కయీను తన తమ్ముడిని నిర్లక్ష్యము చేసాడు


కయీను తన తమ్ముడిని నిర్లక్ష్యము చేసాడు

కయీను తన తమ్ముడిని నిర్లక్ష్యము చేసాడు

    రింకీ పింకీ అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, వీళ్ళిద్దరికీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, ఒకరోజు వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరికీ ఒక పని అప్పచెప్పాడు, ఆ పని పింకీ చాలా చక్కగా చేసింది, కానీ రింకీ మాత్రం సరిగ్గా చేయలేదు.

       అయితే వాళ్ల నాన్నగారు చక్కగా పనిచేసినందుకు పింకీ కి ఒక చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చాడు, అయితే రింకికి ఆ చాక్లెట్ కావాలనిపించింది, అందుకని పింకీని ఆ చాక్లెట్ ఇవ్వమని అడిగింది, చాక్లెట్ అంటే ఇద్దరికి ఇష్టమే కదా! 

    కాబట్టి పింకీ ఏమో నీకు నేను మొత్తం ఇవ్వను నాకు కూడా కావాలి కాబట్టి దీన్ని రెండు ముక్కలు చేసుకుందాం అంది. రింకి దానికి ఒప్పుకొనక మొత్తం నాకే కావాలి, అని చెప్పి పట్టు పట్టింది. దానికి పింకీ ఒప్పుకోలేదు, కానీ రింకి ఏం చేసిందో తెలుసా పింకీ ని బాగా కొట్టి ఆ చాక్లెట్ లాక్కొని కొంచెం కూడా ఉంచుకుండా మొత్తం తానే తినేసింది. 

    పిల్లలు మీకేం అర్థమైంది, మీలో ఎంతమందికి రింకీ అంటే ఇష్టం?? రింకీ అంటే ఇష్టం లేదా??? ఎందుకని, తను వాళ్ళ చెల్లెల్ని పట్టించుకోకుండా తన దగ్గర ఉన్నవి లాక్కొని తినటమే కాకుండా వాళ్ళ చెల్లిని కొట్టింది.  

కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. -ఆదికాండము 4:8

    బైబిల్లో కయీను గురించి మనం పోయిన వారం నేర్చుకున్నాం కదా! కయీనుఏమి చేశాడు ? నిర్లక్ష్యంగా బలర్పించాడు. అందుకని దేవుడు ఆయన బలిని అంగీకరించలేదు అయితే హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు? హేబేలు కయీనుకి ఏమవుతాడు? తమ్ముడు కదా చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు మీరు!

    సరే ఈరోజు దేవుడు తన బలిని అంగీకరించకుండా హేబేలు బలిని అంగీకరించినందుకు కయీను ఏం చేశాడో తెలుసుకుందాం!

    దేవుడు తన బలిని అంగీకరించినందుకు కయీను చాలా కోపం పెంచుకున్నాడు, దేవుడు తన బలి అంగీకరించకపోవడం తన తమ్ముడు బలి అంగీకరించడం ఈయనకి ఏమాత్రం నచ్చలేదు.

    అందుకని ఒక రోజు ఏం చేసాడో తెలుసా? తమ్ముడు అలా పొలంలోకి రా మాట్లాడుకుందాం అని హేబేలును తీసుకువెళ్లి ఎవరు చూడట్లేదు లే అనుకొని తమ్ముడిని చంపేశాడు

    కయీనుకి తన తమ్ముడంటే ఎంత నిర్లక్ష్యం కదా! కొంచెం కూడా ప్రేమ లేదు. పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన తమ్ముడు చెల్లెళ్లతో ఇలానే చేస్తున్నారా? వాళ్లని కొట్టడం వాళ్ల దగ్గరవి లాక్కోవడం చేస్తున్నారా?? ఇలా చేయడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు.

    కయీను చేసినట్టుగా లెక్క లేకుండా మనం ఉండకూడదు, మనం చేసిన ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు, అనవసరంగా మనం ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు! ఎందుకో తెలుసా? మనము అలా కోపపడితేనంట ఒక వ్యక్తిని చంపిన దానితో సమానం అంట!

    ఇంతకుముందు మీరు అలా ఎవరి విషయంలోనైనా కోపపడి ఉంటే యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకోండి. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీకంటే చిన్నవారిని పెద్దవారిని మీ తోటి వారిని నిర్లక్ష్యం చేయక వారిని గౌరవించండి, ప్రేమించండి, అనవసరంగా వారి మీద కోప పడవద్దు, అలా చేస్తే దేవుడు మీ మీద కోప్పడతాడు

    కయీనుకి వాళ్ళ తమ్ముడు ప్రాణం అంటే లెక్క లేకుండా చంపేశాడు, రింకీ కూడా పింకీ బాధ అంటే లెక్క లేకుండా , ఆమెను కొట్టి ఆమె దగ్గర ఉన్నాయి లాక్కుంది. మీరు అలా చేయకూడదు సరేనా! యేసయ్య మేము అలా చేయకుండా ఉండటానికి సహాయం చేయమని దేవునిని అడగండి.

    సరే నేను మీకు ఇక్కడ ఒక కంఠత వాక్యం ఇస్తున్నాను, అందరూ నేర్చుకొనండి, వచ్చే వారం కయీను ఇలా చేసినందుకు ఆయనకేం జరిగిందో తెలుసుకుందాం!

కంఠత వాక్యం

 ..................తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును....... -మత్తయి 5:22

పాట : నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం

ఆర్. సమూయేలు.

Post a Comment