నిబంధన చేయు దేవుడు

నిబంధన చేయు దేవుడు



 నిబంధన చేయు దేవుడు

ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.  -కీర్తనలు 44:17

    నిబంధన అంటే ఒడంబడిక, ఒప్పందం, ప్రమాణం, ఒకే అంశం మీద ఇద్దరు సమ్మతించటం, అని చెప్పవచ్చు. మూడు సందర్భాల్లో ఈ నిబంధనలు ఏర్పడుతూ ఉంటాయి. మూడు తరగతులకు చెందిన ప్రజలు ఈ నిబంధనలు చేసుకునేవారుగా ఉంటారు



    ఇందులో మొదటిది, బలహీనులు బలవంతుల మధ్య ఉండే నిబంధన. బలహీనులు తమ యొక్క బలహీనతను బట్టి బలవంతులు యొద్ద నుండి ఎలాంటి సమస్యలు వారికి సంభవించకూడదని, మీరు మాకు హాని చేయవద్దు మీకేం కావాలో దాన్ని ఇస్తామని బలవంతులతో ఒక నిబంధన చేసుకుంటూ ఉంటారు. దీనిని బలహీనులు బలవంతులు చేసుకునే నిబంధన అని చెప్పవచ్చు. ఇందులో నిబంధన చేయడానికి మొదట ముందుకు వచ్చినవారు బలహీనులే అనే సంగతిని మర్చిపోకూడదు. 

    రెండవ రకమైన నిబంధన బలవంతులు బలవంతులు మధ్య ఏర్పడే నిబంధన. బలవంతులకు బలవంతులకు మధ్య పోరాటాలు జరిగితే ఇరుపక్షాల వారు నష్టపోతారు కనుక మేము మీతో పోరాటం చేయము మీరు కూడా మాతో పోరాటం చేయవద్దని బలవంతులు ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకునేవారుగా ఉంటారు. 

    మూడవ రకం బలవంతులు బలహీనులతో చేసే నిబంధనయై యున్నది. ఈ నిబంధన గురించి ఆలోచన చేస్తే మొదటి రెండు నిబంధనలు అర్ధమైనంత సులువుగా ఇది అర్థం కాదు. మొదటి నిబంధనలో రెండవ నిబంధనలో బలహీనులు బలవంతుల ద్వారా నష్టపోకుండా ఉండటానికి బలవంతులు మరొక బలవంతుల ద్వారా నష్టపోకుండా ఉండటానికి ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్న వారుగా ఉన్నారు. మరి ఒక బలహీనుడు వెళ్లి బలవంతునితో నిబంధన చేయాల్సిన అవసరం ఏంటి? బలవంతుని వలన బలహీనులకే ఇబ్బంది ఉంటుంది కానీ, బలహీనుల వలన బలవంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి రెండు నిబంధనలు లోకంలో మనం చూడవచ్చు, కానీ ఈ మూడవ నిబంధన బైబిల్ లో మాత్రమే మనకు కనబడుతున్నది.

    బలవంతుడైన దేవుడు బలహీనులైన ఈ లోకంలోని మనుషులతో నిబంధన చేసిన వాడుగా ఉన్నాడు. మరలా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే , ఈ నిబంధన చేయడానికి మొదటగా ముందుకు వచ్చినవాడు దేవుడే.

    నిబంధన గురించి బైబిల్ చాలా విషయాలు మాట్లాడుతున్నప్పటికీ , కీర్తనకారుడు ఈ వచనంలో చెప్పినట్లుగా దేవునితో వారు చేసిన నిబంధనను మరచిపోలేదు అన్న మాటలు బట్టి ఆ నిబంధనకు సంబంధించిన విశేషాలను చూద్దాం.

    ఈ నిబంధన అబ్రహముతో ప్రారంభమైంది, అబ్రహం కంటే ముందు దేవుడు నోవాహుతోను ఇతర భక్తులతో నిబంధన కలిగి ఉన్నాడు, ఆ నిబంధనలు మనకు ఇక్కడ అ సందర్భం కనుక మనం వాటిని గురించి చర్చించడం లేదు.

