొండల మునిగిపోయేంతగా వర్షం కురిపించిన వానికి నాలుక అంగటికి అంటుకొని పోయే పరిస్థితి ఏర్పడింది. జీవజలాలిస్తానన్న రక్షకునికి గుక్కెడు నీళ్లు పోసే వారే కరువయ్యారు, ఎంతటి శ్రమో కదా! ఆయన ఎందుకు ఇంతగా శ్రమపడ్డాడు?? సిలువ శిక్ష ఆయన భరించకపోతే ఆయనకి దాహం ఉండేది కాదు. 

 లేఖనము నెరవేర్చడానికి దప్పిగొన్నాడు

    మానవుడు కాబట్టి శారీరకంగా ఎంతో అలసిపోయాడు కాబట్టి దప్పిగొన్నాడు అనేది వాస్తవమైనా, ఆయన నిజంగా దేవుని వాక్యమును అనగా లేఖనాలను నెరవేర్చాలి అనేటువంటి దప్పికను కలిగి ఉన్నాడు. 

    రెండుసార్లు యేసుక్రీస్తువారికి పుల్లటి ద్రాక్షరసం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆయన తిరస్కరించాడు, ఇంకొకసారి ఆయన పుచ్చుకున్నాడు. తిరస్కరించడానికి కారణం సంపూర్ణ స్పృహలో ఉండి సిలువ శ్రమలను అనుభవించాలి అనే ఉద్దేశం, పుచ్చుకోవడానికి గల కారణం తనను గూర్చి లేఖనములలో రాయబడినది నెరవేర్చాలి అని ఉద్దేశం.

    యోహాను రాసిన మాటల ప్రకారం చూస్తే అప్పటికే సమస్తము సమాప్తమైనది అని యేసు ఎరిగి ఒక మానవుడిగా తన మరణాన్ని కంటే ముందు తనను గురించి రాయబడిన లేఖనాలన్నీ నెరవేర్చబడునట్లుగా మిగిలి ఉన్న ఈ ఒక్క లేఖనమును కూడా ఆయన నెరవేర్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే పాపంతో ఆయన పెనుగులాట దాదాపుగా ముగిసింది అని చెప్పాలి, తండ్రి ఎడబాటును సహితము సిలువలో భరించాడు.


    అలా లేఖనము నెరవేర్చబడడానికే నేను దప్పిగొనుచున్నాను అని ఆయన పలికాడు, ఇంతకీ ఆ లేఖనం ఏంటో చూద్దామా

వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. -కీర్తనలు 69:21

ఇదే వచనమును వాడుక భాషలో ఇలా రాశారు

వాళ్ళు చేదు పదార్థాన్ని నాకు ఆహారంగా పెట్టారు. నాకు దాహమైతే పులిసిన ద్రాక్షరసం తాగడానికి ఇచ్చారు.

    కాబట్టి ఈ మాట నెరవేరాలంటే యేసుక్రీస్తు వారు నేను దప్పిగొనుచున్నాను అని పలకాలి. ఆయనలా పలకడం ద్వారా వారు పుల్లటి ద్రాక్షరసాన్ని ఇస్తే దాన్ని ఆయన పుచ్చుకొని ఆ లేఖనాన్ని నెరవేర్చాడు. 

    ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నాం! చదువుతున్నాం!! దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్యప్రకారంగా జీవించాలి అనేటువంటి దాహం నీ లోపల ఉన్నదా?

మన కొరకు దప్పిగొన్నాడు

    యేసయ్య దప్పిగొన్న సందర్భం ఇది ఒకటేనా? కాదు!

నీ మారుమనస్సు కొరకు దప్పిగొన్నాడు

    సుఖారను ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడలేదు ఆమె సమరయరాలు అని చెప్పబడింది. ఈవిడ బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి వద్దకు వచ్చింది ,అది ఇంచుమించు 12 గంటల సమయం, ఆ సమయంలో యేసయ్య ప్రయాణం వలన అలసి ఆ బావి దగ్గర కూర్చున్నాడు 

    అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆమెను దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగాడు.  నువ్వు యూదుడవు నేను సమరయరాలను, మీరు మాతో సాంగత్యం చేయరు కదా! మరి నన్ను ఎందుకు నీళ్ళు అడుగుతున్నావ్? అని అడిగింది, దానికి యేసయ్యా నేను నీకు జీవజలం ఇస్తాను అన్నాడు. నీ దగ్గర తోడుకోవడానికి ఏమీ లేదే నాకు జీవజలం ఎలా ఇస్తావ్? మా పెద్దలైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా?? అని అడిగింది. 

    ఈ నీళ్లు తాగువారు మరలా మరలా దప్పిగొంటారు, కానీ నేనిచ్చే నీళ్లు తాగేవారు ఎన్నటికీ దప్పికగొనరు అని అంటాడు, దానికి ఆమె నేను ప్రతిరోజు వచ్చి ఇలా కష్టపడకుండా ఆ జీవజలం నాకిమ్మని అడుగుతుంది, దానికి యేసయ్యా ఇస్తాను కాని వెళ్లి నీ భర్తను తీసుకు రమ్మని అడుగుతాడు ,ఆమె నాకు భర్త లేడు అంటుంది. 

