వివిధ రకాలు ప్రసంగాల పరిచయం/An Introduction to Types of Sermons by R. Samuel

వివిధ రకాలు ప్రసంగాల పరిచయం/An Introduction to Types of Sermons by R. Samuel


వివిధ రకాలు ప్రసంగాల పరిచయం

    క్రీస్తునందు ప్రియమైన మీకందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? రెఫీదిమ్ మినిస్ట్రీస్ నుండి వ్యాసముల ద్వారా, వీడియో, ఆడియోల ద్వారా అందించబడుతున్న దేవుని వాక్య సత్యములు విని దీవించబడుతున్నారా? దేవుని వాక్యమును బట్టి మీరు బలపరచబడితే దానిని మాకు తెలియపరచండి, మేము కూడా ప్రభువు చేసిన కార్యములను బట్టి ఆయనను స్తుతిస్తాము.

    గతంలో ఒక యవ్వనస్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రసంగమును ఎలా సిద్దపరచుకోవాలి అనే అంశం మీద ఒక ఆడియో చేసాను. దానిని మీరు చాలా చక్కగా ఆదరించారు వందనాలు. అయితే అది విన్న తర్వాత ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానముగా దీనిని మీకు అందిస్తున్నాను. 

    నేను సమాధానం ఇవ్వడం చాలా ఆలస్యం అయ్యింది, దయ చేసి క్షమించండి. మా ప్రశ్న ఇంకా నేను సమాధానం ఇవ్వలేదు అని అనుకుంటున్నవారందరికి కూడా క్షమాపణ చెబుతున్నాను, మీరు అడిగిన ప్రతి ప్రశ్న నా దగ్గర ఉన్నది, మెల్లిగా ఒక్కో దానికి సమాధానం ఇస్తాను. అంతే కాదు ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్న అంశాల గురించి కూడా తెలియజేయండి, తగిన సమయంలో సమాధానం ఇస్తాను. నాకున్న పరిచర్య భారమును బట్టి ఆలస్యం జరుగుతూ ఉంటుంది, అర్థం చేసుకోండి, మా కొరకు ప్రార్ధన చేయండి.

    ఇక విషయానికి వస్తే ప్రసంగించడం అనేది ఒక కళ. క్రైస్తవుని విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలలో ప్రసంగించవలసియున్నది అని చెప్పాలి. అయితే ప్రతి ప్రసంగీకుడు ఈ రెండు అంశాల మీద చక్కని పట్టు కలిగియుండాలి. 

    ఆ రెండు ఏమిటంటే Hermeneutics and Homiletics. 

  • బైబిల్ ను ఎలా అర్థం చేసుకోవాలి అనేది Hermeneutics
  • దానిని ఎలా చెప్పాలి అనేది Homiletics. వీటి గురించి ప్రత్యేకముగా ఇంకోసారి మాట్లాడుకుందాం.

    ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే…అసలు ప్రసంగాలు ఎన్ని రకాలు ఉన్నాయి. దీనికి మీకు చాలా సమాధానాలు వినబడతాయి. Gerald Rowlands గారు {1}  కాపరి దుడ్డు కర్ర అనే పుస్తకం లో చెప్పిన దానిని బట్టి చూస్తే అవి ఏడు రకాలు అని చెప్పొచ్చు.

1. Textual - పాఠ్యభాగ ప్రసంగం

  • ఇక్కడ ప్రసంగీకుడు కేవలం ఒక్క వచనం మాత్రమే తీసుకొని దానిని విశ్లేషించడం జరుగుతుంది.

2. Topical - అంశ ప్రధాన ప్రసంగం

    ఇక్కడ అంశం అనేది ప్రధానం. పాఠ్యభాగ ప్రసంగం వలె ఒక్క వచనముకు ఇది పరిమితం కాదు. ఏదో ఒక అంశమును ఎంచుకొని దానికి సంబందించిన వచనాలు ఒక చేర్చి ఇక్కడ బోధించడం జరుగుతుంది (ఉదాహరణ : ప్రేమ, న్యాయం). 

    ఎక్కువ మంది ప్రసంగీకులు దీనిని ఇష్టపడుతుంటారు. వీరికి సహకారముగా చాలా పుస్తకాలు రచించబడ్డాయి, మా నాన్న గారు కూడా ఈ మధ్య ఇలాంటి పుస్తకం ఒకటి తయారు చేసారు, కావాల్సిన వారు తెప్పించుకొని చదవండి. ప్రస్తుత కాలంలో చాలా యాప్స్ కూడా వీరికి సహకారముగా వచ్చాయి. వీరికి చాలా ముఖ్యమైన ఆయుధం బైబిల్ పదకోశం.

3. Typical - సాదృశ్య ప్రసంగం

    ఇక్కడ పాత నిబంధన లోని కొన్ని విషయాలును తీసుకోని వాటి నేరవేర్పులను పోల్చుతూ ఉంటారు. ఇక్కడ సాదృశ్యమనేది, ఒక వ్యక్తి, స్థలము, సంఘటన, అంశము, ఇలా ఏదైనా కావొచ్చు. పాత నిబంధన లో చాలా విషయాలు యేసుక్రీస్తు కు గుర్తుగా ఉన్నాయి, కొంతమంది వ్యక్తులలో ఆయన గుణగణాలు, కొన్ని సంఘటనలలో ఆయన చేయబోయే కార్యములు దాచబడి ఉన్నాయి. 

    ఇక్కడే ముందు గుర్తులు, దృష్టాంతముల ప్రస్తావన వస్తుంది. ఇస్సాకు, యోసేపు యేసుక్రీస్తు వారికి ముందు గుర్తుగా ఉన్నారు. గుడ్ ఫ్రైడే కి దగ్గరగా ఉన్నాము, మనకు గుడ్ ఫ్రైడే అంటే యూదులకు ఇది పస్కా పండుగ. పస్కా పండుగలో వారు వధించే గొర్రె పిల్ల యేసు వారికి, ఆయన మరణముకు గుర్తుగా ఉన్న్నది. 

    కొంతమంది ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడు మర్మాలు విన్నాము అని అంటూ ఉంటారు. ఇలాంటి ప్రసంగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్య పరిజ్ఞానం అంతగా లేనివారు వీటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. మీరు ఏ వ్యక్తిని, అంశమును సాదృశ్య ముగా తీసుకున్నారో, దానిలో ప్రతి విషయానికి ఏదో ఒక ఆత్మీయ అర్థం చెప్పే ప్రయత్నం చేయవద్దు.

4. Expository - వివరణాత్మక ప్రసంగం

    ఇది పాఠ్యభాగ ప్రసంగం వంటిదే, కాని ఒక చిన్న తేడా ఉన్నది. పాఠ్యభాగ ప్రసంగం ఒక వచనం మీద దృష్టిపెడితే, వివరణాత్మక ప్రసంగం ఒక పేరా లేదా కొన్ని వచనాల మీద దృష్టిపెడుతుంది. ఆ వాక్యభాగములోని పదాల అర్థమును వివరిస్తూ ఇది సాగుతుంది.

5. Biographical - జీవిత చరిత్ర ప్రసంగం

    ఇది ఒక వ్యక్తి మీద, అతని గుణాలు, పొరపాట్లు వీటిని వివరిస్తూ సాగుతుంది. దీనికి ఒక వచనం కాకుండా, ఆ వ్యక్తి బైబిల్ లో కన్పించిన సందర్భములన్నిటిలో నుండి వచనాలు చూపించడం జరుగుతుంది.

6. Analytical - విశ్లేషణాత్మక ప్రసంగం

    ఈ ప్రసంగం లో ఏదైనా ఒక అంశమును లోతుగా విశ్లేషించడం జరుగుతుంది. అంశ ప్రధాన ప్రసంగం లో కేవలం వివరించుకుంటూ వెళ్తే, ఇక్కడ విశ్లేషించి కొన్ని కీలక అంశాలు బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విశ్లేషణ ద్వారా చక్కగా సత్యం వెల్లడి చేయబడుతుంది.

7. Analogical - సారూప్య, లేదా ఉపమానరీతి ప్రసంగం.

    సాదృశ్య ప్రసంగముకు దీనికి ఉన్న తేడా ఏమిటంటే అది ఎక్కువగా ముందు గుర్తులుగా, ప్రవచనాత్మకముగా ఉంటాయి. ఉపమాన ప్రసంగం లో కేవలం పోలికలు మాత్రం చూడగలము. భౌతిక అంశమును తీసుకొని ఆత్మీయ అర్థమును వివరించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. యేసయ్య ఇది ఎక్కువగా ఉపయోగించాడు. 

    దీని విషయంలో కూడా బహు జాగ్రత్త వహించవలసియున్నది. మీరు ఎంచుకున్న ఉదాహరణ లోని ప్రతి అంశముకు ఆత్మీయ అర్థం చెప్పే ప్రయత్నం చేయండి, అలా చేయడం వలనే మంచి సమరయుడు రెండు దేనారాములు ఇచ్చి మళ్ళీ వస్తాను అన్నాడు అంటే యేసయ్య 2 వేల సంవత్సరాల తర్వాత వస్తాడు అనే బోధలు పుట్టాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

- ఆర్. సమూయేలు 

References : 

{1} Gerald Rowlands, “A Simple Guide to Preaching,” Acts, (January - March 2001),6,7. 







Post a Comment