ఇంకెన్నాళ్లు ఇలా….


ఇంకెన్నాళ్లు ఇలా….


ఇంకెన్నాళ్లు ఇలా….

     అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులో నున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను; ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. -ఆదికాండము 26:1-7

    ఈ వచనాలు ఇస్సాకుకు కలిగిన మొదటి ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాయి, ఇస్సాకు జీవితంలో దేవుడాయనతో రెండే రెండు సందర్భాల్లో నేరుగా మాట్లాడాడు ఆ రెండు సందర్భాలు కూడా ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. 

    దేవుడు ఇస్సాకుతో మాట్లాడే ఈ సమయానికి ఆయన చాలా కష్టపరిస్థితిలో ఉన్నాడు, కరువు ఆ దేశంలో ఉన్నది. ఇస్సాకు కనానులో నివసిస్తుండగా, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక ఇంకొక కరువు వచ్చినట్లు దేవుని వాక్యము రాయబడింది. అబ్రహాము దినములలో కరువు ఎప్పుడు వచ్చిందో ఆ సమయంలో ఆయన ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవాలంటే ఆదికాండం 12వ అధ్యాయం చదవండి.

    అబ్రహాము దినములలో కరువు వచ్చినప్పుడు ఆయన కనాను దేశమును విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడు, ఇక అక్కడ మనుషులను బట్టి తన భార్యను గూర్చి చెల్లి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరలా ఇస్సాకు కాలంలో కరువు రాగా ఈయన కూడా ఐగుప్తుకు ప్రయాణమై వెళ్లాలని గెరారు అనే ప్రాంతం వరకు వచ్చాడు, ఆ సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్లకుండా ఇక్కడే ఉండమని చెప్పాడు.

    నేను నీకు తోడై ఉంటాను అని, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని, నీ సంతానం వలన భూలోకంలోని సమస్త వంశాలు దీవించబడతాయని తెలియజేస్తూ, అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో నూతన పరుస్తూ వాగ్దానం ఇచ్చాడు.

    ఆ తర్వాత ఇస్సాకు కూడా దేవుని మాటకు లోబడుతూ తాను జన్మించిన గెరారులో కొన్నాళ్లున్నాడు, అయితే ఈ క్రమంలో ఇస్సాకు మరల తన తండ్రి చేసిన తప్పిదాన్ని చేస్తూ, అక్కడున్న మనుషులకు భయపడి తన భార్యను చెల్లి అని చెప్పాడు ఇది నూటికి నూరు పాళ్లు అబద్ధమే.

    ఇస్సాకు ఎందుకు ఇలా చేశాడు? సమస్య వస్తుందని సత్యాన్ని దాచడం, మేలు కలుగుతుందని లేనివి ఉన్నట్లు చెప్పడం దేవునికి సంతోషకరం కాదు, బైబిల్ అలాంటి ప్రవర్తనను సమర్ధించడం లేదు, ఇస్సాకు దేవుని వాగ్దానం కలిగి ఉండి కూడా, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన ఆ మాటను కూడా పక్కనపెట్టి తనకు ఎవరూ లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ అబద్ధమాడాడు. ఈ తప్పు అబ్రహాము తన జీవితంలో రెండుసార్లు చేశాడు, అది అతని జీవితం మొత్తంలో మచ్చగా ఉండిపోయింది. మరలా ఇప్పుడు ఇస్సాకు అదే తప్పు చేస్తున్నాడు.

    దేవుని పిల్లలమైన మనం ఇలా ప్రవర్తించినప్పుడు తెలియని రీతిలోనే చాలా పోగొట్టుకుంటాము, దాయాలనుకున్నది ఏదైనా ఎక్కువ కాలం దాయలేం, అది ఈరోజో రేపో బయటికి రావాల్సిందే! అయితే అది బయటికి వచ్చినప్పుడు ఏ ప్రజల మధ్య మనం ఉన్నామో, ఆ ప్రజలకు మనం సాక్ష్యం ఇచ్చే అవకాశం కోల్పోతాం, దేవుని నామం అవమానం పాలవుతుంది, మన కుటుంబంలోని సభ్యులకు మనం చులకన అయిపోతాం, ఏ మనుషులకైతే మనం భయపడ్డామో, ఆ మనుషులు ముందు కొన్నిసార్లు తలెత్తుకొని జీవించలేము.