 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. -ఆదికాండము 17:2,7

    దేవుడు అబ్రహం తో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన అబ్రహం కు పరిమితం కాక అబ్రహం యొక్క సంతానమంతటికి నిత్య నిబంధనగా ఉండునట్లు స్థిరపరిచాడు, తాను వారికి దేవుడునై ఉంటానని, ఆయనను అత్యధికంగా అభివృద్ధి పొందే విధంగా చేస్తానని నిబంధన చేశాడు. ఈ నిబంధన మరల ఇశ్రాయేలీయులతో స్థిరపరచబడింది, సీనాయి పర్వతం మీద వారు ఉన్నప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తూ మీరు నా మాట ప్రకారంగా జీవిస్తే సమస్త దేశ జనులలో నా స్వకియ సంపాదింగా ఉంటారు అని చెప్పాడు. 

కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. -నిర్గమకాండము 19:5

    ఈ నిబంధన షరతులతో కూడినది అని మనం మర్చిపోకూడదు, ఈ నిబంధనలో వాగ్దానాలు ఉన్నట్లే ఆ వాగ్దానములు నెరవేర్చబడడానికి షరతులు కూడా ఉన్నాయి. దేవుని మాట ప్రకారంగా ఇశ్రాయేలు జీవిస్తే దేవుడు ఆజ్ఞాపించిన ఆశీర్వాదం అంతా వారు పొందుకుంటారు. 

    ఈ నిర్గమకాండం 19 ఆధ్యాయంలో సీనాయి పర్వతం మీద వారితో దేవుడు నిబంధన చేస్తూ మీరు నా మాటలు ప్రకారంగా నాకు లోబడి జీవిస్తే మీకు ఈ మూడు ఆశీర్వాదాలు కలుగుతాయి అని చెప్పాడు, ఒకటి పవిత్రమైన జనముగా, రెండు రాజులైన యాజక సమూహంగా, మూడు దేవుని సొత్తయిన ప్రజలుగా వారు ఉంటారు అని తెలియపరచడం జరిగింది. 

    నిబంధనలన్నీ రక్తముతో ముద్రించబడేవి, దానికి కారణం ఏంటంటే వారు నిబంధన చేసుకున్న దినాన ఒక జంతువును వధిస్తారు. ఇది ఏమి సూచిస్తుంది అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఆ నిబంధనను మీరితే ఆ జంతువుకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని తెలియజేస్తున్నది. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన ఈ నిబంధన కూడా రక్త నిబంధన

అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. -నిర్గమకాండము 24:7,8

    దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి భూలోకంలో ఎక్కడా జరగని అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా చేస్తానని ఆయన సెలవిచ్చాడు.

నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఇంతకుముందు ఇవ్వబడిన 10 ఆజ్ఞలతో పాటుగా దేవునితో వారు కలిగి ఉన్న నిబంధనను బట్టి వారు చేయవలసిన పనులు ఏంటో దేవుడు తెలియపరిచాడు.

వారు దేవునితో కలిగి ఉన్న నిబంధనలో పది ఆజ్ఞలను పాటించడం చాలా ముఖ్యమనే విషయాన్ని మరిచిపోకూడదు

 అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను; భూమి మీద ఎక్కడనైనను ఏజనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు. నేడు నేను నీ కాజ్ఞాపించుదానిననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్లగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసికొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి.  ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱె పిల్లయేగాని అది నాదగును గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టి చేతులతో కనబడవలదు. ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.  సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు.  నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.  మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను. -నిర్గమకాండము 34:10-27

    అబ్రహాము కాలంలో దేవునికి ఆ ప్రజలకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తుగా సున్నతి చేయించుకొనుట అనే క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు.

మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. -ఆదికాండము 17:11

    తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నిబంధనతో కలిగిన ప్రజలు అని చెప్పడానికి సున్నతితో పాటుగా నిబంధన మందసము ఏర్పాటు చేయబడింది. ఈ నిబంధన మందసములో దేవుడిచ్చిన ఆజ్ఞలతో కూడిన పలకలు, చిగురించిన అహరోను చేతి కర్ర, మన్నాతో నింపబడిన పాత్ర ఉంటాయి.

వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. -సంఖ్యాకాండము 10:33
 ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధ మైన పలకలను తీసికొను టకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని. -ద్వితియోపదేశకాండము 9:9

    ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన రక్తము ద్వారా మనతో క్రొత్త నిబంధన చేశాడు. ఈ నిబంధనను బట్టి మనము పరిశుద్ధమైన జనముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తయిన ప్రజలుగా ఉండగలము. ఈ నిబంధనలో భాగమైన వారికి పాప క్షమాపణ నిత్యజీవము కలుగుతాయి.

    మొత్తానికి ఇశ్రాయేలుకు దేవునితో కలిగిన నిబంధనను బట్టి వారు ప్రత్యేకమైన ప్రజలుగా ఆశీర్వదింపబడినవారుగా ఉండాలి. అయితే అది జరగాలంటే దేవుడితో వారు చేసుకున్న నిబంధనలో భాగంగా వారు దేవునితో ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలి. దేవుని మాటలను వినడంలో ఇశ్రాయేలీయులు విఫలము చెందితే వారికి దేవుని మూలంగా కలిగే ఆశీర్వాదాలు లభించవు.

    ఈ 44 కీర్తనను రాస్తున్నటువంటి కోరహు  కుమారులు, వారికి కలిగిన అపజయాన్ని బట్టి చింతిస్తూ, శత్రువుల చెరలోనికి కొనిపోబడిన వారిని బట్టి బాధపడుతూ, దేవా నీవు మాకు ఇన్ని సమస్యలు కలుగజేసినా, మిగిలి ఉన్న మేమెవరము కూడా నిన్ను మర్చిపోలేదు, నీ నిబంధనను మీరలేదు అని తెలియజేస్తున్నారు.

    నిజానికి దేవునితో మనకున్న ప్రయాణంలో కష్టాలు సంభవించినప్పుడు సమస్యలు ఏర్పడినప్పుడు, దేవునితో నేను నిబంధన కలిగి ఉండటం వలన నాకేమీ లాభము, ఇంతగా ప్రార్థించడం వలన భక్తి కలిగి ఉండటం వలన, లోకమును త్యజించుట వలన నాకేమీ ప్రయోజనము అని ఆలోచిస్తూ ఉంటారు.

దేవుని సేవచేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు,  గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు. -మలాకీ 3:14,15

    అలా ఆలోచించి వారు దేవునితో చేసిన నిబంధనను మరిచిపోయి, దేవుని ఎదుట చేసిన నిబంధనలను విడిచిపెట్టి (వివాహ ప్రమాణం) వారికి ఇష్టమైన ధోరణిలకు తిరిగేవారుగా ప్రవర్తించేవారుగా ఉంటూ ఉంటారు.

అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. -సామెతలు 2:17

    ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి? ఈ లోకములో ఒక రాజకీయ నాయకుడు మాటిస్తేనే చాలా సంబరపడిపోయి ఆయనకు ఓటెయ్యడానికి సిద్ధపడి పోతాం కదా. బలహీనులమైన మనతో బలవంతుడైన దేవుడే ఒక మెట్టు దిగి వచ్చి మన క్షేమం కోరి మీకు ఈ విధంగా మేలు చేస్తానని, మీ జీవితాలను ఈ లోకంలో ఈ రీతిగా ఉంచుతానని నిబంధన చేస్తూ ఉండగా, అందునుబట్టి ఆయనను స్తుతించవలసిన అవసరం లేదంటారా? ఈ నిబంధన ప్రేమపూర్వకమైనది, ఈ నిబంధన యేసయ్య రక్తముతో ముద్రించబడినది. మనతో నిబంధన చేసిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై యున్నాము.

    ఓవైపు మనతో నిబంధన చేసిన దేవునిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అంత గొప్పవాడు మనతో నిబంధనను చేసి ఉండగా, ఎందుకు పనికిరాని మనము ఆ నిబంధనను మీరుతూ, దేవుడిచ్చు ఆశీర్వాదములకు దూరమయ్యేవారంగా, ఆయన మనసును తీవ్రంగా గాయపరిచే వారం గా ఉంటే దానినిబట్టి దేవుని సన్నిధిలో పశ్చాతాపడుతూ క్షమాపణ కోరుకుంటూ, దేవునితో నీ నిబంధనను మరలా స్థిరపరుచుకుంటూ, విశ్వాస ప్రేమ నిరీక్షణలు గల వ్యక్తివై ప్రభువుకు చేరువై ఆయన ఇచ్చే ఆశీర్వాదములను పొందాలని విన్నవిస్తున్నాను. దేవుడు అలాంటి భాగ్యము మనకందరికీ దయచేయును గాక ఆమెన్.

ఆర్. సమూయేలు.

Post a Comment