ఆదిని గూర్చిన ఏడు విషయాలు
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. - ఆదికాండము 1:1
ఉపోద్ఘాతం:
పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి ఆది అనే ఈ పదము మనతో ఏమి మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!1. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు
ఆయన అన్నిటి కన్నా ముందు ఉన్నవాడు, అన్ని నాశనం అయిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు.
అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. -ప్రకటన గ్రంథం 1:8
ఆయన కాక మిగతావి అన్ని మధ్యలో వచ్చి పోయేవే. మన విశ్వాసం మధ్యలో వచ్చి పోయేవాటి మీద కాకుండా నిత్యుడైన దేవుని మీద ఉంచుట శ్రేష్ఠమైనది.
నీ విశ్వాసం నిత్యుడైన దేవుని మీద ఉన్నదా? లేదా అసత్యమైన, నిత్యము కాని వాటి మీద విశ్వాసముంచుతూ సిగ్గుపడుతూ , నిరాశ చెందుతూ, దిగులుపడుతూ, దిక్కుతోచని స్థితికి దిగజారేవారుగా ఉంటున్నారా? ఆలోచించుకొని, నిత్య సత్య దేవునిని అన్వేషించి దీవెన పొందేవారుగా ఉండండి.
2. యేసుక్రీస్తు వారు కూడా ఆది అంతము లేనివాడుగా ఉన్నాడు
అపొస్తలుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఈ విధముగా తెలియజేయుచున్నాడు
నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. -ప్రకటన గ్రంథం 22:13
యేసుక్రీస్తు వారు మెల్కిసేదేకు అను క్రమము ద్వారా యాజకుడైన విధానమును గూర్చి పౌలు గారు వివరిస్తూ ఇలా అంటున్నారు
అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. -హెబ్రీయులకు 7:3
3. ఆదిలో దేవుడు సృష్టిని కలుగజేసాడు
మన జీవితంలో దేవునిని మాత్రమే ఎందుకు నమ్మాలి లేదా ఆరాధించాలి అని ఆలోచిస్తే ఆయన నిత్యుడుగా ఉన్నాడు. నిత్యుడైన ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు. దేవుడు తన శక్తి చేత ఈ లోకమును కలుగజేసాడు. అందుకే కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు...
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. - కీర్తనలు 102:25
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. -రోమీయులకు 1:25
దేవుని పోలికలు సృష్టిలో కనబడవచ్చు, ఎందుకంటే దేవుడే సృష్టిలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే అవి దేవుళ్ళు కాదు. ఉదాహరణకు అగ్ని దేవుడు కాదు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. వాన దేవుడు కాదు, దేవుడు వర్షమును కురిపిస్తాడు. ఇలా చాలా మంది సృష్టికర్తకు, సృష్టికి ఉన్న తేడా తెలియక సృష్టిని పూజిస్తూ, సృష్టికర్తను మరచిపోయినవారుగా ఉన్నారు.
సృష్టికర్తను మరచి సృష్టిని పూజించేవారిలో నీవు కూడా ఉన్నావా? ఒకవేళ ఉంటే అది పాపమని గ్రహించ, క్షమాపణ కోరుకొని, దానిని విడిచిపెట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్తను పూర్ణమనస్సుతో ఆరాధించే వ్యక్తిగా మారవలసియున్నది.
కొంతమంది విశ్వాసుల్లో ఈ సమస్య మరొక కోణంలో కనబడుతున్నది. బహుమానమును ఇచ్చేవానిని విడిచి బహుమతిని ప్రేమిస్తూ దాని వెంట పరుగెత్తుతారు. బహుమతి కంటే బహుమానం ఇచ్చేవాడే గొప్పవాడైనప్పటికి, ఆయనకు విలువ ఇవ్వకపోవడం విచారకరం. హన్నా ఇందుకు చక్కని ఉదాహరణ. తాను సమూయేలును బహుమానముగా పొందినప్పటికి, దేవునికి విలువిచ్చి మాటను నిలబెట్టుకున్నది.
నీవు ఏ వైపు ఉన్నావ్?? సృష్టకర్త వైపా?? సృష్టి వైపా?? బహుమతి వైపా?? దానిని ఇచ్చేవాని వైపా?? బహుమతి ఇచ్చే వాని వైపు ఉన్నవారు, ఆయన ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా, ఆయన మాతో ఉంటే చాలు అని భావిస్తారు. బహుమానం కోసం చూసేవారు అవి లేకపోతే పొందకపోతే, వాటి స్థానం లో సమస్యలు వస్తే తట్టుకోలేరు. నీ స్థితి ఏంటో ఆలోచన చేసుకొని సత్యమైన, నిత్యమైన వాటి వైపు నిలబడే వ్యక్తి ఉండు.
4. ఆది నుండి దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు
దేవుడు మాట్లాడేవాడు, ఏ వ్యక్తి అయినా మాట్లాడకపోతే మౌనంగా ఉంటే ఆ వ్యక్తి ఒక మనసులో ఏముందో మనం ఎప్పటికి తెలుసుకోవాలి, దేవుడు ఆదినుండి మాట్లాడుతూ తన అభిలాషను మనుషులకు తెలియపరుస్తున్నాడు
ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను -యెషయా 48:16
ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట తన మాటలు ఉంచి మాట్లాడుతున్నాడని యాజకుడైన జెకార్య మాట్లాడుతున్నారు.
దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. -లూకా 1:72
అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుందని దేవుడు తన ప్రవక్తలు నోట ఆది నుండి పలికించాడని పేతురు తన ప్రసంగంలో తెలియజేసాడు.
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. -అపో.కార్యములు 3:21
దేవుడు మాట్లాడుతున్నాడు నీవు వింటున్నావా?? ఆయన మాటలకు నువ్వు లోబడుతున్నావా, ఇప్పుడైనా ఆయన స్వరమునకు లోబడి దేవుని దీవెనకు పాత్రుడు కావాలని విన్నవిస్తున్నాను
5. ఆది నుండి భవిష్యత్ ఎరిగినవాడు, తెలియజేసినవాడు దేవుడే
దేవుడు సర్వజ్ఞానియై ఉన్నాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలములను ఎరిగిన వాడుగా ఉన్నాడు, ఆది నుండి భవిష్యత్తును గూర్చి తెలియజేస్తున్న వ్యక్తిని నేనే అని యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. - యెషయా 46:10
6. ఆది నుండి దేవుడు మానవులను పిలచువాడుగా ఉన్నాడు.
ఆదిలో మనుషులను కలుగజేసినవాడు దేవుడే, వారికి రకరకాల పనులు కల్పించినవాడుగా, ఏర్పాటు చేసినవాడుగా ఉన్నాడు. ఆయన వారిని రకరకాల పనులు కొరకు పిలిచినవాడుగా ఉన్నాడు.
ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను. -యెషయా 41:4
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానమును బట్టి చూస్తే ఆయనే ప్రతి మనిషిని ఒక్కో పని కొరకు పిలిచి వారు ఆ పని పూర్తి చేయు వరకు లేదా వారి జీవితం అంతము వరకు వారితో ఉండేవాడుగా ఉంటాడు.వారు దేవునిని విడిచి వెళ్ళవలసిందే గాని దేవుడు వారిని విడువడు. దేవుడు మానవులను ఎందుకొరకు పిలుచుచున్నాడు??
రక్షణ పొందునట్లుగా పిలుచుచున్నాడు.
లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ పిలుపునిస్తున్నాడు, ఆయన వైపు చూచి రక్షణ పొందాలని ఆయన పిలుస్తున్నాడు, ఒక వ్యక్తికి తన పాపము నుండి విడుదల కలగాలంటే అది యేసుక్రీస్తు వారి వైపు ఆయన సిలువ వైపు చూస్తే తప్ప మరెక్కడా కలగదు.
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. -యెషయా 45:22
ప్రత్యేక పని కొరకు పిలుచుచున్నాడు.
చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. - నిర్గమకాండము 31:2
తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను. - కీర్తనలు 78:70
కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను. -యెషయా 44:28
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. -యెషయా 45:1
నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును-యెషయా 45:13
వెలుగులోనికి పిలుచుచున్నాడు
చీకటిలో ఉన్న మానవాళిని అనగా పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని తన వెలుగులోనికి అనగా సత్యములోనికి తన గుణములను ప్రచురించడానికి మనలను పిలుస్తూ ఉన్నాడు
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. -1పేతురు 2:9దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచాడో లేదా పిలుచుచున్నాడో తెలుసుకొని, ఆ పిలుపుకు స్పందించి, ఆయన నియామకంలో జీవించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన పిలిచిన పని కొరకు ఆయన ఇచ్చిన సామర్ధ్యంతో ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉండుటకు తీర్మానం చేసుకో!!!
7. మృతిని గెలిచిన ఆదిసంబూతుడు
మృతులలోని తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు వారు మొదటి వారు, ఆయన అలా తిరిగి లేచాడు గనుక మనమును ఒక రోజున తిరిగి లేస్తామని విశ్వసించి, ఈ జీవితం వ్యర్థం కాదని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఈ లోకంలో జీవిద్దాం.
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. -ప్రకటన గ్రంథం 1:5
ముగింపు :
మన దేవుడు నిత్యుడని, ఆయనే ఆదిలో ఈ సృష్టిని కలుగజేసాడని, ఆయన ఆది నుండి మాట్లాడేవాడుగా ఉన్నాడని, ఆయన ఆది నుండి సర్వజ్ఞానము కలిగినవాడై భవిష్యత్తును గూర్చిన ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్నవాడని,ఆయన ఆది నుండి మానవులను పిలుస్తూ వారి రకరకాలైన పనులు ఇస్తున్నాడని, మృతిని గెలిచి తిరిగి లేచిన వారని ఆయన మొదటి వాడని, గ్రహించి, ఆయనపై విశ్వాసం ఉంచుతూ, ఆయన నిన్ను కలిగించిన కారణమును నెరవేరుస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన ఇచ్చిన పిలుపుకు లోబడి నమ్మకంగా కొనసాగుతూ, ఆయన రాకడలో తిరిగి లేపబడి పరలోక రాజ్యమును పొందేవారంగా ఉందాం!
- ఆర్. సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి