గొప్ప సంఖ్యతో విజయం సాధ్యమా??


గొప్ప సంఖ్యతో విజయం సాధ్యమా

గొప్ప సంఖ్యతో విజయం సాధ్యమా??    

    కొన్ని రోజులు క్రితం సేవకుడు నాకు ఫోన్ చేశాడు, అయ్యా మేము సెలవుల్లో యవ్వనస్తులు కూడిక ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మరి మా సంఘంలో కేవలం 15 మంది మాత్రమే యవ్వనస్తులు ఉన్నారు, మీరు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారా అని అడిగాడు. నాకు సంఖ్యతో పని లేదండి అని చెప్పి వారి మధ్య కెళ్ళి ఆ పరిచర్యలో నేను పాల్గొన్నాను

    మరో సందర్భంలో ఒక ఊరిలో గొడవ జరిగితే ఈ ఊర్లో మా ఇంటి పేరు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు మా ఒక్క కుటుంబమే ఉంది, మిగతా ఊరంతా ఒకే తెగకు చెందినవారు అని ఆ ఒక్క కుటుంబముగా ఉన్న వ్యక్తి భయపడుతూ మాట్లాడాడు.

    ఎందుకు మనం సంఖ్యకు ఇంత విలువిస్తాం?? దేవుడు కూడా మనలానే ఆలోచిస్తాడా?? ఈ సంఖ్యా బలం విషయంలో దేవుని విధానం ఎలా ఉంటుంది?? తెలుసుకోవాలంటే క్రింద భాగాన్ని చదవండి.

    ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి. -2 దినవృత్తాంతములు 13:8 

    క్రీస్తు పూర్వం 913-911 కాలంలో యారోబాము & అబియా అనే రాజులకు యుద్ధం జరిగింది. వీరు రెండు భాగములుగా చేయబడిన ఇశ్రాయేలు రాజ్యముకు రాజులుగా ఉన్నారు. 

    జనాభా పరముగా యారోబాముకు ఉన్నది గొప్ప రాజ్యము, ఆయన వైపు ఇశ్రాయేలుకు చెందిన 10 గోత్రములు ఉన్నాయి. అభియాకు కేవలం రెండు గోత్రాలు మాత్రమే ఉన్నాయి. యూదా బెన్యామీను గోత్రాలు మాత్రమే ఈ వైపు ఉన్నాయి. 8 లక్షల మంది సైన్యమును యరొబాము కలిగి ఉంటే నాలుగు లక్షల మంది సైన్యమును అభియా కలిగి ఉన్నాడు

    సాధారణంగా మనుషులు అంచనా ఏంటి అంటే ఎక్కువ మంది జనాభా ఉంటే గెలుపు సాధ్యం అనుకుంటారు, కానీ యరొబాము వృత్తాంతం మనం తెలియజేసేది ఏంటంటే మీ చుట్టూ ఎంత మంది మనుషులు ఉన్నారు దేవుడు నీతో లేకపోతే నువ్వు విజయాన్ని చూడలేవు.

    యరొబాము సైన్యాన్ని నమ్ముకున్న వాడిగానే కనబడుతున్నాడు, ఈ మాటలు చదువుతుండగా నీ పరిస్థితి ఏంటి? ఎవరిని నువ్వు నమ్ముతున్నావ్? సైన్యమునా?? సంఖ్యనా??? నీ భుజబలమునా??

    దేవుడు లేకుండా ఇవి ఎన్ని నీ జీవితంలో ఉన్న అది సున్నానే, యరొబాము దేవుని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్లిపోయాడో తెలుసుకోవాలంటే ఈ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. సంఖ్యాబలం యరొబాముకి పనికొచ్చిందా లేదా అనే సంగతి కూడా చదివి కింద కామెంట్ లో తెలియజేయండి.

    ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు కూడా యరొబాము వలే ఉన్నావా? అయితే పశ్చాత్తాప పడి ప్రభువైపు తిరుగు, దేవుడు లేని ధనం, దేవుడు లేని బలం, దేవుడు లేని జనం నీకు ఎప్పటికీ దీవెనలు ఇవ్వలేదు.

    సంఖ్య నమ్ముకుని విర్రవీగుతున్నావా?? సంఖ్యను చూసుకొని దిగులు పడుతున్నావా?? విర్రవీగకు! యరొబామును గుర్తుచేసుకో, దిగులు పడకు యోనాతానును గుర్తుచేసుకో!!.

    యోనాతాను ఈ సున్నతిలేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా -1 సమూయేలు 14:6

దేవా, సంఖ్యను బట్టి విర్రవీగక, దిగులుపడక, నీ మీద ఆధారపడి జీవించే భాగ్యం చేయండి -- ఆర్. సమూయేలు

Post a Comment