క్రమశిక్షణలో పెట్టు దేవుడు (సంఖ్యా. 11-14) - స్థిరపరచే దేవుడు (సంఖ్యా. 15-19).
మన దేవుడు సమతుల్యత కలిగిన దేవుడు అని చెప్పొచ్చు. ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదు, తీర్పు తీర్చేవాడు కూడా అనే సంగతి మనం గ్రహించాలి.
మనము దేవునికి వ్యతిరేకంగా తొలగిపోతున్నప్పుడు, కొన్నిసార్లు ఒక తండ్రి వలే మనలను దారిలోనికి తీసుకురావడానికి బెత్తం ఉపయోగించేవాడిగా దేవుడు ఉంటాడు. ఇంకో రకంగా చెప్పాలంటే మనలను క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు ఆయన మనతో కఠినంగా వ్యవహరిస్తాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు ఏ విధంగా క్రమశిక్షణలో పెడతాడు, ఎవరిని క్రమశిక్షణలో పెడతాడు? ఆ క్రమశిక్షణ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానాన్ని ఈ భాగంలో చూద్దాం.
చాలా సార్లు దేవుడు మన జీవితంలో మనము అడిగింది ఇచ్చి మనలను క్రమశిక్షణలో పెడతాడు. ఒక రకముగా చెప్పాలంటే అదే దేవుడు మనకు వేసే శిక్ష అని చెప్పవచ్చు. మన ఇష్టానికి మనలను విడిచిపెట్టడం దేవుని క్రమశిక్షణలో భాగమే.
అడిగింది ఇచ్చి క్రమశిక్షణలో పెట్టాడు (సంఖ్యా. 11,13,14)
ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి ఒక సంవత్సర కాలముగా దేవుడు ఇస్తున్న మన్నాను తింటున్నారు. కాని ఇప్పుడు వారి ఆశలు వారు ఐగప్తులో తినిన చేపల మీదకు మళ్ళి, సణుగుతూ, మాంసం కోసం ఏడుస్తున్నారు.
ఇది దేవునికి నచ్చలేదు, ఇది ఒక రకముగా దేవుని చిత్తమును తృణికరించి, వారి సొంత చిత్తమును కోరడమై యున్నది.
మన జీవితంలో మనం ఇలా చేయడం కూడా దేవునికి నచ్చదు, దేవుడు మన జీవితంలో మనలను ప్రేమించి మన శ్రేయస్సు కోరి మనకు వేటిని అనుగ్రహిస్తున్నాడో, వాటిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోయేవారంగా ఉండాలి.
కానీ మనం చాలా సందర్భాల్లో దేవుడు అనుగ్రహించిన వాటికి కృతజ్ఞతలు చెల్లించడం పక్కనుంచి ఆయనకు కోపం రేపే విధంగా అది లేదు ఇది లేదు అని సణుగుతూ ఉంటాం.
దేవుడు మనకు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించడం మాని, ఇవ్వని వాటిని బట్టి ఇవ్వబోతున్న వాటిని బట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తాము.
మన దేవుడు ప్రేమగల దేవుడు, మనకేది మంచిదో, ఏది చెడ్డదో ఆయనకు బాగా తెలుసు. మనకేది ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతి దానిని దాని సమయాల్లో మనకు ఇస్తాడు.
కొన్నిటిని తనకు మాత్రమే తెలిసిన కారణాల నిమిత్తమై మనకు ఇవ్వకుండా ఆపివేస్తాడు. కొన్నిసార్లు వాటిని భవిష్యత్తులో మనకి ఇవ్వాలనేది ఆయన ఉద్దేశమై ఉంటుంది.
ప్రతి తల్లి ప్రతి తండ్రి దీని అర్థం చేసుకోగలరు, పిల్లలకు మనం ఇచ్చే వస్తువులు, వారి వయసును బట్టి మనం ఇస్తాం కదా. వారికి మనం పెట్టే ఆహార పదార్థాలు వారి ఆరోగ్య స్థితిని బట్టే పెడతాం కదా.
దేవుని చేత సృజింపబడిన మనకే ఇంత మేధస్సు ఉంటే, మనల్ని సృజించిన దేవునికి ఇంకెంత మేధస్సు ఉంటుందో ఆలోచించండి. అందుకే దేవుడు ఇవ్వని వాటి గురించి సనుగుతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం దేవునికి ఏమాత్రం నచ్చదు.
