సిగ్గుపరచు దేవుడు

సిగ్గుపరచు దేవుడు

 సిగ్గుపరచు దేవుడు  

మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.- కీర్తనలు 44:7 

    ఈ లోకములో మనలను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, మనల్ని ద్వేషించే వారు కూడా అంతేమంది ఉంటారు. ఈ లోకంలో మనకు స్నేహితులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారు.

     మనల్ని ప్రేమించే వారు మన యొక్క మేలుని కోరుకుంటే మనల్ని ద్వేషించే వారు మన యొక్క నాశనాన్ని కోరుకుంటారు. మన స్నేహితులు మన విజయాన్ని కోరుకుంటే మన శత్రువులు మన ఓటమిని కోరుకుంటారు.

     ఎవరెవరు ఏమి కోరుకున్నా, తన వారి పట్ల తన యొక్క కోరికను నెరవేర్చుకొనగల సమర్థత గల దేవుడు మనకున్నాడు అందును బట్టి మనం ఆయనను స్తుతింప బద్ధులమై ఉన్నాము.

     ఈ కీర్తన రాస్తున్న కోరహు కుమారులు గత కాలంలో దేవుడు వారికి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు అంటూ ఉన్నారు. 

మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.

     గడిచిన వారంలో మన దేవుడు రక్షించే వాడని తెలుసుకున్నాం. అయితే ఈ భాగంలో మన దేవుడు సిగ్గుపరిచేవాడు అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది.

     ఆయన ఎవరిని సిగ్గుపరుస్తాడు?? మన శత్రువులను మనల్ని ద్వేషించే వారిని ఆయన సిగ్గుపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువుల మూలంగా ఎన్నో రకాలైన సమస్యలు ఎదురైనప్పుడు, దేవుడు వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, ఇశ్రాయేలీయులకు కలిగినది వారి దగ్గర నుండి లాక్కోవాలని శత్రువులు ప్రయత్నించిన అనేక సందర్భాల్లో దేవుడు వారికి సిగ్గునే మిగిల్చాడు.

     ఒక వ్యక్తి మరో వ్యక్తిని ద్వేషించడానికి కారణాలు చాలానే ఉంటాయి, రంగు, రూపం, మాటతీరు, వస్త్రధారణ, కులం, భాష, చదువు, పని, ఉద్యోగం, సంపాదన, ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు, స్నేహితులు, మతం, జాతి, వ్యక్తిత్వం, సాంప్రదాయం, ప్రాంతం ఇలా ఎన్నో కారణాలతో మనం ఇతరులను ద్వేషిస్తూ ఉంటాము మనం ద్వేషానికి గురవుతూ ఉంటాము.

     నీవు ద్వేషించబడుటకు కారణం ఏదైనా నీవు దేవుని బిడ్డవైతే ఆయనకు ఇష్టుడుగా ఇష్టురాలుగా కొనసాగుతున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను ద్వేషిస్తున్న వారిని సిగ్గుపరుస్తాడనే సత్యం తెలుసుకోవలసి యున్నది.

     బైబిల్ ఎంతో మంది చేత ద్వేషించబడింది, క్రైస్తవ్యమును ఎంతోమంది భూరాజులు ద్వేషించారు, ద్వేషించినవారికి సిగ్గు కలిగింది ద్వేషింపబడిన వారు దీవెన పొందారు. ద్వేషింపబడిన లేయ ప్రేమింపబడిన రాహేలుకు అసూయ కలిగే అంతగా దీవెన పొందింది. ఇశ్రాయేలీయులను ద్వేషించిన ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఎంతగానో సిగ్గుపరచబడింది, మొర్థకైని యూదా జాతిని ద్వేషించిన హామాను ఎంతగానో సిగ్గునొందాడు. 

     నీ జీవితంలో నిన్ను ద్వేషించిన వారిని దేవుడు సిగ్గుపరచాడా?? నీ నాశనాన్ని కోరుకున్న వారు చూస్తుండగానే దేవుడు నీ జీవితంలో క్షేమాన్ని అభివృద్ధిని కలుగజేసాడా? నీ జీవితంలో ఏది నీకు దక్కకూడదని, ఏది నీకు జరగకూడదని నిన్ను ద్వేషించిన వారు వాటిని నీ దరిచేరనివ్వకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన అవలీలగా దేవుడు వాటిని ఎదుటకు తీసుకువచ్చి వారిని సిగ్గుపరిచిన సందర్భాలు నీకు జ్ఞాపకం వస్తున్నాయా?

     మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడో కదా! నిశ్చయముగా మనలను ద్వేషించువారిని  ఆయన సిగ్గుపరుస్తాడు. మన విరోధియైన సాతానును యేసుక్రీస్తు వారి సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు సిగ్గుపరిచారు, ఆయన యొక్క రెండవ రాకడలో, సాతానుకు సంపూర్ణంగా సిగ్గు కలుగుతుంది.

     కాబట్టి నిన్ను ద్వేషించువారిని సిగ్గుపరచుటకు దేవుడు నీ పట్ల చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు, అంతేకాదు నీ జీవితంలో దేవునికి విరోధముగా, ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉన్నావేమో పరిశీలన చేసుకో!

దేవుని పిల్లలను ద్వేషించే వారికి సిగ్గు కలుగుట వాస్తవమైతే, ద్వేషించే వారిలో నీవు కూడా ఉంటే నీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. 

కాబట్టి ద్వేషాన్ని విడిచిపెట్టు ఇప్పటికైనా సత్యం తెలుసుకో ద్వేషింపబడిన వారు దీవెన పొందుతున్నారు ద్వేషిస్తున్న వారు అవమానం పాలవుతున్నారు, ఎంతకాలం సిగ్గుపరచబడే అవమానం పాలయ్యే గుంపులో ఉంటావు?? ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకొని దేవునిని దేవుని పిల్లలను ప్రేమించుటకు నేర్చుకుని దీవించబడు!!

- ఆర్. సమూయేలు 

1 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి