దావీదు దేవుని తోడును కలిగినవాడు



దావీదు దేవుని తోడును కలిగినవాడు

దావీదు దేవుని తోడును కలిగినవాడు

చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. -1 సమూయేలు 16:18,19 

కంఠత వాక్యం :

 .....మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. - సంఖ్యాకాండము 14:44

మన జీవితంలో ఎవరో ఒకరి తోడును కలిగియుండాలని కోరుకుంటాము. ఒంటరితనాన్ని ఇష్టపడేది అతి కొద్ది మంది మాత్రమే. చాలాసార్లు చాలామంది మనుషులు మనకు తోడుగా ఉండటాన్ని బట్టి చాలా సంతోషిస్తాము.

మా నాన్న తోడు ఉన్నాడని, మా అమ్మ తోడు ఉందని, మా అన్న తోడు ఉన్నాడని, మా అక్క తోడు ఉందని, మా స్నేహితులు తోడున్నారని, చాలా ఆనందిస్తాం. అసలు మనం ఒకరు తోడును ఎందుకు కోరుకుంటాం?

ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరియొకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? -ప్రసంగి 4:9-12

ఇంకొకరు తోడు ఉండటం వల్ల మన పని సులభం అవుతుంది, మనకు సమస్య వస్తే సహాయం, ఆదరణ, భద్రత దొరుకుతుంది. మనుషుల వలన మనకు కలిగే ఈ ప్రయోజనాలు పరిమితమే. ఒకరు మనకు తోడు ఉండటాన్ని బట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఎవరూ మనకు ఎల్లకాలము అన్ని పరిస్థితుల్లో తోడు ఉండలేరు.

ఇంకో రకంగా చెప్పాలంటే పరిమితమైన మనుషులు తోడుంటేనే, ఇంత సంతోషంగా మనం ఉంటే ఇక దేవుడు మనకు తోడుంటే ఆ జీవితం ఎలా ఉంటుంది?

దావీదుకున్న అనేకమైన ఆదిక్యతలలో గొప్ప ఆదిక్యత దేవుని తోడును కలిగి ఉండటం. మన జీవితంలో మనం అన్నిటినీ కలిగి ఉండి దేవుని తోడును కలిగి ఉండకపోతే ఆ జీవితము అంత విలువైంది ఏమాత్రం కాదు.

దేవుడు తోడు లేని ఏ వ్యక్తి అయినా ఈ లోకానికి మాత్రమే పరిమితం. దేవుడు మన జీవితంలో మనకు తోడుంటే ఏం జరుగుతుంది?

దేవుని తోడును బట్టి దావీదు సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలము నుండి తాను విడిపించబడి తన గొర్రె పిల్లలను కూడా విడిపించగలిగాడు.

అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొఱ్ఱె పిల్లను ఎత్తికొని పోవుచుండగ. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు, సింహము యొక్క బలము నుండియు, ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. -1 సమూయేలు 17:34-37

దేవుడు యోసేపునకు తోడై ఉన్నప్పుడు, ఆయన బానిసగా ఉన్నప్పటికీ వర్ధిల్లాడు. అతను చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేశాడు.

యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు -ఆదికాండము 39:2,3

దేవుడు ఇష్మాయేలుకు తోడై ఉన్నప్పుడు, తాను తన తండ్రికి దూరమైనా గొప్ప వ్యక్తిగా చేయబడ్డాడు.

దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. -ఆదికాండము 21:20

దేవుడు మనకు తోడై ఉండాలంటే మనము దేవునిని అనుసరించేవారంగా ఉండాలి, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు మనకే మాత్రమూ తోడైయుండడు.

.... మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. -సంఖ్యాకాండము 14:43

దేవుడు మీకు తోడై ఉంటే మీరు మంచిగా చదువుకోగలుగుతారు, మీ రాకపోకల్లో కాపాడబడగలుగుతారు, దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, అన్నిటికి మించి పరలోక రాజ్యమును పొందుకుంటారు.

మనం మరణించినప్పుడు మనకు తోడుగా ఉండేది మనతో పాటు వచ్చేది దేవుడు ఒక్కడే , ఆ దేవుని తోడును మనం ఈ లోకంలో కలిగి ఉండకపోతే మన ప్రాణం కోల్పోయినప్పుడు మన నిత్య నరకానికి వెళ్తాము.

కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండాలని మీరు కోరుకుంటే మీ తప్పిదములు దేవుని ఎదుట ఒప్పుకొనండి, దేవునికి శత్రువులుగా కాక ఆయనకి ఇష్టంగా జీవించండి అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు.

Work book : 

  1. పాఠం పేరు :
  2. వాక్యభాగము
  3. కంఠత వాక్యము :
  4. మనుషులు తోడుగా ఉంటే కలిగే నాలుగు ప్రయోజనాలు ఏంటి? (4)
  5. దేవుని తోడును కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులు వారికి కలిగిన ప్రయోజనాలను ఒక పట్టికగా రాయండి? (4)
  6. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? (5)
  7. దేవుడు మనకు తోడు ఉండకపోతే కలిగే నష్టాలు ఏంటి? (3)
  8. అన్వయము : (2)
  9. క్రింద ఇవ్వబడిన రిఫరెన్స్ లు చదివి దేవుడు ఎవరికి తోడున్నాడో, ఆయన తోడుంటే ఏం జరుగుతుందో, ఒక పట్టికను తయారు చేయండి? (20).
  • ఆదికాండము 31:42 
  • ఆదికాండము 35:3 
  • ఆదికాండము 39:21 
  • న్యాయాధిపతులు 1:19 
  • న్యాయాధిపతులు 2:18 
  • 1 సమూయేలు 3:19 
  • 1 సమూయేలు 18:12 
  • 1 దినవృత్తాంతములు 11:9 
  • యిర్మియా 26:24 
  • అపో.కార్యములు 7:9 
  • అపో.కార్యములు 11:21 

Post a Comment