ఆజ్ఞను చులకనగా భావించిన హవ్వ


ఆజ్ఞను చులకనగా భావించిన హవ్వ
Eve - Part 2

ఆజ్ఞను చులకనగా భావించిన హవ్వ

    అపవాదికి మనము చోటు ఇచ్చినప్పుడు తాను మనతో మెల్లగా సంభాషించడం ప్రారంభిస్తాడు. ఈ సంభాషణలు ఎంతో అమాయకంగా, మనలను చిక్కించుకోవడానికి వేసిన ప్రణాళికలుగా కూడా ఉంటాయి. దేవుని ప్రణాళికను చెడగొట్టాలని యోచించిన సాతాను, బలహీన ఘటమైన హవ్వను కేంద్రంగా చేసుకొని తాను ఒంటరిగా దొరికిన సమయంలో తన ప్రణాళికను అమలుపరుస్తూ ఒక సర్పమును ఉపయోగించుకొని హవ్వతో మాట్లాడటం ప్రారంభించాడు.

    సాతాను ఏదైనా ఒక జంతువును కానీ మనిషిని గాని ఆవహించి తన పనిని తాను నెరవేర్చుకొనగలడు, అయితే పరిశుద్ధాత్ముడు కేవలం మనుషులలో మాత్రమే నివసిస్తాడు. ఇక్కడ సర్పం మాట్లాడ్డాన్ని మనం వింతగా భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గాడిద మాట్లాడిన సందర్భం కూడా బైబిల్ లో ఉన్నది.

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. -ఆదికాండము 3:1

    పాము మంచిదే, యుక్తి గలది అంటే కూడా తెలివైనది అని మాత్రమే అర్థం, స్వతహాగా అది చెడ్డది కాదు, సాతాను చేత మాత్రమే ఉపయోగించుకొనబడింది.

 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. -ఆదికాండము 1:31

    ఇక్కడ సర్పం మాట్లాడడం హవ్వకు వింతగా తోచిందా? అందుకే తాను తన సంభాషణను కొనసాగించిందా? సర్పం ద్వారా సాతాను హవ్వతో మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే " మీరు ఈ తోటలో ఏ చెట్టు పండును కూడా తినకూడదు అంట కదా" అని అడిగినట్టుగా ఉన్నది. 

    అసలు హవ్వ సాతానుకు సమాధానం ఇవ్వడమే పెద్ద తప్పు అని, అక్కడే ఆమె పతనం ప్రారంభమయ్యిందని కొంత మంది పండితులు భావిస్తున్నారు. దీనిని గూర్చి ఆలోచిస్తే నిజమేనేమో అని అనిపిస్తున్నది. సాతానుతో మనము సంభాషించవలసిన అవసరములేదు, వాడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకనగా సాతాను మోసగాడు అబద్ధికుడు, మనలను ఏదో ఒక రీతిలో చిక్కించుకోవడానికి లేనిపోని విషయాలు మన ఎదుట పెట్టేవాడుగా ఉంటాడు కనుక జాగ్రత్త వహించవలసి ఉన్నది.

మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వాని యందు సత్యమే లేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. -యోహాను 8:44

    ఇక్కడ హవ్వ సాతానుకు ఇచ్చిన సమాధానమును తెలుసుకొనుటకు ముందుగా ఈ రెండు వాక్యభాగములు పరిశీలించి చూడండి.

మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. -ఆదికాండము 2:16,17
 అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్య వున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. -ఆదికాండము 3:2,3

    ఆది. 2:16,17 దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గురించి తెలియజేస్తే, ఆది. 3:2,3 హవ్వ దానిని తెలియపరచిన విధానమును వివరిస్తున్నది.   ఈ క్రమంలో హవ్వ........ 

ఆజ్ఞను కుదించింది

    ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని దేవుడు చెబితే, ఈమె "ప్రతి, నిరభ్యంతరముగా" అనే పదాలు తీసివేసింది. ఇది దేవుని వాక్యము నుండి కొంత తీసివేయడం అవుతుంది. దేవుని వాక్యము నుండి దేన్నైనా తీసివేయడం ద్వారా అది సమస్యలకు దారితీస్తుంది.

ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును. -ప్రకటన గ్రంథం 22:19

    దేవుని ఆజ్ఞలను కుదించడం ద్వారా ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన మంచి వాటిలో కొన్నిటిని పోగొట్టుకునేవారంగా వాటికి దూరమయ్యేవారంగా ఉంటాము. ఇది కొన్నిసార్లు చేయడం ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు ఉన్న తీవ్రతను తగ్గించడం చేసిన వారమవుతాము. పైగా ఇలా చేయకూడదని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు.

మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. -ద్వితియోపదేశకాండము 4:2

    దేవుని ఆజ్ఞలలో నుండి కొన్నిటిని తీసివేయడం ద్వారా ఆయన మంచితనమును సరిగా అర్థం చేసుకోలేని వారమవుతాం అనే భావనను మీరంగీకరిస్తున్నారా? దేవుని ఆజ్ఞలను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి, అప్పుడు దేవుని మంచితనాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు.

    దేవుని మంచితనాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకుండా ఆయన ఆజ్ఞలలో నుండి కొన్నిటిని తీసివేసే ప్రయత్నం చేస్తూ " చ! క్రైస్తవురాలు అయినందుకు నేను దీనిని అనుభవించలేకపోతున్నానే " అనే భావనలోనికి మీరు వెళ్ళినట్లయితే సాతాను చాలా తేలికగా మిమ్ములను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు హవ్వ ఈ క్రమంలో…

ఆజ్ఞకు కలిపి కఠినము చేసింది.

    హవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞలకు కొంత కలిపింది. దేవుడు "ముట్ట వద్దు" అని చెప్పలేదు, ఈమె ఆ మాటను చేర్చింది. కొన్ని మాటలకు మనం కొన్ని మాటలు కలిపినప్పుడు ఆ మాటలకు ఉన్న మొదటి అర్థమే మారిపోతుంది. ఈ కారణం చేతనే లేని విషయాలు పుట్టించబడతాయి, తర్వాత కొన్నిసార్లు కొండేములుగా కూడా మారిపోతాయి.

    హవ్వ ఇలా కలపడం ద్వారా దేవుని ఆజ్ఞను మరింత కఠినం చేసింది, ఇలా చేయడం ద్వారా దేవునిని ఒక క్రూరునిగా, ఇతరులను బాధపెట్టి తాను ఆనందించేవాన్నిగా చూపించడం అవుతుంది. 

    ఈ విషయాన్ని మరింత లోతుగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి మీద గొప్ప బాధ్యత ఉన్నది. వాస్తవానికి ఈ ఆజ్ఞ ఆదాముకు ఇవ్వబడింది, ఆదాము దాన్ని హవ్వకు తెలియజెప్పి ఉంటాడు, దీనిని మీరు అంగీకరిస్తే హవ్వ ఇలా మాట్లాడడానికి ఆదాము కూడా ఒక కారణమని మనం భావించవచ్చు (కొంతమంది ఆ ఆజ్ఞ ఇద్దరు కలసి ఉన్నప్పుడు ఇవ్వబడింది అని నమ్ముతారు). 

ఆదాము దానిని గూర్చి వివరించిన తీరును బట్టి, హవ్వ అలా మారిందా? లేదా హవ్వ అర్థం చేసుకోవడంలో లోపమేమైనా ఉన్నదా?? ఏది ఏమైనా బోధకులైనవారు దేవుని వాక్యమునకు దేవుడు చెప్పనివి కలిపి అది పాటించుటకు వీలులేనంత కఠినతరము చేయకూడదు.

మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. -మత్తయి 23:4

    "ఆదివారం 10 గంటల్లోపుగా దేవుని మందిరంలో మీరు ఉండాలి " అని చెబితే దాని అర్థం ఆరాధనకు అసలు రావద్దని కాదు 10 గంటల లోపుగా రమ్మని అర్థం. హవ్వ ఇలా దేవుని వాక్యానికి కలిపిన విధానాన్ని కొంతమంది సమర్థిస్తూ దాని విషయంలో కఠినంగా ఉండాలన్న విధానాన్ని బట్టి అలా చెప్పి ఉండొచ్చు అని భావిస్తుంటారు, అయితే దీనికి కొంత మంది యూదా పండితులు చెప్పే సమాధానం ఏంటంటే తాను ఎప్పుడైతే ముట్టకూడదు అనే మాటను చేర్చిందో, వెంటనే సాతాను ఆమెను చెట్టు మీదికి త్రోసినట్టుగా " చూడు నువ్వు ఇప్పుడు దాన్ని ముట్టుకున్నావ్? అయినా నువ్వు చావలేదు, కాబట్టి నీవు పండు తిన్న చావవు " అని పాపమునకు ప్రోత్సహించినట్లుగా తెలియపరిచారు.

    ఏది ఏమైనా దేవుని వాక్యమునకు కొన్ని విషయాలు కలిపి వాక్యములోని అసలు అర్థము పోగొట్టుకుని దేవునిని క్రూరునిగా భావించే ప్రక్రియలోనికి పడిపోకుండా జాగ్రత్త పడదాం. అంతేకాదు హవ్వ ఇలా చెప్పడంలో....

ఆజ్ఞను చులకనగా భావించింది.

    "నిశ్చయంగా చచ్చేదవు" అని దేవుడు చెప్పిన మాటను " చావకుండునట్లు" అని తేలికగా మార్చేసింది, అంతేకాదు యెహోవా అనే పదమును వాడకుండా సాతాను వలే దేవుడు అనే పదాన్ని ఉపయోగించింది. యెహోవా అనే పదము దేవునితో నిబంధన కలిగిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించే పదం. చస్తామంటా అన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నది, నిశ్చయముగా చస్తాము అనే విషయము ఆమెకు అర్థం కాలేదు.

    దేవుని ఆజ్ఞలను మీరు ఏ విధంగా భావిస్తున్నారు? దేవుని వాక్యాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దేవునిని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దేవుని ఆజ్ఞలను లెక్కలో లేనట్లుగా చూడవద్దు, వాటికి విలువనివ్వండి, అందులో చెప్పబడిన విషయాలను వాస్తవమని అంగీకరించండి, దాని ద్వారా మేలును పొందగలిగే వారముగా ఉంటాము.

    దేవుడు మంచివాడు, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మన మేలును ఉద్దేశించినదై ఉన్నది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 

మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. -1 యోహాను 5:3

    దేవుడు నీ ఆనందాన్ని కోరుకునేవాడు గాని నిన్ను బాధపెట్టి ఆయన ఆనందించేవాడు కాదు. మేలుకరమైనదేది, న్యాయబద్ధమైనదేది నీకు దూరం చేయాలనేది ఆయన ఆలోచన కాదు. న్యాయబద్ధమైన ఆనందాలన్నిటిలో వేటికి దేవుడు నిన్ను దూరం చేయలేదు, కాబట్టి దేవునిని ఆయన ఆజ్ఞలను సరిగా అర్థం చేసుకుందాం, ఆయన ఆజ్ఞలకు కలపక తీసివేయక, చులకనగా భావించక ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తూ దేవుడి దీవెనలు పొందుకుందాం. అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్.

- Rephidim Ministries

1 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి