సమాప్తమైనది



సమాప్తమైనది

విజయముతో పలికిన మాట:

సమాప్తమైనది 

 
యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. - యోహాను 19:30

ఉపోద్ఘాతం:

    ఆరు అక్షరాలు కలిగిన ఈ ఆరవ మాట ఎంతో విలువైనది మరియు యేసు జయశీలుడుగా ఈ మాటను పలికాడు. గత రెండు మాటలలో వున్న ఆవేదన, శ్రమ, బాధ ఈ మాటలో కనిపించవు. తన తండ్రి యొక్క ఎడబాటును, శారీరిక దప్పికను తీర్చుకున్న ప్రభువు సమాప్తమైనది అని పలుకుచున్నాడు. మనము జాగ్రత్తగా ఆలోచించిన యెడల అసలు ఏమి సమాప్తమైనదో కనుగొనగలము.

1. ధర్మశాస్త్రము నేరవేర్చబడుట సమాప్తమైనది:

    యేసు ఈ భూలోకములో జీవించిన కాలంలో పరిసయ్యల సద్దూకయ్యల యొక్క వైఖరిని బట్టి ధర్మశాస్త్రము పాటించుట అనేది చాలా కష్టముగా మారిపోయింది. యూదులు 613 ఆజ్ఞలు పాటించవలసియుండేది వాటిలో 365 చేయకూడదు అని చెప్పే నియమాలు అయితే, 248 చేయాలి అని చెప్పే నియమాలు వుండేవి. 

    అంతమాత్రమే గాక విశ్రాంతి దినముకు అధికమైన ప్రాధాన్యత వారు ఇవ్వడం మనము సువార్తలలో చూస్తాము. అయితే ప్రభువు భూలోకములో తాను జీవించినంత కాలము ఆ యొక్క ధర్మశాస్త్రమును నేరవేర్చి ప్రజల మీద నుండి ఆ కాడిని దించాడు. 

    యేసు మన పక్షంగా ధర్మశాస్త్రమును పాటించడమే కాకుండా దానిని సరిగా పాటించని వారికి వచ్చే శిక్షను కూడా భరించాడు. ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా దేవుని యెదుట నీతిమంతులుగా నిలువబడేవారు ఎవరూ లేరు. 

    ఎందుకనగా పాప స్వభావము మన యొక్క జీవితంలో అంతర్లీనంగా వుంది. కనుక అది సాధ్యం కాదు. అయితే మనకు వున్న ఒకే ఒక్క మార్గం ప్రభువైన యేసును ఆశ్రయించడమే! ఎందుకనగా యేసు ధర్మశాస్త్రమును తూ. చ. తప్పకుండా పాటించి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. 

    కాబట్టి యేసును అంగీకరించేవారికి ఆయన తన యొక్క నీతిని ఆపాదిస్తాడు. కనుక యేసు ద్వారా మనం దేవుని యెదుట నీతిమంతులముగా తీర్చబడతాము. ఈ రోజు ఎవరూ కూడా ధర్మశాస్త్రమును పాటించి నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరం లేదు. కాని యేసును అంగీకరిస్తే చాలు.

2. భూలోకములో యేసు యొక్క పని సమాప్తమైనది:

    యేసు ఈ లోకమునకు వచ్చిన పని తన యొక్క సిలువ మరణం ద్వారా పూర్తయ్యింది. యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నేరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. సాతానుకు వాడి అధికారమునకు లోబడిన యున్న మానవులను రక్షించి మానవులు తాము కోల్పోయిన అధికారాన్ని తిరిగి కూడబెట్టడానికి యేసయ్య వచ్చాడు. 

    తండ్రియైన దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపమును సహించలేడు (కాబట్టి ఏదేను వనములో నుండి ఆదాము హవ్వలను దేవుడు వెళ్లగొట్టాడు). కాబట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన ఇష్టాఇష్టాలను ధర్మశాస్త్ర రూపంలో తెలియజేసాడు. 

    ధర్మశాస్త్రము అనగా దేవుని వ్యక్తిత్వాన్ని మరియు చిత్తాన్ని వ్యక్తపరిచేది. అయితే ప్రజలు దానిని అనుసరించడంలో పూర్తిగా విఫలమయ్యారు, కాబట్టి దిక్కు తోచని స్థితిలో వున్నారు. అలాంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నేరవేర్చాడు. 

    అంతే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రితో తెగిపోయిన సంబంధమును కలపడానికి అవసరమైన మార్గాన్ని సిద్ధపరచాడు. ఈ రోజు దేవునిని సమీపించడానికి ఈ లోకములో వున్న ప్రజలు రకరకాల మార్గాలు వెదుకుతున్నారు. 

    కాని మనము ప్రభువైన యేసును మన యొక్క రక్షకునిగా అంగీకరించిన యెడల మనము దేవుని సమీపించగలము. ఎందుకనగా మనము దేవునిని సమీపించడానికి అవసరమైన దానినంతటిని యేసు సమకూర్చాడు. ఇక యేసుని అంగీకరించడమే తరువాయి.

3. విమోచన క్రయధనము చెల్లించుట సమాప్తమైనది:

    తండ్రియైన దేవుడు పరిశుద్ధుడు పాపమును సహించలేడు, ఆయన పాపముకు తగిన శిక్ష విధించబడాలని కోరుకొనేవాడు.

     ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకు లకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి 20:28
    మత్త. 20:28 ప్రకారం యేసు ఈ లోకానికి రావడానికి గల మరియొక కారణం విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకోవడం. సర్వలోక మానవాళి యొక్క పాపములు ఈ యొక్క గొర్రెపిల్ల మీద మోపబడ్డాయి. 

    ఈ గొర్రె పిల్ల ఇప్పుడు వధించబడి, రక్తము చిందించుట ద్వారా అనగా యేసు రక్తము ద్వారా మానవ పాపానికి పరిహారం చెల్లించబడింది. యేసుక్రీస్తు బలియాగం ద్వారా మానవాళి యొక్క పాపానికి పరిహారం చెల్లించబడింది కనుక ఇంకా పాత నిబంధన కాలంలో వలె ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి బలి అర్పించవలసిన అవసరము లేదు. 

    ఇంకా ఏ గొర్రెపిల్లను వధించవలసిన అవసరము లేదు. రక్తము చిందించవలసిన అవసరము లేదు. ఎందుకనగా యేసు ఆ పనిని సిలువపై పూర్తి చేసాడు. మన యొక్క పాపముల కొరకైన క్రయధనము ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా చెల్లించబడింది, కాబట్టి ఇతర మతాలు వారి వలె మనము బలిని అర్పించవలసిన అవసరం ఏమాత్రము లేదు. 

    మన యొక్క పాప విమోచనానికి అవసరమైనది అంతా యేసు ద్వారా సిద్ధపరబడినది. ఇంకా దానిని పొందడానికి ఏ తపస్సులు అవసరము లేదు, యేసుని అంగీకరించడం తప్ప. నీవు ఇంత వరకు పాపములో జీవించుచున్నావు గనుక సాతాను యొక్క అధికారానికి లోబడియున్నావు, ఇప్పుడు యేసు సిలువలో చేసిన త్యాగం వల్ల సాతాను యొక్క అధికారం మన మీద ఏమాత్రము లేదు. యేసు మనలను సంపూర్ణంగా విడిపించాడు.

ముగింపు:

    ప్రభువైన యేసు సిలువలో చేసిన త్యాగం ద్వారా మానవాళి యొక్క రక్షణకు అవసరమైన దానినంతటిని సమకూర్చాడు. మనము రక్షించబడాలంటే యేసుని ఆశ్రయించవలసిందే.

     చాలా మంది తమ యొక్క పుణ్యకార్యాల వల్ల స్వర్గలోకప్రాప్తిని పొందుకుంటాము అని అనుకుంటారు. కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచడం ద్వారానే మనం రక్షించబడగలము. రాబోవు నరక శ్రమను నీవు తప్పించుకోవాలంటే యేసు ఒక్కడే మార్గం.

- ఆర్. సమూయేలు

Post a Comment