    దానికి యేసయ్య నీకు అయిదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అంటాడు, దానికి ఆమె నువ్వు ప్రవక్త అని గ్రహిస్తున్నాను అంటుంది. యేసయ్య మెస్సేయని గుర్తిస్తుంది, కుండను విడిచిపెట్టి వెళ్లి ఆ ఊర్లో ఉన్న వారందరికీ యేసయ్య గురించి చెప్తుంది. ఇందులో యేసయ్య దప్పికగొన్న మాట వాస్తవమే గాని, ఆయన దప్పిక నీళ్లను గూర్చి కాదు, ఆమెను రక్షించాలని యేసయ్య దప్పిగొన్నాడు.

    యేసయ్య ఇక్కడ ఆమె ఇచ్చిన నీళ్లు తాగినట్టుగా రాయబడలేదు, ఆమెలో కలిగిన మార్పు ఆయన దాహమును తీర్చింది, యేసయ్య శ్రమను ధ్యానిస్తూ చలించిపోయి నేను సిలువ వద్ద నిలిచి ఉంటే ఆయన దప్పిక తీర్చేవాడను అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే నీకు ఇప్పటికీ గొప్ప అవకాశం ఉన్నది . 

    నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా మారాలని ఆయన దప్పిగొన్నాడు, నీ జీవితంలో మార్పు చూడాలని ఆయన దప్పిగొన్నాడు, నిన్ను పాపం నుండి రక్షించాలని ఆయన దప్పిగొన్నాడు, నిన్ను నరక శిక్ష నుండి విడిపించాలని ఆయన దప్పిగొన్నాడు, ఇప్పటికైనా సత్యం తెలుసుకొని యేసయ్య దప్పికను తీరుస్తావా??

నీవు దేవుని కొరకు దప్పిగొనాలని


    లూకా 16 : 19-31 లో ఉన్న ధనవంతుడు దేవుని పట్ల ఆశ లేనివాడై లోక సంబంధమైన వ్యక్తిగా జీవించి శాశ్వత కాలం దప్పిగొని ఉండే నరకానికి వెళ్ళాడు అక్కడ నీ దప్పిక ఎన్నటికీ తీరదు, మీ జీవితం అలా మారకూడదని ఈ లోకంలో దేవుని కొరకు దప్పిక కలిగి ఆయనను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ ఆయన రూపంలోనికి నీవు మారే వ్యక్తిగా ఉండాలని యేసయ్య దప్పిక కలిగియున్నాడు.

 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా  ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?  -కీర్తనలు 42:1,2

    మరి నీవు ఇంకా దేవునిపై ఆశ లేకుండా జీవిస్తావా?

సత్క్రియల కొరకు మనం దప్పిక కలిగి ఉండాలని

    మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు భోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. -తీతుకు 2:12 -14

    ఈ లోకంలో చెడ్డ కార్యములు కొరకైనా దప్పిక చాలా ఎక్కువగా ఉంది, అవి మన దాహాన్ని తీర్చక ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాయి, వ్యర్థమైన దాహాల వెంబడి పరిగెత్తుతున్న కొలది తృప్తి లేక ఉన్నదంతా పోగొట్టుకునే స్థితిలో నేడు అనేకులు ఉన్నారు, అయితే మన దాహం నీతి విషయంలో సత్క్రియల విషయంలో ఉండాలని ఆయన దప్పిగొన్నాడు.

    వ్యర్థమైన వాటియందుకాక నీతియందు, మంచి పనులు చేయుటయందు, నీవు దప్పిక కలిగి ఉన్నట్లయితే యేసయ్య దాహం తీరుతుంది! నీ దాహం కూడా తీర్చబడుతుంది.

    నీ శ్రమల్లో దాహం దాహం అని కేకలు వేయాల్సిన అవసరం ఇక లేదు, మీ శ్రమలను దేవుడు అర్థం చేసుకుంటాడు కనుక ఆయనకు లోబడి ఆయనపై ఆధారపడుతూ మీ శ్రమలు మూలముగా పాపమునకు తావివ్వక ముందుకు కొనసాగుదాం.

ముగింపు :

    వాస్తవానికి యేసయ్య దాహం ఇంకా తీరలేదు దాన్ని తీర్చాలంటే నీవు రక్షణ పొంది యేసయ్య కలిగి ఉన్న దాహాన్ని నీవు కలిగి ఉండి, నీతి క్రియలు చేస్తూ దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తూ దేవునిని ప్రేమించే వారిగా ప్రజలను మార్చినప్పుడే ఆయన దాహము సంపూర్ణంగా తీరుతుంది. ఆయన దప్పిగొనుచున్నాను, అని నీతో ఈరోజు చెప్తుండగా నువ్వేం చేస్తావో ఆలోచించుకో! 

-- ఆర్. సమూయేలు

Post a Comment