సంతృప్తితో పలికిన మాట:
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. - లూకా 23:46
ఉపోద్ఘాతం:
యేసు పలికిన ఈ చివరి మాటకు మరియు నాలుగవ మాటకు మధ్య వున్న సంబంధమును ఆలోచిస్తే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని పలికిన ప్రభువు మరలా దేవునితో తనకు వున్న సంబంధాన్ని వ్యక్తపరుస్తూ తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. అనగా ఆయన సిలువలో కొద్ది కాలము మాత్రమే విడువబడ్డాడు, కాని పాపముపై విజయము పొంది ఆయన సమాప్తమైనదని చెప్పి సంతృప్తిగా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు.
ఒక క్రైస్తవునికి, శరీరము, ఆస్థి, బంధువులు, మిత్రులు ఇవి ఏవి అంత ముఖ్యమైనవి కాదు గాని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మ దయ్యములకు నివాసము కాకుండునట్లుగా దేవుని చేతికి అప్పగించుకొనడం మన బాధ్యతయై యున్నది.
ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు తన అంత్య క్రియలను గూర్చి, శరీరమును గూర్చి ఏ మాత్రము చింతంచడు గాని తన ఆత్మ వెళ్లబోవుచున్న స్థలమును గూర్చి ఎంతో సంతోషంగా వుంటాడు.
అయితే హిందువులు వారి యొక్క శరీరము, దహన సంస్కారాల మీదనే దృష్టి నిలిపేవారుగా వుంటారు. యేసుక్రీస్తు తండ్రి అను మాటను 17సార్లు కొండ మీద ప్రసంగంలో ఉపయోగించాడు, 5సార్లు యెహా. 14-16 అధ్యాయాలలో ఉపయోగించాడు.
సిలువపై పలికిన మాటలలో తండ్రితో ప్రారంభించి, తండ్రితో ముగించాడు. మనము మన ఆత్మలు దేవుని చేతికి అప్పగించుకోవాలి (సంఖ్యా. 16:22; ప్రస. 12:7) .
వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి. -సంఖ్యాకాండము 16:22
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. -ప్రసంగి 12:7
యేసు తన ఆత్మలో అప్పగించుకొనుటలో .......................
1. దేవత్వం, రాజసం ఉట్టిపడుతున్నాయి:
మనిషి ముందు చనిపోవాలి, తర్వాత తీర్పు జరుగుతుంది కాని యేసుక్రీస్తు విషయంలో తీర్పు జరిగిన తర్వాత ఆయన శిక్షను భరించాడు (హెబ్రీ. 9:27).
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.-హెబ్రీయులకు 9:27
యేసుక్రీస్తు ప్రభువు సార్వభౌమాధికారం కలవాడు, ఆయనకు ఈ లోకంలో ఉన్నవాటి అన్నిటి పైనా అధికారం వుంది. యేసు చంపబడలేదు, లేక ఆయనను ఎవరూ చంపలేదు. కాని ఆయనే తన యొక్క ప్రాణమును పెట్టాడు.
యేసు తనకు తానుగా ప్రాణమును అర్పించాడు. నీరసించి ఆయన దేహం నుండి ప్రాణం దానంతట అదే పోలేదు, నీరసంతో సృహా తప్పి ఆ శోషలో ప్రాణం కోల్పోలేదు. భూలోకంలో తాను మనుష్యుల చేత శ్రమను అనుభవించిన తర్వాత దేవునికి తనను తాను అప్పగించుకుంటున్నాడు, ఇప్పుడు తండ్రి యొక్క విశ్రాంతికి చేరుతున్నాడు.
యేసుక్రీస్తు యొక్క మరణంలో ఒక ప్రత్యేకత వున్నది, అదేమనగా ఆయన తండ్రి చేతిలోనికి తన ఆత్మను అప్పగించుకున్నాడు, ఇది లోకం దృష్టిలో ఆత్మహత్య కావచ్చు, కాని ఆయన అలా చేయడంలో ఆయన యొక్క దేవత్వం, రాజసం ఉట్టిపడుతున్నాయి (యెహా. 10:18).
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.-యోహాను 10:18
2. ఆయన సంపూర్ణ మానవుడిగా కనబడుతున్నాడు:
క్రీ. శ. 100వ సంవత్సరములో చాలా తప్పుడు సిద్ధాంతములు ఏర్పడినవి. వాళ్లు అన్యజ్ఞానం, మధ్యయుగపు వేదాంతం, విగ్రహారాధికుల నమ్మకాలు బైబిల్ చరిత్రకు జోడించి క్రీస్తు మానవ అవతారుడిగా వచ్చిన విధానమును గూర్చి నూతన సిద్ధాంతములు సృష్టించారు.
