మహిమ తెచ్చుకొను దేవుడు


మహిమ తెచ్చుకొను దేవుడు



 మహిమ తెచ్చుకొను దేవుడు


అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి యున్నావు.  అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకొనువారిని బట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. - కీర్తనలు 44:12-16

    మన జీవితంలో కొన్ని పరిస్థితులను మనం ఏమాత్రం అర్థం చేసుకోలేనివారంగా ఉంటాము. ఎందుకిలా జరిగింది? అనే దానికి కొన్నిసార్లు సమాధానం దొరకదు.

దేవునితో సరైన సహవాసం లేని వారు వారు ఆచరించే ఆచారాల్లో ఏదో లోపం ఉంది కనుక దాన్ని వారు చేయకపోయినా దాన్నిబట్టి ఈ విధమైన దుస్థితి కలిగిందని భావిస్తూ ఉంటారు. 

దేవునితో ఒక మంచి సహవాసం కలిగి కొనసాగేటువంటి ఆత్మీయులు దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతిస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు. 

    నిజంగా దేవుడు చేసే కొన్ని కొన్ని పనులు మానవ దృష్టితో మనం ఆలోచిస్తే వ్యర్థమని మనకనిపిస్తాయి.   దేవుని ఆలోచనలు, మన ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి కనుక ఆయన ప్రణాళికలు ఉద్దేశాలు మనకు అందవు.

    ఇక్కడ ఇశ్రాయేలకు కలిగిన ఓటమిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాసిన కోరహు కుమారులు, దేవుడు అనుమతించిన ఈ పరిస్థితిని గూర్చి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. ఆత్మీయులు వారి జీవితంలో కలిగిన కష్టము, ఓటమి, దుఃఖము, అవమానము, నిందలు, నిరాశలు, వీటికి అర్థమును వెతుకుతూ ఉంటారు.  

వీటి వెనక దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? అని వారు ఆలోచిస్తారు. 

    అయితే ఇక్కడ ఈ కోరహు కుమారుల బాధ ఏంటంటే, దేవా మాకు అవమానం కలిగినా, నీవు మా పక్షముగా యుద్ధం చేయకపోయినా, మమ్మల్ని దోచుకునే వారికి చేతికి అప్పగించినా, దీని ద్వారా నీకు మహిమ వస్తుందంటే మేము ఎంతైనా అనుభవించడానికి సిద్ధమే.

కాని దీని ద్వారా నీకు లాభమేంటో మాకు అర్థం కావడం లేదు అని వారు బాధపడుతున్నారు, ఒకసారి 12 వ వచనమును పరిశీలిస్తే అది ఇంకా మనకు స్పష్టం అవుతుంది.

 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు -కీర్తనలు 44:12

    ఇక్కడ కోరహు కుమారులు ఆలోచన చూడండి, శత్రువుల చేతికి నీవు మమ్ములను బానిసలుగా అమ్మేసినా పర్వాలేదు, కానీ నీకు లాభం లేకుండా అమ్మేసావు ఏంటి? తక్కువ ధరకే అమ్మేశావేంటి? అనేది వీరి ఆలోచన. నిజంగా దూర దృష్టి కలిగినటువంటి వారు చేసే చాలా పనులు మనకి అప్పటికప్పుడు అర్థం కావు,   ఆ సమయంలో వారు మన దృష్టికి వెర్రివాళ్లుగా కనబడతారు.

దేవుడు తాను చేసే కార్యముల ద్వారా చాలామందికి ఈ విధంగా అర్థమయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

   కాని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు తాను ఏం చేస్తున్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన దృష్టిలో వ్యర్థము అనిపించేది ఏదీ లేదు.

ఆయన వ్యర్థముగా ఏ పని చేయడు, ఆయన చేసే ప్రతి పనికి, అనుమతించే ప్రతి దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంది. అది నీకు ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వెనుతిరిగి చూసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. 

    అకు అనే జాతికి సువార్తను ప్రకటించుటకు వెళ్లి ఐదుగురు యవనస్తులు తమ ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఈ ఐదుగురు యవ్వనస్తులు తమ జీవితాలను వ్యర్థం చేసుకున్నారని కొంతమంది భావించి ఉండొచ్చు, ఈ ఐదుగురు యవ్వనస్తులు తమ ప్రాణాలను కోల్పోయినందుకు వారు భక్తిహీనులని దేవుడు వారితో లేడని కూడా అనేకులు వ్యాఖ్యానాలు కూడా చేసి ఉండొచ్చు.

