మార్గము చూపు దేవుడు




మార్గము చూపు దేవుడు

మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. -కీర్తనలు 44:18

    క్రీ. శ. 1608-1680 లో ఇంగ్లాండ్ దేశానికి చెందిన థామస్ బ్రూక్స్ అనే సేవకుడు జీవించాడు. ఈయన ప్రసంగాలు సులభ గ్రాహ్యమైనవిగా, ఆచరణ యోగ్యమైనవిగా మాత్రమే కాక ఆత్మీయమైనవిగా వాక్యానుసారమైనవిగా ఉండేవి. ఈయన చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు , అందులో " సాతాను ఉచ్చులను ఎలా గెలవాలి " అనేది ఒకటి. ఈయన పరిచర్య ద్వారా మేలు పొందిన వారిలో చార్లెస్ స్పర్జున్ అనే గొప్ప సేవకులు కూడా ఉన్నారు. ఈయన దేవుని మార్గములను గూర్చి ఆరు విషయాలు చెప్పాడు.

    దేవుని మార్గములు నీతి గల మార్గములని, ధన్యకరములైన మార్గములని, ఆత్మను నూతన పరచుమార్గములని, సర్వ మార్గములకు అతీతములైన మార్గములని, ఆత్మను బలపరచు మార్గములని, కొన్నిసార్లు బాధించి కలవరపరిచే మార్గములని తెలియపరిచాడు.

    ఏ పని చేయడానికి అయినా ఒక మార్గం కావాలి, ఒక పని చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి అని అనుకుంటాం కానీ ఏ మార్గంలో వెళ్లినా చేరవలసిన గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరతామనే భరోసా అనేకసార్లు ఇవ్వలేము. పరలోక రాజ్యము చేరడానికి చాలా మార్గాలు లేవు, ఉన్నది ఒక్కటే మార్గం అది యేసుక్రీస్తు వారు మాత్రమే.

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. -యోహాను 14:6

    పాపము దేవునిని మానవునిని వేరు చేసి ఉండగా, మానవుల పాపమునకు అవసరమైన క్షమాపణను తన సిలువ మరణము ద్వారా రక్తము చిందించుట ద్వారా సంపాదించిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే, ఆ మార్గం ద్వారా మాత్రమే మనము తండ్రిని లేదా పరలోకమును చేరగలము. ఇది తప్ప మరి ఏ ఇతర మార్గములు మోక్షానికి చేర్చలేవు అందుకే క్రైస్తవ్యం అనేది ఒక మార్గమే కానీ మతం కాదు.

    వాస్తవానికి మానవాళిని సృష్టించిన దేవుడు వారు నడవవలసిన మార్గమును కూడా తెలియపరిచాడు, వారికి క్షేమాన్ని దీవెనను కలిగించేటువంటి మార్గములను వారి ఎదుట ఉంచాడు.

 నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. -ద్వితియోపదేశకాండము 30:19
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పు చున్నారు. -యిర్మియా 6:16

    దేవుడు ఏర్పరచిన మార్గంలో మనం కొనసాగితే, ఖచ్చితంగా సురక్షితమైన రీతిలో ఆయన ఏర్పాటు చేసిన గమ్యానికి చేరగలము. ఆదాము హవ్వలకు దేవుడు ఆ మార్గమును చూపించాడు, ఇందులో నడవండి అని చెప్పాడు. అయితే వారు కూడా మన వలనే అనేక లోక ఆకర్షణలకు లోనైన వారై దేవుని మార్గమును విడిచి తొలగిపోయిన వారుగా ఉన్నారు.

 అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. -రోమీయులకు 3:12

    దేవుని మార్గములను విడిచి తొలగిపోయిన వాడుగా ఉన్న మానవుడు నశించిన స్థితిలో ఉన్నాడు, తాను తప్పిపోయిన ఆ మార్గమును తిరిగి కనుగొనే అవకాశం లేకుండా పోయింది. పరిశుద్ధుడైన దేవునిని తన యొక్క పాప స్థితిని బట్టి మానవుడు చేరుకోలేకపోయాడు, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారే మార్గమై మనలను తండ్రి యొద్దకు చేర్చుటకు దిగివచ్చినవాడుగా ఉన్నాడు.

    కాబట్టి యేసు వారు మనకు మార్గము చూపేవాడుగా, పరిశుద్ధ గ్రంథము మనము జీవించవలసిన మార్గమును తెలియపరచేదిగా ఉండగా, మనుషుల మైన మనము కొన్నిసార్లు లోకము మనలను ఆకర్షించిన విధానాన్ని బట్టి, ఇంకొన్నిసార్లు ఈ లోకంలో మనకు కలిగే కష్ట నష్ట బాధలను బట్టి దేవుని మార్గమును విడిచి తొలగిపోయి, ఇతర మార్గాలను అన్వేషించేవారంగా కొన్నిసార్లు, మనకు ఇష్టమైన మార్గంలో పయనించే  వారముగా ఇంకోన్నిసార్లు ఉంటూ ఉంటాం.

    అయితే కోరహు కుమారులు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటి? వారి జీవితంలో వారు యుద్ధాన్ని ఎదుర్కొన్నారు, ఓటమిని చూశారు, బానిసలు అయ్యారు అయినప్పటికీ వారి హృదయము వెనుకకు మరల లేదు, వారి అడుగులు దేవుని మార్గమును విడిచిపోలేదు, ఇంకో రకముగా చెప్పాలంటే శీతాకాలంలోనూ వేసవి కాలంలోనూ వారి యొక్క హృదయము ఒకే రీతిగా ఉన్నది, వారి అడుగులు దేవుని మార్గంలో స్థిరముగా నిలిచేవిగా ఉంటూ ఉన్నాయి. ఇది ఎంత గొప్ప సాక్ష్యమో కదా!

మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. -కీర్తనలు 44:18

    ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మార్గము చూపు వాడై ఉన్నాడు, కొన్నిసార్లు ఆయన మార్గాలు నిన్ను కలవరపరిచేవిగా ఉండొచ్చు, అవి నీకు అర్థం కానివిగా కూడా ఉండొచ్చు కానీ అవి నీ ఆత్మను నూతనపరిచేవని, బలపరిచేవని, నీతి గలవని, ధన్యకరమైనవని, సర్వ మార్గాలకు అతీతమైనవని నీవు గ్రహించవలసి ఉన్నది. 

    దేవుడు నీ కాపరియై ఉన్నాడు, ఆయన నిన్ను కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలలో కూడా నడిపిస్తాడు, కాబట్టి కష్టాలు నీ జీవితంలో వచ్చినప్పుడు అది దేవుని మార్గం కాదనుకోవద్దు, సులభంగా పరిష్కారం దొరుకుతుందని ఇతర మార్గాలకు తొలగిపోవద్దు, స్థిరమైన ఈ మార్గంలో కదలక నిలుచుటకు ప్రభువు సహాయం కోరుకో.

    ముగింపులో మనం ఈ రెండు పనులు చేద్దాం, యేసుక్రీస్తు ద్వారా తన వాక్యము ద్వారా మనకు మార్గము చూపిస్తున్న దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిద్దాం, అదేవిధంగా మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటూ లోక ఆకర్షణను బట్టి గాని, కష్టాల సుడిగుండమును ఓర్చుకోలేక గాని దేవుని మార్గమును విడిచి తొలగిపోయావేమో ఆలోచించుకుని, పశ్చాతాప హృదయంతో మరలా దేవుని మార్గంలోనికి రావడానికి నిర్ణయించుకో! నీ జీవితంలో నీవు కనబరుస్తున్న స్పందనకు అనుగుణంగా దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్.

- ఆర్. సమూయేలు

Post a Comment