సృష్టికర్త
బైబిల్ ని తెరవగానే దేవుడు ఏం చేసాడో మనకు కనబడుతుంది, దేవుడు ఉన్నాడన్న విషయంతో బైబిల్ ఆరంభమవుతూ ఆయన కార్యములను మనకు వివరిస్తూ ఉన్నది. దేవుడు సమస్త సృష్టికి సృష్టికికర్తయై ఉన్నాడు, శూన్యములో నుండి దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన వాడుగా ఉన్నాడు.
దేవుడు సృష్టిని కలుగ చేయడానికి ఆరు దినాల సమయం తీసుకుంటే అందులో మొదటి మూడు దినాలు ఒక అస్తిపంజరమును తయారు చేయడానికి కేటాయించాడు. ఆ తర్వాత మూడు దినాలు ఆస్తిపంజరములో మాంసం నింపినట్టుగా నింపే ప్రయత్నం చేశారు.
మొదటి మూడు దినాలు ఆయన వైరుధ్యత కలిగిన వాటిని ఒక ఉద్దేశం కలిగి వేరు చేశారు. మొదటి దినాన వెలుగును చీకటిని, రెండోవ దినాన ఆకాశమును సముద్రమును, మూడోవ దినాన సముద్రమును భూమిని వేరు చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి దినాన వెలుగు, రెండవ దినమున ఆకాశము మరియు సముద్రం, మూడోవ దినమున భూమి, ఆయన కలిగించిన వాటిలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. వీటిని నింపే ప్రయత్నం మిగతా మూడు రోజుల్లో జరిగింది.
నాలుగవ రోజున దేవుడు కలిగించిన సూర్యచంద్ర నక్షత్రాలు వెలుగుకు సంబంధించినవై యున్నవి. రెండవ దినాన దేవుడు కలిగించిన ఆకాశమును సముద్రమును నింపుటకై పక్షులను చేపలను సృష్టించడం జరిగింది. మూడవ దినాన సృజింపబడిన భూమిని నింపుటకై జంతువులు మనుషులు సృజించబడ్డారు. ఈ జంతువులకు మనుషులకు అవసరమైన ఆహారమును, గాలిని ఇవ్వడానికి వృక్షములను దేవుడు మూడోవ దినాన కలిగించాడు.
ఈ వృక్ష సంపద మూడు విభాగాల్లో సృజింపబడింది : గడ్డి, మొక్కలు మరియు చెట్లు . జంతువులలో కూడా మూడు విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి : పెంపుడు జంతువులు, మాంసాహారము కొరకైన జంతువులు, మరియు క్రూర జంతువులు.
దేవుడు వీటన్నిటిని ఒక పద్ధతిలో కలుగజేయడం మనం చూడవచ్చు. ఒక విభాగానికి అవసరమైనటువంటి వాటిని కలిగించకుండా దేవుడు ఆ విభాగాన్ని ఉనికిలోకి తీసుకురాలేదు, ఉదాహరణకు మనిషికి అవసరమైన ప్రతి ఒకటి కలిగించే వరకు మనిషిని దేవుడు సృజించలేదు.
ఒక్క మనిషిని తప్ప దేవుడు సమస్తాన్ని తన నోటి మాటతో కలుగజేసాడు, అయితే మనిషిని మాత్రం నేలమంటితో నిర్మించి నాసికా రంద్రములలో జీవ వాయువును ఊదాడు. దేవుడు స్త్రీ పురుషులుగా మనుషులను సృజించాడు, ఆదామును కలుగజేసిన తర్వాత అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ఆదాముకు సాటియైన సహాయము అవసరమని, ఆయన అడగకుండానే తనకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి, ఆ ఖాళీని మాంసంతో పూడ్చి వేసి, ఆ ఎముకతో స్త్రీని నిర్మించి ఆదాముకు జత చేశాడు.
అంతేకాదు కేవలం మనిషితో మాత్రమే తన స్వరూపాన్ని ఆయన పంచుకున్నాడు, మనిషికి ఈ సృష్టి అంతటిని అప్పగించాడు, మనిషిని ఈ సృష్టినంతటికి అధికారినిగా చేశాడు. వీరిద్దరి కొరకు ఒక తోటను ఏర్పాటు చేసి దానిని సేద్యపరిచి కాచే పనిని అప్పగించాడు. తోటని తడుపుటకు అవసరమైన నాలుగు నదులను ఏర్పాటు చేశారు. ప్రతి చల్లపూట దేవుడు ఆదాము హవ్వలతో నడుస్తూ మంచి చెడ్డలు తెలియపరుస్తూ చక్కని సహవాసమును వారితో కలిగి ఉన్నాడు.
ఈ వృత్తాంతమంతటిలో దేవుడు శక్తి గలవాడుగా, జ్ఞానవంతునిగా, ప్రేమగలవాడుగా మనకు పరిచయం అవుతున్నాడు. సృష్టిని కలుగజేయటంలో ఆయనకున్న శక్తి, సృష్టిని క్రమముగా ఏర్పాటు చేయడంలో ఆయనకు ఉన్న జ్ఞానం, తన స్వరూపాన్ని పంచుకొని మానవుని యొక్క అవసరాలను పట్టించుకున్న విధానంలో ఆయన ప్రేమ మనకు కనబడుతున్నది. కాబట్టి దేవుని ప్రేమను గ్రహించి, దేవుని జ్ఞానమును పొంది దేవుని శక్తిని అనుభవిస్తూ దేవుని ఎరుగని ప్రతి ఒక్కరికి దానిని కనపరుద్దాం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి