విడువని దేవుడు



విడువని దేవుడు


 విడువని దేవుడు


 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మా సేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల యెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు -కీర్తనలు 44:9-11

    కీర్తనలు మనుషులు యొక్క భావోద్వేగం నుండి పుట్టేవిగా ఉంటాయి. కొన్నిసార్లు దుఃఖము మరికొన్నిసార్లు సంతోషము కొన్నిసార్లు విజయము మరికొన్నిసార్లు ఓటమి కొన్నిసార్లు సమృద్ధి మరి కొన్నిసార్లు లోటు కొన్నిసార్లు జననము మరికొన్నిసార్లు మరణము కొన్నిసార్లు ప్రార్థన మరికొన్నిసార్లు స్తుతి ఇలా పరిస్థితి ఏదైనా కవులు లేదా రచయితలు వారి భావాలను వ్యక్తపరుస్తూ కీర్తనలు రాసేవారు, దీనికి బైబిల్లోని కీర్తనలు అతీతమైనవి కావు.

    మన ఎదుట ఉన్న ఈ కీర్తన కూడా బహు దుఃఖములో ఉండి రాసిన కీర్తన గా కనబడుతుంది, ఇది విజయాన్ని బట్టి రాసిన కీర్తన కాదు గాని ఓటమిని అవమానమును నిందను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రాసిన కీర్తన గా ఉన్నది. కోరహు కుమారులు ఈ కీర్తనకు రచయితలుగా ఉండి 9 నుండి 16 వచనాల్లో వారి బాధనంత వ్యక్తం చేశారు. 

    ఇది ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు చోటుచేసుకున్నది అనే దాన్ని గురించి పండితులు వారికి తోచిన అభిప్రాయాన్ని వారు వెల్లడిపరిచారు, ఇక్కడ శత్రువులు అని ఎవరినైతే పిలుస్తున్నారో వారు ఎదోమీయులని, బబులోనీయులని ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేదాని గురించి విశ్లేషించి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా అన్వయములో మార్పు ఏమి ఉండదు కనుక దేవుడు మనకు ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 

    మొదటి ఎనిమిది వచనాల్లో దేవుని గొప్పతనం గురించి చాలా గొప్పగా వివరించిన కోరహు కుమారులు, తొమ్మిదవ వచనానికి వచ్చేసరికి అలాంటి దేవుడు మమ్మల్ని విడిచి పెట్టేసాడు అని బాధపడుతున్నారు.

    దేవుడు వారిని విడిచిపెట్టినట్టు వారికి ఎందుకు అనిపించింది? ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా, ఎందుకంటే వారి వలే మనం కూడా చాలా సార్లు అలా అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో జరగాల్సిందే ఏదైనా మనం అనుకున్నట్టుగా జరగకపోతే దేవుడు మనలను వదిలిపెట్టేసాడు అనుకుంటాము, కొన్ని మనకు దూరమై కొన్ని మనకు దగ్గరగా రాకపోతే దేవుడు మనల్ని వదిలిపెట్టేసాడు అని అనుకుంటాం. కొన్నిసార్లు మన విజయాల పరంపరకు కొద్దిపాటి విరామం కలిగితే అప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టేసాడు అని అనుకుంటాము.

ఇక్కడ వీరు అసలు అలా ఎందుకు భావిస్తున్నారో గమనించండి.

 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మా సేనలతో కూడ నీవు బయలుదేరకయున్నావు. -కీర్తనలు 44:9

    వారికి అవమానం కలిగింది, అంటే బహుశా యుద్ధంలో ఓటమి ఏర్పడి ఉండొచ్చు, దానిని బట్టి కత్తి లేకుండానే మాకు విజయం ఇచ్చిన దేవుడవు, నువ్వు మాతో రాకపోయేసరికే కదా మాకు ఓటమి కలిగింది అని ఆలోచిస్తూ దేవుడు వారిని విడిచి పెట్టినట్టుగా భావిస్తున్నారు. 10 11 వచనాల్లో కూడా యుద్ధం తర్వాత జరిగే విషయాలను గూర్చిన ప్రస్తావనే కనబడుతున్నది. పారిపోవడం దోచుకోవడం అప్పగించబడడం ఇవన్నీ యుద్ధంలో ఓటమిని సూచించే పదాలు.

    వీళ్ళకు కలిగిన ఈ ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి? ఓటమి కలిగితే దేవుడు మనతో లేడని భావమా? కోరిన ఫలము కనబడకపోతే దేవుడు మనలను విడిచిపెట్టాడని అర్థమా? ఈ అంశాలను గూర్చి వచ్చేవారం వివరంగా మాట్లాడుకుందాం.

    అయితే నేటి భాగంలో మనం పరిశీలించాల్సిందేమిటంటే వీళ్ళు అనుకుంటున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నిజంగా విడిచిపెట్టడా? బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి!


ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? -రోమీయులకు 11:1,2 

దేవుడు మనలను ఎన్నడు విడిచి పెట్టేవాడు కాదు. ఇదే మాట మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు, ఆ తర్వాత యెహోషువకు కూడా చెప్పాడు, అంతేకాదు దేవుడు కూడా నేరుగా యెహోషువతో అవే మాటలు చెప్పడం జరిగింది


 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనైయున్నాను. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు వీరితో కూడ పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను. -ద్వితియోపదేశకాండము 31:1, 6-8
 నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. -యెహోషువ 1:6

    నీ జీవితంలో నీ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను వదిలేశాడు అని నీవు అనుకుంటున్నట్లయితే, ఈ ఒక్క ప్రశ్న నీ హృదయాన్ని అడుగు, దేవుడు నిన్ను వదిలేసాడా? నీవు దేవునిని వదిలేసావా??

    దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, నిన్ను వదులుకోలేకనే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపింది, నిన్ను వదులుకోలేకనే దేవుడు తన కుమారుని తాత్కాలికంగా సిలువ మీద విడిచిపెట్టింది, నీకోసం తన ప్రియ కుమారుని ఇవ్వటానికి సిద్ధపడిన వాడు నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకున్నావ్?

    నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులు ఏమిటో ఎందుకో నీకు అర్థం కాకపోతే, మౌనంగా ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో, నీవు వదిలేసిన ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం, సహవాసం, సువార్త పనులు భాగం వంటి వాటి గురించి ఆలోచన చేసుకొని మరల వాటిని పునః ప్రారంభించు.

    ఇంకా నీ బాధ తీరకపోతే దేవుని వద్దకు వచ్చి ఆయన్ని నేరుగా అడుగు, అంతేకానీ దేవుని నిన్ను విడిచిపెట్టాడని భావించవద్దు. ఇదే సమయంలో ఒక్కసారి దేవునిని విడిచిపెడితే అసలు నీ జీవితం ఏమవుతుందో ఆలోచన చేసుకో

    ఇప్పుడైనా అర్థం చేసుకొని కృతజ్ఞతతో పశ్చాతాపంతో ప్రభువా నన్ను విడిచి పెట్టక నడిపిస్తున్నందుకు వందనాలు అని దేవునిని స్తుతించు. కొంతసేపు ఆయన నిన్ను లోయలో తిప్పాలి అని అనుకుంటున్నారేమో, ఎల్లప్పుడూ కొండ మీదే ఉండాలని ఎందుకు అనుకుంటావ్, ఆయన చిత్తానికి లోబడి ఆయన ఉద్దేశములను అర్థం చేసుకుంటే ఆయన స్థాయిలో జరిగే కార్యాలు చూడగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

ఆర్. సమూయేలు.

Post a Comment