 లోకం దృష్టిలో దైవ ప్రణాళికలు అర్థం కాని వారి దృష్టిలో ఇది ఒక వ్యర్థం, కానీ దాని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ సంఘటన జరిగిన తర్వాత అనేకమంది యవనస్తులు ఆ జాతికి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు తమ జీవితాలను సమర్పించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఆ యవ్వనస్తుల జీవితాలు వ్యర్థమయ్యాయా?

    స్తెఫెను మరణించినప్పుడు ఆయన ఇంకా కొన్నాళ్లు బ్రతికి ఉంటే బాగుండని, దేవుని కొరకు రోషం కలిగి మాట్లాడి తన జీవితాన్ని వ్యర్ధపరుచుకున్నాడని అప్పుడు ఇప్పుడు భావించేవారు కొంతమంది ఉండొచ్చు, కానీ స్తెఫెను మరణం సౌలు అనే ఒక యవ్వనస్తుని జీవితంలో గొప్ప మార్పుకు కారణమైంది.

ఆ సౌలే పౌలుగా మారి దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయడంలో విరివిగా ప్రయాసపడ్డాడు, స్తెఫెను జీవితం వ్యర్థమైందా?

    ఇశ్రాయేలు ప్రజల ఓటమి వారి శత్రువులు దేవుని తెలుసుకోవటానికి ఒక అవకాశాన్ని కలిగించింది, దానియేలు చెరలోనికి వెళ్లకపోతే అక్కడి ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం ఉందా? నీ జీవితంలో ఏ పరిస్థితి కూడా వ్యర్థంగా అనుమతించబడలేదు.

    ఒక అన్యుడు నీ మీద విజయం సాధిస్తుంటే, దేవుని ఎరుగని ఒక వ్యక్తి ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, మనలను గెలిచినట్లుగా వారు భావించవచ్చు కానీ నిజానికి అక్కడ గెలిచేది దేవుని ఉద్దేశములు మాత్రమే.

నీకు కలిగిన లేమిని బట్టి దేవుడు నిన్ను వదిలేసాడు అని అనుకోవద్దు! నీ కష్టమును బట్టి నువ్వు నష్టపోయేదేముండదు , దైవక కోణంలో నీవు చూడగలిగితే అదంతా లాభమే.

    దేవుడు దేనినైనా ఉపయోగించుకుని మహిమ తెచ్చుకొనగల సమర్థుడు, అన్యుడు ద్వారా సువార్తను ఇతరులకు పంచగలడు, అదే అన్యుడు ద్వారా విశ్వాసులకు బుద్ధి చెప్పగలడు.

కాబట్టి నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులు నీకు అర్థం కాకపోతే, మంచివాడు సర్వజ్ఞుడైన దేవునిని, పరిపక్వత లేని రీతిలో ఇష్టం వచ్చినట్లు దూషించక, దేవుడు అనుమతించిన పరిస్థితిని బట్టి, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన మంచితనానికి సంపూర్ణంగా అప్పగించుకో! ఆయన నీ ద్వారా నెరవేర్చుకోవాలి అనుకున్న కార్యమును నెరవేర్చుకొననివ్వకుండా అడ్డు రావద్దు!! దేవుని కార్యములకు ప్రయోజనకరము కావడం కంటే గొప్ప సార్ధకత మన జీవితానికి ఇంకేముంది!!!

    కాబట్టి గడచిన కాలంలో నీ కఠిన పరిస్థితులను బట్టి దేవునిని దూషించి ఉంటే, ఆయన అనుమతిస్తున్న పరిస్థితులు నీకు అర్థం కాక, ఆయనను నానా మాటలు అని ఉంటే,  ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాతాపపడు! క్షమించమని ఆయనను వేడుకో!! 

    నీ జీవితంలో కఠినమైన పరిస్థితులు దేవుని మహిమార్థమై అనుమతించబడ్డాయని నీకు అర్థమైతే, నీ పరిస్థితి కష్టంగా ఉన్నా, ఫలితం ఏంటో నీకు తెలుసు కనుక,  అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు!

     ఈ కష్టాల మార్గాన్ని నీవు ఇప్పటికే దాటి వచ్చి ఉంటే ఈ ప్రయాణంలో దేవుడు నిన్ను ఎలా మార్చాడో, ఏ స్థితికి చేర్చాడో, జ్ఞాపకం చేసుకుని ఆయన నడిపింపులన్నిటిని బట్టి హృదయపూర్వకంగా దేవునిని  స్తుతించి ఆరాధించు!

    ఏ విధము చేతనైనా మహిమ తెచ్చుకొనగల దేవుడు మనకున్నాడు, ఆయనకు సంపూర్ణంగా లొంగిపోయి ఆయన మహిమార్థమై ఈ లోకంలో నిలుద్దాం! అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.

ఆర్. సమూయేలు.

Post a Comment