    ఒకసారి ఆలోచించండి, ఇస్సాకుకే కాదు మనకు కూడా పరిశుద్ధ గ్రంథం నిండా అనేకమైన వాగ్దానాలు, అభయమిచ్చే ధైర్యపరిచే మాటలు ఉన్నాయి, వాటిని మనం చదువుతున్నాం వింటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం, అయినా దేవునికి భయపడిన జీవితం కలిగి ఉండట్లేదు, మనుషులను గూర్చిన భయమే మనలో రాజ్యమేలుతున్నది, ఇంకెన్నాళ్లు ఇలా! ఇది ఒక బలహీనతలే అని వదిలేద్దామా?? విశ్వాస వీరుల కంటే మనం గొప్పోళ్ళం కాదులే అని సరిపెట్టుకుందామా?? 

    అబ్రహాము తాను చేసిన తప్పులను గురించి ఇస్సాకుకు చెప్పి ఉంటాడా?? తాను అలా చెప్పి ఉంటే, కుటుంబంలో తాను చులకన అయిపోయే అవకాశం ఉంది కనుక చెప్పక పోయి ఉండవచ్చు, అలా చెప్పకపోవడాన్ని బట్టి ఇస్సాకు ఇలా శోధించబడటం, మరలా అదే తప్పు చేయడం జరిగింది. మరి మన సంగతి ఏంటి?? దేవుడు మన పెద్ద వాళ్ళ జీవితాలు మన ఎదుట పెట్టాడు! గొప్ప వాళ్ళ బలహీనతలు కూడా దాయకుండా రాసి పెట్టాడు, ఇది దిద్దుకోవడానికి ఇచ్చిన ప్రేరణ కాదా?? ఆశీర్వాదపు అడుగులు వేయడానికి ప్రోత్సాహం కాదా??

     నేడైనా ఒక మంచి తీర్మానమును గైకొని, దేవునికి భయపడి, ఆయన వాగ్దానమును బట్టి, ఆయన ఇచ్చు ధైర్యంతో ముందుకు సాగుదాం, ఒకవేళ ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అన్నట్లుగా నీ పరిస్థితి ఉన్నదా? అయినా పర్వాలేదు దాన్నే దేవుని ఎదురు పెట్టి నాకు సహాయం చేయమని వేడుకో, మన దేవుడు మన బలహీనతలను అర్థం చేసుకోగలిగినవాడు, కనుక ఆయన సమయోచితమైన సహాయము నీకు చేసి సన్మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఇప్పటికైనా దేవుని కప్పగించుకుంటావా?

    ప్రార్థన 

    ప్రియ ప్రభువా, మా జీవితాల్లో నీ వాగ్దానాలు నిబంధనలు ఎన్ని కలిగి ఉన్నా నీకు భయపడి జీవించలేని దౌర్భాగ్య స్థితిలో మేమున్న మాట వాస్తవం, నీ భయం లేక ప్రవర్తిస్తూ మేమందరం మా యొక్క పరిధిలలో రకరకాలుగా తప్పిపోయిన వారముగా ఉన్నాము. 

    కొన్నిసార్లు మా ఈ ముసుగులు తొలగించబడతాయేమో అని కూడా భయపడుతున్నాము, మా తప్పిదములకు కలిగే పర్యవసానాలు తప్పవు అని మాకు తెలుసు, అయినప్పటికీ మా పాపములను క్షమించండి, నీకు ఇష్టమైన ప్రవర్తన నీకు భయపడిన జీవితం కలిగి ఉండుటకు మేము తీర్మానించుకుంటున్నాం మాకు నీ సహాయం దయచేయండి. 

    ఈ మాటలు చదువుతున్న వారిలో సమర్ధించుకునే ధోరణి కలిగిన వారు, ఎవరైనా ఉంటే వారిని కూడా సన్మార్గంలోనికి నడిపించండి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. - ఆర్. సమూయేలు

Post a Comment