" నీవు ప్రభువుకు కావలసియున్నది "
- మత్త. 21:3
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. - మత్తయి 21:1-3
ఇది యేసుక్రీస్తువారు ఆఖరిసారిగా యెరూషలేముకు ప్రయాణం చేస్తున్న సమయం. ఆయన ఇప్పటికే గలీలయా, పెరయ ప్రాంతములలో పరిచర్య ముగించుకొని, తాను సిలువ మరణం పొందుటకు ముందుగా తన సన్నిహితులతో గడపడానికి బేతనియకు చేరాడు.
వాస్తవానికి ఆయన పెరయ ప్రాంతములో ఇంకా పరిచర్య జరిగిస్తున్నపుడే లాజరుకు బాగాలేదనే వార్త ఆయన చెవినిపడింది. ఆ తర్వాత ఆయన బేతనియకు రావడం, లాజరును తిరిగి బ్రతికించడం, ఇవి జరిగాయి.
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను. - లూకా 17:11
ఇక్కడే 10 మంది కుష్ట రోగులను స్వస్థత చేయడం జరిగింది. అక్కడి నుండి యెరికో వైపు వచ్చి అక్కడ జక్కయ్యను కలిసాడు ఒక గుడ్డివానిని కూడా స్వస్థపరచాడు. ఆ తర్వాత యెరూషలేముకు దగ్గరగా ఉన్న పట్టణం లాజరు నివాసముంటున్న పట్టణమైన బేతనియకు వచ్చాడు.
పస్కా పండుగకు 6 రోజులు ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. అంటే శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం వచ్చాడు అని అనుకోవచ్చు, ఇక్కడే మరియ యేసయ్యను అభిషేకించడం కూడా జరిగింది.
ఆదివారమున లేదా సోమవారమున బేతనియ నుండి యెరూషలేముకు యేసయ్య ప్రయాణమై బేత్పగేకు వచ్చినప్పుడు, గ్రామంలోకి వెళ్లి కట్టబడియున్న గాడిదను దాని పిల్లను తీసుకురమ్మని, ఎవరైనా ఏదైనా అంటే అది ప్రభువుకు కావలసియున్నది అని చెప్పమని తన శిష్యులలో ఇద్దరిని ఆయన పంపాడు.
యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. - లూకా 22:8
ఇక్కడ మీకు స్పష్టంగా తెలియజేయాలి అని భావిస్తున్న విషయం ఏమిటంటే యేసువారి జయప్రవేశపు యాత్ర బేతనియ నుండి ప్రారంభమయ్యింది.
ఇది యెరూషలేముకు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నది గనుక యేసుక్రీస్తు వారి కాలంలో 40 నిమిషాల్లో యెరూషలేముకు చేరుకోవచ్చు అని చెబుతుంటారు. మనము దీనిని అంగీకరిస్తే ఈ జయప్రవేశం కొన్ని గంటల్లోనే పూర్తి చేయబడి ఉంటుంది అని భావించవచ్చు.
1. ప్రభువుకు చెందినవి ప్రభువు అడుగుతున్నాడు
ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కటి దేవునిదే, భూమి, ఆకాశం, సముద్రం, జలములు, పొలములు, పైరులు, వనాలు, వృక్షములు, జంతువులు, పక్షులు, మనుషులు, గృహాలు, వస్త్రాలు, వస్తువులు అన్ని దేవునికి చెందినవే.
ఈ రోజు మనం కొన్ని సంపాదించుకుని నీది నాది అంటూ వాదులాడుకుంటూ ఉంటాము కాని, మన సంపాదన అంతటికి పెట్టుబడి ఆయనదే, దానికి నిజమైన యజమాని ఆయనే అనే విషయం మనము గ్రహించడం లేదు.
మనకు చెందిన వాటిని ఎక్కడైనా, ఎలాగైనా, ఎప్పుడైనా వాడుకునే హక్కు మనకు ఉన్నది. దానిని బట్టి ఆలోచిస్తే ఇప్పుడు మన విషయంలో సర్వ హక్కులు దేవునివే. దేవుడు ఏ క్షణానైనా, ఏ పని కొరకైనా నిన్ను పిలిచినప్పుడు నేను సిద్ధం ప్రభువా అని చెప్పగలవా?
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. -ప్రకటన గ్రంథం 3:20
ఈ రోజు నీ హృదయం ప్రభువుకు ఇచ్చి నీ జీవితం ఆయన చేతుల్లో పెడతావా??
2. ప్రభువు పని కొరకు ప్రభువు అడుగుతున్నాడు
దేవునికి మనము కావాలా? మనకు దేవుడు కావాలా? దేవుని స్థానంలో మనము ఉంటే నాకు ఎవరూ పనిలేదు అని అనే వాళ్ళమేమో. మనము లేకుండా దేవుడు ఏమి చేయడు.