వారు ఆత్మ (కంటికి కనిపించనది) పవ్రితమైనదని. పదార్థము (కనిపించేది) నీచమైనది కనుక ఆత్మ పదార్థములోనికి ఇమడడం సాధ్యం కాదు, కాబట్టి ఆత్మయైన దేవుడు శరీరధారిగా భూలోకానికి రావడం అసాధ్యం అని బోధించారు.
క్రీస్తు కేవలము ఆత్మరూపిగానే వచ్చినట్లుగా వారు బోధించారు. ఆయన ఒక మాయ రూపుడని, ఆయనకు ఆకలి, దాహం, బాధ, ఇటువంటివి తెలియవు అన్నది మరొక బోధ. అయితే యేసు తన ఆత్మను అప్పగించుకొనుటలో వారి యొక్క సిద్ధాంతములు అన్ని కొట్టివేయబడుతున్నవి.
యేసుక్రీస్తుకు శరీరము లేకుండా ఆయన కేవలము ఒక మాయరూపముగలవాడైతే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనవలసిన అవసరత ఏంటి? ఎందుకనగా మాయా రూపము అన్నప్పుడు ఆత్మ శరీరములో ఇమడ లేదు గనుక అవి రెండు వేరుచేయబడవలసిన అవసనం లేదు.
అలాంటప్పుడు దానిని భధ్రంగా తండ్రికి అప్పగించవలసిన అవసరత ఏమిటి? మరణము అంటే శరీరము నుండి ఆత్మను వేరు చేయడమే! యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించుకొనుటలో తాను శరీరమును కలిగియున్నట్లుగా, అది శ్రమపరచబడిన మీదట ఆత్మ వేరు చేయబడి తండ్రి యొద్దకు చేరుతున్నట్లుగా, అందును బట్టి ఆయన సంపూర్ణ మానవుడు అను సంగతి ఋజువు చేయబడుచున్నది.
3. ఆత్మను అప్పగించుట భద్రతను కలుగజేస్తుంది:
మనము దేవునితో సంబంధము కలిగియున్నంత వరకు భద్రంగా ఉంటాము. అది యేసునందలి విశ్వాసము మూలముగానే సాధ్యము. కాపరి చేతులోని గొర్రెలు భద్రంగా వుంటాయి (కీర్త. 23)
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.- కీర్తనలు 23:1-6
నీ ఆత్మ భద్రంగా వున్నదా? నీవు నీ ఆత్మను ఈ రోజు దేవునికి అప్పగించకపోతే నీవు మరొక రోజు ఆయనకు ఇవ్వవలసివస్తుంది అది బహు భయంకరము (హెబ్రీ. 10:30).
పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. -హెబ్రీయులకు 10:30
అయితే ఆయన చేతులలో ఉండటం ఎల్లప్పుడూ సురక్షితమే! మేము నిద్రపోతుండగా మా ఆత్మలను నీ వశము చేసుకో అనే అలవాటు ప్రార్థనను యూదా తల్లులు వారి పిల్లలకు నేర్పేవారు.
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని నిద్రపోయే ముందే ప్రార్ధించి పడుకునేవారట. ఆ ప్రార్థనకు ముందు క్రీస్తు ‘‘తండ్రి’’ అని చేర్చి, శరీరము శాశ్వతంగా నిద్రపోయే ముందు తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. క్రీస్తు మరణం ఆయన చేతుల్లోనే వుంది! మరి మనకో! ఎప్పుడో తెలియదు.
కనుక నేడే నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. మనము మన తండ్రి చేతికి మన యొక్క ఆత్మను అప్పగించినప్పుడు దేవుడు దానిని అన్ని వేళలా కాపాడతాడు. సాతాను దానిని ఏమాత్రము అపహరించలేడు.
ముగింపు:
యేసు పలికిన ఈ 7వ మాట వలన ఆయన పరిపూర్ణ మానవుడిగా దేవుడిగా వున్నాడని మనం తెలసుకున్నాము. ఆయన చేసిన సిలువ త్యాగం ద్వారా మనం దేవునికి దగ్గరయ్యాము అయితే యేసుని అంగీకరించి తండ్రి చేతికి నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ యొక్క నిత్యరాజ్యంలో స్థానం సంపాదించడం మాత్రమే కాక నిత్యత్వము వరకు చాలా భధ్రంగా దేవుని యొక్క చేతిలో కాపాడబడతావు. మరి నేడే నిర్ణయించుకో!
-- ఆర్. సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి