సమూయేలు దేవునిని ఆరాధించాడు
హాయ్ పిల్లలు బాగున్నారా? మంచిగా సండే స్కూల్లో అనేక విషయాలను నేర్చుకుంటున్నారా? ఈరోజు నుండి నేను మరొక కొత్త అంశాన్ని ప్రారంభిస్తున్నాను.
బైబిల్లో హన్నా అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి చాలా కాలం పిల్లలు లేరు, తనకు పిల్లలు లేరని చాలామంది చాలా రకాలుగా ఆమెను బాధపెట్టేవారు. ఒకరోజు ఆవిడ ఈ బాధను తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకున్నది.
ఏమని ప్రార్థన చేసుకుందో తెలుసా " దేవా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇచ్చి నాకు పిల్లలు లేరు అనేటువంటి లోటు తీర్చితే నేను ఆ బాబును తీసుకువచ్చి మరలా నీకే అప్పగిస్తాను " అని ప్రార్థన చేసుకున్నది. తాను అలా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. చాలా కాలంగా పిల్లలు లేని ఆమెకు దేవుడు ఒక చక్కని బాబును ఇచ్చాడు. మన దేవుడు చాలా మంచివాడు, ఆయన మన ప్రార్థనలను వినేవాడు, విశ్వాసంతో ఎవరైతే దేవునికి ప్రార్ధన చేస్తారో వారి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, దేవుడు చేయలేనిది అంటూ ఏమీ లేదు, అందుకే హన్నాకు దేవుడు పిల్లలను ఇచ్చాడు మరి హన్నా ఆ బాబుకు ఏమని పేరు పెట్టిందో తెలుసా? సమూయేలు అని పేరు పెట్టింది.
ఈ బాబు చాలా తెలివైనవాడు. చిన్నప్పుడు నుండి పాలు తాగే వరకు అమ్మ దగ్గర ఉన్నాడు, ఆ రోజుల్లో మూడు సంవత్సరాల వరకు పిల్లలకు పాలిస్తారు. ఆ కాలమంతా సమూయేలు అమ్మ దగ్గరే ఉన్నాడు, ఇక ఆ తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళ అమ్మగారు దేవుని దగ్గర ఒప్పుకున్నట్టుగానే సమూయేలు అనే ఈ బాబును తీసుకుని వెళ్లి దేవుని మందిరంలో అప్పగించింది. ఇక సమూయేలు ఇంటికి రాడు, హన్న ఒక్కతే ఇంటికి వెళ్ళాలి , సమూయేలు అక్కడినుండి దేవుని మందిరంలోనే ఉండాలి. సమూయేలును వాళ్ళ అమ్మ దేవుని మందిరంలో అప్పగించినప్పుడు సమూయేలు ఏం చేశాడో తెలుసా? సమూయేలు దేవునిని ఆరాధించాడు.
ఎలా ఆరాధించి ఉంటాడు? బహుశా ప్రార్థన చేశాడేమో, దేవునిని స్తుతించాడేమో! సమూయేలు దేవునిని ఆరాధించినప్పుడు సమూయేలు వయసెంతో తెలుసా? మూడు సంవత్సరాలు. మరి పిల్లలు, మీరు దేవునిని ఆరాధిస్తున్నారా? పాటలు పాడి, స్తుతించి, ప్రార్థించి మనం దేవునిని ఆరాధించవచ్చు. దేవుడు మిమ్ములను ఇంత చక్కగా కలుగజేసినందుకు మీరు దేవునిని ఆరాధించాలి, దేవునికి వందనాలు చెప్పాలి. ఒకవేళ మీకు ఎలా ఆరాధించాలో తెలియకపోతే, మీ అమ్మానాన్న ని అడగండి, వారి దగ్గర దేవునిని ఆరాధించడం నేర్చుకోండి. మొత్తానికి వాళ్ళ అమ్మగారు సమూయేలును అక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళింది. సమూయేలు అక్కడ ఏమి చేశాడు ఎలా ఉన్నాడు అనే విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.
కంఠత వాక్యం
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. -యోహాను 4:24
పునర్విమర్శ :
- హన్న కుమారుని పేరేమిటి?
- హన్నా సమూయేలును దేవుని మందిరానికి ఎందుకు తీసుకొని వచ్చింది?
- సమూయేలు దేవునిని ఆరాధించినప్పుడు ఆయన వయసెంత?

కామెంట్‌ను పోస్ట్ చేయండి