ఖచ్చితంగా ఈ అనుభవం పొందినవారు, దాని గుండా వెళ్ళిన ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా అర్థం చేసుకోగలరు. తండ్రులు కుటుంబాన్ని నడిపించేవారు ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలరు.
మనం ఇలా దేవుడు మనకు ఇవ్వని వాటిని గురించి ఏడుస్తూ సనుగుతుంటే దేవుడు ఏం చేస్తాడు?
మనము ఇలా చేసినప్పుడు మనము అడిగింది ఇచ్చి మనకు దేవుడు తీర్పు తీర్చుతాడు, లేదా క్రమశిక్షణలో పెడతాడు.
వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను. -కీర్తనలు 106:15
నువ్వు అడిగావు కదా తీసుకో అన్నట్టుగా దేవుడు ఇచ్చే విధానం ఉంటుంది. దాని ద్వారా తర్వాత ఏమి జరిగినా దానికి మనమే బాధ్యులం, ఎందుకంటే అది కావాలని అడిగింది మనమే.
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వారు కోరినట్టుగా మాంసాన్ని ఇచ్చాడు. కానీ ఎన్ని రోజులు వారికి మాంసం ఇచ్చాడో తెలుసా?
వీరికి నెల రోజుల పాటు దేవుడు మాంసం పెట్టాడు, ఇంకో రకముగా చెప్పాలంటే వారు చచ్చేవరకు పెట్టాడు అని చెప్పవచ్చు.
కాబట్టి ప్రార్ధన చేసేటప్పుడు దేవుని చిత్తమును కోరుకొనండి, సొంత చిత్తమును వీడండి.
ప్రియ యవనస్తులరా, మీ జీవిత భాగస్వామి కొరకు ప్రార్థిస్తున్నారా? మీ చిట్టా దేవుని ఎదుట పెట్టి దానిమీద ఆయన ముద్ర వేయాలని కోరుకుంటున్నారా? దయచేసి ఆ పని చేయకండి.
మీకు ఎవరు సరైన వ్యక్తులో, దేవునికి తెలుసు, ఆయన చిత్తం జరగాలని కోరుకోండి. అలా కాదు మీ చిత్తమే జరగాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఆ తర్వాత కలగబోయే పర్యవసానాలకు కూడా సిద్ధపడి ఉండండి.
ఒక రోగి కొరకు ప్రార్థన చేసే సమయంలో కూడా, దేవుని చిత్తం జరగాలని కోరుకోండి.
ఇదే అంశంకు సంబందించిన రెండొవ సందర్బము, 13,14 అధ్యాయముల్లో ఉన్నాయి. ఈ భాగములో వీరు దేవుని మాటను నమ్మక, వాగ్దాన దేశమును ఒకసారి వేగు చూడాలని కోరుకున్నారు.
అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి మన కంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మన కొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. -ద్వితియోపదేశకాండము 1:22
వారి కోరిక చొప్పున వారు వేగు చూడడానికి పంపబడ్డారు, వేగు చూసినవారిలో ఎక్కువ శాతం చెడ్డ సమాచారం తీసుకొచ్చారు.
వేగు చూడడం ద్వారా వారి విశ్వాసం కొంత సన్నగిల్లింది, దానికి కారణం వారి దృష్టి దేవుని మీద నుండి తొలిగిపోయి వారి సొంతవిధానమును ఆశ్రయించడమే.
వారు వేగు చూడడానికి అనుమతించబడడం కూడా దేవుని క్రమశిక్షణలో భాగమే. వేగులవారు తెచ్చిన సమాచారంలో ప్రోత్సహించే అంశాలు ఉన్నప్పటికి, ప్రజలు చెడ్డ సమాచారం వైపు మొగ్గు చూపి, వాగ్దాన దేశముకు వెళ్ళడానికి విముఖత చూపారు.
ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి. -సంఖ్యాకాండము 14:3
వారు కోరుకొనిన దానికి దేవుడు వారిని అప్పగిస్తూ, అరణ్యములో 40 సంవత్సరాలు తిరగడానికి, వాగ్దాన భూమిలో అడుగుపెట్టడానికి ఇష్టపడని వారందరి ప్రాణాలు అరణ్యములో రాలిపోచేయడానికి దేవుడు ఆలోచించాడు. ఒక్కసారే ఆయన ఈ జనమును నాశనం చేయనందుకు సంతోషించాలి.
అసూయను బట్టి క్రమశిక్షణ(సంఖ్యా. 12.)
దేవుని చేత మోషే చక్కగా ఉపయోగించబడుటను బట్టి మిర్యాము అసూయ చెంది ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడడం జరిగింది. మిర్యాము చూపిన అసూయకు, దేవుడు ఆమెను క్రమశిక్షణలో పెడుతూ కుష్ట రోగం ఇవ్వడం, 7 దినాలు పాలెం వెలుపల గడపడానికి అనుమతి ఇచ్చాడు. అసూయలకు తావు ఇచ్చి దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి చెందక ఆయన క్రమశిక్షణకు లోను అయ్యేవారము కాకుండా ఉండుటకు జాగ్రత్తపడదాం.
స్థిరపరచు దేవుడు (15-19)
దేవుడు ఈ భాగములో ఆజ్ఞలు ఇచ్చి (15, 18,19) తిరుగుబాటును తిప్పి కొట్టి అధికారమును (16) యాజకత్వమును (17) స్థిరపరచాడు.
తిరుగుబాటుల మధ్య స్థిరపరిచాడు
ఇశ్రాయేలీలు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం గా అరణ్యంలోనే రాబోయే 38 సంవత్సరాలు గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కొంతమందికి అసహనం పెరిగిపోయింది, మోషే యొక్క నాయకత్వం మీద, అహరోను యొక్క యాజకత్వం మీద తిరుగుబాటులు అధికమయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో మోషే అహరోనులు తమను తాము తగ్గించుకొని దేవుని చేతికి అప్పగించుకొనగా ఆయనే వారి పక్షముగా నిలువబడి, తిరుగుబాటులను తిప్పి కొట్టి అహరోను యాజకత్వమును మోషే నాయకత్వమును దేవుడు స్థిరపరిచాడు. ఈ క్రమంలో వ్యతిరేకులుగా లేచిన కొరహు దాతాను అభిరాము అను వారి కుటుంబాలను వ్యక్తులను భూమి మింగడం జరిగింది. దేవుడే అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అనేదానికి గుర్తుగా అహరోను కర్ర చిగురించడం కూడా జరిగింది.
ఏ పరిస్థితుల్లో మనకు ఏ స్థానము దేవుని పరిచర్యలో అప్పగించబడినా, దానికి లోబడి మనం నడుచుకోవాలి, మనకి ఇవ్వబడిన స్థానములలో నమ్మకంగా పనిచేయాలి, మన పైనున్న వారికి మనము అప్పగించుకోవాలి అలా చేయడం ద్వారా దీవెన కలుగుతుంది, కానీ వారికి వ్యతిరేకులుమై మనం ప్రవర్తిస్తే ఏమి జరుగుతుంది అనేదానికి కోరహు సమాజమే ఉదాహరణ.
ఒకవేళ మోషే అహరోనులు ఉన్నటువంటి పరిస్థితులలో మీరును ఉండి వ్యతిరేకతలు తిరుగుబాటులు ఎదుర్కొంటున్నారా? మౌనంగా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొనండి, తిరుగుబాటుదారులకు సమాధానమిచ్చే ప్రయత్నం చేయవద్దు, ఎందుకనగా దేవుడే మిమ్ములను స్థిరపరుస్తాడు.
మరికొన్ని ఆజ్ఞలు ఇచ్చి స్థిరపరిచాడు
విశ్వాసము లేని మూర్ఖతరము ఓవైపు నశించిపోతుండగా దేవుడు వారి పిల్లలను వాగ్దానదేశంలో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తూ అందులో భాగంగా ఆ దేశంలోనికి వారు వెళ్లిన తర్వాత వారు నడుచుకోవలసిన విధి విధానాలను గూర్చి మరికొన్ని ముఖ్యమైన ఆజ్ఞలు దేవుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఆజ్ఞలు వారి భక్తిని దేవునితో వారికున్న సహవాసమును మరింత స్థిరపరిచేందుకే ఇవ్వబడ్డాయని సంగతి గ్రహించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి