అపవాదికి చోటిచ్చిన హవ్వ
ఆదామును చూడగానే అతనికి ఏదో తక్కువైనట్టుగా దేవునికి అనిపించింది, ఇతను ఒంటరిగా ఉన్నాడు అది మంచిది కాదు, ఈయనకు సహకారంగా ఒక వ్యక్తిని కలుగ చేస్తాను అని దేవుడు అనుకొని, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి, ఒక స్త్రీని నిర్మించి ఆదాముకు తోడు చేశాడు. ఆ స్త్రీ పేరే హవ్వ. హవ్వ అనగా జీవము, జీవమిచ్చున్నది అని అర్థం. ఈమె దేవుని చేత సృజింపబడిన రెండవ మనిషి, మొదటి స్త్రీ, మొదటి భార్య, మొదటి తల్లి. మరి ఆమె ఒక స్త్రీగా, భార్యగా, తల్లిగా ఎలా ఉన్నదో చూద్దాం!
స్త్రీ గా :
ఆదాము హవ్వలు ఇద్దరూ ఏదేను తోటలో ఉంటూ ఉండగా, తోటను మొత్తాన్ని దేవుడు వారికి అప్పగించి, దాన్ని కాచుటకు బాధ్యతనిచ్చి దానిని అనుభవించుటకు అవకాశం ఇచ్చాడు. అయితే వారికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, తోటలోని ప్రతి చెట్టు పండును తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పండు జోలికి వెళ్ళద్దు అన్నాడు, దాన్ని తింటే మీరు మరణిస్తారు అని చెప్పడం జరిగింది.
అపవాదికి చోటు ఇచ్చింది
ఆనాటి నుండి ఆ పండు జోలికి వెళ్లకుండా ఆదాము హవ్వలు జాగ్రత్త తీసుకున్నారా? లేదా దానిపై ఆశను పెంచుకున్నవారుగా ఉన్నారా? కొంతమంది పండితుల ఉద్దేశం ప్రకారం దేవుడు ఆ పండును తినవద్దని చెప్పిన తర్వాత ఎందుకు దేవుడు ఆ పండును తినవద్దన్నాడు అని, దానిని గూర్చి ఆలోచిస్తూ హవ్వ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా తెలియజేశారు.
తోట మధ్య వున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు......-ఆదికాండము 3:3
హవ్వ ఇక్కడ మధ్యలో ఉన్న చెట్టు గురించి మాట్లాడుటను బట్టి, తన దృష్టంతా ఆ చెట్టు మీదనే కేంద్రీకృతమై ఉన్నదని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమని మన అంగీకరిస్తే మనం ఇక్కడ ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు.
దేవుడు వద్దని చెప్పిన వాటి విషయంలో మన మనసుకు హద్దులు నియమించుకోకపోతే ఖచ్చితంగా అపవాది మనలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. దీనినే అపవాదికి చోటివ్వడం అనవచ్చు. అపవాదికి చోటు ఇవ్వవద్దు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది
అపవాదికి చోటియ్యకుడి; -ఎఫెసీయులకు 4:27
అపవాదికి మనము ఎప్పుడూ చోటిచ్చే వారంగా ఉంటాము?
ఒంటరితనం :
ఖచ్చితంగా మన ఒంటరితనం దానికి కారణం. ఒంటరిగా మనం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే తుంటరి పనులన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది.
హవ్వ ఇక్కడ ఒంటరిగా ఉన్నదా? ఆదాము దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలో తీరిక లేకుండా ఉంటే, తనతో కలిసి ఆ పనిలో భాగం పంచుకోవలసిన హవ్వ ఒంటరిగా ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ దాని అందమును గూర్చి దేవుడు విధించిన షరతును గూర్చి ఆలోచిస్తూ గడిపిందా? కొంతమంది పండితులు అవుననే చెప్తున్నారు.
ఒంటరితనాన్ని సరిగా సద్వినియోగపరుచుకుంటే అద్భుతాలే సృష్టించబడతాయి, కానీ అదే ఒంటరితనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోకపోతే అది మన వినాశనానికి కారణం అవుతుందని గ్రహించాలి.
ఒంటరిగా ఉన్నప్పుడు మీలో కలిగే ఆలోచనను జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని పరిస్థితులు ద్వారా భర్తకు దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తే మీ ఆలోచన ద్వారా క్రియల ద్వారా అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త వహించండి.
దురాలోచనలు :
ఒంటరిగా ఉండి దురాలోచనలు రేపుకునే వారి కోసం సాతాను ఎదురుచూస్తూ ఉంటాడు, దేవుడు వద్దన్న వాటి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, వాటిని తాకాలని రుచి చూడాలని ఆశిస్తూ ఉంటారో, సాతాను వారి మీద తన దృష్టిని నిలుపుతాడు. మంచి ఆలోచనలు చేయని వారి మీద సాతానుకు ఆశ కలుగుతుంది, వారిని బంధించడానికి బానిసలుగా చేసుకోవడానికి ఇక అక్కడి నుండి ప్రణాళికలు రచించడం ప్రారంభిస్తాడు.
.............. సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును........... -ఆదికాండము 4:7
మనం అవకాశం ఇచ్చిన దానిని బట్టి ఒక వ్యక్తి మనతో మాట్లాడగలుగుతాడు, మనం అవకాశం ఇచ్చిన దాన్నిబట్టే ఒక వ్యక్తి మనకు దగ్గరగా రాగలుగుతాడు, మన ఆలోచనల ద్వారా మనం అవకాశం ఇవ్వకపోతే సాతాను మనలను దరిచేరలేడు.
హవ్వ దేవుడు వద్దన్న వాటిని గూర్చి ఆలోచిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నది కనుక సాతాను ఆమెతో సంభాషణను ప్రారంభించాడు. ఒకవేళ తాను తన భర్తతో కలిసి ఉండి దేవుడు తమకు అప్పగించిన పనిని జరిగిస్తూ కొనసాగినట్లయితే, ఒంటరిగా తాను ఉండక దురాలోచనకు తావు ఇవ్వక ఉన్నట్లయితే సాతాను శోధనను తప్పించుకోగలిగేదేమో. జంటగా ఉండుట ద్వారా శోధనను సునాయాసంగా జయించగలిగే అవకాశం ఉంటుంది. దురాలోచనలు మనలను సాతాను శిబిరంలోనికి ప్రవేశపడతాయి. పాపమే లేని వాతావరణంలో హవ్వ శోధించబడింది అంటే చెడిపోయిన లోకంలో జీవిస్తున్న మనము మరి ఎక్కువగా శోధించబడడానికి పడిపోవడానికి అవకాశం ఉన్నది, కనుక జాగ్రత్త తీసుకుందాం.
ఆత్రుత :
దేవుడు కొన్ని మనకు దూరం చేసినప్పుడు, వద్దని చెప్పినప్పుడు ఎందుకు దూరం చేశాడో తెలుసుకోవాలనుకోవడం, ఎందుకు వద్దన్నాడో తెలుసుకోవాలనుకోవడం, ఆయన వద్దన్నవి ఎలా ఉంటావో తెలుసుకోవాలనుకోవడం ద్వారా కూడా మనము అపవాదికి చోటిచ్చిన వారమవుతాం. హవ్వకు ఇక్కడ ఆ పండును గూర్చి ఉన్న ఆత్రుత, తనను ఆ చెట్టుకు దగ్గరగా చేర్చింది అని చెప్పవచ్చు.
నీ ఆత్రుతను బట్టి నీవు అపవాదికి చోటిస్తున్నావేమో ఆలోచించు! దేవుడు నిషేధించిన వాటిని గురించి ఆత్రుతను పెంచుకోవద్దు. కొన్నిసార్లు కొన్నిటిని మనం దగ్గరగా పరిశోధన చేయాలనే ఆత్రుత కూడా మనలను అపరాధంలో పడవేస్తుంది.
దురాశ :
న్యాయబద్ధము కానీ ఆశలన్నీ దురాశలే. మన చర్యలు మన ఆశలను వ్యక్తపరుస్తాయి. హవ్వకు దురాశ లోపల ఉన్నది గాని దేవుని ఆజ్ఞ ఆమెను ఆపింది. నిజంగా ఆమెకు దురాశ లేకపోతే ఆ చెట్టుకు దగ్గరగా ఆమె ఎందుకు వచ్చినట్టు?
దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. -సామెతలు 4:15
ఒంటరితనం, దురాలోచనలు, దురాశలు, వ్యర్ధమైన ఆత్రుతలు మనం అపవాదికి చోటిచ్చే విధంగా చేస్తాయి. ఈ మాటలు నిజమని నువ్వు అంగీకరిస్తున్నావా? గతంలో నీ జీవితంలో ఈ నాలుగు అంశాలను బట్టి అపవాదికి చోటిచ్చిన అనుభవం ఉంటే, దానిని బట్టి పశ్చాతాపపడి ఇంకెన్నడు ఆ రీతిగా చేయకుండా ఉండుటకు జాగ్రత్త తీసుకోండి. ఇంతకుముందు ఎన్నడూ మీరు ఈ అంశాల గుండా వెళ్లకపోయినట్లయితే ఈ అంశాల్లో ఒక వ్యక్తి సాతానుకు ఏ విధంగా చోటిస్తారో ఆలోచించి దానిని మీ జీవితంతో పోల్చి చూస్తూ, అపవాదిని జయించుటకు మీరు తీసుకున్న ఆచరణాత్మకమైన నాలుగు తీర్మానాలను మీ డైరీలో రాసుకొని వాటి ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని దేవుని వేడుకొనండి.
అపవాది చేత జయింపబడి మీ జీవితాలను కుటుంబాలను నరకప్రాయంగా మార్చుకొనక, అపవాదిని జయించి ఆశీర్వాదకరంగా నిలుచు భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమెన్.

హవ్వను గురించి చక్కగా వివరించారు..
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి