యేసయ్య ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఎందుకు ప్రార్ధన చేసాడు?
యేసుక్రీస్తువారు 100% మానవుడు, 100% దేవుడు. దేవుడే మానవునిగా దిగి వచ్చాడు, భూలోకములో ప్రతి మానవుడు ఎదుర్కొనే వాటిని అత్యున్నత స్థాయిలో ఎదుర్కొని మచ్చలేని మాదిరి మనకు కనబరచాడు. యేసుక్రీస్తు వారి మానవత్వమును అనుమానించేవారు ఎవరైనా ఉంటే అది దీనితో పటపంచాలు అవుతుంది. ఒకసారి యేసయ్య చేసిన ప్రార్ధనను పరిశీలిద్దాం.
కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.- మత్తయి 26:39
ఈ ప్రార్థన చదవగానే మానవ సహజ సిద్ధమైన సమస్యను తప్పించుకోవాలి అనేటువంటి భావం కనిపిస్తుంది. అది మొదలుకొని తనకు కలగబోయే కష్టాలు యేసుక్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు, వాటన్నిటిని తలపోసుకుంటూ ఇవి తొలగిపోతే బాగుండు అని కోరుకున్నాడు! మరణ భయం యేసుక్రీస్తు వారికే మాత్రం లేదు, మరణ భయముకు లోనైన వారిని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు,
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను. -హెబ్రీయులకు 2:14,15
ఆయన తన ప్రాణము పెట్టడానికి తీసుకోవడానికి రెండిటికీ అధికారం కలిగినవాడుగా ఉన్నాడు,
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. -యోహాను 10:18
సిలువలో వేలాడుతున్న సమయంలో, తన ఆత్మను అప్పగించి ప్రాణం విడిచాడు, ఆ తర్వాతనే తల వంచాడు, సిలువ మీద ఒక వ్యక్తి అంత త్వరగా మరణించటాన్ని ఇంతకుముందు వారు చూసి ఉండలేదేమో, అందుకే యేసయ్య మరణం గురించి విని పిలాతు ఆశ్చర్యపోయాడు.
పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. -మార్కు 15:44
యేసుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు మరణించపోవడమును కూడా గమనించండి, వారు మరణించలేదు కాబట్టే వారి కాళ్లు విరగొట్టాల్సి వచ్చింది.
ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. -యోహాను 19:31,32
యేసయ్య యొక్క పోరాటం ముగిసింది కనుక, పొందవలసిన శిక్షను అనుభవించాడు కనుక తన ఆత్మను దేవునికి అప్పగించాడు, అది ఆయన రాజసమును చూపిస్తుంది.
అయితే ఇక్కడ గెత్సెమనేలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే ఆయన ప్రాణము అప్పటికే మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగి ఉన్నది, కాబట్టి యేసయ్య ఆ విధంగా మాట్లాడారు. యేసుక్రీస్తు వారు ఒక రాజు వలె తన మరణమును ఎదుర్కొన్నట్టుగా యోహాను తన సువార్తలో చిత్రీకరించాడు.
అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి -మత్తయి 26:38
ఈ మాటలను బట్టి మానవులను రక్షించే విషయంలో వెనక్కి తగ్గాలన్నది యేసుక్రీస్తు వారి ఉద్దేశం కాదు. యేసుక్రీస్తులో ఉన్న మానవ స్వభావం ఆయనను ఈ విధంగా మాట్లాడింపజేసింది. యేసయ్య ఇక్కడ నిజంగా అడుగుతుంది ఏంటి? తండ్రి ఇది ఒక్కటే మార్గమా వేరే మార్గం ఏదైనా ఉందా? అని అడుగుతున్నాడు.
మానవులను రక్షించుటకు ఈ మార్గం కాకుండా వేరే ఇతరమైన మార్గం ఏదైనా ఉంటే ఆ విధానములో పని చేయమని అడిగాడు, కానీ వెంటనే తేరుకొని అద్భుతమైన ప్రార్థన చేసి మనకో చక్కని మాదిరిని చూపించాడు. యేసయ్య తర్వాత వచనాల్లో మాట్లాడిన మాటలను చూస్తే నేను ఈ పాత్రలోనిది తాగితే తప్ప కుదరదు అని నువ్వు భావిస్తే నీ చిత్తమే జరగనివ్వు తండ్రి అని ఆయనకు అప్పగించుకున్నాడు.
మరల రెండవ మారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నా యొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి.. -మత్తయి 26:42
మనమును అట్టి మాదిరిని అనుసరించి మన జీవితాలను ఇతరుల జీవితాలను దీవెనకరంగా మార్చుకుందాం మారుద్దాం.
- ఆర్. సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి