బుద్ధిహీనురాలు వలె మాట్లాడిన శారా
అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను - ఆదికాండము 16:5
శారా తన భర్తను శోధించి హాగరుతో వివాహానికి ఒప్పించింది, హాగరుతో వివాహం తర్వాత ఆమె గర్భవతైంది. హాగరు గర్భవతైనది మొదలుకొని శారాకు సమస్యలు ఎక్కువైపోయాయి.
హాగరు శారాను నీచంగా చూడడం ప్రారంభించింది, దానిని శారా ఏమాత్రం ఓర్చుకోలేక కొన్ని మాటలు మాట్లాడింది.
ఆమె మాట్లాడిన మాటలను గమనిస్తే ఆమె ఎంత బుద్ధిహీనురాలో మనం అర్థం చేసుకోవచ్చు.
చాలాసార్లు మన జీవితాల్లో తప్పు మనం చేసి దానికి కారణం ఇంకెవరో అన్నట్టు మాట్లాడుతాము, ఇక్కడ శారా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
తన బుద్ధిహీనతను ఒప్పుకోలేకపోయింది
అయ్యో నేను ఎంత బుద్ధిహీనంగా ఆలోచించాను అని శారా బాధపడటం లేదు, తాను ఒక తెలివైన పనిచేసాను అనే భావంలోనే ఉన్నట్టుగా ఉంది. ఆమెలో ఉన్న గర్వం, ఆమె అనుభవిస్తున్న సమస్యను బట్టి కలిగిన కోపం, ఆమె యొక్క ఆలోచనలను మూసివేసాయని కూడా చెప్పవచ్చు.
శారా నీచమైనదిగా హాగరు చేత చూడబడడానికి, కారణం ఎవరు? శారా కాదా?
ఆమె ద్వారా కుమారుని కనాలను ఉద్దేశం ఎవరిది శారాది కాదా? బహుశా శారా పిల్లల గురించి మాత్రమే ఆలోచించి ఉంటుంది కానీ ఈ హాగరు ప్రవర్తించే విధానాన్ని అంచనా వేయలేకపోయి ఉండొచ్చు.
ఖచ్చితంగా మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో ఫలితాలు మనం అంచనా వేయగలం కొన్నిసార్లు మనం అనుకున్న దాని కంటే భిన్నమైన ఫలితాలు వస్తాయి మరి ముఖ్యంగా మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అలాంటి ఫలితాలను అనుమతించేవాడుగా ఉంటాడు.
మనం చేసిన ఒక పని, మనం అనుకున్న ఫలితాలకు భిన్నమైన ఫలితాలు ఇచ్చినప్పుడు, అలాంటి ఫలితాలను చూడాల్సి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం?
శారా వలెనే ప్రవర్తిస్తున్నామా? అయ్యో నేను బుద్ధిహీనమైన పని చేశాను అని ఒప్పుకుంటున్నామా? లేదా నేను బాగానే చేశాను అని సమర్ధించుకునేటువంటి విధానాల్లో కొనసాగుతున్నామా? ఈ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి.
మన యొక్క బుద్ధిహీనతను మనం అంగీకరించాలి, మన బుద్ధిహీనుతను మనం అంగీకరిస్తే మనం తక్కువగా చూడబడతాము అని భావించి బహుశా శారా వలె అంగీకరించడానికి మనం ఇష్టపడకపోతే సమస్యకు పరిష్కారం దొరకకుపోగా ఇంకా ఇబ్బందులు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి
మన బుద్ధిహీనతను మనము అంగీకరించి దాని విషయమై దేవుని ఎదుట పడితే క్షమాపణ కోరుకుంటే దేవుడు కచ్చితంగా పరిస్థితులను మారుస్తాడు తనదైన శైలిలో మనకు చేయగలిగినమేలును పరిష్కారాన్ని చూపిస్తాడు.
అనవసరంగా భర్త మీద నింద మోపింది
శారా తన తప్పును తన అంగీకరించకపోగా తప్పంతా తన భర్తదే అని మాట్లాడింది. నా ఉసురు నీకు తగులును అనే ఈ మాటను గమనిస్తే నేను అనుభవిస్తున్న కష్టమంతటికి కారణం నువ్వే అనే భావాన్ని మనం గమనించవచ్చు.
శారా తన మాటల్లో దానిని వివరించింది, నేనే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను, కానీ నువ్వేం చేసావో చూడు! ఇప్పుడు ఆ హాగరు అలా ప్రవర్తిస్తుంది అంటే కారణం నువ్వే కదా! అని శారా అబ్రహాముతో మాట్లాడుతున్నది.
వివాహం చేసుకోవాలన్నది అబ్రహాము ఆలోచన కాదు, హాగరు ద్వారా పిల్లలను కనాలన్నది అబ్రహాము ఆలోచన కాదు ఈ భాగంలో అబ్రహాము చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది శారా మాటకి తలవంచడమే.
అబ్రహాముకు మరో వివాహం చేయాలని హాగరుకు పుట్టిన బిడ్డను తన బిడ్డ అని పిలుచుకోవాలని దాని ద్వారా ఒక రకంగా దేవుని వాగ్దానం నెరవేర్చాలని ఇలా ఓ పెద్ద పథకం వేసిన స్త్రీ శారా.
కానీ ఇప్పుడు మాత్రం తన భర్తను నిందిస్తున్నది విచిత్రం ఏంటంటే శారా కోరుకున్నవన్ని జరిగాయి కానీ తాను ఊహించనది కోరుకొననది హాగరు చేత నీచముగా చూడబడే పరిస్థితి రాగానే తను తట్టుకోలేకపోయింది.
తప్పు మొత్తం భర్త మీదకి తోసేసింది. ఈ శారా వంటి మహా జ్ఞానవంతురాలు ఇప్పటికీ మన కుటుంబాల్లో కనబడుతూ ఉంటారు, మనం చాలా సార్లు అంతే మహా జ్ఞానంగా ప్రవర్తించి ఉంటాం కదా.
శారా కంటే ఇంకా గొప్ప గొప్ప పథకాలు కూడా రచిస్తూ ఉంటాం. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడించడం, రాజకీయ ఎత్తుగడలు, కుటుంబ స్థాయిలో చాలానే చేస్తూ ఉంటాం. అబ్బా, నేను భలే పని చేశాను అనుకుంటాము కానీ ఊహించని ఫలితం వచ్చినప్పుడు మాత్రం నా పథకం మంచిదే కానీ నువ్వు అమలు చేసే విధానమే బాగాలేదు అన్నట్టుగా మాట్లాడుతాము.
నీకే చేతకాలేదన్నట్టుగా భర్త గాని పిల్లలు గాని ఎవరు ఉంటే వారి మీదకు దాన్ని తోసేస్తాం. ఆ పథకం చెడిపోయిన రోజున కారణం వాళ్లేనని మాట్లాడుతాము . చెడంతటికీ మూలం వారేనని నిందిస్తాం.
అబ్రాహాము తప్పు ఇక్కడ ఏమీ లేకపోయినప్పటికీ శారా ఆయనను నిందించింది. మనం మన జీవితంలో తప్పు మనదైతే దానికి ఇతరులను నిందిస్తున్నామా? సమస్య మనదైతే దానికి కారణం ఇంకెవరో అని చెప్తున్నామా?
మంచి జరిగితే దానికి కారణం నువ్వు అని చెప్పుకుంటూ చెడు జరిగితే ఇంకెవరో కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నావా? దేవుని కృపను బట్టి ఈ లక్షణాన్ని మనలో నుంచి తీసి వేసుకుందాము! మన తప్పులు అంగీకరించడానికి ఇష్టపడదాము!!
దేవుడు న్యాయం చెప్పాలని కోరుతున్నది
చాలాసార్లు మనము ఇతరులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వము. మౌనంగా ఉండు నేను చెప్పేది విను అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. శారా కూడా కేవలం తనొక్కతే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది .
అబ్రహము మాట్లాడడానికి అసలు అవకాశం ఇవ్వలేదని చెప్పొచ్చు. అబ్రహాము తన సమస్యను విననట్టుగా, తనకు పరిష్కారం చూపనట్టుగా శారా భావించి దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు అని మాట్లాడుతున్నది.
అబ్రహము ఇక్కడ న్యాయం చెప్పకపోతే అప్పుడు శారా ఆ మాట అనాలి కానీ శారా మనసులో తప్పంతా అబ్రహాముదే అనే భావం ఉంది గనుక నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు మన ఇద్దరికీ తగిన న్యాయం తీరుస్తాడని ఆమె భావిస్తూ మాట్లాడుతున్నది.
ఈ మాటలు చాలా సందర్భాల్లో నవ్వు తెప్పించే మాటలుగా ఉంటాయి. తప్పు చేసిన ఒక వ్యక్తి ఏ తప్పు చేయని వ్యక్తి వైపు చూసి నాకు దేవుడు ఉన్నాడు నీ విషయంలో నాకు న్యాయం చేస్తాడు అని మాట్లాడుతుంటారు.
నిజంగా ఆలోచిస్తే దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు అని మాట్లాడే వాళ్ళల్లో దేవుని ఎదుట సరైన ప్రవర్తన లేని వారే ముందు వరుసలో ఉంటారని మాథ్యూ హెన్రీ అనే వ్యాఖ్యత అభిప్రాయపడ్డాడు.
ముందు వెనక ఆలోచించకుండా దేవుని న్యాయమును కోరుకునే చాలామంది ఆయన ఎదుట దోషులుగా, వారు కోరుకునే న్యాయం దురుద్దేశాలతో కూడినదిగా ఉంటుంది.
మనం కూడా ఇలా మాట్లాడుతున్నామా? దేవుడే నిజంగా చాలా ఇక్కడ న్యాయం తీరిస్తే ఆమె బుద్ధిహీనమైన పథకానికి, అవిశ్వాసానికి, అసహనానికి, అపార్ధానికి, బుద్ధిహీనమైన మాటలకి, భర్త మీద నింద మోపిన విధానానికి న్యాయం తీర్చాలి.
వీటన్నిటిలో శారాకు దక్కే ఫలితం ఏంటి మంచి అయితే కాదు కదా.
ముగింపు :
కాబట్టి గర్వమును విడిచి, బుద్ధిహీనమైన మాటలు మాని, ఇతరులను నిందించక, తగ్గింపు కలిగి, మన యొక్క తప్పిదాలను అంగీకరిస్తూ, సరి చేసుకుంటూ, దేవుని ప్రేమ మన మీద కనబరచబడాలని కోరుకునేవారంగా ఉందాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి