నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు
అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. -లూకా 23:43
యేసయ్య ఎందుకు ఈ మాటలు అన్నాడు? ఈ మాటలు పలికిన దాన్నిబట్టి యేసయ్యలో ఈ గుణాన్ని మనం చూడవచ్చు.
తన యొద్దకు వచ్చు వారిని ఆయన త్రోసివేయడు
తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. -యోహాను 6:38
తన యొద్దకు వచ్చిన వారిని యేసుక్రీస్తువారు ఎన్నడూ తోసివేయడు, అయితే ఆయన యొద్దకు ఎలా రావాలి?
దేవుని భయం కలిగి ఆయన యొద్దకు రావాలి
అత్యంత మహిమాన్వితుడైన దేవుడు తన మహిమను విడిచి భూమి పైకి దిగివచ్చి తన ప్రేమను సత్యమును వెల్లడిపరుస్తూ ఈ లోకములో కొనసాగాడు, అయితే ఈ లోకము ఆయనను ద్వేషించింది, త్రోసివేసింది తమ హృదయాల్లో చోటు ఇవ్వలేకపోయింది.
యేసయ్య సిలువ వేయబడిన సంఘటన క్రమమంతటిని చూస్తే వారు ఎంతగా ఆయనను ద్వేషించారో అర్థం అవుతుంది,
- డబ్బుకు ఆశపడి యేసుక్రీస్తువారిని అప్పగించిన యుదా కూడా తాను ఒక నిరపరాధిని నీతిమంతుని అప్పగించానని గుర్తించాడు,
- యేసుక్రీస్తు వారిని విచారించిన పిలాతు కూడా అసూయతో యుదా పెద్దలు ఆయనను అప్పగించారని గ్రహించాడు.
- ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షలు విధిస్తున్నామని భావిస్తున్నటువంటి యుదా పెద్దలు, తాము చేస్తున్న అన్యాయం తమ మనసుకు తోచలేదా? ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప ఒక నేరానికి మరణ శిక్ష విధించకూడదని యుదా చట్టంలో ఉంటే నిందితుడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా శిక్ష ఎలా విధిస్తారు?
- మరణశిక్ష విధించిన రోజునే దాన్ని అమలు జరిపే హక్కు లేదు, నిందితుడిని బుట్టలో వేసేటట్లుగా అసలు ప్రశ్నలు అడగడానికే వీల్లేదు, ఇలా ప్రతి విషయంలో ఈ ప్రధాన యాజకులు, యూదా మత పెద్దలు దేవుని భయం లేనివారై చట్టాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నారు.
- మరణశిక్ష విషయంలో ఖచ్చితంగా నిలబడాల్సిన పిలాతు దేవుని భయం లేనివాడై నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరించాడు.
- సైనికులు వారి ఉద్యోగం వారు చూసుకోకుండా దేవుని భయము లేని వారే ఆయనను ఎంతగానో హేళన చేశారు.
- సిలువపై యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న దొంగ కూడా దేవుని భయం లేని వాడు ఆయనను దూషించాడు.
నిజంగా మన కఠిన పరిస్థితిలో మనలను ప్రేమించే వారెవరో దేవుని భయం కలిగిన వారు ఎవరో సులభంగానే అర్థమవుతుంది.
యేసయ్య సిలువ మోస్తున్న సమయంలో గానీ, సిలువపై వేలాడుతున్న సమయంలో గానీ దారిని వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు యేసుక్రీస్తు వారిని గూర్చి హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటే సిలువపై ఉన్న మరొక దొంగ దేవుని భయం కలిగినవాడై ప్రవర్తించినట్టు మనం చూడగలం. ఈయన తన జీవితకాలంలో దేవుని భయం లేక ఎంతో మందిని బాధ పెట్టిన మాట వాస్తవం కావచ్చు, ఎంతోమందిని దోచుకున్న మాట కూడా వాస్తవం కావచ్చు, అయినప్పటికీ మరణం ముంచుకొస్తున్న వేళ తోటి వ్యక్తికి లేని దేవుని భయం ఈయన కలిగి దేవుని వద్దకు వచ్చాడు.
తన పక్కనున్న దొంగ పూర్తిగా లోక సంబంధిగా కనబడుతున్నాడు, ఈనాడు ఉన్న అనేకులు ఆలోచిస్తున్నట్టుగా మరణం వరకే జీవితం అన్నట్టుగా ఆయన భావన ఉన్నది, కానీ ఈ దొంగకు కలిగినటువంటి అవగాహన ఏంటంటే మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది.
దేవుని భయము లేని ఆ దొంగ తాను అనుభవిస్తున్న ఆ శిక్షను ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే దేవుని భయము కలిగిన ఈ దొంగ మరణము తర్వాత ఉండే శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు!
ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని భయం ఉన్నదా నిజానికి మనల్ని సరైన దారిలో నడిపేది అదొక్కటే. ఎవరి భయము మనలను సరైన దారిలో ఉంచలేదు. దేవుని భయము కలిగిన వ్యక్తి ఇంటా బయట ఒకే రకంగా ఉండగలుగుతాడు.
ఇప్పటివరకు నీ జీవితం ఏ రీతిగా గడిచిపోయిందో, దేవుని భయం లేక ఏ రీతిగా నువ్వు ప్రవర్తించావో విడిచిపెడదాం! ఎందుకంటే దాన్ని మనం మార్చలేం!! అయితే కనీసం ఈ క్షణం నుండైనా దేవుని భయము కలిగి జీవించడానికి నిర్ణయించుకుంటావా? తన వద్దకు వచ్చిన వారిని త్రోసివేయని దేవుడు నిన్ను కూడా చేర్చుకుంటాడు.
పశ్చాతాపంతో దేవుని యొద్దకు రావాలి
ఈ దొంగకు లోపల తాను చేసిన తప్పును గురించి జీవితంలో ఎప్పుడైనా బాధపడ్డాడో లేదో తెలీదుగానీ ఇప్పుడు మాత్రం బాధపడుతున్నాడు, తనకనిపిస్తుంది ఇది మనకు న్యాయమే, మనం ఏమైతే చేశామో దానికి ఫలాన్ని అనుభవిస్తున్నాం!
జీవితం మార్చబడడంలో మొదటి మెట్టు మన తప్పును గుర్తించడంతోనే ప్రారంభమవుతుంది నాలో తప్పు లేదనుకునే వాడికి నేను ఏ పాపము చేయలేదని చెప్పుకునే వాడికి ఏ ఒక్కరు సహాయం చేయలేరేమో.
మనలో తప్పులను ఏంచి చూపేది దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా యేసయ్య స్వభావమును గూర్చి నేర్చుకుంటూ ఉండగా, మన ఆత్మీయ జీవితంలో ఉన్న పొరపాట్లన్ని తేటతెల్లమవుతూ ఉంటాయి.
వాటిని దేవుని వాక్యం వాటిని ఎత్తిచూపుతున్నప్పటికీ సమర్ధించుకుంటూ పశ్చాతాపం లేకుండా. కనీసం బాధ హృదయంలో లేకుండా, మార్చుకోవాలనే తపన లేకుండా ఇష్టానుసారంగా కొనసాగితే రక్షించుటకు యేసయ్య సిద్ధమే గాని రక్షణ పొందే భాగ్యం నీకు దొరకదు, పశ్చాతాపంతో నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, ఆయనను త్రోసి వేయకుండా చేర్చుకుంటాడు, ఏం ఆలోచిస్తున్నావ్?
యేసయ్య నిర్దోషత్వాన్ని గుర్తించి ఆయనకు యొద్దకు రావాలి
ఈ దొంగ తన మాటల్లో ప్రభువైన యేసు క్రీస్తు ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి! ఎందుకో తెలుసా?
ఆయన అలా మాట్లాడితే యూదా మత పెద్దలు, పిలాతు, సైనికులు, హేళన చేస్తున్న వారందరికి వ్యతిరేకంగా ఈ దొంగ మాట్లాడినట్టు అవుతుంది. ఆ తర్వాత ఈయన ఇలా మాట్లాడినందుకు వారు ఈ దొంగని ఇంకా ఎక్కువగా హింస పెట్టి ఉండొచ్చు.
పోయే ప్రాణం ఎలాగో పోతావుంది అది నరకానికి పోకుండా కాపాడుకోవాలని తాపత్రయం ఈ దొంగలో కనపడుతుంది. యేసయ్యను ఆశ్రయిస్తే కొన్ని సమస్యలు తప్పవు, అయితే అవి భూలోకంలో కలిగేవి కానీ పరలోకంలో నిత్య సంతోషాన్ని ఇవ్వగలవు, మనుషులకు భయపడక దేవుని కొరకు నిలబడు ఆయన నిన్ను త్రోసివేయక నీ కొరకు కార్యం చేస్తాడు.
మత పెద్దలు యేసుక్రీస్తువారు దోషియని తీర్పుతీర్చి ఆయన సిలువకు అప్పగిస్తే ఈ దొంగ మాత్రం యేసుక్రీస్తువారు ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు, ఈయనకు ఈ గ్రహింపు ఎలా కలిగింది? జీవితంలో ఎప్పుడైనా యేసయ్యను కలుసుకున్నాడా? ఆయన బోధలు విన్నాడా? చాలామంది పండితులు ఈయన జీవితంలో ఎప్పుడు యేసయ్య కలుసుకోలేదని తెలియజేస్తున్నారు. ఈ కొద్దిసేపట్లో యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన ఆయన యొక్క జీవితం మీద బలమైన ముద్ర వేసింది అని చెప్పొచ్చు, యేసయ్యను నువ్వు ఎలా చూస్తున్నావ్?? ఆయన ఏ పాపం ఎరుగక, నీ పాపం కొరకు మరణించాడని గుర్తించాలి.
