కయీను నిర్లక్ష్యముగా అర్పించాడు
అది సాయంత్రం కాల సమయం, మాథ్యూస్ కి బాగా ఆకలేస్తుంది, హాస్టల్లో పెట్టిన కూరేమో నచ్చలేదు, ఈ లోగా తన ఫ్రెండ్ ఒకడు, బయటకు వెళ్తుంటే తనకు ఏదన్న కర్రీ తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి పంపించాడు. వెళ్లిన ఫ్రెండు ఎంతసేపటికి రాలేదు, మాథ్యూస్ కి బాగా ఆకలి ఎక్కువ అయిపోతా ఉంది, ఒకసారి ఫోన్ చేద్దామని అతనికి ఫోన్ చేశాడు, కానీ స్పందన లేదు, మరలా రెండు మూడు సార్లు చేశాడు అయినా స్పందన లేదు, సరే ఇక చేసేదేమీ లేక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు.
చాలాసేపటి తర్వాత కూర తీసుకురావడానికి వెళ్లిన ఫ్రెండు వచ్చాడు, రావడం రావడమే సైకిల్ దిగకుండానే, మాథ్యూస్ దగ్గరికి చాలా కోపంగా ఆ కర్రీ ప్యాకెట్ను చాలా దూరంలో నుంచి విసిరేసాడు, ఆ దెబ్బకి ఆ ప్యాకెట్ చినిగిపోయి కూరంతా మాథ్యూస్ మొహం మీద కొంచెం, ప్లేట్లో కొంచెం, టేబుల్ మీద కొంచెం, నేల మీద కొంచెం గోడ మీద కొంచెం పడ్డాయి. మాథ్యూస్ చాలా బాధపడ్డాడు, ఒకవైపు ఆకలి, ఇంకో వైపు తిందామంటే కూర లేదు, అలాగే చేతులు కడిగేసుకున్నాడు.
మాథ్యూస్ ఆరోజు భోజనం చేయలేకపోవడానికి, అంతగా బాధపడ్డానికి కారణం ఎవరు? ఖచ్చితంగా వారి ఫ్రెండు నిర్లక్ష్యమే. ఇక్కడ అతను మాథ్యూస్ యొక్క ఆకలిని పట్టించుకోలేదు అందుకే ఆలస్యంగా వచ్చాడు, వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఇవ్వడానికి బదులు కోపంతో దూరం నుండి విసిరేశాడు.
నిర్లక్ష్యం అంటే ఏంటి? లెక్క లేనట్టు ఉండటం, శ్రద్ధ చూపించకపోవడం, ఇచ్చిన పని లేదా చేసే పని ఆసక్తితో చేయకపోవడం, ఆలోచన లేకుండా మాట్లాడడం ప్రవర్తించడం, ఇంకో వ్యక్తిని సరిగా పట్టించుకోకపోవడం.
ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. -ఆదికాండము 4:1-7
బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, బైబిల్లో వాళ్లే మొదటివారు. వారి పేర్లు కయీను హేబేలు. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆదాము హవ్వ. ఈ అన్నదమ్ములు చెరోక పని చేసేవారు, అన్నేమో వ్యవసాయం చేసేవాడు, తమ్ముడేమో గొర్రెలు కాసేవాడు. కొన్ని రోజులకి దేవుడు వీళ్ళిద్దరికీ మంచిగా దీవించాడు అందుకని వీరు దేవునికి అర్పణ తీసుకురావాలనుకున్నారు. అన్న ఏమో తన పొలం పంటలో కొంత తీసుకొస్తే తమ్ముడేమో తన మందలో నుండి మంచి గొర్రెను తీసుకొచ్చాడు. దేవుడికి తమ్ముని అర్పణ నచ్చింది, అన్న అర్పణ నచ్చలేదు. ఎందుకని అన్న అర్పణ నచ్చలేదు. గొర్రెను తీసుకురాలేదని కాదు, మంచి మనసుతో కయీను ఆ అర్పణ ఇవ్వలేదు.
ఇంతకుముందు కథలో మాథ్యూస్ ఫ్రెండ్ కూర తెచ్చాడు గాని మాథ్యూస్ ఆకలి తీరలేదు, బాదేమో ఎక్కువైంది. ఎందుకని? కూర తెచ్చాడు కదా! కూర తెచ్చాడు గాని మంచిగా ఇవ్వలేదు. మనం ఇచ్చే వాటికంటే మంచి మనసుతో ఇవ్వటం కావాలి, లెక్క లేనట్లుగా ఇస్తే, విసిరేస్తే ఎవరికీ ఇష్టం ఉండదు.
పిల్లలు మీరు ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉన్నారా? మీ అమ్మానాన్నలతో గాని టీచర్లతో గానీ మీ అన్న చెల్లి తమ్ముడు అక్కలతో గాని, ఫ్రెండ్స్ తో గాని నిర్లక్ష్యంగా ఉన్నారా? అలా ఉండే పిల్లలు అంటే యేసయ్యకు ఇష్టం లేదు, చూడండి కయీను నిర్లక్ష్యంగా అర్పణ ఇచ్చినందుకు దేవుడు ఆయన అర్పణ అంగీకరించలేదు. మనం దేవునికి ఇచ్చే వాటిలో ఇతరులకు ఇచ్చే వాటిలో నిర్లక్ష్యం చూపించకూడదు. మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా నిర్లక్ష్యంగా అది చేయకూడదు.
మనం చేసేది యేసయ్యకు నచ్చాలంటే మనం మన తప్పులన్నీ ఒప్పుకొని శ్రద్ధతో ఆసక్తిగా దేవుని సన్నిధికి రావాలి. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మంచిగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకొని సమయానికి రావాలి. ఆలస్యంగా రాకూడదు. ఆలస్యంగా వచ్చే వాళ్ళందరూ నిర్లక్ష్యం చేస్తున్నట్టే లెక్క.
యేసయ్య మనందరి కొరకు మరల ఈ లోకానికి అతి త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆసక్తిగా పనిచేసిన వాళ్లకి నిర్లక్ష్యంగా పనిచేసిన వాళ్లకి ఇద్దరికీ కూడా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నిర్లక్ష్యం లేకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం. కయీను ఇంకా ఏ ఏ విషయాల్లో నిర్లక్ష్యం చూపించాడో, దానివలన ఆయనకు ఎలాంటి ఫలితం వచ్చిందో వచ్చేవారం తెలుసుకుందాం. అప్పటివరకు ఈ పాట నేర్చుకుని, ఈ కంఠతో వాక్యం నేర్చుకుని సిద్ధంగా ఉంటారుగా!
పాట : నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం
కంఠత వాక్యం :
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయు దురు. -ప్రసంగి 5:1

కామెంట్‌ను పోస్ట్ చేయండి