మిర్యాము విధేయురాలు
హాయ్ పిల్లలు బాగున్నారా, ఎండాకాలం సెలవులు చివరకు వచ్చేసినాయి కదా! సెలవుల్లో బాగా ఆడుకున్నారా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు అందరు సమాధానం చెప్పాలి సరేనా! మీరు ఎక్కడో ఒకచోట బిజీగా ఆడుకుంటున్నారు! సడన్ గా మీ అమ్మ రా నీతో పని ఉంది అని పిలిచింది.
మీలో ఎంతమంది పని ఏంటి అని అడగకుండా అమ్మతోపాటు వస్తారు?? సరే పని ఏంటి అని అడిగారు, దానికి అమ్మ ఏమి చెప్పిందంటే నువ్వు వేరే ఊరు వెళ్ళాలి, అని అనగానే ఇంక వేరే ప్రశ్నలు వేయకుండా మీలో ఎంతమంది అమ్మతోపాటు వస్తారు? సరే ఏ ఊరు వెళ్లాలి అని అడిగారు, దానికి అమ్మ ఊరు పేరు చెప్పి నువ్వొక్కడివే వెళ్లాలి లేదా నువ్వు ఒక్కదానివే వెళ్లాలి అని చెప్పింది. ఇప్పుడు మీలో ఎంతమంది అమ్మతోపాటు వస్తారు? ఒక్కడినే వెళ్ళాలా, అక్కడ ఎన్ని రోజులు ఉండాలి? నాకు అవసరమైనవన్నీ అక్కడ ఎవరిస్తారు? అని ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ మీలో చాలామంది ఆటను వదిలి రాకుండా, అమ్మ మాట వినకుండా అక్కడే ఉండిపోతారు కదా!
అయితే నేను ఈరోజు ఒక పాప గురించి చెప్తాను, ఈమె వాళ్ళ అమ్మ మాట చాలా చక్కగా వినింది. ఈ పాప వాళ్ళ ఇంట్లో పెద్దమ్మాయి, అలా అమ్మానాన్న ఇద్దరూ బానిసలుగా ఉన్నారు. వారు దేశం కానీ దేశంలో ఉన్నారు, వారిని పరిపాలిస్తున్న రాజు చాలా క్రూరుడు. ఎంత క్రూరుడంటే, బానిసలుగా ఉన్న వాళ్లకి పుట్టిన మగ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ జారీ చేశారు, అమ్మో ఎంత కష్టమో కదా! చాలా చాలా కష్టం.
కానీ అలాంటి పరిస్థితుల్లోనే వీరికి ఒక చిన్న తమ్ముడు పుట్టాడు. చాలా బాగున్నాడు బాబు చూడడానికి, మొత్తానికి రాజుగారు ఎవరికైతే చంపమని చెప్పాడో వారి కంటపడకుండా మూడు నెలలు కాపాడగలిగారు . కానీ ఆ తర్వాత కాపాడలేరు కదా, అంటే అప్పటి నుంచి పిల్లలు అన్ని గుర్తు పడుతూ ఉంటారు. అయితే ఏ పిల్లలైతే ఇలా బ్రతికారో, వారందరినీ నదిలో పడవేయమని రాజుగారు మరో ఆజ్ఞ జారీ చేశాడు.
లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా, వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. -నిర్గమకాండము 2:1-4
నీకు ఇప్పుడు చేసేదేమీ లేక వాళ్ళ అమ్మగారు చాలా చక్కని పని చేశారు. రాజుగారు పడవేయమన్నారు కాబట్టి బాబును తీసుకెళ్లి నేరుగా నదిలో పడవేయకుండా దేవునిపై నమ్మకంతో ఒక జమ్ము పెట్ట తయారుచేసి దాని లోపలికి నీళ్లు రాకుండా ( కీలు ) తారు పూసి, జిగటమన్నంటే దాని వాసనంటే మొసళ్ళకు గిట్టదు, పైగా నైలు నదిలో మొసళ్ళు ఎక్కువగా ఉంటాయంట, వాటి భారీ నుండి బాబును రక్షించుకోవడానికి ఆ బుట్టకు జిగటమన్ను కూడా పూసి, బాబును అందులో జాగ్రత్తగా పెట్టి ఆ నది ఒడ్డున కొంత జమ్ము ఉంటే దానిలో ఆ పెట్టెను వదిలిపెట్టింది, అంతేకాదు ఆ అమ్మగారు ఏం చేశారో తెలుసా, ఆ పెట్టెకు అందులో ఉన్న బాబుకు ఏమి జరుగుతుందో చూడడం కోసం ఈ పాపను అక్కడ దూరంగా నిలబెట్టింది.
వాళ్ళ అమ్మ ఆ పాపను అక్కడ ఉంచిందా? లేక తనకు తానే తమ్ముడు మీద ప్రేమతో అక్కడ ఉన్నదా? బైబిల్ లో ఈ విషయం స్పష్టంగా రాయబడలేదు. ఆ రెండిట్లో సమాధానం ఏదైనా మనము నేర్చుకోవటానికి రెండు పాఠాలు ఉన్నాయి. ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందాం, అందుకుగాను ప్రస్తుతానికి వాళ్ళ అమ్మగారు ఆ పాపని అక్కడ నిలబెట్టారు అని అనుకుందాం.
ఈ పాప పేరు ఏం పేరో తెలుసా? మిర్యాము. వాళ్ల నాన్న పేరు అమ్రాము, అమ్మ పేరు యోకెబేదు, ఆ బుట్టలో ఉన్న తమ్ముడు పేరు మోషే. మిర్యాముకు వాళ్ళ అమ్మగారు ఈ పని అప్పచెప్పినప్పుడు ఆ పాప చాలా చక్కగా వాళ్ళ అమ్మ చెప్పినట్టు విన్నది.
ఆ పాపకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలుసా? 7 నుండి పది సంవత్సరాలు ఉండొచ్చు. మీ వయసే కదా! మిర్యాము స్థానంలో మీరే ఉంటే మీ అమ్మగారు మిర్యామును పిలిచిన పని కొరకు మిమ్ములను పిలిస్తే మీరేం చేస్తారు? అమ్మగారు చెప్పినట్టు వింటారా? లేదా ఎదురు ప్రశ్నలు వేసి అసలు వినకుండానే మానుకుంటారా?
మన తల్లిదండ్రులు, పెద్దవారు మనలను ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు మనం ఎదురు ప్రశ్నలు వేయకూడదు, ఆ పని మనకు వచ్చినా రాకపోయినా చెయ్యనని చెప్పకూడదు.
మీ ఎదుట ఒక పెద్ద రాయి పెట్టి బాబు దీన్ని దొర్లించండి అని అంటే అమ్మ నా వల్ల కాదు నేను చెయ్యను అని అనకూడదు, ఆ రాయి అక్కడనుండి కదిలినా కదలకపోయినా మీరు మాత్రం మీ పెద్ద వాళ్ళు చెప్పిన దానిని బట్టి ఆ రాయిని దొర్లించే ప్రయత్నం చేయాలి. ఇలా పెద్దల మాట ఎవరైతే వింటారో, తల్లిదండ్రులకు విధేయులుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు. మరి తల్లిదండ్రులు మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు మీకు ఇచ్చే కంఠత వాక్యం అదే !
కంఠత వాక్యం
తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.-సామెతలు 30:17
ఏం జరుగుతుంది? అలాంటి పిల్లలకు కన్నులను లోయకాకులు పీక్కొని తింటాయంట! ఆ….! మేము చాలాసార్లు మా అమ్మ వాళ్ళ మాట వినలేదు, అయినా మాకేం కాలేదు అని అనుకుంటున్నారు కదా! దేవుడు చాలా మంచివాడు కాబట్టి మీకేమీ కానివ్వకుండా కాపాడాడు. మీరు ఇలాగే తల్లిదండ్రులు మాట వినకుండా ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు!
కాబట్టి యేసయ్య మమ్మల్ని క్షమించండి, నేను చాలాసార్లు మా అమ్మ వాళ్ళ మాటలను, పెద్దవారి మాటలను వినకుండా వారికి ఎదురు చెప్పాను, నా మీదకు ఎలాంటి శిక్షను తీసుకొని రావొద్దు! నేను ఇకనుండి పెద్దవారు మా తల్లిదండ్రులు ఏమి చెప్పినా కాదనకుండా చేస్తాను, ఎదురు ప్రశ్నలు వేయను , నాకు ఆ విధంగా సహాయం చేయండి అని దేవునికి ప్రార్ధన చేయండి, అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు విధేయత చూపిస్తే ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. మిర్యాము గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వచ్చే వారం మరొక విషయంతో కలుసుకుందాం!

కామెంట్‌ను పోస్ట్ చేయండి