యేసును రాజుగా గుర్తిస్తూ ఆయనకు యొద్దకు రావాలి
ఇక్కడ ఈ దొంగ యేసుక్రీస్తువారిని రాజుగా గుర్తించాడు. రాజుగా ఎలా గుర్తించాడు అనేది ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తూ ఉంది.
ఉమ్ము కారుతున్న గడ్డం, రక్తసిక్తమైన శరీరం, సొగసైన కిరీటానికి బదులు ముళ్ళ కిరీటం, ఈ చిత్రమే వేరే భావనను కలిగిస్తూ ఉంటే ఈ దొంగ మాత్రం యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని అంటున్నాడు .
ఆయనకిక్కడ అర్థమైందేంటి, ప్రస్తుతానికైతే యేసయ్య చనిపోతున్నాడేమో కానీ ఆయనకంటూ ఒక రాజ్యం ఉన్నది ఆయన తన రాజ్యముతో మరల వస్తాడు అని గ్రహింపు కలిగి ఉన్నాడు, నీవు యేసుక్రీస్తును రాజుగా చూస్తున్నావా? ఆయన తన రాజ్యముతో వస్తాడని, ఆయన రాజ్యములో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా?
ఆయన రక్షకుడై యున్నాడు
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. -మత్తయి 1:21
దేవుని ప్రజలమై యుండి పాపంలో జీవిస్తున్న ఈ లోకాన్ని, వారి పాపము నుండి రక్షించడానికి, పాపం మూలంగా వచ్చే శిక్షను తాను భరించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రతి వ్యక్తిని రక్షించు వాడై ఉన్నాడు అయితే ఆయన ఎవరిని రక్షిస్తాడు??
తనకు ప్రార్థించు వారిని రక్షిస్తాడు
ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. -రోమీయులకు 10:13
ఇక్కడ దొంగ యేసుక్రీస్తువారిని ప్రార్థిస్తూ ఉన్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మృతుల పునరుత్థానం గురించి ఈ దొంగకి అవగాహన ఉందా? దాని గురించి అడుగుతున్నాడా?? ఆలోచించండి
నీవు కూడా ప్రభువైన యేసూ, నేను పాపిని, నా పాపాముల కొరకు నీవు మరణించావని నమ్ముతున్నాను, నా పాపములను క్షమించు, నేను ఇది మొదలుకొని నీకు లోబడి జీవిస్తాను అని ప్రార్ధించగలిగితే రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోగలవు.
అన్వయము & ముగింపు :
యేసయ్య అంత బాధ అనుభవిస్తున్న, తన శరణు కోరి వచ్చిన ఈ దొంగను త్రోసివేయలేదు. ఆయన నిన్ను కూడా త్రోసివేయుడు.
మనుషులకు కాదు దేవునికి భయపడు! కనీసం ఈ రోజైనా నీ పాపమును బట్టి పశ్చాత్తాప పడి జీవితాన్ని మార్చుకో!! ఈ లోకంలోని అశాశ్వతమైన వాటి కొరకు కాక శాశ్వతమైన వాటి కొరకు ఆశ కలిగి ఉండు!!! ఆయన రాజుగా స్వీకరించి నీ జీవితంలో ఆ స్థానమును ఆయనకు ఇవ్వు!!!!, దేవుని రాజ్యంలో ఉండాలన్న తాపత్రయం గల వ్యక్తివై, ఆ దిశగా నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన రాకడ కొరకు ఎదురుచూసే వ్యక్తిగా ఉంటే రక్షించబడతావు.
ప్రియ విశ్వాసి నీ జీవితంలో యేసుక్రీస్తువారి మాదిరిని నువ్వు కూడా కనబరచవలసి ఉంది, ఎంతసేపు మన బాధలు మన కష్టాలే కాదు, మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకుండాలి, పౌలు చెరసాలలో ఉన్న సంఘములు పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు, స్తెఫను తాను చనిపోతున్న ఆ ప్రజల మీదకు రాబోయే ఉగ్రత తప్పించబడాలని ప్రార్థించాడు.
మనం నడిచే బైబుల్ గా ఇతరులకు ఉండాలి, చాలామందికి సువార్త వినే అవకాశం ఉండదు, వారికి వినబడే, కనబడే ఏకైక సువార్త నువ్వే, దొంగ యేసయ్య మాటలు ఎప్పుడు వినలేదు కానీ ఈ కొన్ని గంటలు ఆయన ప్రవర్తన చూసి మార్పు చెందాడు, నీ ప్రవర్తన విశ్వాసికి తగినట్లుగా ఉంటే సువార్త వినలేని అనేక మందిని దేవుని కొరకు సంపాదించగలుగుతావు.
ప్రభువా ఈ లోకపు దురాశ నుండి విడిపించబడి మా కష్ట స్థితిలోనూ మా జీవితం ద్వారా సాక్ష్యం ద్వారా నీ కొరకు వారిని సంపాదించే భాగ్యం మాకు దయచేయండి . - ఆర్. సమూయేలు



కామెంట్‌ను పోస్ట్ చేయండి