మిర్యాము ధైర్యవంతురాలు
హాయ్ పిల్లలు బాగున్నారా? స్కూల్ కి క్రమంగా వెళుతున్నారా? పండు రోజు స్కూల్ కి వెళ్ళనని మారం చేస్తా ఉన్నాడు, ఎందుకు తెలుసా? తనకి తోడు ఎవరూ లేరు. ఒంటరిగా వెళ్లాలంటే చాలా భయం. పైగా తాను వెళ్లేదారిలో కుక్కలు కూడా ఉన్నాయి. పిల్లలు మీకు కూడా ఒంటరిగా వెళ్లాలంటే భయమా?(పిల్లల్ని సమాధానం చెప్పనివ్వండి) కొన్ని జంతువులంటే మీకు కూడా భయం కదూ!
అయితే మిర్యాము అలాంటిది కాదు. మిర్యాముకు భయమేసిందో లేదో తెలియదు కానీ ఆమె చాలా ధైర్యంగా తన తమ్ముడు కోసం నిలబడింది. రాజుగారి ఆజ్ఞ ప్రకారం తమ తమ్ముడిని పెట్టిలో పెట్టి జమ్ములో వదిలిపెట్టారు కదా, మరి ఆ సమయంలో ఆ బాబుని అలా వదిలిపెట్టడానికి కుటుంబమంతా వచ్చి ఉంటారా? (పిల్లల్ని సమాధానం చెప్పనివ్వండి)
లేదు, ఎందుకంటే వాళ్లు అలా వచ్చి ఉంటే అది రాజు గారికి తెలిసిపోతుంది. కాబట్టి ఒకరో ఇద్దరో వచ్చి ఆ బుట్టని అలా విడిచిపెట్టి ఉండుంటారు, ఇక మిర్యాము అక్కడే నిలబడి జాగ్రత్తగా చూస్తూ ఉండి ఉండొచ్చు. మిర్యాము ఒక్కతే ఉందంటారా?? అవును ఒక్కతే ఉన్నది.
ఆ బాబుని వారు ఎప్పుడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి ఉండుంటారు? ఎవరికీ తెలియకుండా ఉండాలంటే బహుశా సాయంకాలంలో అలా తీసుకొచ్చి వదిలిపెట్టి ఉండొచ్చు. అమ్మో మరి చీకటి పడుతూ ఉండుంటదిగా, మరి మిర్యాముకు భయమేయ లేదా? భయమేసిందో లేదో తెలీదుగానీ, మిర్యాము మాత్రం ధైర్యం అక్కడే నిలబడింది.
మీకు ఓ విషయం తెలుసా? నైలు నదిలో చాలా మొసళ్ళు ఉంటాయట, అందుకే వాళ్ళ అమ్మగారు బాబును మొసళ్ళ బారి నుండి రక్షించడానికి ఆ బుట్టకు జిగటమన్ను కూడా పూసిందని తెలుసుకున్నాము. అమ్మో అకస్మాత్తుగా ఇప్పుడు ఒక మొసలి అక్కడికి వస్తే, మిర్యాముకు భయమేయదా! నాకెందుకులే ఏది జరిగితే అది జరిగింది అని మిర్యాము భయపడి వెళ్లిపోలేదు. మిర్యాము చాలా ధైర్యవంతురాలు కదా!
అంతేకాదు ఒకవేళ రాజుగారికి సంబంధించిన వారు అక్కడికి ఈ సమయంలో వస్తే, " ఏయ్ నువ్వేం చేస్తున్నావ్ " అని మిర్యామును అడిగితే, అమ్మో మిర్యాము కి భయమే లేదా?? ఏది ఏమైనా మిర్యాము మాత్రం చాలా ధైర్యంగా అక్కడే ఉన్నది. అబ్బా ఈ మిర్యాముకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపిస్తుందా మీకు?? మిర్యాములాగే మీరు కూడా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారా?
మిర్యాము ఇలా ధైర్యంగా ఉండటానికి బహుశా దేవునికి ప్రార్థన చేసి ఉండి ఉండొచ్చు. మీకు ఎప్పుడు భయమేసినా దేవునికి ప్రార్థన చేయండి ఆయన మీకు ధైర్యాన్ని ఇస్తాడు. కొంతమందికి పరీక్షలు అంటే భయమేసి జ్వరం వస్తుంది, నిజమేనా నీకు ఎప్పుడైనా వచ్చిందా? మనము దేవునికి భయపడితే, ఆయన చెప్పినట్టుగా వింటూ ఆయనకు ప్రార్థిస్తే ఆయన మనకు అన్ని సమయాల్లో ధైర్యాన్ని ఇస్తాడు. యేసయ్య నాకు ధైర్యం ఇవ్వమని మీరు కూడా ప్రార్థన చేస్తారా?? ( పిల్లల్ని ప్రార్థనలో నడిపించండి).
కంఠత వాక్యము :
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును -సామెతలు 14:26
కార్యాచరణ :
మీరు భయపడే అంశాలన్నిటిని రాసి, వాటి మీద మీ చేతుల నుంచి మీ స్నేహితులతో కలిసి ఈ అంశంలో నాకు ధైర్యం ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి