మనలను పరిశుద్ధులుగా తీర్చుటకే క్రీస్తు మరణించాడు
యేసుక్రీస్తు వారి మరణం మానవ జాతికి వరం. ఆయన సిలువనెక్కిన దినమున తరతరాల నిరీక్షణకు తెరదించినవాడుగా వున్నాడు. యేసుక్రీస్తువారు మరణించిన విధానమును చూసిన అనేకమంది అయ్యో, అయ్యో అని రొమ్ముకొట్టుకొంటూ ఇంటికి వెళ్లారు.
అంత ఘోరాతి ఘోరముగా ఆయన మరణించవలసిన అవసరత ఏమిటి? అని ఆలోచిస్తే నాకు ఈ మూడు విషయాలు ప్రభువు అర్థం చేసాడు.
1. దేవుడు అసమానమైన పరిశుద్ధుడు.
యెహోవా ....పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు.......... - నిర్గమ. 15:11
పరిశుద్ధత అను మాట 900సార్లు పరిశుద్ధ గ్రంధములో ప్రస్తావించబడిరది. హెబ్రీ భాషలో పరిశుద్దత అను మాటకు నరకుట, ఖండించుట, లేదా ప్రత్యేకించుకొనుట అని అర్థము. దేవుని పరిశుద్ధతను గూర్చి బైబిల్ ఎంతో చక్కగా మనకు వివరించుచున్నది.
దేవుని స్వభావము పరిశుద్ధమైనది
నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.- యోహాను 17:11
ఆయన పేరు పరిశుద్ధమైనది
............. ఆయన నామము పరిశుద్ధము. - లూకా 1:49
ఆయన మాటలు కూడా పరిశుద్ధమైనవే
కొంత మంది జీవితములలో వారి పేరులే పరిశుద్ధముగా వుంటాయి, కాని మాటలు, ప్రవర్తన అన్నియు అపవిత్రముగానే కనబడతాయి. అయితే ఆయన మాటలు కూడా పరిశుద్ధమైనవే.
ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలుచున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను. -యిర్మియా 23:9
ఆయన సింహాసనము పరిశుద్ధమైనది
అంత మాత్రమే కాదు ఆయన సింహాసనము పరిశుద్ధమైనది
దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు. -కీర్తనలు 47:8
ఆయన రాజ్యము పరిశుద్ధమైనది
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను, దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. -1 కోరింథీయులకు 6:9,10
దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది
నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? -హబక్కూకు 1:13
ఆయన పరిశుద్ధుడని దూతలు ఆయనను ఆరాధించుచున్నారు
వారు సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. -యెషయా 6:3
దేవుని పరిశుద్ధతను పరిశీలించిన మీదట ఆయనవంటి పరిశుద్ధుడు మరెవరును లేరని స్పష్టమగుచున్నది. నిజముగా ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడైయున్నాడు. మహనీయుడైన ఈ పరిశుద్ధుడు మనము కూడా తన వలె వుండాలని, పరిశుద్ధతలో ఆయనకు వారసులమైయుండాలని కోరుకున్నాడు.
2. ఆయన పరిశుద్ధత మన యొద్ద నుండి పరిశుద్ధతను కోరుకున్నది.
.......నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. ...... -లేవీయకాండము 11:44
తాను పరిశుద్ధడైయున్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా వుండాలని దేవుడు కోరుతున్నాడు. మరోక రకముగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధత మన యొద్ద నుండి పరిశుద్ధతను కోరుకున్నది. సాధారణముగా పరిశుద్ధతను రెండు విధానములలో అర్థము చేసుకొనవచ్చును. అంటే పరిశుద్ధత రెండు రకాలు అని చెప్పాలి.
భాహ్యసంబంధమైనది- శరీరసంబంధమైనది:
పాత నిబంధనలోని లేవీయులు, నాజీరులు తమను తాము శారీరకముగా పరిశుద్ధపరచుకొనేవారు (నిర్గ.29, సంఖ్యా. 6:1-21).
............యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ......... మంగలకత్తి అతని తలమీద వేయవలదు, ................ ఏ శవమును ముట్టవలదు............... . -సంఖ్యాకాండము 6:1-21
` రాబోవుదానికి ఛాయరూపకముగా ఇవ్వబడిన ధర్మశాస్త్ర విధులలో అనేకం ఈ భాహ్యసంబంధమైన పరిశుద్ధతకు సంబందించినవే అని చెప్పాలి. ఇది ఎంతో అవసరం కాని దీనికి మించినది అంతరంగ శుద్ధి.
అంతరంగమునకు సంబంధించినది. నైతికమైనది - ఆత్మసంబంధమైనది.
మనము దేవుని స్వరూపములో వున్నాము గనుక మనము ఆయన వలెనే పరిశుద్దత కలిగియుండాలని దేవుడు ఆశించాడు. తెల్లని బట్టలు ధరించినంత మాత్రాన ఎవరు దేవునిని చూడలేరు గాని నల్లని బట్టలు వేసుకొన్న సరే హృదయము శుద్ధిగా వున్నప్పుడు ఖచ్చితముగా ప్రభువును చూడగలగుతాం!
అందుకే పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము (హెబ్రీయులకు 12:14)ఆయనతో సహవాసము కలిగియుండలేము (కీర్త. 15: 1,2)అని బైబిల్ బోధిస్తున్నది.
.......పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు. -హెబ్రీ. 12:14;
మనము అంతరంగములోను బాహ్యముగాను శుద్ధికలిగినవారమై అనగా పరిశుద్ధులమై యుండాలని దేవుడు ఆశించాడు, కాని స్వేచ్చగల మానవులు వారు తీసుకున్న నిర్ణయాల మూలముగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేకపోయారు.
నిజానికి చాలా మందికి అనగా పరిశుద్ధతను కలిగియుండాలని ఆశించిన అనేకమందికి అంతరంగ శుద్ధిని గూర్చి ఆశలేదు గాని భౌతికముగా శుద్ధిని కోరుతూ నైతికముగా అంతకంతకు అసహ్యులుగా మారిపోయారు.
3. పరిశుద్ధులుగా తీర్చుటకు క్రీస్తు మరణించాడు
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. -కొలస్సీయులకు 1:22
................పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు.............. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. -మార్కు 7:1-13
పళ్లెమును కడుగుకొనుటకు ఇష్టపడ్డారు కాని హృదయమును కడుగుకొనుటకు వారు ఇష్టపడలేదు. మరోక రకముగా చెప్పాలంటే నిజముగా వారిని అపవిత్రులుగా మార్చుతున్నదేమిటో వారు గ్రహించలేకపోయారు.
అందుకే క్రీస్తువారు వారిని సవాలు చేస్తు లోపల నుండి వచ్చేది మనుష్యుని అపవిత్రపరస్తుంది అని తెలియజేసాడు. అనగా వారు అంతరంగ శుద్ధిలేనివారుగా వున్నారు. ఆ మాటకొస్తే భూమి మీద వున్న ప్రతి మానవుడు అదే స్థితిలో వున్నాడు, ఎందుకంటే పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు గనుక మనము పరిశుద్ధులముగా తీర్చబడాలంటే పాపమెరుగని మానవుని యొక్క రక్తము చిందించవలసిన అవసరం వున్నది.
ఎలాంటి బ్రాండెడ్ సబ్బు అయినా మన శరీరముపై మురికిని తొలగించగలదేమో గాని మన ఆత్మకు అంటిన కళంకమును తొలగించలేదు. దీనికి పరిష్కారము పాపులలో చేరక ప్రత్యేకముగా వున్న యేసుక్రీస్తువారే.
పాపులలో చేరక ప్రత్యేకముగా వున్న క్రీస్తు (హెబ్రీ. 7:26)మన యొక్క కళంకమును తొలగించుటకు తన రక్తమును చిందించాడు (ఎఫెసీ. 5:26) అని బైబిల్ తెలియజేయుచున్నది.
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. -హెబ్రీయులకు 7:26
పరిశుద్దుడైన దేవునిని చేరుటకు మన అపవిత్రత తొలగించబడడం అవసరమైంది. మన కళంకము తొలగించబడుటకు దైవకుమారుడు సిలువపై మరణించుట అవశ్యమైంది. ఆయన రక్తము మన పాపములను కడిగి పవిత్రపరచింది, అపరాధ భావము నుండి విడుదలను కలిగిస్తు మనస్సాక్షిని శుద్ది చేసింది. తండ్రియైన దేవునితో సమాధానమును అనుగ్రహించింది.
పరిశుద్ధత లేక పరలోకం చేరడం అసాధ్యం, పరిశుద్ధులుగా తీర్చబడుటకు ప్రభుయేసు రక్తమే శరణము. మరి మనం చేయవలసినదేమిటి?
అన్వయం
నీవింకా క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించకపోతే నేడే క్రీస్తు యాగముపై విశ్వాసముంచడం ద్వారా తండ్రియైన దేవునిని సమీపించు. ఆయన రక్తము వలన నీ అవిత్రత తొలగించబడతున్నదని విశ్వసించు.
నీవు క్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసివైతే యేసుక్రీస్తు రక్తము వలన మనకు పరిశుద్ధత కలిగినది గనుక మరల అపవిత్రతకు మన జీవితాల్లో చోటును ఇవ్వక క్రీస్తు రాకడ పర్యంతము పవిత్రత కలిగి జీవిద్దాం. పాపమలోనే బ్రతుకుతూ నాశనమునకు జోగుచున్న అనేకులను పరిశుద్ధుని యొద్దకు చేర్చుదాం! అట్టి కృప పొందెదము గాక. ఆమెన్.


కామెంట్‌ను పోస్ట్ చేయండి