అతిశయ కార్యములు చేయు దేవుడు
దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.) -కీర్తనలు 44:8
అతిశయము అంటే గొప్పలు చెప్పుకోవడం, నోరు పెద్దదిగా చేసుకుని మాట్లాడడం అని చెప్పవచ్చు. చాలామంది చాలా విషయాలు బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది రథాలను బట్టి కొందరు గుర్రాలని బట్టి అతిశయిస్తారు అని దేవుని వాక్యం చెబుతున్నది.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. -కీర్తనలు 20:7
దుష్టులు తమ యొక్క మనస్సు అభిలాషను బట్టి, కొంతమంది తాము చేసిన కీడును బట్టి, అతిశయిస్తారు.
దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు -కీర్తనలు 10:3శూరుడా, చేసిన కీడును బట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. -కీర్తనలు 52:1
ఇంకొంతమంది వ్యర్ధమైన విగ్రహాలను బట్టి, ఇతర మనుషులను బట్టి అతిశయిస్తూ ఉంటారు.
వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును. -కీర్తనలు 97:7కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. -1 కోరింథీయులకు 3:21
కొంతమంది తమను బట్టి తాము అతిశయిస్తూ ఉంటారు
మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకల జనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. -హబక్కూకు 2:5
కొంతమంది శరీర విషయంలో, ఇంకొంతమంది వారి యొక్క డంబములలో అతిశయిస్తూ ఉంటారు.
అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును. -2 కోరింథీయులకు 11:18
ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. -యాకోబు 4:16
కొంతమంది వృధాగా అతిశయపడుతూ ఉంటారు, కొంతమంది వారు సిగ్గుపడవలసిన విషయాలు బట్టే అతిశయిస్తూ ఉంటారు.
ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము. -గలతియులకు 5:26నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు. -ఫిలిప్పీయులకు 3:19
అసలు మనం ఎవరిని అతిశయించాలి?? దేవుని వాక్యం దీని గురించి ఏం తెలియజేస్తున్నాదో చూద్దాం!
అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. -యిర్మియా 9:24
అతిశయించే ప్రతి వ్యక్తి తాను దేవునిని బట్టే అతిశయించాలి. ఎందుకు మనం దేవుని బట్టి అతిశయించాలి? ఎందుకనగా ఆయన కృప చూపే దేవుడు, నీతి న్యాయములు జరిగించే దేవుడు.
ఈ 44వ కీర్తనలో మొదటి ఏడువచనాల్లో దేవుడు చేసిన కార్యాలను కోరహు కుమారులు జ్ఞాపకం చేసుకుంటూ, ఎనిమిదవ వచనంలో దినమెల్ల మేము దేవుని యందు అతిశయ పడుచున్నాము అని తెలియజేస్తున్నారు. ఎందుకు వారు దేవుని యందు అతిశయిస్తున్నారు?
దేవుడు తన భుజబలం చూపినందుకు, అన్యజనులను వెళ్ళగొట్టినందుకు, తమ పితరులను వాగ్దాన దేశంలో నాటినందుకు, అన్యజనులను నిర్మూలము చేసి ఇశ్రాయేలీయులను వ్యాపింపజేసినందుకు, వారు దేవుని యందు అతిశయిస్తున్నారు.
నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. -కీర్తనలు 44:2
దేవుడు ఇశ్రాయేలను కటాక్షించినందుకు, వారికి విజయాన్ని కలిగించినందుకు దేవునిని బట్టి వారు అతిశయిస్తున్నారు.
వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. -కీర్తనలు 44:3
తన ప్రజలను రక్షించేవాడుగా, తన శత్రువులను, తనను ద్వేషించే వారిని సిగ్గుపరిచేవాడుగా దేవుడు ఉన్నందుకు వారు ఆయనను బట్టి అతిశయిస్తూ స్తుతిస్తున్నారు.
మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. -కీర్తనలు 44:7
దేవుడు నీ జీవితంలో నీవు గొప్పగా చెప్పుకోగలిగిన కార్యమేమి చేయలేదా? చాలా సందర్భాల్లో దేవుడు చేసిన కార్యములను మన ఖాతాలో వేసుకుని అది మన గొప్పతనం అని భావిస్తూ అతిశయించిన వారముగా ఉన్నాము, దానిని బట్టి కనీసం మీ దినమైన పశ్చాతాపడుతూ, దేవుడు నీ జీవితంలో నా దేవుడు గొప్పవాడు అని చెప్పుకోదగిన రీతిలో చేసిన గొప్ప కార్యములు అన్నిటిని బట్టి దేవునిని స్తుతించే వారం గా ఉందాం.
నిజంగా మన దేవుడు అతిశయ కార్యములు చేసే దేవుడు, మనుషులు ఇవ్వలేని భద్రతను, వస్తువులు ఇవ్వలేని విజయాన్ని, రాజులు ఇవ్వలేని ఘనతను దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు.
ఓడలో నోవాహును కాపాడిన వాడు, మృత తుల్యమైన అబ్రహాము శారాల శరీరంలో తన శక్తిని నింపి సంతానాన్ని అనుగ్రహించినవాడు, సముద్రంలో మార్గాన్ని ఇచ్చినవాడు, పంట పండించవలసిన అవసరం లేకుండానే 40 సంవత్సరాల పాటు 30 లక్షలు మందిని పోషించినవాడు, యుద్ధము చేయవలసిన అవసరం లేకుండానే ఆయుధాలతో పని లేకుండానే యుద్ధములో విజయాన్ని అనుగ్రహించినవాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు, చనిపోయిన వారిని తిరిగి లేపిన వాడు, మానవ పాప పరిహారార్థం తానే సిలువను ఎక్కి, మరణించి సమాధి చేయబడి, సమాధిని చీల్చుకొని మృత్యుంజయుడై తిరిగి లేచిన మన దేవుడు నిజంగా అతిశయ కార్యములు చేసే దేవుడు.
దేవుడు నీ ఆకలి బాధలు తీర్చి ఉంటే, అన్న వస్త్రా పానీయాలు నీకు అనుగ్రహించి ఉంటే, ఆరోగ్యమును బలమును క్షేమమును ఆయన దయచేసి ఉంటే, తలపెట్టిన కార్యములను సఫలపరిచి ఉంటే, కుటుంబమును వర్థిల్ల చేస్తూ సమాధానముతో దాన్ని నడిపిస్తూ ఉంటే.. రాసిన పరీక్షల్లో, సాతానుతో చేస్తున్న పోరాటాల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తూ ఉంటే…ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలుగా గుర్తించు!
వీటికి కారణం నీవని ఎంచుకొనక, నీకు ఇట్టి స్థితిని కలుగజేస్తూ నీ పట్ల గొప్ప కార్యములు చేసిన దేవుని యందు అతిశయిస్తూ ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించు!
నిన్ను నువ్వు హెచ్చించుకొనుట మానుకొని దేవునిని హెచ్చించుట ప్రారంభించు దేవుడు నిన్ను మరింతగా హెచ్చిస్తాడు.
దేవుని అతిశయ కార్యములను అనుభవించిన మనం ఆయన యందే అతిశయిస్తూ ఆ కార్యములను ప్రచురిస్తూ ఆ రాజ్యంలోనికి అనేకమందిని చేర్చుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.
- ఆర్. సమూయేలు

Good topic brother, praise the Lord
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి