రక్షించు దేవుడు
"నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు" -కీర్తనలు 44:6
జీవితంలో ప్రతి వ్యక్తికి రక్షణ అవసరం, వయసు, లింగ, సామర్థ్య భేదాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వారి వారి స్థాయిలో రక్షణ అవసరమైయున్నది. మన ప్రయాణాల్లో, పోరాటాల్లో, చేసే ప్రతి పనిలో రక్షణ అవసరం. కొన్నిసార్లు మృగాల నుండి మరికొన్నిసార్లు మృగం వంటి మనుషుల నుండి రక్షణ అవసరం.
మనకు అవసరమైన ఈ రక్షణ నిమిత్తమై కొన్నిసార్లు కొంతమంది మనుషుల మీద ఆధారపడతాం, మరి కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనకు రక్షణ ఇస్తాయని భావిస్తాము. ఈ క్రమంలో రక్షక భటులను, అంగరక్షకులను వారికున్న పరపతిను బట్టి కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. మరి కొంతమంది కొన్ని ఆయుధములను సంపాదించుకొని వాటి ద్వారా రక్షణ తమకు తాము కలిగించుకునే ప్రయత్నం చేస్తారు.
నిజంగా మనకు రక్షణ కలిగించేది ఎవరు? పోలీసులా? సైనికులా?? తుపాకులా???కత్తులా???? ఏది మనకు రక్షణ కలిగిస్తుంది? ఈ వచనాలు రాసినటువంటి కోరహు కుమారులు ఈ విధంగా తెలియజేస్తున్నారు, "నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు"
గత కాలంలో దేవుడు వారికి కలిగించిన రక్షణను విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మేము మా వింటిని, కత్తిని నమ్ముకోలేదు అని తెలియజేస్తున్నారు. వారు గత విజయాలను స్మరించుకుంటూనే, ప్రస్తుతము ఈ కీర్తన రాస్తున్నటువంటి వారు ఉన్న కఠిన స్థితిలో కూడా మేము ఆ యుద్ధాయుధములు నమ్ముకొనుటలేదు అని తెలియజేస్తున్నారు.
వారెందుకు ఇంటిని గాని కత్తిని గాని నమ్ముకోలేదు? మన విల్లులు గురి తప్పవచ్చు, విరిగిపోవచ్చు, మీ వద్ద నుండి దాన్ని ఎవరైనా దొంగతనం కూడా చేయవచ్చు, ఒకవేళ దాన్నే గనుక నమ్ముకుని కూర్చుంటే విజయం పొందగలమా?? రక్షణ చూడగలమా??
మరి కత్తిని ఎందుకు నమ్ముకోలేదు? కత్తి కూడా విరిగిపోవచ్చు, మొద్దు బారిపోవచ్చు, మన చేతిలో నుండి జారిపోవచ్చు కూడా, అలాంటి పరిస్థితుల్లో కత్తిని నమ్ముకుంటే విజయం కలుగుతుందా? రక్షణ చూడగలమా?? కాబట్టి మనం నమ్ముకోవాల్సింది, ఆనుకొనవల్సింది వాటిని మనకంటే మెరుగ్గా వాడుతూ అవి ఉన్నా లేకపోయినా మనకు రక్షణ కల్పించగల దేవుని మీదనే!
నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా? నీ తలాంతులు నువ్వు నమ్ముకుంటున్నావా?? నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకుంటున్నావా?? నీ చుట్టూ ఉన్న మనుషులను నమ్ముకుంటున్నావా?? నీకు అందుబాటులో ఉన్న ఆయుధములను నువ్వు నమ్ముకుంటున్నావా?? ఒకసారి ఆలోచించు, ఇవి నీకు నిజంగా రక్షణ కల్పించగలవా?
ఇవన్నీ ఆలోచిస్తుంటే నిన్ను రక్షించగలిగినవాడు దేవుడు ఒక్కడే అనే సంగతి నీకు అర్థం కావడం లేదా? మనకు భౌతికంగా రక్షణ అవసరమైనా అది దేవుని వద్ద నుండే రావాలి, దేవుడే గనక రక్షించకపోతే మనము నమ్ముకున్న వీళ్ళు ఎవరూ మనల్ని రక్షించలేరు, ఈ భయంకరమైన ఎండల్లో మనలను ఆరోగ్యంగా ఉంచుతుంది మన ఆహారమో, మనకున్న సదుపాయాలో, మనం తీసుకుంటున్న జాగ్రత్తలో కాదు! సాక్షాత్తు దేవుడే!! ఇంత అద్భుతమైన కాపుదల దేవుడు నీకు ఇస్తున్నందుకు ఈ నాలుగు నెలల పాటు దేవుడు నిన్ను కాపాడినందుకు ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించు!!
భౌతికంగా మాత్రమే కాదు మన ఆత్మకు అవసరమైన రక్షణ కూడా దేవుని నుండే రావాలి! మన పుణ్య కార్యాలు మనలను రక్షించలేవు, మన పాపము మనలను దేవుడు నుండి దూరం చేసి, నరక శిక్షకు పాత్రులుగా మనల్ని చేసి ఉండగా, ఆ నరకం నుండి తప్పించుకోవడానికి దేవుని సంతోష పరచడానికి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మన స్థానములో ఆయన బలయ్యే విధంగా చేసి మన పాప శిక్ష అంతటినీ ఆయన మీద మోపి ఆయన మరణము ద్వారా మనకు రక్షణను సిద్ధపరిచాడు.
మన స్వనీతి మనలను రక్షించదు, యేసయ్య తన విధేయత ద్వారా మరణము ద్వారా సంపాదించిన నీతి మాత్రమే మనలను రక్షించగలదు, నీ స్వనితి నిను రక్షిస్తుందని భ్రమ పడుతున్నావేమో! నీ పుణ్య కార్యాలు నీకు రక్షణ కలుగజేస్తాయని ఆలోచిస్తున్నావేమో!! నేడైనా సత్యాన్ని గ్రహించు!!
నరక శిక్షణ తప్పించుకోవాలంటే ఇక నిన్ను నువ్వు నమ్ముకొనక, నీ పుణ్య కార్యములను నమ్ముకొనక, నీ సామర్ధ్యమును జ్ఞానమును నమ్ముకొనక, బలవంతుడైన నీ కొరకు బలైన ఏసుక్రీస్తు వారి యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచి ముందుకు సాగుటకు నిర్ణయించుకో, దేవుని రక్షణ నీవు కనులారా చూడగలుగుతావు!!
అన్వయము :
గడచిన కాలంలో దేవుని రక్షణలో నీవు అనుభవించి ఉంటే, భౌతికంగానూ ఆత్మీయంగానూ నీ జీవితంలో ఆయన కనబరిచిన రక్షణను బట్టి ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించు!!
ఒకవేళ నువ్వు ఇప్పటికీ నీ సామర్థ్యాన్ని, అనుభవాన్ని, సంపదను, తెలివిని, నమ్ముకుంటున్న వ్యక్తివైతే, దానిని బట్టి దేవుని సన్నిధిలో పడి ఇక ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవునిపై సంపూర్ణమైన నమ్మకం ఉంచి, నిన్ను రక్షించు బాధ్యత ఆయనపై మోపి కొనసాగుటకు తీర్మానించుకో!!

రిప్లయితొలగించండిఆమె న్
కామెంట్‌ను పోస్ట్ చేయండి