గాడిదను, పిల్లను విప్పి తోలుకొని రమ్మని ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఎందుకు తీసుకురమ్మంటున్నాడో వారికి అర్థమై ఉంటుందా? గాడిద పిల్ల మీద ప్రభువు ప్రయాణం చేయబోతున్నాడు, ఇంతకు మునుపు ఎన్నడూ అలా జరిగి ఉండలేదు. మనము ఎవరమైనా దేవుని పని కొరకు మనము ఉపయోగపడాలి. ఇక్కడ గాడిద పిల్లకు ఆ అవకాశం వచ్చింది
గాడిదలు ప్రయాణం కొరకు ఆ దినాల్లో ఎక్కువగా ఉపయోగించినా, ఈ గాడిద పిల్ల మీద ఇంత వరకు ఎవరూ కూర్చోలేదు, ప్రయాణం చేయలేదు. ఎవరూ ఉపయోగించని దానిని ఉపయోగించడం గొప్ప గౌరవం, ఈ అంశంలో యేసయ్యకు దొరికిన గొప్ప గౌరవం ఇదే.
ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని - ద్వితియోపదేశకాండము 21:3
కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి - 1 సమూయేలు 6:7
ఇక్కడ కట్టబడి, ఒక యజమాని యొక్క అధీనంలోయున్న ఒక గాడిద పిల్లతో దేవునికి అవసరం వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, నీవు ప్రభువుకు కావాలి.
నీవు నీ కుటుంబముకు అక్కరలేకపోవచ్చు, స్నేహితులకు అక్కరలేకపోవచ్చు, ఈ లోకములో ఏ మనిషికి మీరు అక్కరలేకపోవచ్చు, నీ జీవితం వైపు చూసుకుని నీకు నీవే నేను బ్రతకనక్కరలేదు అని అనుకోవచ్చు, కాని నీవు దేవునికి కావాలి.
నీకు చదువులేకపోయినా దేవునికి కావాలి, చెడిపోయిన వ్యక్తివైనా దేవునికి కావాలి, జ్ఞానం లేకపోయినా దేవునికి కావాలి, నీకు ధనం లేకపోయినా దేవునికి కావాలి. బహుశా నీకు దేవుడు అవసరం లేదని నీ జీవితంలో ఆయనకు దూరం అయ్యావేమో, కాని ఆయన నిన్నే వెదుకుతూ నీకోసం ఈ లోకమునకు వచ్చాడు.
ప్రభువు తన పనికొరకు నిన్ను పిలుస్తున్నాడు, నీవు ఇష్టపడితే నీ కట్లు తెంపి, నీ పైనున్న వారితో మాట్లాడి, తన ఆధిపత్యం చేత నీకు విడుదల ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. ఏమి నిర్ణయించుకుంటావు??
3. ప్రవచన నెరవేర్పు కొరకు అడుగుతున్నాడు
యేసయ్య ఇక్కడ అలసిపోయిన దానిని బట్టి గాడిద మీద ప్రయాణం కోరుకోలేదు, ఎందుకంటే గలీలయ నుండి యెరూషలేముకు కాలినడకన ప్రయాణం చేసిన వ్యక్తికి ఈ మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయడం పెద్ద విషయం కాదు, పైగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది బేతనియ నుండి అనే విషయం మరచిపోకూడదు.
యేసుక్రీస్తువారు ఒక రాజువలె గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తాడు అని యెరూషలేమును గురించి జెకర్యా ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరాలంటే ఇక్కడ గాడిద కావాలి.
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. -జెకర్యా 9:9
మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. - నిర్గమకాండము 12:3ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి - నిర్గమకాండము 12:7
అంతే కాదు అబ్రాహాము తన కుమారుని బలి అర్పించడానికి గాడిద మీద ప్రయాణం చేస్తూ వచ్చినట్లు మనము చూడవచ్చు.
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. - ఆదికాండము 22:3
4. ప్రశ్నించకుండా అప్పగిద్దాం.
" విప్పి తోలుకుని రండి " ఇది చదవగానే యేసయ్య వీరికి దొంగతనం చేయమని చెప్పినట్లుగా అన్పిస్తూ ఉంటుంది " కాని "ప్రభువుకు కావలసియున్నది" అని చెప్పమనగానే యేసయ్య ఏదో కోడింగ్ పెట్టుకున్నట్లు కూడా అన్పిస్తుంది. ఎందుకంటే వారు ఆ మాట చెప్పగానే దాని యజమాని పంపిస్తాడు అని కూడా చెప్పాడు.
ఈ గాడిదల యజమాని యేసయ్యకు తెలిసిన వ్యక్తి అని, లేదా శిష్యుడని అభిప్రాయాలూ ఉన్నాయి, అంతే కాదు యేసయ్య యెరూషలేముకు పస్కా పండుగ నిమిత్తమై తరచుగా వెళ్లి వస్తూ ఉంటారు గనుక ఈ జంతువుల యజమానులు తెలిసి ఉండవచ్చు అనేది కూడా ఇంకో అభిప్రాయం.
తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు. వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను. ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును. దెవుడు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.-1 సమూయేలు 10:3-7
ముగింపు :
నీవు ప్రభువుకు కావాలి, నీవు ఆయనకు చెందిన వ్యక్తివే, నిన్ను ఆయన పిలుస్తున్నాడు, తన పని కొరకు పిలుస్తున్నాడు, నీ పట్ల ఉద్దేశ్యం కలిగి పిలుస్తున్నాడు, ప్రశ్నలు వేస్తూ సాకులు చెబుతూ కూర్చుంటావా? నిన్ను రక్షించుటకు పస్కా పశువుగా చేయబడిన యేసయ్యకు అప్పగించుకొని, నీ జీవితమును, ఇతరుల జీవితమును దీవెన కరముగా మార్చుతావా? ఆలోచించుకో!!
- ఆర్ . సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి