క్రమశిక్షణలో పెట్టే దేవుడు

క్రమశిక్షణలో పెట్టే దేవుడు

అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు -కీర్తనలు 44:19

    దేవుడు మన సృష్టికర్తగాను న్యాయాధిపతిగానూ ఉన్నాడు, ఆయన మన జీవితములను పట్టించుకుంటూ, మనలను నడిపించువాడై యున్నాడు. దేవుడు మనలను నడిపించే క్రమంలో ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు, మనం ఆయనకు స్పందిస్తున్న విధానాన్ని బట్టి కూడా మనలను నడిపిస్తాడు. 

    మన జీవితంలో కొన్నిసార్లు మనము దేవునికి సరిగా లోబడకపోతే, విలువని ఇవ్వకపోతే, విశ్వాసముంచకపోతే, ఆయన మనలను నడిపించే తీరు దానికి సరిపడినదిగా ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుని పిల్లలైనా వారి యెడల వారు దేవుని పట్ల కనపరచు వైఖరికి తగినట్టుగా తాను వారిని నడిపిస్తాడు.

    ఒక పిల్లవాడు తండ్రి మాట వినకపోతే, తల్లికి ఎదురు తిరిగితే ఆ పిల్లవాడికి బెత్తం దెబ్బలు అవసరం మరియు క్షేమకరం. బెత్తము వాడిని కుమారులు తండ్రుల గురించి బైబిల్ ఇలా చెబుతుంది….

బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. -సామెతలు 13:24

    పిల్లల వైఖరిని బట్టి కొన్నిసార్లు వారికి ఏ విధంగా బెత్తం దెబ్బలు కావాలో దేవుని పిల్లలైన మనకు కూడా కొన్నిసార్లు మనం దేవునితో వ్యవహరించే వైఖరిని బట్టి బెత్తం దెబ్బలు అవసరం.

    దారి తప్పిపోతున్న తన కుమారుని శిక్షించేవాడు లేదా బెత్తం దెబ్బలు కొట్టడం ద్వారా క్రమశిక్షణలో పెట్టేవాడు ప్రేమ గల తండ్రి అని బైబిల్ చెబుతుంది. అంతేకాదు ఈ బెత్తం దెబ్బలు తగిలేది లేదా తగిలించబడేది కుమారులకు కుమార్తెలకే గాని ఇతరులకు కాదు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ అసలు బెత్తం దెబ్బలు తగలకపోతే మనము కుమారులు కుమార్తెలను కాదు అన్నట్టు మాట్లాడాడు.

కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందని యెడల దుర్బీజులేగాని కుమారులు కారు. -హెబ్రీయులకు 12:8

    దేవుడు తన పిల్లలను క్రమశిక్షణలో పెడతాడు, అంటే సాతాను పిల్లలను దేవుడు క్రమశిక్షణలో పెట్టడు. క్రమశిక్షణ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్రమశిక్షణలో పెడుతున్న విషయాన్ని కోరహు కుమారులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రింది మాటలు మాట్లాడుతున్నారు.

అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు -కీర్తనలు 44:19 

    నక్కలు ఉన్నచోట దేవుడు వారిని నలిపినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. నక్కలున్న చోటు అంటే మనుషులు లేని ఎడారి ప్రాంతం, ఆ ప్రాంతంలో మిగిలిన వాటిని రాబందులు, గుడ్లగూబలతో పాటుగా నక్కలు కూడా పంచుకొని తినే పరిస్థితి ఉండగా మాకు వాటితో భాగం కల్పించావు అని వారు మాట్లాడుతున్నారు.

    యుద్ధంలో వారికి కలిగిన ఓటమినిబట్టి చెరగొని పోబడిన వారు చెరగొని పోబడగా మిగిలిన కొద్ది శేషమును బట్టి, పాడైపోయిన వారి పట్టణం మనం చూసుకొని, నక్కలకు ఇతర క్రూర జంతువులకు నివాసమైన వారి ప్రాంతమును చూసుకుని వారు పై మాటలు మాట్లాడినవారుగా ఉన్నారు.

నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను. -కీర్తనలు 141:5

    నీతిమంతులు గద్దింపే మనకు తైలాభిషేకం అయితే దేవుని చేత నలగొట్టబడడం ఎంత ఆశీర్వాదకరమో కదా! క్రమశిక్షణ కష్టంగానే ఉంటుంది కానీ అది తుదకు మంచి ఫలితాలను ఇస్తుంది.

మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. -హెబ్రీయులకు 12:11

    గడిచిన ఆదివారం మన సంఘానికి సంబంధించిన ఒక సహోదరి ఆదివారం ఆరాధనకు రాలేదు, ఆ రోజు సాయంత్రం ఆ అక్కను కలిసి ఏంటక్కా ఆరాధనకు రాలేదు అని అడిగితే ఆవిడ దానికి చాలా సంతోషపడింది, అబ్బా ఎన్నాళ్ళకి ఈ మాట నన్ను అడిగావయ్యా, నువ్వు నన్ను ఇలా అడిగావు అంటే నేను నీ లెక్కలో ఉన్నానని అర్థం. నాకు చాలా సంతోషం అంతే చాలు అని అన్నది. 

    దేవుడు మనలను క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటే మనము దేవుని పిల్లల మై ఉన్నాం అందునుబట్టి మనము సంతోషిద్దాం దేవునిని స్తుతిద్దాం. ఒక్కసారే దేవుని తీర్పుకు గురై నిత్య నరకానికి వెళ్లడం కన్నా దేవుని చేత అనేకమార్లు క్రమశిక్షణలో పెట్టబడి పరలోక రాజ్యం చేరడం మేలు.

    దేవా నన్ను నీ కుమారునిగా కుమార్తెనుగా స్వీకరించినందుకు వందనాలని దేవుని స్తుతించండి, నాకు మేలు కలుగునట్లుగా నన్ను క్రమశిక్షణలో పెడుతున్నందుకు వందనాలనే దేవుని స్తుతించండి, నన్ను ఒక్కసారి నాశనం చేయక క్రమక్రమంగా సరిదిద్దుతున్నందుకు వందనాలనే దేవుని స్తుతించండి.

    మీలో ఎవరైనా క్రమశిక్షణ అంటే గిట్టని వారు ఉంటే అందులోని ప్రాముఖ్యతను గ్రహించి, గతంలో దేవుని క్రమశిక్షణను మీ జీవితంలో త్రోసివేసిన మూర్ఖులుగా మీరు ఉంటే దానిని బట్టి పశ్చాతాప పడుతూ దేవుని క్రమశిక్షణను ఇకనుండి ప్రేమించడానికి సంతోషంగా అంగీకరించడానికి నిర్ణయం తీసుకోనండి. సమస్తమును మేలుకై జరిగించే మన దేవుని యొక్క ఆశీర్వాదము క్రమశిక్షణను ప్రేమించు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా కలుగును గాక ఆమెన్.

- ఆర్. సమూయేలు.

Post a Comment